[తన అభినందన సభలో మాట్లాడుతుంటాడు పెంచలయ్య. అందరికీ కృతజ్ఞతలు చెప్తాడు. తాను తప్పు చేస్తే దండించమంటాడు. తనకు ఎం.ఎల్.ఎ. సీటు వదులుకున్న పెద్దమనిషికి పాదాభివందనం చేస్తాడు. ఆయన ఆయన, నళినీ రెడ్ది మాట్లాడుతారు. సభ అనంతరం విందు జరుగుతుంది. మంత్రి హోదాలో రాష్ట్రమంతా పర్యటిస్తాడు పెంచలయ్య. తరువాత రాజకీయ చర్చలన్నీ హైదరాబాదులో జరుగుతాయి. నళినీ రెడ్డి, పెంచలయ్యల గురించి పుకార్లు వినవస్తాయి. నళినీ ఏమిటో భర్తకి తెల్సు కనుక వాటిని పట్టించుకోలేదు. నళినీ భర్త డా. శ్రీధర్ త్రాగుడికి అలవాటు పడతాడు. ఓ మానసిక వ్యాధి నిపుణుడికి భర్త బాధ్యతలు అప్పగిస్తుంది నళినీ. వర్తమానంలోకి వచ్చిన జయంతికి విసుగ్గా అనిపించి శివరాం ఇంటికి వెడతాడు. పెళ్ళికి పది రోజులే ఉందని చెబుతుంది పార్వతి. శివరాం ఇంట్లో లేకపోవడం వెనక్కి తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు జయంతి. కాసేపు పడుకుని లేస్తాడు. లేచేసరికి ఎదురుగా రవి కనబడతాడు. అమ్మ రమ్మని చెప్పమంది అంటాడు. ఇద్దరు కలిసి శివరాం ఇంటికి వెడతారు. అక్కడ జయంతి పార్వతి, శారదలతో మాట్లాడుతాడు. రవి అడిగిన రామాయణంలోని సందేహాన్ని శారద తీరుస్తుంది. తన సందేహం తీరడంతో, అక్కడ్నించి కదులుతాడు రవి. ఇక చదవండి.]
జయంతి శారదల పెళ్లి పద్ధతిగా జరిగింది.
ఆకాశమంత పందిరి భూదేవంత అరుగూ వేయలేదు.
కానీ అందరూ మెచ్చేలా చాలా ముచ్చటగా జరిగింది.
శారద జయంతి ఇంటికి చేరిపోయింది, ఓ శుభమూహుర్తానికి.
ఎంత కాలమయిందో ఆ ఇంట ఆడపిల్ల కనపడక. ఆడమనిషి తిరగక. జయంతి ఎంతో కొంత ఆలస్యంగా పెళ్లి పీటలపైకెళ్లినా చాలా మంచి సెలక్షన్ అన్నవారు ఉన్నారు. ‘మంచి పెయిర్’ అన్నవారు ఉన్నారు.
శారద అందమైనదే గాక వినయం, వివేకం, చదువు ఉన్నమనిషి.
ఆ ఇంట ఇక ఉండేది శారదా జయంతిలే అయినా ఆ ఇంటితో అనేక సంవత్సరాల సంబంధం ఉన్న పనివాళ్లు పది పదిహేనేళ్ల నుండి ఉన్నారు.
నారాయణప్ప మాత్రం జయంతి వ్యవహారాలన్నీ చూసేవాడు.
తాతగారితో ఇక్కడకు వచ్చి ఆయన మరణం తరువాత ఇక్కడే ఉడిపోయాడు జయంతికి అండగా.
వ్యాపారలావాదేవీలూ వ్యవహారపు తేడాలు, పైసల లావాదేవీలున్ని అన్నీ నారాయణప్పే చూసేవాడు.
నారాయణప్పకు అసిస్టెంట్లుగా బసప్ప శివరావులున్నారు.
ఇద్దరు చాలా చరుకైన వారే.
బసప్ప స్వయానా నారాయణప్ప బామ్మరిది.
శివరావు మాత్రం అక్కడివాడే.
వారు కాక ఓ లేడీ టైపిస్టు ఉన్నది.
ఆ పిల్ల గానుగ ఎద్దులాంటిది. ఆవిడ ‘పని’ ఎక్కడా తెమలదు. ఇక్కడ తీరదు. ఇంటి దగ్గరా అంతే. Non-stop express లా మాత్రం వెడుతూనే ఉంటుంది. ‘విశ్రాంతి’ అనేది ఒక్కటి ఉందని, అది చాలా శరీరాలకు మొదట ఉపశాంతన, ఆనక ఆరోగ్యాన్ని కల్గిస్తుందనీ ఆవిడకు తోచదు.
వారందరితోనూ శారద adjust అయ్యేది.
నెమ్మదిగా వ్యవహారాలలోకి దిగింది. వాటిని వంట పట్టించుకునే ప్రయత్నం చేసింది.
శారద వ్యవహారాలలో తల దూర్చడాన్ని జయంతి చూస్తూ ఊర్కొనడంతో, నారాయణప్ప అప్పటికి నడచిన లొసుగులను సరి చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు.
***
“నాకు చాలా రోజులగా హంపి చూడాలనిపిస్తున్నది” అనడగింది శారద. జయంతి “నాకూ ఉంది కానీ ఇప్పటిదాకా పడలేదు” అన్నాడు.
“మరి ఎప్పుడు వెళ్దామంటారు?”
“నాల్గు రోజుల తరువాత నువ్వు ఎప్పుడంటే అప్పుడే” అన్నాడు హేపీగా.
“ప్రోగ్రామ్‌ను మరో రోజునకు పెంచి మహానంది చూసొద్దాం” అంది.
“అలాగే”
“మంచిది” అని ఓవల్టీన్ కలిపి తెచ్చిచ్చింది. శారద.
కప్పు ఖాళీ చేసి చేతికిచ్చి “నువు అర్జంటుగా ఇక్కడకు రావాలి” అన్నాడు.
శారద వచ్చి పక్కెక్కింది. కానీ దురంగా కూర్చుని “దీన్ని పగలు అంటారు” అన్నది.
“మూడు చాలా బావుందిగా!”
“ఒక్క వైపుగ ఉండే ఏం లాభం?”
“ఇవ్వాళ్లికి వదిలెయ్యి. ఆనక నియమంగా పాటిద్దాం” అన్నాడు.
“కుదరదు” అని మంచం దిగింది.
“ఇక లాభం లేదా?” లేచాడు జయంతి. నారాయణప్ప లోనికొస్తూ కనిపించాడు.
అతన్ని పిలిచి “నారాయణప్పా నాల్గురోజులు నాకు శెలవు కావాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటానని మాటిస్తే చాలు” అన్నాడు నవ్వుతూ.
తల ఊపాడు నారాయణప్ప.
కరెక్టుగా అయిదో నాడు కారులో ఇద్దరూ బయలుదేరారు.
రాత్రి కల్లా మహానంది చేరుకున్నారు. సత్రంలో గది తీసుకుని బడలిక పోయేలా నిద్రపోయి ప్రొద్దుటే లేచారు. తలారా స్నానం చేసి దైవదర్శనం చేసుకున్నారు. అయితే దైవంగా ఆకర్షించే విగ్రహమేదీ లేదక్కడ. శివలింగం లాంటి పుట్ట, దానిపైన గోపాదమంత రంధ్రం. దీనినుండి ధారగా గంగ పొంగి వస్తూ కనిపించింది. ఆలయం ముందున్న నంది నుంచి నీరు కోనేరులా గుడి ముందు భాగాన కట్టిన జలాశయంలోకి వస్తూంది. అక్కడి నుంచి ఆ జలాశయానికున్న రెండు వైపుల నున్న రంధ్రాల నుంచి బయటనున్న రెండు జలాశయాలలోకీ అక్కడి నుంచి అదే నీరు పొలాలలోకీ నిరంతరం పారుతూ కనిపిస్తుంది. న్యాయానికి అది ఓ నీటి బుగ్గ. దాన్ని అలా మలచారనిపిస్తుంది. అయితే వేల సంవత్సరాల నుండి ఆ ధార అలా నడుస్తూనే ఉందని స్థల పురాణాపు వ్రాతల వల్ల అర్థమవుతంది.
స్కాందపురాణంలో ఈ మహానంది ప్రసక్తి ఉంది. నీరు చాలా స్వచ్ఛమైనది. ఆలయం ముందున్న జలాశయంలో మూడున్నర అడుగల లోతున నుండి బయటకు వెళ్తుంది. పావలా నాణాన్ని నీటిలో వేసినా అది అడుగునకే వెళ్లి స్పష్టంగా కనిపిస్తుంది. అంత స్పటికం లాంటి నీరది. దాని తేటదనం మనను అబ్బరపరుస్తుంది.
పూజాదికాలు పూర్తి చేసుకొని బయటకొచ్చారు. కొద్ది సేపు కూర్చున్నారు. లేచి మూడు ప్రదక్షిణలు చేసారు. ఇక్కడ ఇలాంటివే ఇంకా ఎనిమిది నందులు ఉన్నాయి. వాటి సముదాయాన్ని ‘నవనందులు’ అంటారు.
విష్ణునంది, శివనంది ఇలా పేర్లు కూడా చెప్పారు.
ఆలయంగా అంత చూడల్సింది లేకపోయినా చాలా ప్రశాంతంగా అనిపించింది.
మానసికంగా హాయి ననుభవించాడు జయంతి.
“ఇంకో రోజు ఇక్కడే ఉండిపోదామోయ్” అని శారదతో అన్నాడు కూడా.
“మీ యిష్టం” అన్నది.
చుట్టు ప్రక్కల చూస్తూ జలాశయం ఒడ్డున కూర్చుని ఆ రోజంతా గడిపారు.
పగలు తెచ్చుకున్న ఆహారం ఉంటే కలిసి తిన్నారు. సాయంత్రం పూట ఆలయానికి ప్రక్కన ఉన్న సంస్కృత పాఠశాల దగ్గర కెళ్లారు. అక్కడ చదువుకుంటున్న పసివాళ్లతో చాలా సేపు గడిపారు.
ఆలయం మూసిందాకా గుడి ముందే గడిపి సత్రం గదికి తిరిగి వస్తుండగా ఓ సాధువు కనిపించాడు.
ధ్యానంలో ఉన్నట్టుగా లేడు.
సంచారిలా సరంజామా అతని వెంట కనిపించింది.
గదికి వెళ్లి కూర్చున్నాక తలుపు తట్టిన శబ్దమనిపించింది.
శారద వెళ్లి తలుపు తీసింది.
ఆ సాధువే.
అడగకుండానే లోనకొచ్చి జయంతి కెదురుగా కూర్చుండిపోయాడు.
జయంతినే చూస్తూ “నా పేరు రామానాధం, ఇలా కాకముందు” అని నవ్వాడు.
“ప్రస్తుతం చిన్న స్వామి అని పిలుస్తారు. నేను తెలుగువాణ్ణి. ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందు ఆయుర్వేదంలో ఘనంగా చెప్పబడిన పరుశవేది కోసం హిమాలయాలకు వెళ్లాను. మానససరోవరం ప్రాంతాన కూడా చాలా రోజులు నా అన్వేషణలోనే తిరిగాను” అని ఓ క్షణం ఆగి “మనది నిజంగా పుణ్యభూమి” అన్నాడు. ఈ మాటకు అర్థమేమిటో జయంతికి అర్థం కాలేదు.
“ఆ తరువాత మన ఋషులు స్వచ్ఛంద మరణం వరంగా కల్గిన వారని తెలిసుకొని వార్ని కలిసేందుకు ప్రయత్నంచాను.
నా అన్వేషణ కొంత ఫలించింది.
దాదాపు మూడు వందల ఏళ్లుగా తపోనిష్ఠ నందున్న ఇద్దరు తాపసులను వేర్వేరు గుహలలో చూసాను.
వారి జాగృదావస్థను గమనించి సాష్టాంగపడ్డాను.
ఒక తాపసి కళ్లు తెరిచి నన్ను గమనించాడు.
నా జీవితం ధన్యమైందనిపించింది.
వారి తపస్సు ఇంకా ఎంత కాలం కొనసాగతుందో మాత్రం నాకు తెలీదు.
ఒక తాపసి వద్ద సాష్టాంగపడి ‘నన్నేమి ఆజ్ఞాపిస్తారు స్వామీ’ అని వేడుకున్నాను.
నవ్వి ‘ఇది పుణ్యభూమి. ఇందున్న ఆలయాలనన్నింటినీ దర్శించు. వాటి ప్రసిద్ధిని గమనించి చారిత్రక పత్రాలను వెలికి తీసి గ్రంథస్థం చేయి’ అని చెప్పాడు.
ఆ యాత్రలోనే ఇప్పుడున్నాను.
నిన్న అహోబిలం నుంచి ఇక్కడకి చేరుకున్నాను.
ఈ ప్రాంతాన ఎక్కువగా శైవ ఆలయాలు ఉన్నాయి.
బహుశా కన్నడీగుల వీరశైవ ప్రభావమేమో.
కర్నాటక పాలకులు మన నేలను చాలా కాలం పరిపాలించారు కదా” అని ఆపాడు.
ఇది చెపుతున్నంత సేపూ శారదనే తదేకంగా చూసాడు.
‘ఈవిడను ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను’ అనుకున్నాడు. కాని ఎక్కడ అనేది స్పురించక తాను చూసి ఇరవై ఏళ్లు గడిచినా అలాగే ఉండడం ఎలా సాధ్యం అనుకున్నాడు.
అయితే అలాంటి మనిషా?
నేను చూసిన మనిషి లేదా?
ఈ ఆలోచన తెగక సతమతమయ్యాడు.
“మీ పేరు రామనాధం అన్నారు గదూ” అడిగింది శారద, అతననుభవిస్తున్న చికాకును గమనించి.
తల ఊపాడు.
“సోమయాజులుగారి అబ్బాయా మీరు?” అడిగింది.
“ఆఁ! ఆఁ! అవును” అంటూ నోరు తెరిచాడు.
“మరి మీరు?” అన్నాడు అర్థం గాక.
“నా పేరు శారద మీ ఇంటికి దాపున మేం రెండేళ్లు ఉన్నాము.”
“ఒకటో తరగతిన రామనాధం నాతో చదివాడు.”
“అవును. ఆ రామనాధాన్నే. ఇప్పుడు గుర్తులోకొచ్చారు” అంటూ లేచాడు.
“ఈయన మా వారు జయంతి. గుళ్లూ గోపురాలను ఓ వారం పాటు చూసి వద్దామని నా మాటను తోసి పుచ్చలేక వచ్చారు” అంది.
“మీరు అడగకుండా లోని కొచ్చారేం?” అన్నాడు జయంతి రామనాధాన్ని చూస్తూ.
“కారణం ఉంది. గదిలో ఉన్నది నూతన వధూవరులని తలపోసాను. వారి జాతకం చెప్పి వారిచ్చింది తీసుకొని తిరుగు ప్రయాణం చేద్దామని భావనలతో-”
“మీరనుకుంటే సరిపోయేదా ఇది. మాకు చూపించుకోవాలనే ఆసక్తి ఉండాలి కదా?”
“మీరేదన్నా అనండి. ప్రతి మనిషికీ తన ముందు రోజును గురించి తెల్సుకోవాలనే కుతూహలం ఉంటుంది. తెల్సినవరకూ చెప్పి మెప్పించి-”
“చేతి రేఖలు సరిపోతాయా? జన్మ నక్షత్రం కూడా చెప్పాలా?”
“రెండూ ఉంటే ఇంకా మంచిది గదా!”
“శాస్త్రం తెలుసా?” అడిగాడు అట్టాగే చూస్తూ.
“ప్రవేశం ఉంది” అన్నాడు నిరుత్సాహపడి.
“ప్రవేశం ఉండడమంటే అసమగ్రంగానే తెల్సునని కదా”
తల ఊపాడు ఒప్పుకుంటున్నట్లు.
“అరకొర ఇలాంటి పనులు వల్లనే ఈ శాస్త్రం పట్ల నమ్మకాన్నిపొగొట్టారు.”
“శాస్త్రం శాస్త్రమే గదా!”
“కాదని ఎవరంటారు?”
“మరి దాన్ని అధ్యయనం చేయకుండా” అని నవ్వి “అయినా మా శారద చెయ్యి చూడండి” అన్నాడు.
లేచి జయింతికి నమస్కరించి బయటకు నడవబోయాడు.
“వెళ్తున్నారేం?” అడిగాడు జయంతి.
ఆగాడు.
“దాన్ని వదలండి” అని “కనీసం మీరు అన్ని ఆలయాలను పరిశీలించి చూస్తూ వివరాలను సేకరిస్తున్నారా?” అని అడిగాడు.
“ఆ నేను చేస్తున్నదదే.”
(ఇంకా ఉంది)