[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నేర్చుకుందాము’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రకృతి నేర్పుతుంది మనకు పాఠాలు
నేర్చుకుందాం ఒద్దికగా ఓర్పుతో
ఆణువణువూ పరిశీలించితే
ఏదో ఒక సందేశం వినిపిస్తుంది
భూమి – ఆకాశం, సరస్సులు – నదులు,
పర్వతాలు – అంతం లేని సాగరం
జీవిత సత్యాన్ని చెప్పే బోధకులు
ఏ పాఠశాలలోనూ తెలియ చెప్పని
గొప్ప నేస్తాలు
కాలం గడవటంలేదు అనడం
బద్ధకస్తుల లక్షణం
ఆకాశంలోకి చూస్తే దేశాలు దాటి
ఎగిరే పక్షులు కనిపిస్తాయి
అగాధమైన జలధిలో ప్రయాణించే ఓడలు
చిన్న గాజు తొట్టెలో ఈదులాడే మీనాలు
చెంగున దూకే ఉడతలు అబ్బుర పరుస్తాయి
బుల్లి బుల్లి రెక్కలు ముడుచుకొని
హమ్మింగ్ బర్డ్స్ చిట్టి చిట్టి చీమలు
నిరంతరం పనిచేసే క్రమశిక్షణ
రాబోయే కాలానికి ముందు జాగ్రత్త
ఎవరైనా నేర్పేరా లేదు నేర్చుకున్నాయి
చూడటానికి దూది పింజెలు అయితేనేమి
కఠినమైన శిఖరాలను సైతం
బాహువుల్లో బంధించగలవు మేఘాలు
ఎంత గాలి వీచినా తుపానులు వచ్చినా
ఎదిరించి ఠీవీగా నిలబడతాయి భారీ వృక్షాలు
మానవాళికి మార్గదర్శకాలు తరచి చూస్తే
కంటి ఎదుట నిలిచిన సుందర స్వప్నాలు
మాయని చరిత్రలో స్ఫూర్తి సందేశాలు
అనుసరించేవారికి తరగని విలువైన ఖజానాలు.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.