Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేటి సిద్ధార్థుడు-1

బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు”.

మహీధర పురం ఒక స్వతంత్ర రాజ్యం. ప్రపంచ రాజ్యాలన్నింటిలో చాల సుందర రాజ్యమని దానికి పేరు. ప్రశాంతతకు మారు పేరుగా నిలిచి, ఆదర్శరాజ్యంగా కూడా పేరు తెచ్చుకున్నది. పరిమితమయిన జనాభాతో మిత్రదేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నది. చిరకాలపు రాచరికాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నది.

అక్కడ రాచమందిరంలో ఈ సమయాన మంగళ వాద్యములు మెల్లగా మ్రోగుతున్నాయి. దారికిరువయిపుల రాజభటులు మహారాజుకు, మహారాణికి అభివాదం చేస్తున్నారు. వారిరువురు సుదీర్ఘమయిన ఆ ప్రాంగణముగుండా పయనిస్తూ సుందరమయిన ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ నిర్మించిన ప్రశాంతమయిన విద్యామందిరానికి మెల్లగా చేరుకుంటున్నారు..

“జయహో..! జయహో..! రాణీ మాలినీదేవి సమేతంగా శ్రీమాన్ శ్రీ శశాంకవర్మ మహారాజుగారు వేంచేస్తున్నారు.. బహుపరాక్..! బహు పరాక్..!”

రాజభటుల జయజయ ధ్వనులు విని జ్ఙానముని చిరునవ్వుతో రాజుకు,రాణికి ఆహ్వానం పలికారు. వారిరువురు గురువుగారికి ప్రణామాలు చేసారు. గురువుగారు వారిని ఆసీనులు కమ్మని కోరగా వారిరువురు ఆసనాలలో కూర్చున్నారు. అక్కడ ఉన్న రాకుమారుడు సిద్ధార్థుడు ఇతర విద్యార్థులంతా రాజు, రాణులకు నమస్కారాలు చేసి కూర్చున్నారు.

“గురువర్యా..! మా పుత్రుని విద్యాభ్యాసం ఎట్లా జరుగుతున్నదో తెలుసుకొనుటకు ఇక్కడకు వచ్చాము..”

“మహారాజా..! సిద్ధార్థులవారి గురించి ఏమి చెప్పమందురు? వారు మిగితా పిల్లలకన్నా భిన్నమయిన వారు. ఏది నేర్పినా చాలా చురుకుగా గ్రహిస్తూ వారి తెలివితేటలతో మమ్మములను అనునిత్యం ఆశ్చర్య చకితులను చేస్తున్నారు. వారు ఏ శాస్త్ర గ్రంథమయిన అతి స్వల్పకాలంలో అధ్యయనం చేసేస్తున్నారు.”

“ఇది మాకు చాలా సంతోషకరమయిన విషయం.” రాణి మాలినీదేవి ఆనందంగా అన్నది.

“మహారాజా విద్యార్థులకు అక్షరజ్ఞానం కన్నా ప్రపంచజ్ఞానం చాల అవసరం. అందునా భావి మహీధర మహా సామ్రాజ్యనికి రాజు కావలసినవారు మా రాకుమారులవారు.”

“నిజము పలికినారు గురువర్యా..! మరి ఆ ప్రపంచ జ్ఞానం కలగడానికి మీరు ఏ విధమయిన విద్య గరుపుతున్నారు.”

“రాకుమారులవారికి అనేక విజ్ఙాన విషయములతో పాటు వివిధ కావ్యములను పరిచయం చేస్తున్నాను. వారును కావ్య పఠనమున్నా కథలన్నా చాల ఆసక్తి చూపుతున్నారు. అందువలన వారికి పలువిధములయిన కథలను చెబుతున్నాను. కథలలో చరిత్ర ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయం, సాహసం, ప్రేమాభిమానం, మంచీ మన్నన తెలుస్తాయి. అందువలన వారికి పాఠాలుగా భావింపని రీతిలో అనేకానేక కథలను చెబుతున్నాను మహారాజా!.” స్వరం తగ్గించి రాజుకు వివరించారు జ్ఞానముని.

“రాకుమారా..! ఇటు రమ్ము. ఇప్పటిదాకా మీరు ఎట్టి కథలను విన్నారు? మాకు తెలుసుకోవాలనేని కుతూహలంగా ఉన్నది.”

“తండ్రీ..! ఇప్పటిదాకా ఎన్నో కథలను విన్నాను. పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్ర కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, సాలభంజిక కథలు విన్నాను. అన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి తండ్రిగారు.”

“ఓ అలాగా.! మరి ప్రస్తుతం ఏమి వినుచున్నారు.?

“ప్రస్తుతం మా గురువుగారు జాతక కథలు చెబుతున్నారు. ముందుగా బుద్ధుని గురించి మొదలు చెప్పడం మొదలు పెట్టారు. ఇంతలో మీ ఆగమనం జరిగింది.”

రాణీ మాలినీదేవి మనసు ఎందుకో కలవర పడింది. సిద్ధార్థుడు ఏది విన్నా దాన్ని అంత సులభంగా వదలడు. అలాంటిది ఇప్పుడతను తథాగతుని గాథ వినబోతున్నాడా? ఎందుకో ఆ కథలు చెప్పవద్దు అని అందామని ఉన్నదామెకు. కానీ గురువుగారు ఏమి అనుకుంటారో అని ఆగింది.

వారివురు ఇక్కడ కూర్చుని ఉండగానే గురువుగారు తథాగతుని గాథను కొనసాగించారు. సిద్ధార్థుడు అతని మిత్రులు చాల ఆసక్తిగా వినసాగారు.

“అప్పుడు సిద్ధార్థుడు రాజ్య పర్యటనకు బయలుదేరాడు. ఆ పర్యటనలో అతను చూసిన మూడు సంఘటనలు అతని జీవితాన్నే మార్చేశాయి. ఫలితంగా దేశం ఒక రాకుమారుణ్ణి కోల్పోయింది. కానీ లోకానికి ఒక ఆదర్శమూర్తి కరుణాసాగరుడు దొరికాడు. అదెలాగా అంటే..” అంటూ గురువర్యులు జ్ఞానముని కథను కొనసాగించారు. రాజుగారు, రాణిగారు అక్కడనుండి లేచి మెల్లగా తమ అంతఃపురానికి బయలు దేరారు.

2

రాణిగారికి ఆహారం రుచించలేదు. ఆమె తల్లి మనసు ఎందుకో కలతపడసాగింది. వెళ్లి గదిలో శయ్యను చేరింది.

“రాణి మాలినిదేవి..! గురువుగారి వద్దకు వెళ్లి వచ్చాము. పుత్రుని ప్రతిభకు మురిసిపోక ఎందుకీ దిగులు?” అడిగారు రాజుగారు.

“ఎందుకో తెలియదు రాజా! ఏదో జరుగరానిది జరుగనున్నట్లు మనసుకు కలవరం కలుగుతున్నది. రేపు ఉదయం కోవెలకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేయగలరా.?”

“తప్పకుండా చేస్తాను. మేము కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇద్దరమూ కలిసే వెళదాము. చింతించకుండా నిదురింపుము దేవి.”

పరి పరి విధముల ఆలోచనలతో మనశ్శాంతిని కోల్పోయిన మాలినీదేవి ఏడూ రోజులు కోవెలకు వెళ్లి వివిధ రకములయిన పూజలను చేసింది. కుమారుడు సిద్ధార్థుడు, కుమార్తె వాసంతికల పేరిట అర్చనలు,  అభిషేకాలు చేయించింది. మూడురోజులా పాటు ఉపవాసదీక్షను చేపట్టింది.

“మాలినీదేవీ! మీరు అనవసరంగా ఎందుకో కలత పడుతున్నారు. మన కుమారుని విద్యపట్ల అతని శక్తి సామర్థ్యాల పట్ల మీరు ఎట్టి అనుమానాలు పెట్టుకోవలదు..”

“అనుమానాలకు తావే లేదు మహారాజా..! కేవలం నా మనసులో ఎందుకో తెలియని  ఆందోళన మాత్రమే.”

“ఆందోళన ఎందుకు దేవీ? సరే మీ మనసుకు ఊరట కలిగేందుకు, నాకు కొంత నమ్మకం కలిగేందుకు.. రాకుమారునికి మరింత ఆత్మవిశ్వాసం పెరిగేందుకు.. కుమారుల విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాను. వారి విద్యలు, ఆటపాటలు చూసి తెప్పరిల్లుము దేవీ.”

మహారాజు ఆ విధంగా చెప్పగానే మాలీనీదేవి మనసు కొత్త ఉత్సాహంతో ఉరకలువేసింది. ఈ సందర్భంగా రాచబంధువులందరూ కలుస్తారని సంతోషపడింది. వారికి కావలసినవసతి, భోజన ఏర్పాట్లు చేయించడంలో మునిగిపోయింది.

3

అనుకున్న రోజు రానే వచ్చింది. రాకుమారుడు సిద్దార్థుడు.. సేనానాయకుల కుమారులు, సైనికుల కుమారులు, మంత్రుల కుమారులు రాజకుటుంబంలోని కొందరు యువకులు అందరూ పాల్గొన్న ఆ విద్య ప్రదర్శన కార్యక్రమం ఆద్యంతం చాలా ఉత్కంఠగా జరిగింది. విలువిద్య, అస్త్ర, శస్త్ర విద్యలు, కుస్తీపోటీలు, వ్యాయామ పోటీలు, చిత్రలేఖనం, కవిత్వ పఠనమూ, గాత్రకచేరీ, వాద్యకచ్చేరీ.. ఇలా ఎన్నెన్నో జరిగాయి. సిద్ధార్థుడు ముఖ్యమయిన వాటిలోనే పాల్గొని మిగతా వాటిలో ఇతరులకు అవకాశము ఇచ్చాడు.

అనంతరం కావ్యచర్చ జరిగింది. అర్థశాస్త్ర, రాజనీతి శాస్త్ర చర్చలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుండి పిలిపించిన పెద్ద పెద్ద పండితులు న్యాయనిర్ణేతలుగా చర్చా నిర్వాహకులుగా విచ్చేసారు. అన్నింటా అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తున్న రాకుమారున్ని చూసి నివ్వెరపోయిన ఒక పండితుడు అతన్ని ఎలాగయినా ఓడించాలని చూసాడు. ఆ రోజు సామాజిక, రాజనీతి శస్త్ర చర్చ జరుగుతున్నది.

సాకేతముని అను గురువు సిద్దార్ధుణ్ణి వివిధ రకముల ప్రశ్నలు వేసి పరీక్షించుచున్నారు

“రాజు సామ్రాజ్యాన్ని విస్తరించుట అవసరమా కాదా ..?”

“అవసరమే..! సామ్రాజ్యాన్ని విస్తరించుటకంటే  ముందు రాజు తన రాజ్యం చుట్టుపక్కల ఉన్న రాజ్యాల భౌతికస్వరూపం.. అక్కడ ఉన్న సేనల వివరాలు తెలుసుకొనుటతో పాటు అక్కడి రాజు శక్తివంతుడా, బలహీనుడా అని కూడా తెలుసుకొనవలెను.”

“అటులనిన ఒక వేళ  అక్కడ ఉన్న రాజు శక్తివంతుడయితే..? ”

“ఎట్లయినా చేసి రాజు అతనితో మైత్రి సల్పవలెను.”

“ఎందుకు అతనితో యుద్ధం చేయలేకనా..?” సాకేతముని వెటకారంగా అడిగాడు.

“కాదు గురువర్యా..!  తన వద్ద ఉన్న సైన్యాన్ని కోల్పోకుండానూ నష్టపోకుండా ఉండడం కోసం ” సిద్ధార్థుడు ఓర్పుగా జవాబు చెప్పాడు.

“వివరిస్తారా రాకుమారా?” శశాంక వర్మ అడిగారు..

“శక్తివంతుడయిన రాజుతో తలపడినప్పుడు, ఆ రాజును తప్పక జయించగలమేమో గాని అంత త్వరగా జయించలేము. తుదకు వివిధ యుద్ధ ప్రక్రియల ద్వారా అతన్ని ఎలాగయినా జయించే క్రమంలో మనదగ్గర ఉన్న అనేకమంది శక్తి వంతులయిన సైనికులను కోల్పోతాము. ఆ తరువాత వచ్చే ఆ విజయం రాజుకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ, పైకి సంతోషంగా ఉన్నట్లు కనపడినా..  తమ మిత్రులనూ సహసైనికులనూ,తమ కుటుంబీకులనూ కోల్పోయిన సైన్యం మాత్రం సంతోషంగా ఉండదు.”

“మళ్ళీ సైన్యాన్ని బలోపేతంచేసే సమయంలో కొత్తవారు సైన్యంలో చేరుటకు త్వరగా ముందుకు రాకపోవచ్చు.  ఒక వేళ కొత్తగా సైన్యంలో కొందరు చేరినా వారు సుశిక్షుతులవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా ఓడిపోయిన రాజు కుటుంబీకులు, అతని సైన్యం మళ్ళీ ఏదో వ్యూహం పన్నవచ్చు. మెల్ల మెల్లగా వారు బలం పుంజుకోవచ్చు. ఇన్నినష్టాలకంటే శక్తివంతుడయినా రాజుతో లౌక్యంగా ఉంటూ మైత్రి చేసుకోవడం మేలు కదా!”

సిద్ధార్ధుని వాదనను శశాంక మహారాజు ఆశ్చర్యంగా వినసాగాడు.

“సరే మరి బలహీనులయిన రాజుల గురించి చెబుతారా?”  సాకేతముని అడిగాడు.

“బలహీనులయిన రాజులను తక్షణం ఓడించి ఆ రాజ్యం మన రాజ్యంలో కలుపుకోవడమే ఉత్తమం.”

“భలేవాడివి కుమారా..! ఇంతకు ముందేమో శక్తివంతుడయిన రాజుతో యుద్ధం చేయవద్దు అన్నారు. ఇప్పుడేమో బలహీనుడయినా రాజుతో తక్షణం యుద్ధం చేయాలి అంటున్నారు. బలహీనులయినా వారి మీదనా రాజుల ప్రతాపం..” సదాశివ గురువు వెటకారంగా అన్నాడు.

రాజు రాణులతో పాటుగా ప్రేక్షకులంతా జరుగుతున్నా చర్చను ఉత్కంఠతో వింటున్నారు. మాలినీదేవి కుమారుని తెలివి తేటలకు ఒకవంక అబ్బుర పడుతున్నది.  అంతలోనే పండితులతో ఙరుగుతున్న ఆ చర్చలలో కుమారుడు ఎక్కడ ఓడిపోతాడో అని భయపడుతున్నది. పండితులు చర్చను కొనసాగించారు.

“ఇది చాలా వింతగా ఉన్నది కుమారా..! ఇందాక మీరు శక్తివంతుడయిన రాజుతో యుద్ధం వద్దు అన్నారు.  ఇప్పుడు బలహీనుడయిన రాజుతో యుద్ధం చేసి తీరవలెనని అంటున్నారు. ఇది ఏమిటి?” సాకేతముని రెట్టించి అడిగాడు

“గురువర్యా..! బలహీనుడయిన రాజుని మనం ఓడించకుంటే మరొక శక్తి వంతమయిన రాజు వచ్చి దండెత్తవచ్చు. అప్పుడు ఆ రాజు మనకు పక్కలో బల్లెముగా మారవచ్చు. అందువలన బలహీనుడయిన రాజుతో యుద్ధం ప్రకటించి దశల వారీగా యుద్ధం చేస్తూ అతన్ని బలహీన పరుస్తూ అతనంతట అతనే సంధి కుదుర్చుకునేటట్లు చేయాలి. అప్పటికీ మూర్కంగా యుద్ధమే చేస్తే ఓడించే తీరాలి.”

ప్రేకులనుండి చప్పట్లు మారుమ్రోగిపోయాయి. ఇలా ఏ చర్చ మొదలుపెట్టినా సిద్దార్థుడు తన వాద పటిమతో నెగ్గుకొస్తున్నాడు. అయినను సదాశివ పండితుడు సిద్ధార్ధుని వదిలి పెట్టలేదు. ఎలాగయినా అతన్ని ఓడించాలని చూస్తున్నాడు.

“కుమారా..! రాజయిన వాడు సామ్రాజ్యమును విస్తరించుటలో శ్రద్ద చూపించవలెనా.. లేక వారసుణ్ణి కాపాడుటలోనూ, వంశము నిలుపుకొనుటలోనూ శ్రద్ధ వహించవలెనా..?

“సామ్రాజ్యమును విస్తరించుటయందె దృష్టి పెట్టుట అంత ముఖ్యం కాదు గురువుగారు. అలాగని వంశం నిలుపుకొనుట యందే ధ్యాస ఉండుట కూడా ముఖ్యం కాదు. కేవలం వారసుడిని సిద్ధం చేయుటయే అతి ముఖ్యం..”

సదాశివ పండితుడు, సాకేతముని పెద్దగా నవ్వారు..

“వంశం నిలుపుకోవడం ముఖ్యం కాదా..? మరి వారసుడు యెట్లా వస్తాడు..? తన వంశం కాని వాడిని రాజు తన వారసుడు అని ఎలా ప్రకటిస్తాడు.. ?

“వంశగౌరవం అనేది రాచకుటుంబానికి మాత్రమే ప్రతిష్ఠాకరం. ఏ రాజ్యానికయినా సమర్ధుడయిన వారసుడు లేకపోతే మాత్రం.. ఆ రాజ్యం తీవ్రముగా నష్టపోవాల్సి వస్తుంది. పాలనలో ఉన్నరాజు ముందుచూపుతో తనకు సరియయైన వారసుడిని ఏర్పాటు చేయలేకపోతే ఆ తప్పిదం వర్తమాన రాజుదే అవుతుంది.. ”

“అది ఎట్లో వివరించగలరా కుమారా..?” శశాంకవర్మ అడిగారు పౌరుషంగా

“అవును రాజా..! కుటుంబానికి దక్షుడైన తండ్రి యెంత ముఖ్యమో, ప్రజా రాజ్యానికి తండ్రివంటి సమర్ధుడయిన రాజు కూడా అంతే ముఖ్యం. కుటుంబానికి తండ్రిగాని రాజ్యానికి రాజు కానీ శాశ్వతము కాదు. తన తదనంతరం ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుందో ముందే ఆలోచించి ఆ కుటుంబ పోషణకు తగిన ఏర్పాట్లు ఆ కుటుంబ పెద్ద చూడాలి. అలాగే తనకు ఏ క్షణమయిన ఏమయినా అయితే.. ఆ రాజ్యం పరిస్థితి ఏమిటా..? అని ముందే ఆలోచించి రాజే ఒక వారసుణ్ణి సిద్ధం చేసుకోవాలి. ఆ వారసుడు తన కడుపున పుట్టినవాడో తన వంశస్థుడో అయి తీరాల్సిన అవసరం లేదు. రాజ్యం అనేది అతని స్వంత ఆస్తి కాదు సంతానం ఎలా ఉన్నా వారికి అప్పచెప్పడానికి వంశం అశాశ్వతం. రాజ్యం శాశ్వతం. ముందు  చూపుగల నిజాయితీ పరుడయినా రాజు వంశగౌరవం కోసం ప్రలోభపడకూడదు. రాజ్య భవిష్యత్తుకై పాటుపడాలి. రాజ్యాన్ని కాపాడగలిగిన యోధుడు.. తన వంశములో లేని రోజున.. దక్షత, శక్తి సామర్థ్యత, కుశలత కలవాడయి ఉన్నవారిని ఎంచుకుని, వారికి తగిన తర్ఫీదు ఇవ్వాలి.. ”

ఆ ఆవరణంతా మళ్ళీ చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

ఆ చప్పట్లతో సదాశివ పండితుని అహం దెబ్బతిన్నది. రాకుమారుని మెచ్చుకోవాల్సిన పండితుడు రాకుమారుణ్ణి ఎలా దెబ్బతీయాలా అని ఆలోచించసాగాడు.

పండితుడు ఇక ఆ చర్చలో రాకుమారున్నీ విజేతగా ప్రకటిస్తాడని ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్రంగా..

“కుమారా మీరు అసలయిన రాజువలే ఒక సామ్రాజ్యవాది వలే ఎంత సేపు రాజ్యము.. సింహాసనం గురించిన ఆలోచనలతోనే గడుపుతున్నారు. రాజ్యం యొక్కప్రధానలక్షణాలు.. రాజ్యమూ, సార్వభౌమాధికారమూ మాత్రమే కాదు, రాజ్యమంటే.. ప్రజలూ వారి బాగోగులు కూడా. ఇన్ని విద్యలు నేర్చినారు గాని, అసలు  ఏనాడయినా ప్రజల మధ్యకు వెళ్ళారా..? ఈ సిద్ధార్థుల వారికి అసలు సామాన్య జనం ఎలా ఉంటారో తెలుసా..? ఏనాడయినా వారి ఈతి బాధలను తెలుసుకున్నారా..?”  సవాలు విసిరాడు.

సిద్ధార్థుడు మౌనం వహించాడు.. వెంటనే జ్ఞానముని వేదిక మీదకు వచ్చి…

“ఇప్పటివరకు జరిగిన రసవత్తరంయినా చర్చలో సిద్ధార్థుడు అమితమయిన తెలివితేటలను ప్రదర్శించి మహారాజులవారిని, మహారాణిని, గురువులను, పండితులను ఆనందింపచేసాడు. అతనిని విజేతగా ప్రకటిస్తున్నాము.” అంటూ సిద్ధార్ధుని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.

సిద్ధార్ధుడు వినయంగా జ్ఞానమునికి, ఇతర గురువులకు తల్లిదండ్రులకు పాదాబివందనం చేసాడు. కానీ అతని మనసు అల్లకల్లోలంగా ఉన్నది.

“సిద్ధార్థుల వారిప్పుడు పదహారేళ్ళ ప్రాయంవారు. ఇప్పటిదాకా విద్యను అభ్యసించుటలోనే గడిపారు. కుమారుని క్షేమమును, రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇంతవరకూ నగర సంచారానికి గాని, దేశపర్యటనకుగాని మహారాజు వారు సిద్ధార్ధుని అనుమతించలేదు. ఈ విషయం సదాశివ పండితులవారు గ్రహించలేదు. విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించునప్పుడు.. సంబంధిత విషయం గురించి మాత్రమే వారి అనుభవాలను, ప్రతిభను పరిగణలోకి తీసుకోవాలని సదానంద పండితుల వారికి తెలియనిది కాదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమయినా గురువులకు పండితులకే కాక ఇక్కడ గుమిగూడిన ప్రజానీకానికి కూడా కుమార రాజావారి ప్రతిభా స్థాయి తేట తెల్లమయినవి. అందులకు మీకు మరి ఇతర పండితులకు మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రతిభాపాటవ పరీక్షా ప్రదర్శనా ఇంతటితో ముగిసినదని ప్రకటిస్తున్నాను..” అని జ్ఞానముని ప్రకటించారు.

(సశేషం)

Exit mobile version