Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నియో రిచ్-22

[తన తండ్రిని దుబాయ్ పంపేస్తానని జయంతి అన్నప్పుడు శాలిని భయపడి స్పృహ తప్పుతుంది. ఆమెను ఇంటివద్ద దింపి వస్తుందంగా రాంజీ ఎదురవుతాడు. అతన్ని కారులో ఎక్కించుకుని అతనికి అప్పగించిన పని నాలుగు రోజులు ఆలస్యమైందని అంటాడు జయంతి. అతన్ని దింపేసి ఇంటికి చేరి అన్నం తిని నిద్రపోతాడు. గంట తరువాత సికందర్ ఫోన్ చేస్తే జయంతి పడుకున్నాడని శారద చెబుతుంది. జయంతి నిద్ర లేచాక సికందర్ ఫోను గురించి చెప్పి, చంద్రశేఖర్ ఇచ్చిన ఆహ్వానం చేతికిస్తుంది. దాన్ని చూసిన జయంతి – చంద్రశేఖర్ బంగారం కొట్టు పెడ్తున్నాడన్నమాట అనుకుంటాడు. అప్పుడు చంద్రశేఖర్ గతాన్ని తలచుకుంటాడు. పోలీసు శాఖలో ఎస్.ఐ.గా చేరటం, అవినీతిపరుడై డబ్బు సంపాదించడం, ఉద్యోగం వదులుకుని వ్యాపారంలో స్థిరపడడం అన్నీ గుర్తుచేసుకుంటాడు. A.S. వచ్చాడని తెలిసి అతన్ని చూడ్డానికి అతని హోటల్‍కి వెళ్ళి కాసేపు మాట్లాడి ఇంటికి చేరతాడు జయంతి. ఇక చదవండి.]

మంచమెక్కాక A.S.ను గురించి తలపు తొలుచుకొచ్చింది.

A.S. అంటే ‘అప్పల స్వామి’.

ఈయనది బందరు. పోలీసు స్టేషనులో ఫోటో ఉన్నవాడు. మూడు ముక్కల ఆట బాగా నడిపేవాడు. మొదటి రోజులలో ఆయిదారుగురు ఆవారా గ్యాంగును సాకుతూ ఉండేవాడు.  వాళ్లు ఉదయం రైల్వే స్టేషన్‌కు, పదకొండింటికి బస్సు స్టాండు, ఆనక సినిమా హాళ్లు ఇలా ముప్పూటలా పని పాటా నడుపుకుంటూ ఉండేవారు. అసలు ఇతను చేసేది ఏదైనా, కట్టుబాటుగా గుట్టుగా చేయడం ఇతని అలవాటు. కాలాన్ని వృథా చేసేటోడంటే మండిపడేవాడు. చాలా సార్లు లాకప్పుకెళ్లాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు, కటకటాలను చూసాడు. అయినా చింతా కంతా సిగ్గు పడలేదు. వృత్తిని మానుకోను లేదు. ఇతనికి పని ధ్యాస ఎక్కువ. ఒకసారి సబ్ జైయిలున ‘బాబులు’ అనేటోడు పరిచయమయ్యాడు. వారి వారి పరిస్థితులను వృత్తులను సమీక్షించుకున్నారు. ఈ సమీక్షణంలో A.S. విధానం బాబులుకు నచ్చింది. వాడు నాకు కావాల అనుకున్నాడు. బయటకొచ్చాక A.S.ను అడ్డాకు పిలిపించుకున్నాడు. మర్యాదలతోనే మాటాడుకున్నారు. ఆ మాట ప్రకారం A.S. బాబులు దగ్గరకే మారాడు. 60-40 వాటాలతో దందా షురూ చేసారు. అప్పలస్వామి లేని లోటు అక్కడ తీర్చలేనిది కనుక శిష్య బృందాలు బాధపడ్డారు. ‘కర్తవ్యం’ అడిగారు. అభయహస్తం ఇచ్చాడు. వెళ్లిపోయారు.

 A.S. బాబులు సహకారంతో ప్రభుత్వ సరుకు అమ్మి కాపు సారా కాసే సెంటరును నడిపాడు. రెండేళ్లు నిరాఘాటంగా నడిచింది. ఆనక ప్రొహిబిషన్ ఎత్తేసారు. ఆలోచించి సారా వ్యాపారంలోకే నేరుగా దిగాడు.

అదే సారా బతుకు. వారి ప్రతి రూపాయీ పది రూపాయలైంది.

బాబులు A.S. వ్యాపార దక్షతకు బాగా ముచ్చటపడ్డాడు.

బాబులుకు పెళ్లి పెటాకులూ లెవ్వు. ‘రత్నం’ అనే ఆవిడను దగ్గరగా ఉంచుకున్నాడు, వంటకీ, ఒంటికి అవసరం అనిపించిననాడు మంచమెక్కడానికి పనికొస్తుందని. అతను చేరదీసిన దగ్గరనుంచి రత్నం ఈ రెండిటికీ భేషుగ్గా ఉపయోగపడుతూనే ఉంది. అయితే మన బాబులు గతాన జైలు పిరియడు ఎక్కువగా ఉండడంతో వంటి తీపు భరించలేక మరొకడితో పారిపోయింది. అయితే రత్నం కోసం బాబులు బెంగ పడలేదు. సీసాలు త్రాగనూ లేదు. మరో గుంట పర్మినెంటుగా కావాలనీ అనుకోలేదు. ఆకలయినప్పుడు అన్నం తింటాం గదా అట్టానే అది కావాలనిపించినప్పుడు గంతకు తగ్గ బొంతనొక దాన్ని పిలచుకునేవాడు ఏదోక కంపెనీ నుంచి.

A.S.ను మాత్రం సొంత తమ్ముడిగా ప్రాణంగా ఇంకా చెప్పాలంటే, ఎదిగిన కొడుకుగా చూసుకొన్నాడు. ఒకనాడు యాపారం ముగిసాక A.S. బాబులు దగ్గరకొచ్చి వాడు మంచం పైన కూర్చుంటే క్రింద కూచున్నాడు ఎదురుగా.

వాడేదో అగడటానికే వచ్చాడని గ్రహించిన బాబులు నెత్తిన చెయ్యి పెట్టి ప్రేమగా నిమిరి “ఏం కావాలిరా, నాకాడ బెదురెందుకు?” అని అడిగాడు.

“అన్నా! తమ్ముడికి పెళ్లీడు వచ్చిందనిపించడం లేదానే.” అన్నాడు సిగ్గు పడుతూ.

“అవున్రా! అవును. పెళ్లీడొచ్చింది. పెళ్లి చేసియ్య మంటావేంటి?” అన్నాడు.

తలూపి,  “అన్నా! నువ్వు ఓ కుటుంబీకుడివైతే బాగే. అన్నకు పెళ్లి కాంది తమ్ముడికి పెళ్లేంది అంటారే లోకులు” అన్నాడు.

“ఓర్నీ నాకే పెళ్లి చేత్తావట్రా!” అన్నాడు కళ్లలో నీరు నిండుతుండగా.

అప్పలస్వామిని లేపి మంచంలో సరసన కూర్చో బెట్టుకుని “తమ్ముడూ! నాకు తమ్ముడివైనా కొడుకువైనా నువ్వేరా! నాకు పెళ్ళంటే దానికి పిల్లలు పుట్టుకొస్తారు. పుట్టుకొచ్చాక వాళ్లు నావాళ్లువుతారు. నువ్వు వేరుగ కనబడతావు.” అని నవ్వి “నాకు పెళ్లొద్దురా! నాకే కోరికా లేదు. పెళ్లిని నిఖార్సుగా నిభాయించుకోనూ లేను. ఎప్పుడు ఏడ ఉంటానో తెలియదు.. నా పెళ్ళి చేస్తే.. ఇక పో” అన్నాడు.

బాబులు దొడ్డ మనసు అర్థమయినాక వాని కాళ్ల మీద పడి కన్నీళ్లు పోయిందాకా ఏడ్వాలనిపించింది అప్పలస్వామికి. “అన్నా!” అని కౌగిలించుకొని మంచం దిగి కాళ్లకు మొక్కి కళ్లు తుడుచుకుంటూ నడిచాడు.

చందనపు బొమ్మలాంటి పిల్లను వెతికి A.S.కు  పెళ్లి చేసాడు.

నిండుగ ఆశీర్వదించాడు. దేముడి ముందు వ్రతం చేయించాడు.

A.S. భార్య పేరు దేవి. శ్రీలక్ష్మి అంశ గలది.

ఆవిడ ఇల్లాలిగా వచ్చింది మొదలు వద్దంటే డబ్బు.

ఇక్కడ కాక కర్నాటక, మధ్యప్రదేశ్ లలో కూడా యాపారం విస్తరించింది.

కర్నాటకను చూసి వస్తానని వెళ్లిన బాబులు జీపు ప్రమాదంలో అకస్మాత్తగా చనిపోవడం A.S.కు ‘షాక్’ అయింది. విమానంలో శవాన్ని తెచ్చి అంత్యక్రియాలు జరిపాడు. తలకొరివి పెట్టాడు.

బాబులు పోయిన నెలకు ఓ రోజు పొద్దుట ‘రత్నం’ వచ్చింది.

ఈ కబురు తెలిసే వచ్చిందట. పెద్దగా ఏడ్చింది. సొమ్మసిల్లి పడిపోయింది.

తేరుకున్నాక “అబ్బయ్యా మీ అన్నతో ఎక్కువకాలం ఉన్నది నేనేగా!” అన్నది.

తెల్సుగనుక “అవును” అన్నాడు A.S.

“వానికే నేను ముండ మోస్తానురా” అంది.

చిత్రంగా చూసాడు  A.S. అసలావిడేమన్నదో అర్థమూ కాలేదు.

మధ్యాహ్నానికి తెల్లచీరతో గాజులు తీసేసి వచ్చింది.

“మాతోనే ఉంటావా?” అడిగాడు.

“నా పెళ్లాం నీలాడిందాకా ఉండి పోతా” అంది.

తలూపాడు. నెలలు నిండిన ‘దేవి’ మగపిల్లాడ్ని కన్నది. ‘బాబు’ అని పేరెట్టుకున్నాడు. వాణ్ణి రత్నం చేతుల్లోకి తీసుకొని “అబ్బయ్యా! నాకు మగడు పుట్టాడురా! వాడు వాడు చావలేదు” అంది. పిల్లడ్ని ఉన్న రెండు నెలలూ అపురూపంగా చూసుకున్నది. ఆనక “ఇక వెళ్తరా అబ్బయ్యా” అంది ఒకనాడు ప్రొద్దుటే.

“ఎక్కడికి పోతావు?” అడిగాడు.

మాటాడలేదు.

“ఇక్కడ నీకేం తక్కువైంది” అడిగాడు మళ్లా.

“పోతారా, ఈడ ఉండలేను. ఉండి వాడి గుర్తుల్ని తట్టుకోలేను. ఏదన్నా  ఆశ్రమానికి పోవాలని పిస్తాన్నది” అన్నది.

“నేనే పంపుతా” అని విశాఖలో ఉన్న ఓ స్వామిజీ ఆశ్రమంలో అప్పగించి ఆవిడకు కావాల్సినంత డబ్బు బ్యాంకున వేసి ఆ పుస్తకాన్ని ఇచ్చి వచ్చాడు.

ఇప్పుడు ఆ A.S. సారా ప్రపంచంలో  NO.1గా ఎదిగిన అతికొద్ది మందిలో ఒక్కడిగా తయ్యారయ్యాడు.

A.S.ను మనస్సు నుంచి ప్రక్కకు బలవంతాన నెట్టి నిద్రకు మళ్లాడు.

***

బెడ్ కాఫీతో ‘శారద’ వచ్చి లేపిందాకా మెలకువ రాలేదు. కప్పు అందుకున్నాడు శారదను చూస్తూ. సంతోషంగా లేదు. “ఏమయిందోయ్” అని దగ్గరకు తీసుకొనబోయాడు. నెమ్మదిగా తప్పించుకుంది.

“శారదా, నీ కష్టమేమిటో నాతో చెప్పడానికేం. నా బ్రతుకున మెరిసిన ఆ నవ్వును.. కంట తడిని భరించలేను. Please” అన్నాడు దగ్గరగా జరిగి. మన్నించమన్నట్లుగా చూసాడు. శారద అన్నీ మరచి ప్రసన్నంగా మారి దరికి చేరింది.

ఆ రోజు అన్ని ప్రోగ్రామ్‌లూ క్యాన్సిల్ చేసుకొని ఇంటిలోనే ఉన్నాడు జయంతి.

మర్నాడు తెల్లవారుతూనే హడావిడిలో పడ్డాడు. ఇది ఆగేది కాదు. తనకే కాదు, లోకావలోకనంతో సంబంధం లేనిది కాల గమనం. దాని ధర్మం ప్రకారం అది నడుస్తునే ఉంటుంది. ఆ గాడిన నడవడమే తప్ప మరొకటి లేదు అంటారు.

ముందుగా లేచిన జయంతి నిద్రిస్తున్న శారదను చూస్తూ నిల్చుండిపోయాడు.

శారదలో కదలిక కనిపించగానే బాత్ రూంలో జొరబడ్డాడు.

లేచింది శారద. జయంతి కనిపించకపోయేసరికి ఆలస్యమైందేమోనని టైం చూసుకుంటూ నడిచింది. కమ్మటి కాఫీ ఇచ్చింది మొదట. వెళ్లేటప్పుడు టిఫిన్ పెట్టింది. కారు దాకా వెంట నడచింది.

కారు స్టార్ట్ చేసి విష్ చేస్తూనే బయటపడ్డాడు జయంతి. శివరాం ఇంటి ముందు ఆగాడు. శివరాం గబగబా ఎదురొచ్చి “జయంతీ, శ్రీధర్ రెడ్డి చనిపోయాడు.” అన్నాడు.

“ఎలా? ఎప్పుడు? నాకు ఫోను కూడా రాలేదు.”

“పెంచలయ్యతో పని ఉంది, వస్తానని ఫోను చేస్తే ఇది చెప్పి తానే వస్తున్నట్లు చెప్పాడు.”

ఊళ్లో వాళ్లకంటే ముందు ఈ వార్త రాజధానికి తెల్సిందన్నమాట అనుకొని “రా వెళ్దాం” అన్నాడు.

శివరాం వచ్చి కారెక్కాడు. తోవలో “శ్రీధర్ రెడ్డి చావు పైన నీకేమైనా అనుమానాలున్నాయా?” అడిగాడు శివరాం.

“నన్నే ఎందుకు అడుగుతున్నావు? పూల దండలు తీసుకెళ్దాం” అని పూల కొట్టు దగ్గరకెళ్లి తీసుకున్నారు.

“శ్రీధర్ రెడ్డి నిన్నటి దాకా బాగానే ఉన్నాడు. ప్రొద్దుట చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్ లాంటిది సివియర్‌గా వస్తే పోవచ్చు. ఏభై దాటిన వాడుగదా” అంటూ ఉండగానే కారు శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు కొచ్చింది. జనం చెదరు ముదురుగా కనిపించుతున్నారు.

కార్లూ ద్విచక్రవాహానాలూ చాలా ఆగి ఉన్నాయి. లోనకు బయటకూ జనం తిరుగుతున్నారు.

వరండా ఎదురుగా షామియానా వేసి ఎత్తైన ప్రదేశాన శ్రీధర్ రెడ్డిని ఉంచారు. ముఖం తప్ప పూలదండల్తో ఇంకేమీ కనిపించడం లేదు.

దగ్గరగా వెళ్లారిద్దరూ. కనిపిస్తున్న ముఖాన్నే పరిశీలనగా చూసాడు జయంతి.

పెదవి బాగా కమిలినట్లు ఉంది. దండ వేస్తూ ఇంకా దగ్గరగా చూసాడు.

అక్కడ నుంచి బయటకొచ్చి జయంతి ఫోను చేసాడు.

అరగంట తరువాత S.P. తో సహా పోలీసులు అక్కడకు చేరారు.

కాని ఏమీ చేయక ఏం చేయాలో తోచక నిల్చుండిపోయారు. ఎట్లా కదులుతామన్నా మున్సిపల్ చైర్‌పర్సనాయే. మంత్రిగారి తాలూకా ఆమె,

ఆయిదారు నిముషాలు తట్టుమిట్టాడి నళిని దగ్గరకి S.P వెళ్లి “డాక్టరు గారి బాడీని పోష్టుమార్టంకు పంపించాలి” అన్నాడు.

నళిని బావురుమని ఏడ్చింది.

పోలీసుల మాటను ఒప్పుకోవద్దనుకుంది.

ఇంతలో పెంచలయ్య వచ్చాడు. శ్రీధర్ రెడ్డికి దండ వేసి శ్రద్ధాంజలి ఘటించి విచారంగా కూర్చున్నాడు.

 S.P. గారి మాటను పెంచలయ్యకు చెప్పాడు నళిని మావయ్య వచ్చి.

ఖిన్నుడైపోయాడు. నిప్పులు చెరిగే కళ్లతో S.P.ని చూసాడు. హితులూ, వందిమాగధులూ ఈ మాట తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇది ఇలా ఉండగానే అంబులెన్సు వచ్చింది.  S.P. దగ్గరుండి స్ట్రెచర్‌లో శ్రీధర్ రెడ్డిని అంబులెన్స్ కెక్కించాడు, వ్యాను కదిలింది. అందరూ జరిగింది చూస్తూన్నారే తప్ప అవును కాదు అన్నవారు లేరు. అంతా నిశ్సబ్దం.

శివరాం మాత్రం ఇది జయంతి పెట్టిన మెలికేనేమో అని అనుకున్నాడు.

Post mortem పూర్తయింది. శవాన్ని పంపించారు.

‘బలవన్మరణం’ అని వ్రాసాడు డాక్టరు.

ఒక అవిటివాడు బలవన్మరణాన్ని ఆహ్వానించగలడా?

మరి జరిగిందేమిటి?

హత్యా?

అయితే శ్రీధర్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?

ఇలా మొదలైంది ప్రశ్న.

ఈ ప్రశ్నవెంట పోలీసు నడక మొదలయింది.

నళిని కూడా అనుమానితురాలయింది.

ఇది సాగి సాగి పెంచలయ్యను అనుమానించే స్థితికి చేరింది.

కాని అధికారం ముందు కేసును అలా నమోదు చేయలేకపోయింది పోలీసు. కలాన్ని కదపనివ్వలేదు.

రోటీన్ కేసులా చివరకు మారిపోయింది. ఆగిపోయింది.

అయితే ఈ మధ్య నడిచిన నెల రోజులుగా పెంచలయ్య నళినీ జనం కళ్లలో నానారు. పెంచలయ్య మాత్రం శ్రీధర్ రెడ్డి కంచు విగ్రహాన్ని చౌరాస్తాలోనే నిర్మించేందుకు ఆరాట పడట్లు కనిపించాడు. దగ్గర ఉండి చందాలు వసూలు చేసాడు టౌనులో. మంత్రి హోదాలో మంచి రోజు చూసి శాస్త్రోక్తంగా విగ్రహప్రతిష్ఠ పనిని జరిపాడు.

ఆ విగ్రహం కనిపించిపుడల్లా జయంతికి నవ్వు ఆగేది కాదు.

శ్రీధర్ రెడ్డి పైన జయంతికి గౌరవముంది. కాని దాన్ని ప్రతిష్ఠించిన తీరు అతన్నలా చేసింది. వెనకటికి ఓ ఆసామి, తెలీసో తెలియకో పిల్లిని చంపాడుట. దాని పరిహారార్థం వెండి పిల్లిని చేయించి బ్రాహ్మణుడికిచ్చాడట. దాంతో చేసిన పాపం కడిగేసుకున్నట్లు అయిందన్నమాట. ఇది గుక్తులోకొచ్చి జయంతి పెదవులు వంకర్లు తిరిగేవి.

(ఇంకా ఉంది)

Exit mobile version