[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘నేనున్నాను!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
నేనున్నాను!
(The Force behind the Forces)
తెల్లని మల్లెపూలు ఆకాశమంతా పరుచుకునట్లు నీలినీలి ఆకాశం తెల్లని మబ్బులతో, వాటితో పోటీ పడుతూ తొంగితొంగి చూస్తున్న చందురుడు, సన్నగా వీస్తున్న గాలితో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కొద్ది దూరంలో బన్సా నది చిరుసవ్వడితో చిన్నగా కదులుతోంది.
వెదురుతో చేసిన వరండాలో, సిమెంట్ గోడకు ఆనుకొని కూర్చున్న సూర్యతేజ, భుజం మీద తల ఆనించి కూర్చుంది విభవ. విభవ పాదాల మీద సున్నితంగా పారాణిలా రాస్తూ, కూనిరాగం తీసాడు సూర్యతేజ. అవటానికి మిలిట్రీ ఆఫీసరే అయినా భావుకుడు. మొదటిసారి పెళ్ళి చూపులలోనే, చామనచాయతో, పెద్దజడతో, సుకుమారంగా ఉన్న విభవ నచ్చేసింది. వారి పెళ్ళి అయ్యి అప్పటికి ఇరవై రోజులే అయ్యింది. సెలవు లేదని పెళ్ళి కాగానే భార్యను తీసుకొని, మాసిమ్పూర్ వచ్చేసాడు.
“ఇది మన ప్రేమ సౌధమ్ము. ఇచట వసింపుము చెలీ” పొద్దున జీప్ దిగుతూ చూపించిన ప్రదేశం చూసి ఆశ్చర్యపోయింది విభవ. చుట్టూ చూసింది. నేలనే తప్ప ఎక్కడా ఇల్లన్నది లేదు. కొంచం పక్కగా ఒక కుటీరం కనిపించింది. అంతా కొండలు, చెట్లతో ఉన్న అడవి ప్రదేశం! దూరంగా అక్కడక్కడ చదునుగా ఉన్న కొండల మీద వెదురు గుడిసెలు కనిపిస్తున్నాయి. తేజ వైపు ప్రస్నార్థకంగా చూసింది. నవ్వుతూ చూస్తున్నాడు.
“కొత్త పెళ్ళికూతురిని అట్లా బయట నిలబెట్టావు? లోపలికి రండి తేజా” వినిపించి అటు చూసింది విభవ. పక్క కుటీరం గుమ్మంలో ఒకావిడ నిలబడి ఉంది.
“వస్తున్నాము భాభీ” జవాబిచ్చాడు. పద అంటూ విభవను అటు తీసుకెళ్ళి, “మిస్సెస్ నీనా ఠాకూర్” అని పరిచయం చేసాడు.
అప్పుడే ఒక పెద్ద ట్రక్, నిండా వెదురు, మట్టి మొదలయిన సామాన్లతో వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక జవాన్ దిగి, తేజాకు సెల్యూట్ చేసాడు. అదంతా ఏమిటో అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తున్న విభవ పక్క నుంచి ఏదో పాకినట్లుగా అనిపించి కిందికి చూసింది. ఒక పాము ఏదో పని ఉన్నట్లు నీనా, విభవ మధ్యలో నుంచి చరచరా పాకుతూ ఇంట్లోకి వెళ్ళింది. భయంతో ఒక్క ఉదుటన గెంతి, తేజను అతుక్కుంది విభవ. అదంతా మామూలే అన్నట్లు, ట్రక్‌లో నుంచి తిగిన ఇద్దరు జవాన్లు కర్రలు తీసుకొని లోపలికి వెళ్ళారు.
“అబ్బా.. ఈ పాములతో దుంపతెగుతోంది” విసుక్కుంటూ తల కొట్టుకుంది నీనా.
భయంతోనూ గజగజా వణుకుతున్న విభవను దగ్గరా పొదుపుకొని, “భయపడ్డావా? ఏమీ కాదులే” అనునయంగా అన్నాడు తేజా.
ఇంతలో లోపలికి వెళ్ళిన ఇద్దరు జవాన్లూ కర్రకు చుట్టుకున్న పామును తీసుకొని వచ్చారు. అది చూసి మరింత భయపడి, తేజను గట్టిగా పట్టుకుంది. వాళ్ళు ఆ పాము దూరంగా తీసుకెళ్ళి, కర్రతో సహా విసిరేసారు.
“అదో చూడు, మన ఇల్లు తయారవుతోంది” విభవ వీపు నిమురుతూ అన్నాడు తేజా. చిన్నగా తలతిప్పి అటు చూసింది. అప్పటికప్పుడే అక్కడంతా మట్టితో గోడలు కడుతున్నారు. శిక్షణ పొందిన సైనికులు అలవాటుగా చకచకా కట్టేస్తున్నారు.
“లోపలికి రండి, చాయ్, బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంది. కల్నల్ ఠాకూర్ డ్యూటీకి వెళ్ళారు. వస్తారు” ఆహ్వానించింది నీనా.
బ్రేక్‌ఫాస్ట్, టీ తీసుకొని, ఇప్పుడే వస్తాను అని తేజా వెళ్ళాడు.
“నువ్వేమి చదువుకున్నావు?” అడిగింది నీనా.
“బి.యే. బిఎడ్ చేసాను. స్కూల్‌లో జాబ్ చేస్తుండగా పెళ్ళి అయ్యింది. జాబ్ వదిలేసి వచ్చాను” జవాబిచ్చింది విభవ.
“మిలిట్రీ లైఫ్ లోకి రావటం మొదటిసారా? పరవాలేదు కొన్ని రోజులవుతే అలవాటవుతుంది. ఇప్పుడు మనం ఉన్న మాసిమ్పూర్ ఆల్మోస్ట్ అస్సాంకు చివరి ఊరు. మనమున్నదంతా మిలిట్రీ ఏరియా. ఇక్కడ చాలా డివిజన్‌లు ఉన్నాయి. ఇదంతా కొండలు, అడవుల ప్రదేశం. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ. ఉన్నట్లుండి సుడిగాలి లేస్తుంది లేదా పెద్ద వాన వస్తుంది. ఇట్లా వాతావరణం క్షణంక్షణం మారిపోతూ ఉంటుంది. అవి వచ్చినప్పుడు ఇళ్ళు కూలిపోతాయి లేదా గాలికి ఎగిరిపోతాయి. అందుకని ఇట్లా కుటీరాలలా కడతారు. వీటిని ‘బషా హట్స్’ అంటారు. దగ్గరదగ్గరగా ఉన్న చిన్నచిన్న కొండల మీద కొన్నిచోట్ల ఒక్కొక్కటి లేదా రెండు-రెండు ఉంటాయి. కొండ మీదకు ఎక్కి వెళ్ళవచ్చు లేదా వెహికిల్ వెళ్ళేందుకు మట్టి రోడ్ ఉంటుంది. సిల్చర్ మనకు దగ్గరలో ఉన్న సిటీ. మా పిల్లలు అక్కడికి, స్కూల్‌కు ఆర్మీ స్కూల్ బస్‌లో వెళతారు” చెప్పింది నీనా.
తనకు తెలియని కొత్త ప్రపంచం గురించి ఆసక్తిగా వింటూ “మరి ఇళ్ళు ఎగిరిపోతే ఏం చేస్తారు?” ఆసక్తిగా అడిగింది విభవ.
“మెస్‌కు మారుతాము. సామానంతా క్వార్టర్ గార్డ్‌లో పెడతాము. సెలవుల్లో ఊరెళ్ళేటప్పుడు కూడా సామానంతా పాక్ చేసి క్వార్టర్ గార్డ్‌లో పెట్టి వెళుతుంటాము. అందుకే ఇక్కడ ఎక్కువ సామానులు ఉంచుకోము. అవసరమయినంత వరకే ఉంచుకుంటాము. సామాన్యంగా మేము వచ్చేసరికి ఇల్లు ఉండదు. అప్పుడు ఇక్కడనే కాదు మాకు నచ్చిన చోటు సెలెక్ట్ చేసుకొని, ఇదో ఇప్పుడు తేజా కట్టిస్తున్నాడే అలా కట్టించుకొని చేరిపోతాము” నవ్వుతూ జవాబిచ్చింది నీనా.
వీళ్ళు మాట్లాడుకుంటుండగానే తేజా వచ్చాడు. లంచ్ రెడీ చేస్తాను తిని వెళ్ళమంది నీనా.
“మెస్‌లో చెప్పానండి. ఇల్లు కూడా రెడీ అయ్యింది. రేపు ఉదయం చేరుతాము” అని నీనాకు థాంక్స్ చెప్పి విభవను తీసుకుని మెస్‌కు వెళ్ళాడు. ఆఫీసర్స్ మెస్‌కు వీళ్ళింటి నుంచి వెళ్ళాలంటే చుట్టూ దారి మూడు మైళ్ళుంటుంది. అందుకని ఆ కొండకు వీళ్ళున్న కొండకు మధ్య సిమెంట్ డ్రమ్ లతో, పక్కన తాళ్ళు కట్టి వంతెనలా కట్టారు.
“అమ్మో ఇట్లా ఉన్నాయి? పగలు పరవాలేదు కానీ రాత్రి పూట కాస్త కష్టమే!” అంది విభవ.
“రాత్రిపూట జవాన్స్ లాంతర్‌తో దారి చూపిస్తారు. నన్ను పట్టుకొని జాగ్రత్తగా నడువు” అంటూ అటూ ఇటూ ఊగిపోతున్న దాని మీద నడవలేకపోతున్న విభవను పట్టుకొని నడిపించాడు.
***
మరునాడే కొత్త ఇంటికి చేరారు. చిన్నప్పుడు కథలలో చదివిన కుటీరంలా ఉన్న ఆ ఇల్లూ, చుట్టూ అందమైన ప్రకృతి, కిటికీలో నుంచి చూస్తుంటే ఎండలో మిలమిలా మెరుస్తూ బన్సా నది భలే నచ్చేసాయి విభవకు. ఆ రోజు పౌర్ణమి. మూన్ లైట్ డిన్నర్ అని వెనుక వైపు, వెదురు కర్రలతో చేసిన వరండాలో భోజనం చేసారు.
అందమైన, ఆహ్లాదమైన ఆ వాతవరణంలో, తేజా ప్రేమలో తడిసి ముద్దైంది విభవ!
ఉదయమే ఆఫీస్‌కు వెళ్ళాలని యూనీఫాం వేసుకొని, “విభా! కొంచం ఉప్పు తీసుకురా” అడిగాడు తేజా.
“ఆఫీస్‌కు వెళుతూ ఉప్పెందుకండీ?” ఉప్పు ఇస్తూ అడిగింది.
జవాబివ్వకుండా, షర్ట్ జేబులో, పాంట్ జేబులల్లో కొద్దికొద్దిగా ఉప్పు వేసుకొని, “లంచ్‌కు వస్తాను. అప్పుడు చెపుతానులే ఉప్పెందుకో” అని నవ్వుతూ వెళ్ళిపోయాడు.
వంట చేసి, రాతి పలకతో వేసిన డైనింగ్ టేబుల్ మీద సర్డింది. మంచాలు కూడా పెద్ద రాతిపలకతో వేసారు. ఏమిటో రాతియుగంలోకి వచ్చినట్లుంది అనుకుంటూ, రేడియో ఆన్ చేసి, నవల చేతిలోకి తీసుకుంది. నవల చదువుతుండగానే కునుకు పట్టేసింది. ఎంతసేపు గడిచిందో గమనించలేదు. దఢ.. దఢ.. మని పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే గబుక్కున కళ్ళు తెరిచింది. బయట పెద్ద వాన కురుస్తున్నట్లుంది, పైన వేసిన రేకుల కప్పు మీదే పెద్దపెద్దగా శబ్దం అవుతోంది. లేచి కూర్చుంది. రేడియో ఎప్పుడు ఆగిపోయిందో! వంట ఇంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చీర పైకి పట్టుకొని చిన్నగా అడుగులేస్తూ అటు వెళ్ళింది. పైన కప్పులో నుంచి నీళ్ళు పడుతున్నాయి. గబగబా వంట గిన్నెలు తీసుకొచ్చి బెడ్ రూంలో కుర్చీ మీద పెట్టింది. కిటికీ తలుపు తెరిచి చూసింది. గాలి, వానజల్లు విసురుగా మొహానికి తగిలాయి. పొద్దున అందంగా కనిపించిన బన్సా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పొద్దున పెళపెళలాడ్తూ ఉన్న ఎండ మాయమయి, ఉరుములు మెరుపులతో వాన కురుస్తోంది. కిటికీ మూసేసింది. దడదడలాడుతున్న గుండెతో మంచం మీద కూర్చుంది. ఇల్లంతా వరదలా నీళ్ళు వచ్చేసాయి. అదృష్టం బెడ్ రూమ్‌లో అంతగా కురవటం లేదు. ఒక పక్కనే కురుస్తోంది. నీనా దగ్గరకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కుండపోతగా వాన కురుస్తూనే ఉంది.
చీకటి పడింది. ఎలక్ట్రిక్ లైట్ చాలా డిమ్‌గా వెలుగుతోంది. గడియారం వైపు చూసింది. సాయంకాలం అయిదున్నరే అయ్యింది. అయినా చీకటి పడిపోయింది. తేజా రాలేదు. ఇంత వానలో ఎట్లా వస్తాడు? భయంభయంగా ఉంది. ఎట్లాగో ఆ రాత్రి గడిచింది.
వాన ఉధృతం తగ్గినట్లుంది. బయట తలుపు తట్టిన శబ్దం, “విభా!” అన్న పిలుపు వినిపించాయి. ఒక్క ఉదుటన వెళ్ళి తలుపు తీసింది. తేజా తల మీద నుంచి నీళ్ళు కారుతుండగా లోపలికి వచ్చాడు. గబగబా తువ్వాలు తెచ్చి తల తుడవ బోయింది. అప్పటికే షర్ట్, బనియన్ తీసేసిన తేజా వైపు చూసి ‘కెవ్వ్’మని అరిచింది.
తేజా చాతీ మీద ఉన్న నల్లటి పురుగులను, రక్తం చూస్తూ, “ఏమిటవి” వణికిపోతూ అడిగింది.
“జలగలు. ముందు ఉప్పు తీసుకురా” అన్నాడు.
లోపలికి వెళ్ళి ఉప్పు జాడీ తెచ్చింది. అందులో నుంచి గుప్పిళ్ళతో ఉప్పు తీసుకొని వాటి మీద పోస్తూ, “వీపు మీద ఉన్నాయేమో చూడు. ఉంటే వాటి మీద ఉప్పు వేయి” చెప్పాడు.
మొత్తం వంటి మీద ఉన్న జలగలన్నీ ఉప్పుచల్లుతూ తీసేసరికి రెండు గంటలయ్యింది. అవన్నీ తీసేసి, స్నానం చేసి పైజామా, కుర్తా వేసుకొని వచ్చాడు. అప్పటికీ తేరుకోక బెదిరిపోయి, మంచం మీద నిస్త్రాణంగా కూర్చున్న విభవను చూసి “భయపడ్డావా? రాత్రి ఏమైనా తిన్నావా? నేను రాలేకపోయాను. అంతా కొండల దారి కదా! ఈ వానకు ఆ దారి కూడా కనిపించదు. అందుకే రాలేకపోయాను. ఉప్పెందుకు అన్నావు కదా! ఇక్కడ జలగలు ఎక్కువ. ఉప్పు వేస్తే జలగలు పోతాయి. అందుకని డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉప్పు జేబులల్లో వేసుకొని వెళతాము. ఈ వానకి ఆ ఉప్పు సరిపోలేదు. పద అన్నం తిందాము” అన్నాడు.
వంట ఇల్లంతా నీళ్ళమయం. బెడ్ రూంలోనే తినేసారు. వాన తగ్గినట్లుందని కిటికీ తీసి చూసింది. నది ఉధృతం తగ్గింది. నది మధ్యలో ఉన్న పెద్ద రాయి మీద పాము పడుకొని ఉంది. కొన్ని పాములు, చిన్నచిన్న జీవాలు నదిలో కొట్టుకు పోతున్నాయి. చూడలేక తలుపు మూసేసింది. తేజా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చాతీ మీద ఉన్న జలగలు పీల్చిన రక్తం మరకలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయింట్మెంట్ తీసుకొని చిన్నగా రాస్తుంటే కళ్ళు తెరిచాడు.
విభవ కళ్ళల్లో నీళ్ళు చూసి, “ఏయ్ పిచ్చీ ఏమిటిది? ఇవన్నీ మాకు మామూలే. సేవలు చాలు పడుకో” అంటూ విభ చేతిలోని ఆయింట్మెంట్ పక్కన పెట్టి, దగ్గరకు తీసుకున్నాడు.
చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. విభ అక్కడి పరిసరాలూ, ఆ వాతావరణంకు అలవాటు పడింది. మిగితా ఆఫీసర్‌ల భార్యలతో, తమ డివిజన్ లోని సిపాయిల భార్యలతో పరిచయం చేసుకుంది.
***
ఉదయమే తల స్నానం చేసి, దీపం వెలిగించి, పాయసం నివేదన చేసి, డైనింగ్ టేబుల్ మీద సద్దుతుండగా, తేజా వచ్చి కూర్చుంటూ, “నీ పూజ కూడా అయిపోయిందా? హాపీ ఆనివర్సరీ” అంటూ, పాయసం స్పూన్‌తో విభవ నోటికి అందించాడు.
విభవ మీకూనూ అంటూ, తేజాకు పాయసం పెడుతూ, భావోద్వేగంతో తేజాను హత్తుకుంది.
ఒక్క క్షణం తేజా కూడా భావోద్వేగంతో కదిలిపోయి, “ఊ.. ఇట్లా ఉంటే నేను డ్యూటీకి వెళ్ళినట్లే!” నవ్వుతూ అని, “ఈ రోజు జంగిల్ సర్వైవల్ ట్రైనింగ్ కోసం, వెళుతున్నాము. లంచ్‌కి రాను. సాయంకాలం బయటకు వెళుదాము. రెడీగా ఉండు.” అని వెళ్ళిపోతున్న తేజాతో గుమ్మం వరకూ వెళ్ళి, జీప్ కనిపించేంత వరకూ చూసి లోపలికి వెళ్ళింది.
టేబుల్ మీది బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్స్ తీసేసి, లంచ్‌కు రానన్నాడు, చాయ్‌తో పాటు మైసూర్ పాక్, పకోడీలు చేస్తే సరి అని, వాటికి కావలసిన సామాన్లు తీస్తూ, కిటికీలో నుంచి బయటకు చూసింది. ఉండీ ఉండీ ఏవో పక్షుల కూతలు తప్ప అంతటా నిశ్సబ్ధం! ఠాకూర్ వాళ్ళు సెలవ మీద వెళ్ళారు. మొన్న వచ్చిన గాలివానకు వాళ్ళ హట్ ఎగిరిపోయింది. తిరిగి వచ్చాక ఎక్కడ కట్టుకుంటారో! ఇదేదో గమ్మత్తుగానే ఉంది అని నవ్వుకుంటూ, ఈ మధ్య సిల్చర్ వెళ్ళినప్పుడు మారేజ్ డే కని తేజా కొన్న, అస్సామీ సిల్క్ చీర, అలమారాలో నుంచి చేతిలోకి తీసుకుంది. ఎరుపు, నలుపు డిజైన్‌తో మెత్తగా మృదువుగా, కొంచం బరువుగా ఉన్న చీరను ప్రేమగా మొహం దగ్గరకు చేర్చుకుంది.
***
దట్టమైన అడవి మార్గం గుండా సూర్యతేజ్ ట్రూప్ – 10 మంది సిపాయిలు, హవల్దార్ రామ్ సింగ్‌తో కలిసి ముందుకు సాగుతున్నారు. అడవంతా నిశ్శబ్ధంగా ఉంది. పక్షులు కూడా ఆహారాన్వేషణ కోసం వెళ్ళినట్లున్నాయి. వాటి కూతలు కూడా లేవు! ఎందుకో ఆకుల సవ్వడి కూడా లేదు. గాలి కూడా మౌనంగా ఉంది!
“అలర్ట్‌గా ఉండు రామ్ సింగ్! ఈ రీజియన్లో ULFA వాళ్ళు ఆక్టివ్‌గా ఉన్నారు” రామ్ సింగ్ కు చెపుతూ చేతిలోని మాప్‌ని చూసుకుంటున్నాడు సూర్యతేజ.
ఇంతలో అకస్మాత్తుగా..
“ఏయ్ పాగల్! హఠ్.. హఠ్..” డ్రైవర్ అరుపు విని, తేజా తలెత్తి చూసాడు. రోడ్ మీద ఎదురుగా ఒక యువకుడు వస్తున్నాడు. తేజా కూడా గాభరగా ఇదేమిటి ఈ అబ్బాయి ఇట్లా జీప్‌కు ఎదురొస్తున్నాడు అనుకుంటూ “జీప్ పక్కకు తీయి” అంటున్న తేజా మాటలు,
“అరే హఠ్..” అంటున్న డ్రైవర్ మాటలు, ఢాం.. అన్న శబ్ధంలో కలిసిపోయాయి.
మానవ బాంబు మాస్క్‌తో ముఖం కప్పుకుని, బాడీలో 10 కేజీల RDX పట్టుకుని అరుస్తూ సూర్యతేజ జీప్ ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఢీకొన్నాడు!
అదే సమయంలో వెనుక ట్రక్ మీద కూడా మానవ బాంబు అటాక్ చేసాడు! చూస్తుండగానే రోడ్ అంతా తునాతునకలయిన, జీప్, జీప్ వెనుక వస్తున్న ట్రక్ శకలాలు, జీప్‌లో ఉన్న తేజా, డ్రైవర్, హవల్దార్ రామ్ సింగ్‌తో సహా వెనుక ట్రక్‌లో ఉన్న పదిమంది సిపాయిల శరీర భాగాలు చెల్లా చెదురుగా పడ్డాయి. రక్తం ఏరులై పారింది. అకాశంలోకి ఉవ్వెత్తున మంటలు, ఎగిసిపడిన మట్టి, చెల్లాచెదురుగా పడిన మాంసఖండాలు, ఆర్తనాదాలు.. అక్కడంతా బీభత్సంగా ఉంది. అమ్మా.. అన్న ఆర్తనాదాలు! దూరంగా పడిన ఒక చేతిలో తెరిచి ఉన్న పర్స్, అందులో నుంచి బయటకు కనిపిస్తున్న ఫొటో, బోసి నవ్వుతో చిన్న పాప, మొహమంతా పరుచుకున్న నవ్వుతో యువతి! గిలగిలా కొట్టుకుంటున్న కాలి తునకలు, ఆ ప్రదేశమంతా హృదయ విదారకంగా ఉంది.
***
డైనింగ్ టేబుల్ దగ్గర తల వాల్చుకొని కూర్చున్న విభవ “మేడం” పిలుపు విని తలెత్తి చూసింది.
“మేడమ్! ట్రేన్ టైం అయ్యింది” సెకెండ్ లెఫ్టినెంట్ భత్రా అన్నాడు.
లేచి, తమ వలపులను పండించుకున్న కుటీరాన్నీ చివరిసారిగా కన్నీటితో చూసుకుంది! విషణ్ణవదనంతో, నిశ్శబ్దంగా భత్రా వెనుక నడిచింది..
విభవకు మనసంతా భారంగా ఉంది. దుఃఖం పొంగుకు వస్తోంది. ఆనందంగా సాగిపోతున్న జీవితం ఏ మలుపు తిరిగింది! అంతలోనే కలలన్నీ కల్లలైపోయాయి? ‘విభా..’ అని ప్రేమపూర్వకంగా పిలిచే తన ప్రియనాథుడు ఏడి? ఇక నాకెవరున్నారు? ఆగని కన్నీరు తుడుచుకుంటూ తల వంచుకొని కూర్చుని ఉన్న విభవ,
“దీదీ..” పిలుపు విని, తలెత్తి చూసింది.
హవల్దార్ రామ్ సింగ్ భార్య, పాపను ఎత్తుకొని,అయిదేళ్ళ బాబును చేత్తో పట్టుకొని నిలబడి ఉంది. విభవ తన వైపు చూడగానే ‘దీదీ..’ అంటూ పెద్దపెట్టున రోదించింది. విభవ ఆమెను దగ్గరగా తీసుకుంది. ఇంతలో తేజాతో వెళ్ళిన సిపాయిల భార్యలు కూడా అక్కడికి వచ్చి రోదించసాగారు. వారిని చూడగానే మనసు ఆర్ధ్రమైంది. వారితో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. యూనిట్ ఆఫీసర్ భార్యగా వారిని కనుక్కోవలసిన బాధ్యత మర్చిపోయింది. వారిని ఎట్లా ఓదార్చాలో తెలియటం లేదు.
ఇక ముందు మేమెట్లా బతకాలీ అన్న వారి ప్రశ్న విభ మనసును కదిలించింది. అవును నిజమే, వాళ్ళంతా పల్లెటూరి నుంచి వచ్చినవాళ్ళు. ఎక్కువగా చదువుకోలేదు. మరి ఏ ఉద్యోగం చేసుకుంటారు? పిల్లలను ఎట్లా పెంచుకుంటారు? మిలిట్రీలో ఉన్నది ఒక్క సంవత్సరమే అయినా ఇది తన కుటుంబం, వీరంతా తనవారు అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళకోసం తను ఏమయినా చేయాలి అని నిశ్చయించుకుంది. తననుతాను తమాయించుకొని,
“ఆఫీసర్! వీరందరీ అడ్రెస్‌లు తీసుకొని నాకు పంపగలరా ప్లీజ్” అని భత్రాతో అని, “మనవాళ్ళు దేశ సేవలో వారి ప్రాణాలను త్యాగం చేసారు. వారి త్యాగంలో మనమూ పాలు పంచుకున్నాము. ధైర్యంగా ఉండండి. మీకోసం ఏమి చేయాలో ఆలోచించి చేస్తాను” అని సిపాయిల భార్యలకు ధైర్యం చెప్పి, వారి కన్నీరు తుడిచి, తన రైలు ఎక్కింది.
***
తల్లి,తండ్రులతో కలిసి హైద్రాబాద్ వచ్చింది. సైనిక్‌పురిలో ఇల్లు కట్టుకుంది. వార్ విడోస్‌కు సహాయం చేయటం కోసం ముందు ఒక గదిని తన ఆఫీస్‌గా చేసుకుంది. ఇక వార్ విడోస్‌కు ఎలా సహాయం చేయాలి? వారికి కావలసిందేమిటి?
ఇవన్నీ సక్రమంగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఆలోచించుకుంది. కొంత మంది రిటైర్డ్ ఆఫీసర్‌లను కలుసుకొని, తన ఉద్దేశం వివరించింది. దానికి వారి సహాయసహకారాలను అందిస్తామన్నారు. అసలు చేయవలసింది ఏమిటి అన్నది వారితో కూలంకషంగా చర్చించింది. ముందుగా మన సమాజంలో వితంతువులకు చాలా నిబంధనలు, పరిమితులు ఉంటాయి. వాటిని ఛేదించుకొని బయటకు వచ్చే ధైర్యం కలిగించాలి. ముఖ్యంగా తను సహాయం చేద్దామనుకుంటున్న సిపాయిల భార్యలు చాలా వరకూ గ్రామాల నుంచి వచ్చారు. వారిలో చాలా మందికి తమకు వచ్చే రాయితీల గురించి, పెన్షన్ గురించి తెలియదు. అలాంటివారికి వాటి గురించి వివరించి, ఆఫీస్‌లకు తీసుకెళ్ళి కావలసిన అప్లికేషన్‌లు వ్రాసి ఇవ్వటము, పెన్షన్ వచ్చేట్లుగా చూడటము, వారి పిల్లల చదువులకు వచ్చే స్కాలర్‌షిప్‌ల గురించి వివరించాలి. చదువు లేనివారికి తగిన ఉపాధి కలిగించే, కుట్లూ, వంటలు, కుటీర పరిశ్రమలకు కావలసిన చిన్న చిన్న కోర్స్ లను చేయించి అవకాశాలను కలిగించాలి.
అందుకే ముందుగా ‘S.S.S.S Foundation – (Surya Silent Sacrifices Support)’ అని సూర్య పేరుతో ఒక సంస్థను స్ధాపించింది. మొదటగా సూర్యతేజతో పాటు బాంబు దాడిలో మరణించిన సిపాయిల భార్యలను, స్వయంగా వారి ఊరికి వెళ్ళి కలిసి, కావలసిన సహాయం చేసింది. ఆ తరువాత ఉత్తరాలు వ్రాస్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకోసాగింది. S.S.S.S. Foundation వివిధ రాష్ట్రాలకు విస్తరింపచేసింది. ప్రతి రాష్ట్రానికి ఒక విభాగం చొప్పున వాటికి, సహాయమందించటానికి ముందుకు వచ్చిన కొంతమంది వార్ విడోస్‌ను అధిపతులుగా ఉంచింది. కాలం గడిచే కొలది సెల్‌ఫోన్‌లు వచ్చి, వాట్సప్ గ్రూప్ లను ఏర్పరిచే సులువు కలగటంతో, ఉత్తరాలు, స్వయంగా వెళ్ళి పర్యవేక్షించే ఇబ్బంది తొలగింది.
తల్లితండ్రులు విభవను మళ్ళీ పెళ్ళి చేసుకొని, జీవితంలో స్థిరపడమన్నారు. కొందరు యువకులు పెళ్ళి చేసుకునేందుకు ముందుకు వచ్చారు కూడానూ! కానీ విభవ ఇష్టపడలేదు. దేశ సేవకుల వెనుక నిలబడి మౌనంగా త్యాగాలు చేస్తున్న కుటుంబాలకు తగిన గుర్తింపు, సహాయం అందించటమే తన కర్తవ్యం అని పెళ్ళి ప్రతిపాదనను తిరస్కరించింది.
రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతున్నాయి..
విభవ ఆఫీస్లో కూర్చుని, ఆ రోజు వాట్సప్‌లో వచ్చిన, ఒక సైనికుని భార్య మెసేజ్‌ను చూస్తోంది. అప్రయత్నంగా, ఆరోజు తారీఖు చూసింది. 25 జూలై!
తమ పెళ్ళిరోజు..
తన విభుడు తనకు దూరమయిన రోజు!
చేతిలోని సెల్‌ను బల్ల మీద పెట్టి, బెడ్ రూం లోకి వెళ్ళి, అలమారా తీసింది. హాంగర్‌కు ఉన్న అస్సాం సిల్క్ చీరను చేతిలోకి తీసుకొని దాని వైపే, మసక తెరలు కమ్మిన కళ్ళతో చూస్తూ, ‘తేజా! మురిపించి ముద్దు చేసి, జీవితకాలం సరిపోను ఆనందాన్ని అందించి,ఎక్కడెకి వెళ్ళావు?’ అనుకుంటుంటే మనసు మూగగా రోదిస్తోంది!
“మేడమ్!” పిలుపు విని, తమాయించుకొని వెను తిరిగింది.
హెల్పర్ మేరీ “మిమ్మలిని కలిసేందుకు, ఒకావిడ వచ్చిందమ్మా” చెప్పింది.
“వస్తున్నాను పద” అని, చీర లోపల పెట్టేసి, ఆఫీస్ గదిలోకి వెళ్ళింది.
అక్కడ ఒక స్త్రీ, పక్కన మిలిట్రీ యూనీఫాంలో ఒక యువకుడు, ఇంకో పక్కన రెండు జడలు, పంజాబీ డ్రెస్‌తో ఒక అమ్మాయిలతో నిలబడి ఉంది.
విభవను చూడగానే “దీదీ.. ఎట్లా ఉన్నావు?” నవ్వుతూ పలకరించింది.
చప్పున ఆమె ఎవరో గుర్తు రాలేదు.
తనను గుర్తుపట్టలేదని గ్రహించి ఆమె “నేను రాం సింగ్ భార్యను” అంది.
హవల్దార్ రామ్ సింగ్ భార్య! వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా హత్తుకుంది.
ఆమె కొడుకును చూపిస్తూ “మెరా బేటా ఉత్తమ్ సింగ్. తండ్రిలాగే ఫౌజీలో చేరుతానని చేరాడు. బేటీ ఇంటర్ చదువుతోంది. అంతా మీ కృప” అంది గద్గద కంఠంతో.
పిల్లలిద్దరు ముందుకు వంగి విభవ పాదాలకు నమస్కరించారు.
“అయ్యో వద్దు. ఫౌజీ భరతమాతకు తప్ప ఎవరికీ తల వంచకూడదు” భావోద్వేగంతో అంటూ ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది!
“నేను ఎక్కడికి వెళ్ళాను విభా? ఇక్కడే ఉన్నాను. నేనున్నాను” సూర్యతేజ పిల్లల్లిదరిలో కనిపించాడు!
“What is an extraordinary adventure of a lifetime for you, is our daily life.” –
Signboard on Leh-Ladakh Highway (Indian Army)
