Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను, యాజ్ఞసేనిని!

[శ్రీ భట్టు వెంకటరావు రచించిన ‘నేను యాజ్ఞసేనిని’ అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము.]

 (1)

ప్రవేశిక

***

పాంచాల దేశపు రాజధాని కాంపిల్య నగరంలో ఒక రోజు.

పూర్వాహ్న సమయం. 

రాజనగరు పరిసర ప్రాంతం అంతా కోలాహలంగానూ, అట్టహాసంగానూ గొప్ప ఉత్సవం జరుగుతూన్న శబ్దంతో నిండి ఉంది. 

రాజ నగరుకు వెలుపల, వీధిలో పురజనులిద్దరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

***

మొదటి వ్యక్తి: వింటున్నవా మిత్రమా, ఆ కోలాహలరవం! రాచ నగరులో ఏదో ఉత్సవం జరుగుతున్నట్లుగా ఉంది కదూ!

రెండవ వ్యక్తి: అవును, ఉత్సవమే మిత్రమా! కాదూ మరి? ద్రుపదమహారాజుల వారి జీవితంలో ఈ రోజు ఎంత సుదినమో కదా!

మొ.వ్య: అవునా!? ఆ విశేషమేవిటో నాకూ కాస్త చెపుదూ.. వింటానూ..

రెం.వ్య: అదేవిటి? నీ కింకా ఆ విశేషం గురించి తెలియదా మిత్రమా? అయితే విను. రాజ్యాధికారం చేపట్టి ఇన్నేళ్ళు గడిచినా సంతానం కలగక సంతాపం చెందుతున్న ద్రుపదమహారాజులవారు, అనుభవజ్ఞులైన పండిత, పురోహితుల ఆధ్వర్యంలో సంతానం కోసం యజ్ఞం చేస్తూన్న సంగతి తెలిసిందే కదా!

మొ.వ్య: అవునవును, ఆ విషయం అందరూ ఎరిగినదే కదా!

రెం.వ్య: సంతృప్తుడైన యజ్ఞపురుషుడు కడకు కరుణించాడటయ్యా మిత్రమా!

మొ.వ్య: ఆహా, ఎంత మాటా.. కరుణించి?

రెం.వ్య: కరుణించి ద్రుపదమహారజుల వారికి ఒక కుమార్తెను, ఒక కుమారుడిని ప్రసాదించాడట. అందుకే రాచనగరులో ఆ సంబరం!

మొ.వ్య: ఓహోహో, వీనుల విందైన మాట చెప్పావు గదయ్యా మిత్రమా! ద్రుపదమాహారాజులవారి కోరిక ఇన్నాళ్ళకు గదా తీరింది.. ఆఁ! అదేమిటి మిత్రమా కోట సింహద్వారాన్ని ద్వారపాలకులు ఎన్నడూ లేనిది అలా పూర్తిగా తెరుస్తున్నారు? ఏమిటీ వింత?!

రెం.వ్య: అందులో వింతేమీ లేదు మిత్రమా! పురజనులందరికీ ఈ రోజెంతో పండగదినం కదా! నగరులో జరిగే ఉత్సవాలలో పురజనులందరూ పాల్గొనవచ్చు. నాతో రా.. మనమూ రాచనగరులో ప్రవేశించి ఉత్సవాలను కళ్ళారా తిలకిద్దాం. నీవే చూశావుగా.. ఈ రోజు కోటగుమ్మం దగ్గర మనల్ని ఎవ్వరూ ఆపరు. కనుక సంకోచించాల్సింది లేదు. త్వరగా నడు.. యజ్ఞపురుషుడు ప్రసాదించిన ఇరివురు సంతానంతో మహారాజులవారు అంతఃపుర సౌధపు పై అంతస్తునుండి దర్శనమిస్తారని విన్నాను. దర్శనం చేసుకుని మనమూ తరిద్దాం!

మొ.వ్య: అవునా మిత్రమా? అయితే పద మరి. ఇంక ఆలస్యం చేయొద్దు.

(2)

(రాచ నగరులోపల.

జనసందోహం సంబరాలు జరుపుకుంటున్న కోలాహలం శబ్దం మరింత దగ్గరగా వినిపిస్తూ ఉంది.

ఆ సంబరాల ఉత్సాహ శబ్ద తరంగాల మధ్యలోంచి ఒక పురుష కంఠం, రాజ సౌధం పై అంతస్తు మీది నుంచి అందరికీ వినిపించేలా బిగ్గరగా అరిచి చెబుతున్నట్లుగా వినబడుతుంది.)

పురజనులారా, శబ్దం చేయకండి. శాంతంగా ఉండండి. మహారాజులవారు తమ దేవేరులవారితోను నవజాత శిశురత్నములైన వారి కుమార్తె యాజ్ఞసేని అమ్మవారితోను, దృష్టద్యుమ్న యువరాజుల వారితోను రాజసౌధాగ్రభాగానికి వచ్చి దర్శనమిచ్చే ఘడియ వచ్చేసింది. ముందువెనుకల మంగళ రావములతో ఇదిగో వేంచేస్తున్నారు. సావధానులై తిలకించండి..

(జనసందోహం నుంచి జయజయద్వానాలు వినిపిస్తున్నాయి)

దృపదమహారాజులవారికి..జై..దృష్టద్యుమ్న యువరాజుల వారికి..జై..యాజ్ఞసేని అమ్మవారికి..జై..

(ఆ జయజయధ్వానముల మధ్యనుంచి…ఒక స్త్రీ కంఠం..యాజ్ఞసేని కంఠం.. హుందాగా.. మాట్లాడడం మొదలవుతుంది.)

యాజ్ఞసేని: అవును, నేను యాజ్ఞసేనిని. యజ్ఞసేనుడి కుమార్తెను గనుక నాకా పేరు. నా తోడబుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. సంతానార్ధియై యజ్ఞం చేసిన ద్రుపదులవారికి మా యిద్దరిని మా తండ్రి సొంతం చేశాడు.  అప్పటినుండీ నేను ద్రుపదమహారాజు కుమార్తెగా ద్రౌపది నయ్యాను. ద్రుపదమహారాజు కుమార్తె గానే అష్టైశ్వర్యాలూ అనుభవిస్తూ పెరిగి పెద్దదాననయ్యాను. యుక్త వయసు రాగానే, వివాహం చేయాలని సంకల్పించారు తండ్రిగారు. నాకు తగిన వరుడిని వెదికి పట్టుకోవడం కోసం మత్స్యయంత్రాన్ని నిర్మించి, ఆ యంత్రాన్ని ఛేదించిన విలుకానికే నన్ను కట్టబెడతామని చాటింపించారు. కర్ణుడితో సహా ఎందరో ప్రయత్నించి విఫలులైన ఆ మత్స్యయంత్రాన్ని బ్రాహ్మణ యువకుడి వేషంలో ఉన్న అర్జునుడు ఛేదించి నన్ను పొందాడు. బ్రాహ్మణ యువకుడి వేషంలో ఉన్నది పాండవ మధ్యముడే అని తెలిసిన తరువాత మా తండ్రిగారు సంతోషించారు. పాండునందనులైదుగురితో నేను అత్తవారింటికి బయలుదేరి వెళ్ళాను. ఏకచక్రపురంలో ఒక సాధారణ గృహస్తుడి ఇంట్లో ఉంటూ బిక్షాటన చేసుకుని భుక్తి గడుపుకుంటున్నారు పాండవులు ఆ  రోజులలో. ‘తమ్ముడు ఒక అసాధారణ బిక్ష సంపాదించి తెచ్చాడమ్మా ఈ రోజు!’ అని విన్నవించిన ధర్మజుడితో ‘అందరూ సమంగా పంచుకోండి!’ అన్నది మా అత్తగారు, కుంతి.  ఆ బిక్ష నేనని తెలిసిన తరువాత కూడా ఆ మాటను విడువలేదామె. ధర్మజుడందుకు అంగీకరించ లేదు. అన్నలిద్దరు అవివాహితులుగా ఉండగా తాను వివాహితుడవడాన్ని ఒప్పుకోనని అర్జునుడన్నాడు. చివరికి వ్యాసులవారి సలహా ప్రకారం పాండవులైదుగురకూ నేను పత్నినయ్యాను. కుంతీదేవి స్థానంలో పాండవు లైదుగురకూ ఆమె తరువాత ‘ఆడదిక్కు’ నయ్యాను.

పాండవులైదుగురూ గొప్ప వీరులే. అయినా ఏం ప్రయోజనం?  జూదంలో నన్ను పణంగా ఒడ్డి ధర్మజు డోడిననాడు, నిండు సభలో దుశ్వాసనుడు నా ఒంటిపై చీరను వొలిచే ప్రయత్నం చేస్తుంటే ఒక్కరూ అడ్డుకోలేక పోయారు. నిస్సహాయనై సభామధ్యంలో ఒంటరిగా నిలబడ్డాను. భీష్మ, విదుర, కృపాచార్యాది కురువృధ్ధులనేకులు సభలో ఉండి కూడా దుశ్శాసనుడి ధర్మబాహ్య కార్యాన్ని ఒక్కరూ అడ్డుకోలేదు.  ఎందుచేత? దుర్యోధనుడికి భయపడా? లేక, నిజంగానే నేను ధర్మవిజితనే అని నమ్మి నందునా? అసలింతకీ నేను ధర్మవిజితనేనా?

కురువృధ్ధులనేకులు మాటాడక మిన్నకుండిన సభలో, వయసులో చిన్నవాడైనప్పటికీ ధైర్యం చేసి వికర్ణుడు నేను ధర్మవిజితను కాదని చక్కటి న్యాయం చెప్పాడు. అయినా ఎవరూ లక్ష్య పెట్టలేదు. జరగ బోయే దారుణాన్ని అపే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. ఎందుచేత? నేను ధర్మవిజితనని నమ్మేనా? భగవంతుడికి తెలియాలి. నా జీవితంలో అత్యంత హేయమైన, దురదృష్టకరమైన సందర్భం అది.

 (3)

(హస్తినాపురంలో సుయోధనుడి సభ. పాచికలాటలో పాండవులు సర్వం పోగొట్టుకుని, సుయోధనుడికి బానిసలై నిలబడిన సందర్భం. సభాభవనంలో ద్రౌపది సంధించిన ప్రశ్నకు దుర్యోధనుడి తమ్ముళ్ళలో ఒకడైన వికర్ణుడు ధైర్యంగా తన అన్న దుర్యోధనుడిని ఎదిరించి మాట్లాడిన సందర్భం.)

వికర్ణుడు: (ఆవేశంగా) కాదు, ద్రౌపది ధర్మ విజిత కాదు. (దుర్యోధనుని ఉద్దేశ్యించి) అన్నా, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. (భీష్మ, ద్రోణాది కురువృధ్ధులను ఉద్దేశ్యించి) భీష్మ పితామహా..గురువర్యా ద్రోణాచార్యా..కృపాచార్యా..పెద్దలు, ధర్మనిర్ణయం చేయగల సమర్ధులు ఇందరుండి ఈ సమయంలో మౌనం వహించడం ధర్మం కాదు. జూద వ్యసనవర్తియై, పరాజితుడైన పాండవాగ్రజుడు, పాండవు లైదుగురికీ ఉమ్మడి సొత్తయిన ద్రౌపదిని పణంగా పెట్టి జూద మాడడం ఏ విధంగా న్యాయం? ఆమె ధర్మ విజిత కాదు. అలాంటి ఆమెను, ఏకవస్త్రయై ఉన్న స్త్రీని, నిండు సభకు ఈడ్చుకు రావడం అన్యాయం, అమానుషం!

కర్ణుడు: (కోపంగా) చాలించు వికర్ణా నీ అధిక ప్రసంగం. (అవహేళణగా) ఇందరు నిమ్మకున్న ఈ సభలో, చిరుతవు, నీ కెందుకోయ్ ఈ ధర్మ నిర్ణయాల గందరగోళపు గోల?

వికర్ణుడు: కర్ణా, నీ అవహేళణ చాలించు. ధర్మ నిర్ణయానికి కావలసినది బుధ్ధి కుశలత గాని, వయసు కాదు.

కర్ణుడు: (వ్యంగ్యంగా) ఆహా! వింటున్నావా సుయోధనా మీ తమ్ముడి వాక్చాతుర్యం? ద్రౌపదిని అధర్మ విజితగా ధర్మనిర్ణయం చేసిన అతని బుధ్ధి కుశలతను గుర్తించావా? (ఆవేశంగా) అధర్మవిజితయట అధర్మ విజిత? ఎక్కడి అధర్మవిజిత? నిండు సభలో ఇందరి యెదుట ధర్మజుడు తన సర్వస్వాన్ని పణంగా ఒడ్డి ఓడిపోవడం నిజం కాదా? ఆ సర్వస్వంలో ద్రౌపది భాగం కాదా? ద్రౌపది ధర్మజుడికి వెలి కాదు కనుక, ఆమె ధర్మవిజితయే! అలా కానప్పుడు పాండవులైదుగురూ ఆమెను ధర్మవిజితగా ఎందుకు వొప్పుకుని మౌనంగా ఉన్నట్లు? ఇక ఏకవస్త్రయై ఉన్నదానిని సభకు తోడ్కొని రావడం ధర్మం కాదని కదూ వికర్ణా నీ ఆక్షేపణ? ఏకవస్త్రను కాదు, విగతవస్త్రను చేసి తెచ్చినా తప్పు లేదు. ఎలాగంటావా? భార్యకు దైవ విహితుడైన భర్త  ఒక్కడుండడం ఆర్య ధర్మం. కాని, ద్రౌపది అనేక భర్తృక. బంధకి. అలాంటి స్త్రీని విగత వస్త్రను చేసి సభకు తెచ్చినా ధర్మవిరుధ్ధం కాదు.

దుర్యోధనుడు: భళి కర్ణా భళి! బాగా గుర్తు చేసావు. నీతి బాహ్యులైన ఈ పాండవులకు, ఈ బంధకికి అదే తగిన శాస్తి. (దుశ్శాసనుడిని ఉద్దేశ్యించి, బిగ్గరగా) సోదరా దుశ్శాసనా!

దుశ్శాసనుడు: అన్నా!

దుర్యోధనుడు:  విన్నావుగా నా ప్రియ మిత్రుడు కర్ణుడి ధర్మనిర్ణయం. విగతవస్త్రను చేసి తెచ్చినా తప్పు లేదట! ఇంకా చూస్తూ నిలబడతావేం?

(దుశ్శాసనుడి వికటాట్టహాసం వినిపిస్తుంది).

 (4)

(యాజ్ఞసేని మాటలు మళ్ళీ మొదలవుతాయి…)

వివస్త్ర అన్న ఒక్క మాటను సూచనగా దుర్యోధనుడికి వినిపించడం ద్వారా నిజానికి దుర్యోధనుడి మనసులో లేని ఆలోచనను రేపెట్టినవాడయ్యాడు కర్ణుడు ఈ సందర్భంలో. దుర్యోధనుడు మూర్ఖుడు. పరమ దురభిమాని. అతడి అంతరంగాన్ని కర్ణుడు చదవగలిగినంతగా మరే వ్యక్తీ చదవలేకపోయాడన్నది నిజం. ఒక్కొకప్పుడు దుర్యోధనుడి దురభిమానానికి ఏది తృప్తిని కలగజేస్తుందో దుర్యోధనుడి కంటె కర్ణుడే ముందుగా గ్రహించి అతడికి తెలియ జేశాడేమో అనిపిస్తుంటుంది.

మయసభలో మయుడి భవననిర్మాణ చాతురికి నమూనాలుగా నిలిచిన అద్భుతాలను తిలకిస్తూ మైమరచి ఉన్న స్థితిలో ఊహించని రీతిలో పరాభవం జరిగింది దుర్యోధనుడికి. నీటి మడుగును నేలగా భ్రమసి అందులో పడిపోయాడు. వొంటి మీదనున్న వస్త్రాలన్నీ తడిసిపోయాయి. నవ్వుల పాలయ్యాడు.  అవమానంతో దహించుకుపోయుంటాయి అతని ఆత్మ, శరీరం ఆ క్షణాలలో. విషయం తెలుసుకున్న ధర్మజుడు నూతన వస్త్రాలు పంపించాడు సేవకుల ద్వారా. వాటిని అందుకుని తన శరీరం మీద తడిసిన వస్త్రాల స్థానే వాటిని మార్చుకుంటున్నప్పుడు దుర్యోధనుడి దురభిమాన చిత్తంలో రగిలిన ఘోరమైన అవమాన జ్వాల ఏ మాట వినడంతో మరొకసారి రగులుకుని ప్రజ్వరిల్లి అతడిని పశువుగా మారుస్తుందో సరిగ్గా ‘విగతవస్త్ర’ అన్న ఆ మాటనే మాట్లాడాడు కర్ణుడు ఆ సందర్భంలో అనిపించింది నాకు. కర్ణుడు ఊహించినట్లుగానే ఆ మాట దుర్యోధనుడికి మయసభలో తాను పొందిన అవమానాన్ని స్ఫురణకు తెచ్చింది. బదులు తీర్చుకునే అవకాశాన్ని కల్పించింది కూడా. అందుకు కర్ణుడిని అభినందిస్తూ, తమ్ముడైన దుశ్శాసనుడిని పురమాయించాడు, నావి నా భర్తలైన పాండవులైదుగురి వస్త్రాలనూ ఊడ్చేయమని. లజ్జితులైన పాండవులు తమంత తామే ధరించి ఉన్న వస్త్రాలను విడిచి తలలొంచుకుని నిలబడ్డారు అర్ధ నగ్న శరీరాలతో నిండు సభలో. మానవ లక్షణాలన్నీ మరుగున పడిపోగా పశువులా మారి వికటాట్టహాసం చేస్తూ నా వైపు అడుగులు వేశాడు దుశ్శాసనుడు. నేను కంపించి పోయాను. జరగబోయే దారుణాన్ని ఊహించుకున్న నా మనసు వశం తప్పింది. అప్పటికే దుశ్శాసనుడి పిడికిలి నా భుజం మీది చీర చెంగును ఒడిసి పట్టుకుంది. చేసేదేమీ లేక చేతులు జోడించి భగవంతుడిని ప్రార్ధిస్తూ శిలలా మారి పోయాను. శ్రీకృష్ణుడు నా మొరను ఆలకించి ఆదుకున్నాడు. కర్ణుడు కోరుకున్నట్లు, దుర్యోధనుడు శాసించినట్లు నేను విగత వస్త్రను కాలేదు. నిండు సభలో దుశ్శాసనుడు నాకు చేయబోయిన పరభావాన్ని చూసి సహించ లేక ఉగ్రుడై భీముడు సభలో అందరి ఎదుటా ప్రతిజ్ఞ చేశాడు.

(5)

(హస్తినాపురంలో దుర్యోధనుడి సభలో భీముడి ఉగ్ర కంఠం వినపడుతుంది)

భీముడు: కురు వృధ్ధులు, గురు, వృధ్ధ బాంధవులు ఇంతమంది చూస్తుండగా, ఒళ్ళు మదమెక్కి, ద్రౌపదిని ఇలా పరాభవించిన ఈ పశువు దుశ్శాసనుడిని, లోకభీకరంగా వధించి, కొండలా బలిసి ఉన్న వాడి వక్షాన్ని చీల్చి అందుండి పారే వేడి రక్తాన్ని తాగుతాను. అలా చేయలేని నాడు పితృపితామహుల గతికి తప్పినవాడి నౌతాను!

కర్ణుడు: (వికటంగా నవ్వుతూ) వింటున్నావా సుయోధనా..భీముడి వీరవచనాలు? దుశ్శాసనుడిని వధించి రొమ్ము చీల్చి రక్తం తాగుతాడట! ఎంత శౌర్యం? (రోషంగా) ఈ కర్ణుడు జీవితుడై ఉండగానే? (తిరిగి హేళణగా) పైగా, అలా చేయలేనినాడు పితృ పితామహుల గతికి తప్పినవాడౌతాడట! చివరికి అదే నిజమౌతుంది భీమసేనా, సిధ్ధపడు!  (ద్రౌపదినుద్దేశించి) పాంచాలీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఐదురుగురు భర్తలున్నారు నీకు. అయినా ఏం ప్రయోజనం? చేతగాని ఐదుగురు భర్తల కన్నా, పౌరుషవంతుడైన ఒక్క భర్త మేలు! ఇప్పటికైనా జూదంలో ఆలిని పణంగా పెట్టి ఓడిపోని భర్తను ఒక్కడిని తగినవాడిని చూసుకో!

దుర్యోధనుడు: భేష్ కర్ణా భేష్! భలేగా చెప్పావ్! (ద్రౌపదిని ఉద్దేశించి) నా ప్రియమైన మిత్రుడు కర్ణుడు చెప్పినట్లుగా చెయ్యి పాంచాలీ. రా.. నువ్వు కూర్చోవడానికి సరిపోయే పీఠంలా నా బలమైన తొడ సిధ్ధంగా ఉంది. వచ్చి కూర్చో!

(6)

(యాజ్ఞసేని మాటలు కొనసాగుతాయి..)

భూ రాజ్య సంపదల బలంతో, ఒళ్ళు మదమెక్కి, ఉచ్చనీచాలు మరచి ఏ తొడనైతే ఎక్కి కూర్చోమని నన్ను దుర్యోధనుడు ఆహ్వానించాడో, ఆ తొడను రణంలో తన గదాఘాతంతో విరగగొడతానని శపథం చేసి, ఆయుధంచేబూనబోతూ అనుజ్ఞ కోసం ధర్మజుడి వైపు దృష్టి సారించి నిలబడ్డ భీముడిని, కోప తాపాలు ప్రదిర్శించడానికి ఇది తరుణం కాదని భీష్మ, విదుర, ద్రోణాదులు సముదాయించి అపారు.

సభలో ఆ రోజు జరిగినదంతా విదురుడి ద్వారా తెలుసుకున్న దృతరాష్ట్రులవారు బాధపడి, నన్ను దగ్గరకు పిలిపించుకుని ఇచ్చిన వరాల సహాయంతో నా భర్తలైదుగురినీ వారి ఆయుధాలతో సహా దాస్య విముక్తులను చేసుకున్నాను.

రెండవ మారు ఆడిన జూదంలో కూడా ధర్మజుడు ఓడిపోయాడు. ఫలితంగా మాకు పండ్రెండేండ్లు వనవాసం, పదమూడవ ఏడు అజ్ఞాత వాసం ప్రాప్తించాయి. కట్టు బట్టలతో అడవుల పాలయ్యాం!

ఒకటా, రెండా? పన్నెండేండ్ల వనవాసంలో ఎంతో తీరికి దొరికేది. తీరిక దొరికిన సమయాల్లో అలోచనలు గతంలోకి మళ్ళేవి. గతం తలుచుకున్నప్పుడల్లా శరీరంలో రక్తం పగతో రగిలి ఉరకలుపెట్టేది. భీముడు చేసిన ప్రతిజ్ఞలు చెల్లించుకునే కాలం ఎప్పటికి వస్తుంది? దుశ్శాసనుడి ఱొమ్ము రుధిరంతో నా కురులెప్పుడు తడుస్తాయి? అర్జునుడి చేతిలో కర్ణుడు నిహతుడయ్యాడన్న వార్త నా చెవిన పడే రోజు ఎన్నటికొస్తుంది?…ఇలా సాగేవి ఆలోచనలు. కాలం నత్తనడక నడుస్తున్నట్లుగా ఉండేది. రోజు లెంతకీ తరిగేవి కావు. పగ తీరే రోజు కనుచూపు మేరలో కనుపించక, దుఃఖితనై ఉన్న నన్ను భీముడు ఓదార్చేవాడు. భీముడి ఓదార్పు మాటలు నాకు కొంత ఉపశమనాన్ని కలగజేసేవి. నా మనస్తాపాన్ని కొంత చల్లార్చేవి.

స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించిన అనాటి మేటి విలుకాడైన అర్జునుడిని నేను మనసారా వరించి ఎంతగానో ప్రేమించాను. అలాగే నేనూ అర్జునుడి ప్రేమకు పాత్రురాల నవుతాననుకున్నాను. కానీ, నన్ను పణంగా పెట్టి జూదమాడిన ధర్మజుడి చేతులు కాల్చుతానన్న భీముడిని వారించాడు అర్జునుడు. నిండుసభలో నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చి దుశ్శాసనుడు పరాభవిస్తుంటే తల వంచి నిలుచున్నాడు తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు అర్జునుడు. మాట్లాడిన వ్యక్తి భీముడు. మాట్లాడడమే కాదు, కంఠనాళాలు బ్రద్దలయేలా అరిచి ప్రళయం సృష్టించ బోయాడు. దుర్యోధనుడు తన తొడ చూపించి నన్ను వచ్చి కూర్చోమని పిలిచినపుడూ అర్జునుడు మాట్లాడలేదు. దుర్యోధనుడి తొడలు విరగ కొట్టి వధిస్తానని యుధ్ధానికి అప్పటికప్పుడే సిధ్ధమై తన గదా దండాన్ని అందుకోబోయిన భీముడిని చూపులతోనే వద్దని వారించాడు ధర్మరాజు. ఇవన్నీ తలుచుకున్నప్పుడు, భీముడు నన్ను ప్రేమించినంతగా నేనెంతగానో ఆశపడి ప్రేమించిన అర్జునుడు నన్ను ప్రేమించలేదనిపిస్తుంది. తన భార్యగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కనప్పుడల్లా భీముడు కోపంతో బుసలు కొట్టేవాడు. మిగతా నలుగురిలో నాకు ఆ లక్షణం కనపడేది కాదు. అలాంటి సందర్భాల్లో అర్జునుడి మౌనం నన్ను మాటలతో చెప్పలేనంత మనస్తాపానికి గురిచేసేది. కర్ణుడు నిండు సభలో నన్ను గురించి చాలా అవమానకరంగా మాట్లాడి పరిహసించినపుడు కూడా అర్జునుడు పెదవి కదపకపోవడం నన్ను చాలా కాలం క్షోభ పెట్టింది. విలువిద్యాకౌశలంలో అర్జునుడికి దీటైన విలుకాడుగా అందరిచేత అంగీకరింపబడిన వ్యక్తి కర్ణుడు. కళ్లెదురుగా భార్యను పరాభవిస్తుంటే చూస్తూ ఊరుకున్న చేతకాని ఐదురుగురు భర్త లెందుకని అవహేళణ చేశాడు. దుర్యోధనుడి వంక చూపెడుతూ, ఇకనైనా ఆలిని పణంగా పెట్టి జూదం ఆడని వ్యక్తిని ఒక్కడిని చూసుకోమని హాస్యమాడాడు. కర్ణుడి నవ్వుకు అడ్డుకట్ట వేయగలిగిన ఒకే ఒక వ్యక్తి అయిన అర్జునుడి మాట, ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట అక్కడ లేకపోవడం నన్ను హింస పెట్టేది. ఇతడా నన్ను గెలుచుకున్నది? ఇతడినా నేను వరించినది? అర్జునుడి ఇంత నిర్లిప్తతకు నేను చేసిన పాపం ఏమిటి? ఎంత ఆలోచించినా అర్ధమయేది కాదు. అందరిలోకీ చిన్నవాడయినా, ధైర్యంగా, చొరవ చేసుకుని, వికర్ణుడు విప్పి చెప్పబోయిన ధర్మ సందేహాన్ని అడ్డుకుంటున్న కర్ణుడిని, అప్పుడే అర్జునుడు కలిగజేసుకుని ‘ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఇందులో తలదూర్చవద్దు, అదనంగా ఇంకొక్క మాట మాట్లాడడానికి వీలులేదని’ తెగేసి చెప్పున్నట్లయితే, కర్ణుడు మారు మాట్లాడే ధైర్యం చేసేవాడా? అంత హేయంగా మాట్లాడి అవహేళణ చేయగలిగేవాడా? అందువలననే, ఆ అలోచన మదిలో మెదిలిన ప్రతిసారీ, నా కలతలన్నిటికీ అర్జునుడి మౌనమే మూలకారణంగా నేను భావిస్తూ ఉండేదానిని. కర్ణుడి నవ్వు సర్వకాల సర్వావస్థల లోనూ నన్ను వెంటాడుతూనే ఉండేది. చేతనను ఒక పట్టాన వదిలేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక వైపు నుంచి సన్నగా వినిపిస్తూ, పరిహసిస్తూ, నన్ను కలతకు గురి చేస్తూ ఉండేది. కర్ణుడి నవ్వు పెట్టే క్షోభ నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? నా ఈ అవ్యక్త మనస్తాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకుని, అప్పటి  నా అంతరంగలోని వ్యధను అత్యుత్తమమైన రీతిలో ఆవిష్కరించి చూపెట్టిన సహృదయుడు నన్నయ భట్టు. యోగక్షేమాలు విచారించి వెళ్దామని వచ్చిన కృష్ణుడితో నా బాధను వెళ్లబోసుకున్న సందర్భంలో నా చేతనే చెప్పించిన మాటలు నా దృష్టికోణాన్ని స్పష్టంచేసి చెప్పాయి.

(7)

(అడవిలో పాండవులు నివాసముంటున్న ప్రదేశం. చుట్టూ పక్షుల కిలకిలా రావములు. దగ్గరలో సేలయేరు ప్రవహిస్తున్న నీటి ప్రవాహశబ్దం మధ్య ద్రౌపదికి శ్రీకృష్ణుడికి సంభాషణ జరుగుతూ ఉంటుంది.)

ద్రౌపది: (నిర్వేదంగానూ, బాధ గానూ) అన్నా! పార్ధివ ప్రభుడైన పాండుమహీపతి కోడలినైయుండి, యుధ్ధ కుశలురైన పాండుతనూజులకు భార్యనైయుండి, పూజ్యుడవైన నీకు చెల్లెలినైయుండి, అధిక శక్తి సంపన్నుడైన దృష్టద్యుమ్నుడికి తోబుట్టువునైయుండి, దృతరాష్ట్రుడి ముద్దుల కొడుకైన దుశ్శాసనుడి చేత నిండుసభలో తలపట్టి ఈడ్వబడి, ఆ పాపకర్ముడి చేత పరిదానమొలవగాబడి, దారుణమైన పరాభవాన్ని అనుభవించాను. నా ఐదుగురు భర్తలూ చేష్టలుడిగి చూస్తూ ఊరుకున్నారు తప్ప, ఏమీ చేయలేక పోయారు. భీష్మ ద్రోణాది కురువృధ్ధ బంధు జనులనేకులుండీ ఒక్కరూ నోరు మెదపలేదు. అదంతా ఒక ఎత్తు. ఆ సూతపుత్రుడైన కర్ణుడి నవ్వు ఒక ఎత్తు. లోక గర్హితుడైన దుశ్శాసనుడి చేష్ట కంటే కర్ణుడి నవ్వు చిచ్చులా నా మనస్సును మాటిమాటికీ దహించివేస్తూన్నది. నా ఈ బాధ ఎప్పటికి తీరేను? నాలో రగిలిన ఈ జ్వాల ఎప్పటికి చల్లారేను?

కృష్ణుడు: దుఃఖించకు సోదరీ! నీ పగ తీరుతుంది. నీ మనస్తాపం చల్లారుతుంది. పాండవుల ఇల్లాలుగా, రాజ్ఞిగా నిన్ను గౌరవించాల్సినవారూ, ఆదరించాల్సినవారూ విజ్ఞత కోల్పోయి నిన్ను పరాభవించడం, పరిహసించడం చూశావు. కొన్నాళ్ళు ఓపికపట్టు. భర్తలను పోగొట్టుకుని వారి సతులు ఒకరొకరుగా సాయంసంధ్య వేళలో హృదయ విదారకంగా రోదించడం చూద్దువుగాని!

(8)

(యాజ్ఞసేని మాటలు కొనసాగింపు..)

అలా రోజులు గడిచి, పన్నెండేండ్ల వనవాసం పూర్తయింది. పదమూడవ యేడు అజ్ఞాతవాసం కోసం మేము మారు వేషాలతో విరాటమహారాజు కొలువు చేరాము. కీచకుడి రంగ ప్రవేశం వరకు రోజులు బాగానే గడిచాయి. కీచకుడి ఆగమనం పరిస్థితులను మార్చివేసింది. నాకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి.  చాలానాళ్ళు ఓపిక పట్టాను. బెదిరించి చూశాను. కీచకుడు లెఖ్ఖపెట్ట లేదు. ఫలితం అనుభవించాడు, మూర్ఖుడు. ఒకనాటి రాత్రి జరిగిన ద్వంద్వ యుధ్ధంలో భీముడి చేత వధించబడి, తెల్లవారేసరికి ఒక పెద్ద మాంసపు ముద్దగా మిగిలాడు. కీచకుడితో పాటు నన్నూ దహనం చేయాలని ప్రయత్నించిన అతని సోదరుల నుండి మళ్ళీ భీముడే నన్ను కాపాడాడు.

కీచకుడిని వధించ గలిగిన యోధుడు భీముడే అని కౌరవులు గ్రహించారు. అజ్ఞాత వాసాన్ని భగ్నం చేయాలన్న కోరికతో విరటుడి పైకి పెద్ద యెత్తున దండెత్తి వచ్చారు. ధర్మజుడి అనుజ్ఞ మేరకు అర్జునుడు గాండీవ ధారియై కౌరవసేనతో తలపడి తరిమి కొట్టాడు. విరటుడికి విజయం లభించింది. మా అజ్ఞాత వాసం అనాటితో ముగియడంతో, పాండవుల గుట్టు పసిగట్టామనుకున్న కౌరువుల ఆశ నిరాశే అయ్యింది. అజ్ఞాతవాసం ముగిసి విజయోత్సాహంతో మేము ఇంటి ముఖం పట్టాము.

పదమూడేండ్లు రాజ్యాధికారానికి దూరమైన ధర్మజుడు, ధర్మంగా తమకు రావలసిన రాజ్యభాగం కోసం కృష్ణుడిని దృతరాష్ట్రుడి వద్దకు రాయబారిగా పంపడం, అర్ధ రాజ్యం కాదు, అయిదూళ్ళు కాదు, కనీసం సూదిమొన మోపగలిగినంత భూమిని కూడా పాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు చెప్పడం, యుధ్ధం తప్పనిసరి కావడం, పద్దెనిమిది రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాలూ బాగా నష్ట పోవడం, భీముడు తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడం, అర్జునుడి చేతిలో కర్ణుడు నిహతుడవడం… అన్నీ జరిగి చివరికి రాజ్యం పాండవుల హస్తగతమయింది.

ధర్మరాజు  సింహాసనం అధిష్టించే నాటికి రాచనగరు అంతా బోసిపోయి ఉంది. అందరూ పోయారు. ఎక్కడ చూసినా రోదనలు. ఒక్క యుయుత్సుడు తప్ప మిగిలిన అందరు కొడుకులనూ పోగొట్టుకుని గాంధారి అంతులేని దుఃఖంతో రోదించింది. నా అయిదుగురు పుత్రులనూ పోగొట్టుకుని నేను రోదించాను. అభిమన్యుడిని పోగొట్టుకుని సుభద్ర రోదించింది. మాకు లాగానే ఇంకా ఎందరో స్త్రీలు తమ తమ భర్తలను, పుత్రులను పోగొట్టుకుని రోదించారు. తప్పదు. యుధ్ధమంటే విజితులకూ, పరాజితులకూ చివరకు మిగిలేది రోదనే!!

యుధ్ధం ముగిసి రాజ్యాధికారం పాండవుల చేతికొచ్చిన కొద్ది కాలానికే, ఊహించని విధంగా కృష్ణుడు ఒక విషాదకర పరిస్థితిలో మరణించాడు. కృష్ణుడి మరణం ధర్మరాజును సంకటంలో పడవేసింది. ఆలోచించి, ఆలోచించి… చివరకు రాజ్యాధికారాన్ని అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తునకు అప్పగించి, మేము అంతిమ యాత్రకు సమాయత్తమయ్యాం!

 (9)

(గంగాప్రవాహం శబ్దం వినిపిస్తూ వుండగా..యాజ్ఞసేని మాటలు కొనసాగుతున్నాయి.)

గంగనూ, హిమాలయాలనూ దాటి ఆవల పీఠభూమిని చేరుకుని, ఒకరి వెనుకాల ఒకరంగా, ఆరుగురమూ కొన్ని నెలల పాటు నడిచాం. నడిచి నడిచి, చివరకు ఒక రోజు, ఇక నడిచే సత్తువ లేక అందరికంటే ముందు నేను కుప్పగా కూలి పడిపోయాను. నా తరువాత భీమార్జుననకులసహదేవులు పడిపోయారు. ఒక్క ధర్మరాజు, ఆయనను అనుసరిస్తూ ఒక శునకమూ ముందుకు సాగిపోయాయి.

పడిపోయినా నేనింకా స్పృహలోనే ఉన్నాను. కళ్ళు మూసుకు పోతున్నాయి. శరీరంలో సత్తువ పూర్తిగా నశించి, మరణానికి అతి చేరువలో ఉన్నట్లు నాకు అర్ధమైంది. ఆ స్థితిలో, నాకు కొంచెం దూరంలో ఏదో ఈడ్చుకు వస్తున్నట్లు శబ్దం, ఆ అనంత నిశ్శబ్దంలో వినిపించి నన్ను భయకంపితురాలిని చేసింది. ఆ శబ్దం అంతకంతకూ చేరువై, చివరకు “నేను, భీముడను!” అని చెప్పినది నా చెవులపడే వరకూ నా శరీరం కంపిస్తూనే ఉంది. భీముడి ఆ మాటతో ప్రాణం కాస్తంత పదిలపడి, కనులు తెరిచి చూసే ప్రయత్నం చేశాను. కుదరలేదు. “చూశావా..అర్జున, నకుల సహదేవులు మువ్వురూ..” అన్నాడు భీముడు. భీముడు చెప్పదలచినది అర్ధమైంది. “అన్న ధర్మజుడు మాత్రం నడుస్తూ ముందుకు వెళ్ళి పోయాడు. నీవూ, నేనూ ఇలా మిగిలాం. బాధగా ఉన్నదా పాంచాలీ..” అన్నాడు భీముడు. “తప్పని ఈ పరిస్థితికి బాధెందుకు? అయినా, నీవు పక్కన ఉండగా నాకు బాధేమిటి?” కష్టం మీద గొంతు పెగుల్చుకుని అన్నాను.

“అవును, నీ కోసం నేనేమైనా చేస్తాను. చెప్పు, ఇప్పుడు ఏమి చెయ్యమంటావ్?” అడిగాడు భీముడు.  నేను నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాను “నాకు తెలుసు. నా కోసం నువ్వేమైనా చేస్తావు.  భూమికి చెందిన పురుషుడివి నువ్వు. భూమికి చెందిన పడతిని నేను. మన ఇరువురి లక్షణాలూ ఒకటే. అందుచేత మిగిలిన నలుగురి కంటే నీకే నేను బాగా అర్ధమయ్యాను. నీ వంటి పురుషుడిని కొడుకుగా కన్న స్త్రీ, పతిగా పొందిన స్త్రీ ఇద్దరూ సుఖ పడతారు. మన ఆరుగురకూ మరో జన్మంటూ ఉంటే, ఆ జన్మలో నువ్వు అగ్రజుడిగా జన్మించు. నీ నీడలో మనం అందరం సుఖంగా ఉందాం!”

అవి నా ఆఖరు మాటలు. ఆ తరువాత…

(నిశ్శబ్దం).

Exit mobile version