Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరువు హత్యల కథతో నేటి సమాజంపై వ్యాఖ్యానం – NH10

[‘NH-10’ అనే హిందీ సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

‘NH10’ హిందీ చిత్రం 2015లో వచ్చింది. కథ పరువు హత్యలకు సంబంధించినది. కానీ నేటి అధికాదాయవర్గాలకి, గ్రామీణులకి మధ్య ఉన్న ఘర్షణను ప్రభావవంతంగా చూపించింది. ఈ కథ దిల్లీ, హర్యాణా ప్రాంతాల్లో జరిగిన కథ. ఒక దశాబ్దం తర్వాత ఇది హైదరాబాద్, రంగారెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన కథ అని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. దశాబ్దకాలంలో హైదరాబాద్ బాగా ‘అభివృధ్ధి’ చెందింది. కానీ రాజధాని అభివృద్ధికి తగినట్టు రాష్ట్రానికంతటికీ విద్య, సదుపాయాలు దక్కాయా? లేదు. శివారు ఐటీ కంపెనీల్లో కొందరు బాగా సంపాదిస్తుంటే, ఇంతకు ముందు అదే చోట ఉండి, స్థలం అమ్ముకుని, పనివాళ్ళుగా మిగిలిపోయినవారు అసహనానికి లోను కారా? సంపాదన బాగా ఉన్నవాళ్ళు వీళ్ళని అనాగరికులుగా చూస్తుంటే కడుపు రగలదా? ఇలాంటి ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ప్రశ్నలుగా నిలుస్తాయి. ఈ చిత్రం జీ5లో లభ్యం.

కథలోకి వెళితే మీరా, అర్జున్ దిల్లీలో బాగా సంపాదిస్తున్న ఒక జంట. పెళ్ళైన జంటే.. సహజీవనం కాదు. అంతవరకూ నయం! ఒకరాత్రి ఒక పార్టీకి వెళతారు. అక్కడ ఒకామె మీరాతో “బెంగళూరులో బార్లు 11.30కే మూస్తేస్తారు. దిల్లీ చూడు!” అంటుంది. అంటే రాత్రి తెల్లవార్లూ తాగేలా సదుపాయం ఉంటే గొప్పన్నమాట! ఆ మాటన్న ఆమెకి అర్జున్ అంటే ఇష్టమని మీరాకి తెలుసు. అయినా ఇదంతా మామూలే అనుకుంటుంది. అదీ నేటి సంస్కృతి. ఇంతలో మీరాకి ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా ఆఫీసుకి వెళ్ళాలి. ఒక్కతే బయల్దేరుతుంది. ఈ రాత్రిళ్ళు కూడా పని చేసేంత ‘అభివృద్ధి’ మనకి అవసరమా? కారులో వెళుతుంటే దుండగులు అటకాయిస్తారు. మీరా తప్పించుకుంటుంది. అర్జున్‌కి డీఐజీ తెలుసు. ఒక పోలీసు అధికారి “మీకు డీఐజీ తెలుసు కదా. మీరాకి గన్ను లైసెన్సు తీసుకోండి” అని సలహా ఇస్తాడు. తుపాకీ సంస్కృతి కూడా పెరిగిపోతోంది. వహ్వా!

మీరా గన్ను తీసుకుంటుంది. ఒక వారాంతం విహారయాత్రకి బయల్దేరతారు మీరా, అర్జున్. ఆమెని ఆఫీసు నుండి పికప్ చేసుకోవటానికి అర్జున్ కారులో వస్తాడు. కారంటే చిన్న కారు కాదు. పేద్ద కారు. ఎస్‌యూవీ. ఓ అర్థశతాబ్దం క్రితం పొడుగైన కారు ఉంటే పడవంత కారు అనేవారు. ఇప్పుడు వీటిని ఏమనాలో? కారు ఆఫీసు భవంతి ఎదురుగా ఆపుతాడు అర్జున్. సెక్యూరిటీ కార్మికుడు ఇక్కడ ఆపకూడదు అంటాడు. అర్జున్ “అడ్డేం లేదుగా. కాసేపే” అంటాడు. ఇలాంటి చిన్న విషయాల్లోనే రచయిత, దర్శకుడు సమాజంలో ఉండే ద్వంద్వ ప్రవృత్తిని చెబుతారు. నియమాలు ఉన్నది పాటించటానికి. ఎవరికైనా అడ్డా? ఎంతసేపు? అనే ప్రశ్నలు రాకూడదు. అదే మనకి ఎవరైనా అడ్డొస్తే మాత్రం గొడవ చేస్తాం. నియమాలు ఉన్నది ఇతరులకే, మనకి కాదు! మీరా వచ్చి కారెక్కుతుంది. సెక్యూరిటీ కార్మికుడు “మీకు తెలుసు కదా మేడం” అంటాడు. ఆమె కారెక్కి అర్జున్‌తో “అతన్నెందుకు ఇబ్బందిపెడతావు?” అంటుంది. అతను సెక్యూరిటీ కార్మికుడికి సారీ చెబుతాడు. నియమాలు ఎవరు పాటించినా పాటించకపోయినా నేను పాటిస్తాను అనుకుంటే కొన్ని సమస్యలైనా తగ్గుతాయి. కారులో దిష్టి తగలకుండా ఈ మధ్య వాడుతున్న ఈవిల్ ఐ ప్రొటెక్షన్ (చెడు చూపుల నుంచి రక్షణ) వేళాడుతూ ఉంటుంది. దేవుడి బొమ్మ పెట్టుకుంటే చాదస్తం. ఈవిల్ ఐ ప్రొటెక్షన్ మాత్రం ఫ్యాషన్!

మీరా, అర్జున్ NH-10 హైవే మీద వెళుతుంటారు. ఒక టోల్ గేట్ దగ్గర కొన్ని లేన్లు మూసి ఉంటే అర్జున్ అటెండెంట్‌ని ఏమైందని అడుగుతాడు. “పెద్ద కార్లో నలుగురొచ్చారు. టోల్ అడిగితే అటెండెంట్‌ని షూట్ చేశారు” అంటాడతను. మీరాకి సరిగ్గా వినపడదు. అర్జున్ కూడా ఏమీ చెప్పడు. కొందరు భూస్వాములు ఆదాయపు పన్నులు కట్టరు. ప్రజల పన్నులతో వేసిన రోడ్లు మాత్రం వాడుకుంటారు. టోల్ అడిగితే కోపం. అయినా ఇంతకు ముందు స్వేచ్ఛగా తిరిగిన చోట ఇప్పుడు టోల్ కట్టమంటే నచ్చకపోవటం వింతేం కాదు. హింస మాత్రం తప్పే. గుడ్గావ్ (గురుగ్రామ్) దిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది. అది హర్యాణాలో భాగం. అర్జున్ కారుది హర్యాణా రెజిస్ట్రేషన్. గుడ్గావ్‌లో బహుళజాతి కంపెనీలు కట్టేశారు. చుట్టుపక్కల విలాసమైన నివాసాలు వెలిశాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో తెల్లాపూర్ లాగా. ఉద్యోగులకి, స్థానికులకి ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ‘ఇంత డబ్బు పెట్టి కొన్నాం’ అని ఉద్యోగులు, ‘ఇవన్నీ మా స్థలాలే’ అని స్థానికులు – ఎవరి వాదన వారిది. రాజకీయనాయకులు కమీషన్లు తీసుకుని చోద్యం చూస్తుంటారు. ఈ తారతమ్యాలు ఉంటేనే వారి పబ్బం గడుస్తుంది.

అర్జున్ ఒకచోట దారి తెలుసుకోవటానికి ఆగుతాడు. అక్కడ స్థానికులు దురుసుగా జవాబు చెబుతారు. మీరాకి స్థానికులని చూస్తే అదో రకం భయం. కాస్త దూరం వెళ్ళాక భోజనం కోసం ఒక ధాబా దగ్గర ఆగుతారు. ఒక జంట అక్కడి నుంచి పారిపోవటం కనిపిస్తుంది. టాయిలెట్లో మీరాకి తలుపు మీద బూతు మాట కనిపిస్తుంది. ఆమె దాన్ని తుడిచేస్తుంది. ఇంతలో పారిపోతున్న జంటలోని అమ్మాయి వెనక్కి వచ్చి “అక్కా. మమ్మల్ని కాపాడు. మా ఇద్దర్నీ చంపేస్తారు” అంటుంది. మీరా పట్టించుకోకుండా వచ్చేస్తుంది. భోజనం ఆర్డరు చేసి కూర్చుంటే కాసేపటికి కొందరు వచ్చి అక్కడ దాక్కున్న జంటని లాక్కువెళ్ళి జీపులో ఎక్కిస్తారు. అర్జున్ వారి నాయకుడిని ఆపటానికి ప్రయత్నిస్తే అతను అర్జున్‌ని చెంపదెబ్బ కొడతాడు. ఆ నాయకుడి పేరు సత్‌బీర్. మీరా అప్పటికీ అర్జున్‌ని ఆపుతూనే ఉంటుంది. సత్‌బీర్ “పక్కకి పో. అది నా చెల్లెలు” అంటాడు. అర్జున్ అవాక్కయి ఉండిపోతాడు.

అర్జున్ అహం మీద దెబ్బ తగిలింది. అతను ముభావంగా కారు నడుపుతూ ఉంటాడు. వేగం పెంచుతాడు. మీరా అతన్ని సముదాయించటానికి ప్రయత్నిస్తుంది. అతను ఆమెని విసుక్కుంటాడు. ఇంతలో హైవేకి పక్కని నిర్జన ప్రదేశంలోకి సత్‌బీర్ జీపు వెళ్ళటం కనిపిస్తుంది. మీరా వద్దంటున్నా అర్జున్ వెనక వెళతాడు. గన్ తీసుకుంటాడు. “వాళ్ళు పల్లెటూరి బైతులు. కాస్త మర్యాద నేర్పించాలి” అంటాడు. పల్లెటూరి వారంటే చులకన భావం ఇక్కడ కనిపిస్తుంది. పల్లెటూరి వారైతే అనాగరికులేనా? అందరినీ ఒకే గాటన కట్టేస్తారా? ఒకచోట ఆగి ఉన్న జీపు కనిపిస్తుంది ఖాళీగా. అర్జున్ దిగి అక్కడున్న కాలిబాటన వెళతాడు. మీరా కారులోనే ఉంటుంది. అర్జున్ ఫోన్ కారులోనే వదిలేశాడని ఆమె తర్వాత గమనిస్తుంది. అర్జున్ ఆ నిర్జన ప్రదేశంలో నడిచి వెళుతుంటే పైన ఆకాశంలో దూరంగా ఒక విమానం పొగలు చిమ్ముకుంటూ వెళుతుంటుంది. కింద ఉన్న ప్రపంచంలో జరుగుతున్న అకృత్యాలు పైన ఆకాశంలో ఎగురుతున్నవారికి తెలియవు. వారికి అంతా అందంగా కనిపిస్తుంది.

సత్‌బీర్ గ్యాంగ్‌లో బుద్ధిమాంద్యం ఉన్న ఒక అమాయకుడు ఉంటాడు. అతని పేరు ఛోటే. అతను జీపుకి కాపలాగా కాస్త దూరంగా ఉంటాడు (అందరూ వెళుతుంటే నేనూ వస్తానని మారాం చేస్తే అతన్ని తీసుకువచ్చారని ఊహించవచ్చు). అర్జున్ కారు అతనికి నచ్చుతుంది. కారు దగ్గరకి వచ్చి మీరాని “కారు నేను నడపనా?” అంటాడు. అతను అమాయకుడని ఆమె గ్రహిస్తుంది. ఆమె అర్జున్ గురించి అడిగితే అతను తుపాకీ సంజ్ఞ చేస్తాడు. మీరా కంగారుపడి అర్జున్ వెళ్ళిన వైపు వెళుతుంది. అర్జున్‌కి సత్‌బీర్ గ్యాంగ్ కనిపిస్తుంది. వాళ్ళు ప్రేమజంటని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అబ్బాయి కాళ్ళు విరిచేస్తారు. అమ్మాయికి సత్‌బీర్ విషం తాగిస్తాడు. “ప్రేమ కావాలా?” అని అరుస్తాడు. ఆర్జున్ భయపడి పారిపోతాడు. దారిలో మీరా కలుస్తుంది. ఇద్దరూ పరిగెడతారు కానీ సత్‌బీర్ గ్యాంగ్ వెనకాల వచ్చి అర్జున్‌ని తలపై కొడతారు. మీరా వేడుకున్నా వినరు. ఆమె ఫోన్ లాక్కుంటారు. అర్జున్ ఫోన్ కార్లో ఉంది కాబట్టి ఇప్పుడు వారు ఎవరికీ ఫోన్ చేసే అవకాశం లేదు. తర్వాత అర్జున్ గన్‌తో సత్‌బీర్ తన చెల్లెలిని కాల్చేస్తాడు. ఆమె ప్రియుడిని గడ్డపారతో పొడిచి పొడిచి చంపేస్తాడు. అర్జున్‌ని, మీరాని చంపాలని అనుకుంటారు. వారు భయభ్రాంతులై ఉంటారు. ఇంతలో సత్‌బీర్ కింద పడేసిన తుపాకీని ఛోటే తీసుకుంటాడు. మీరా, అర్జున్ ల దగ్గరకి వస్తాడు. సత్‌బీర్ గ్యాంగ్ కాస్త దూరంలో ఉంటుంది. తర్వాత ఏం చేయాలో చర్చించుకుంటూ ఉంటారు. సత్‌బీర్ మేనమామ కూడా గ్యాంగ్‌లో ఉంటాడు. అతనే సలహాలు ఇచ్చే పెద్దబుర్ర.

మీరా ఛోటేతో గన్ ఇస్తే కారు తాళాలు ఇస్తానంటుంది. అతను కారు తాళాలు తీసుకుని గన్ ఇస్తాడు. అర్జున్ గన్ తీసుకుని అతనికి గురి పెట్టి కారు తాళాలు తిరిగి ఇవ్వమని అరుస్తాడు. గ్యాంగ్ పరుగున వస్తుంది. ఛోటే కారు తాళాలు ఇవ్వనని మొండికేస్తాడు. అర్జున్ లాక్కోబోతుంటే గన్ పేలి ఛోటే చనిపోతాడు. కారు తాళాలు వదిలి మీరా, అర్జున్ పారిపోతారు. గ్యాంగ్‌లో ప్రతీకారవాంఛ రగులుతుంది. వారిని వెంబడిస్తారు. ఇంతలో చీకటి పడుతుంది. మిగతా కథంతా తెల్లవారే లోపు జరుగుతుంది.

సత్‌బీర్ సొంత చెల్లెలిని చంపటం దారుణమే. కానీ కాస్త ఆలోచిస్తే అమ్మాయిలు ఎందుకు ప్రేమలో పడుతున్నారు? సినిమాల్లో ప్రేమని గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. సినిమాల్లో విలాసవంతమైన జీవితం చూసి అమ్మాయిలు నగరాలకు వెళ్ళాలని ఉబలాటపడుతున్నారు. తలిదండ్రులు విలన్ల లాగ కనపడుతున్నారు. తలిదండ్రులని గౌరవించాలని పిల్లలకి చెప్పాలి. పిల్లలకి ప్రేమ పంచాలని పెద్దలు తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మగపిల్లలని ఊరి మీదకి వదిలేసి, ఆడపిల్లలని బందీల్లాగ ఉంచటం మానాలి. ఈ చిత్రంలో తర్వాత వచ్చే సన్నివేశాల్లో మీరా భయంతో ఒకడిని చూస్తుంటే అతను “కళ్ళు దించు” అంటాడు. ఆడవాళ్ళంటే అంత లోకువ. ఇంకో సన్నివేశంలో ఒక పిల్లవాడు నానమ్మ తన తల్లిని చెంపదెబ్బ కొట్టటంతో తల్లి కిందపడితే చూసి నవ్వుతాడు. చిన్నప్పటి నుంచే ఆడవారిని చులకన చేయటం చూస్తున్నారు పిల్లలు. తండ్రి తల్లిని ప్రేమగా చూసుకుంటే పిల్లలకి ప్రేమ విలువ ఇంట్లోనే తెలుస్తుంది. నగరాలు వేగంగా అభివృద్ధి చెంది పల్లెటూళ్ళు వెనకబడి ఉండటం వల్ల యువతీయువకులు నగరాలకి పరుగులు పెడుతున్నారు. ఇది మారాలి. వ్యవసాయరంగం మళ్ళీ ఆకర్షణీయంగా మారాలి. ఇది రాత్రికి రాత్రే జరగదు. దీనికి రాజకీయనాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి.

పరువు హత్యలు జరిగే కుటుంబాల్లో పెద్దలే వాటికి కారణమవుతున్నారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో. విద్య నేర్పేటపుడు సదాచారం, సత్ప్రవర్తన గురించి చెప్పే పాఠాలు కనుమరుగవుతున్నాయి. అటు ఇంట్లో, ఇటు బడిలో సదాచారం చెప్పకపోతే పిల్లలు పెద్దయిన తర్వాత సాటి మనిషిని గౌరవించాలని ఎలా నేర్చుకుంటారు? సాటి మనిషి సంగతి దేవుడెరుగు, ఇంట్లో వాళ్ళనే గౌరవించటం లేదు. అమ్మాయి ఎవర్నో ప్రేమించి వెళ్ళిపోతే చంపాలన్నంత కసి ఎందుకు? పరువు కోసం హత్య చేయటం ఏం ఆచారం? ఎవరైనా అడిగితే “మా ఇష్టం లేకుండా వెళ్ళింది. పోనీయండి” అంటే సరిపోతుందిగా. అయినా ఎవరూ ముఖం మీద అడగరు. వెనకాల ఏదో అనుకుంటారని చింత. ఏమనుకుంటారు? పెంపకం గురించి ఏదో అంటారని. ‘నా పెంపకాన్ని తప్పుబడతారు’ అనే భావన. అంటే అహంకారమేగా? ఆ అహాన్ని సంతృప్తిపరచుకోవటానికి హత్య చేయాలా? తెలంగాణలో జరిగిన ఒక పరువు హత్య పర్యవసానం ఏమైంది? హత్య చేయించిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ చిత్రానికి సుదీప్ శర్మ స్క్రీన్‌ప్లే రాయగా నవదీప్ సింగ్ దర్శకత్వం వహించాడు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రెండూ ఆలోచింపజేసేలా ఉంటాయి. చివరికి చిత్రం కమర్షియల్ పంథాలో నడిచినా చిత్రం పొడుగునా వాస్తవికత కనపడుతూ ఉంటుంది. మీరాగా అనుష్కా శర్మ, అర్జున్‌గా నీల్ భూపాలన్, సత్‌బీర్‌గా దర్శన్ కుమార్ నటించారు. తర్వాత వచ్చే సర్పంచ్ పాత్రలో సీనియర్ నటి దీప్తి నావల్ గుర్తుండిపోతుంది.

Spoiler warning: ఈ కింది భాగంలో చిత్రం మిగతా కథ ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

తర్వాత జరిగే కథలో గ్యాంగ్‌లో మరొకడిని మీరా తుపాకీతో కాల్చి చంపేస్తుంది. తుపాకీలో తూటాలు అయిపోతాయి. అర్జున్ కాలికి కత్తిపోటు వల్ల తీవ్రగాయమవుతుంది. అతన్ని ఒక రైల్వే అండర్ పాస్‌లో కూర్చోబెట్టి మీరా సాయం కోసం వెళుతుంది. పోలీస్ స్టేషన్‌కి వెళితే అక్కడ ‘మా పరిధి కాదంటే మా పరిధి కాదని’ పోలీసులు గొడవపడతారు. మీరాకి మన దేశం అసలు స్వరూపం అక్కడ తెలుస్తుంది. తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ ఆమెకి దారిలో ఎదురుపడతాడు. సాయం చేస్తానని తన జీపులో ఎక్కించుకుంటాడు. “గుడ్గావ్‌లో ఆఖరి మాల్ దాటగానే రాజ్యాంగం పరిధి కూడా అంతమవుతుంది” అని కొత్త సూక్తి చెబుతాడు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆటవిక రాజ్యమన్నమాట. ఆమెకి అతని అసలు స్వభావం అర్థమవుతుంది. అతను కూడా సత్‌బీర్‌తో కుమ్మక్కయినవాడే. ఇంతలో సత్‌బీర్ జీపు రావటం కనిపిస్తుంది. ఆమె తన దగ్గర ఉన్న పెన్‌తో ఇన్స్‌పెక్టర్‌ని కంట్లో పొడిచి చంపేసి పారిపోతుంది.

మీరా తవ్వకాలు జరిగే ఒకచోట ఉన్న కూలీ ఇంట్లోకి వెళుతుంది. ఆ కూలీ కుటుంబం బీహార్ నుంచి వచ్చింది. వారు ఆమెని సర్పంచ్ ఇంటికి వెళ్ళమని చెబుతారు. ఇంతలో సత్‌బీర్ మేనమామ గ్యాంగ్ నుంచి వేరుపడి అక్కడికి వస్తాడు. ఆ కూలీ కుటుంబం మీరాని లోపలే ఉంచి కాపాడుతుంది. పోలీసులు చేయని సాయం ఆ కూలీవాళ్ళు చేశారు. మానవత్వం ఉంటే సామాన్యుడే దేవుడు. మానవత్వం లేకపోతే పోలీసైనా రాక్షసుడే. పదవి వల్ల ఆ రాక్షసత్వం ఇంకా పెరుగుతుంది. మీరా సర్పంచ్ ఇంటికి వెళుతుంది. ఆ సర్పంచ్ ఒక నడివయసు స్త్రీ. ట్విస్ట్ ఏమిటంటే సత్‌బీర్ ఆ సర్పంచ్ కొడుకే! తల్లి చెప్పటం వల్లే చెల్లెలిని చంపాడు.

సర్పంచ్ మీరాని బంధిస్తుంది. మీరాకి సత్‌బీర్ చెల్లెలి ఫోటో కనిపిస్తుంది. ఆమెకి తాను ఇంకా ప్రమాదంలో పడ్డానని అర్థమవుతుంది. సత్‌బీర్ భార్య మీరాపై సానుభూతి చూపిస్తుంది. “పింకీ (సత్‌బీర్ చెల్లెలు) ఒక్కతే నన్ను ప్రేమగా చూసుకునేది. నేను ఎమినిదేళ్ళుగా ఇక్కడ మగ్గిపోతున్నాను. తన పెళ్ళయ్యాక పింకీ నన్ను తనతో తీసుకెళతానంది” అంటుందామె. ఆమెలా ఎంతమంది చెరసాల లాంటి జీవితాలు గడుపుతున్నారో. గ్యాంగ్ వస్తుంది. సత్‌బీర్ మీరాని బయటకి తీసుకొచ్చి కొడతాడు. సర్పంచ్ “నా ప్రైవేటు వ్యవహారాన్ని వీధిన పెట్టావు కదే” అని మీరాని తిడుతుంది. మీరా అదను చూసి సత్‌బీర్ కొడుకుని బావిలో తోసేస్తానని బెదిరించి సర్పంచ్‌ని, సత్‌బీర్  గ్యాంగ్‌ని ఇంట్లో బంధిస్తుంది. దానికి సత్‌బీర్ భార్య సాయం తీసుకుంటుంది. వారసుడి కోసం సర్పంచ్, కొడుకు కోసం సత్‌బీర్ పడే ఆరాటం అంతా ఇంతా కాదు. మగవాడివే ప్రాణాలు, ఆడపిల్లవి కావు! మీరా సత్‌బీర్ జీపు తాళాలు తీసుకుని బయటపడుతుంది.

ఆమె అర్జున్ దగ్గరకి వెళ్ళేసరికి అతను గ్యాంగ్ చేతిలో హతుడై ఉంటాడు. ఇప్పుడు మీరాలో పగ రగులుతుంది. సత్‌బీర్ జీపులో వెనక్కి వచ్చి ఆ జీపునే ఆయుధంగా మార్చి గ్యాంగ్‌ని పరుగెత్తిస్తుంది. జీపుతో గుద్ది ఇద్దరిని చంపుతుంది. తర్వాత ఒకచోట దాక్కుని బైకు మీద వస్తున్న సత్‌బీర్‌ని, అతని మేనమామని గడ్డపార అడ్డుపెట్టి కింద పడేస్తుంది. మేనమామ తల రాతికి తగిలి చనిపోతాడు. సత్‌బీర్ కాలు విరుగుతుంది. కష్టం మీద లేచిన అతన్ని గడ్డపారతో తలమీద కొట్టి, పొడిచి చంపేస్తుంది మీరా. సర్పంచ్ వస్తుంది. కొడుకు చనిపోవటం చూసి కుప్పకూలిపోతుంది. “నేను ఒప్పనుకున్నదే చేశాను” అంటుంది. “నా ఒప్పనిపించిందే నేనూ చేశాను” అంటుంది మీరా. సూర్యుడు ఉదయిస్తుండగా మీరా ఊరి బయటకి నడుస్తుంది.

నిజం చెప్పొద్దూ. చివరి సన్నివేశం చూసి ప్రతీకారవాంఛ తీరిన సంతృప్తి నాక్కూడా కలిగింది. ఇది మరీ అవాస్తవికంగా ఉండదు. భర్త అన్యాయంగా చనిపోవటంతో మీరా స్తబ్దుగా మారిపోయి అచేతన స్థితిలో ఒక యంత్రంలా గ్యాంగ్‌ని మట్టుబెట్టినట్టు చూపించాడు దర్శకుడు. అతని దర్శకత్వ ప్రతిభ ఇక్కడ కనిపిస్తుంది. సత్‌బీర్‌ని చంపేముందు మీరా అతను చూస్తుండగానే సిగరెట్ వెలిగిస్తుంది. అతను కాలు విరిగి నిస్సహాయంగా చతికిలబడి ఉంటాడు. పురుషాధిక్యతకి మరో రూపమైన సత్‌బీర్ ముందు సిగరెట్ తాగటం మీరా ధిక్కారానికి ప్రతీక. సినిమాల్లో హీరోయిజం చూసి మగవాళ్ళు ఈలలు వేయటం చూశాం. ఇది ఆడవాళ్ళు ఈల వేసే సీన్. కానీ ప్రతీకారంతో సమస్య తీరిపోతుందా? వ్యవస్థలో మార్పు రావాలి. పోలీసులు మారాలి, రాజకీయనాయకులు మారాలి, ముందు తలిదండ్రులు మారాలి. ఈ కలియుగంలో అది జరిగే పనేనా? ఏమో గుర్రం ఎగరావచ్చు!

Exit mobile version