Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిద్ర లేవండి

[డా. నెల్లుట్ల నవీన చంద్ర రచించిన ‘నిద్ర లేవండి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[Disclaimer:
The view and opinions expressed by the author are of his own and Sanchika does not subscribe to nor support them. Sanchika can in no way be held responsible for author’s opinions and views. – Sanchika Team]

మంచి ఎక్కడ ఉన్నా దానిని అనుసరించే వారు ఉదారులు. మంచి లేకున్నా కాపీ కొట్టడం దాస్యభావం. 18, 19 శతాబ్దాలు యూరపు, భారత దేశాల మధ్య సంబంధాలకు పునాది వేసినవి. సంస్కృతం నేర్చుకుని మన పుస్తకాలు చదివారు ముందు జర్మనీలో. ఈ మేధా సంబంధంలో నాలుగు దశలు గుర్తించవచ్చు.

  1. మన పుస్తకాలను అభ్యసించడం.
  2. మన పుస్తకాలు అంటే అత్యంత గౌరవం చూపడం
  3. మన పుస్తకాల నుండి అయిడియాలు తమవే అని దొంగిలించడం.
  4. మన పుస్తకాలను, సంస్కృతినీ, చరిత్రనూ నిందించడం.

ఇది పాశ్చాత్య చరిత్రకారుల, తత్త్వవేత్తల MODUS OPERANDI

ఇమ్మన్యుయేల్ కాంట్

ఇమ్మన్యుయేల్ కాంట్ ఈ పద్ధతికి ఓనమాలు చుట్టి తనంత గొప్ప వేదాంతి లేడని ప్రసిద్ధికెక్కాడు.

తత్త్వ శాస్త్రం యొక్క చరిత్రలో ఇమ్మాన్యుయేల్ కాంట్ 18 శతాబ్దంలో యూరపు యొక్క అత్యంత ప్రముఖ ఆలోచనాపరుడుగా గుర్తించబడ్డాడు. సమగ్రమయిన, క్రమబద్ధమయిన పనులు చేశాడు కాంట్ జ్ఞాన శాస్త్రంలో, అధిభౌతిక శాస్త్రంలో, నీతి శాస్త్రంలో, సౌందర్య శాస్త్రంలో. ‘ఆధునిక నీతిశాస్త్ర పిత’, ‘సౌందర్య శాస్త్ర పిత’, ‘ఆధునిక తత్త్వ శాస్త్ర పిత’ అనే బిరుదులు గణించాడు.

అసలు నిజం ఏమిటంటే తన సృజనా పూర్వక ఆలోచనలన్నీ ముఖ్యంగా భగవద్గీత నుంచి తీసుకుని ఆ గ్రంథ రాజానికి రెఫరెన్సులు కూడా ఇవ్వలేదు.

ఇమ్మానుయేల్ కాంటు గారి మూడు సూత్రాలు:

1.జగతాతీత ఆదర్శవాదం (Transcendental Idealism):

భగవద్గీతలో పరమాత్మ లోక వ్యవహారాలచే ప్రభావితుడు/ప్రభావితురాలు కాదు అని ప్రతిపాదించబడ్డది. కాంటు గారు తన జగతాతీత ఆదర్శవాదంలో లోకులు సత్యాన్ని నేరుగా గ్రహించలేరు కాని ఒక వడపోత (ఫిల్టరు) ద్వారా గ్రహిస్తారు అని విశదీకరిస్తారు.

లోకంబులు లోకేశులు, లోకస్థులు తెగినతుది అలోకంబగు పెం

జీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్.

 

ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై,

ఎవ్వనియందుడిందు,పరమేశ్వరుడెవ్వడు,మూలకారణం

బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు, సర్వము దానె ఐన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.

ఈ పద్యాలు గజేంద్ర మోక్షములో పోతన్నగారు రాసారు. పోతన్న గారు కాంటు కన్నా 300 ఏళ్ళకింద నివసించారు. ఈ రెండు పద్యాలలో కాంటు గారి జగతాతీత ఆదర్శవాదం విశదీకరించబడింది. కాంటు పోతన్న గారి రిఫరెన్సు ఇవ్వలేదు.

2.నిర్దిష్ట ఆవశ్యకత (Categorical Imperative):

కాంటు గారు మనం పనులు చేసేటప్పుడు ఒక విధిగా, ఒక కర్తవ్యముగా చేయాలి కాని వాటి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కాదు, వాటి నుంచి బహుమతులను ఆశించి కాదు. భగవద్గీతలో నిష్కామ కర్మ సూత్రం ఇదే ఉద్దేశ్యాన్ని బోధిస్తుంది. కాంటు గారు నిష్కామ కర్మ సూత్రాన్ని కాపీ కొట్టారు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|

మాకర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోఅస్త్వ కర్మణి || 2-47

కర్మములు చేయుట యందే నీకు అధికారము కలదు. వాటి ఫలితముల యందాసక్తితో కర్మములు చేయకు. ఫలితములు ఈశ్వర ప్రసాదములు. అట్లను కర్మములు చేయుట మానరాదు.

శ్రీమాన్ రమణ మహర్షి ఇలా రాసారు:

కర్త్రురాజ్ఞ్యయా ప్రాప్యతేఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం”

కర్త (జగదతీతము) ఫలం ఇస్తారు. జడమయిన కర్మ ఫలముల నివ్వలేదు.

3. తెలుసుకోవడము, తర్కము (Verstand and Vernunft – understanding and reason):

ఈ రెండు అభిజ్ఞాన సమర్ధతలు (Cognitive Faculties) అని కాంటు గారు నిర్వచించారు. భగవత్ గీతలో అంతఃకరణ చతుష్టయం లో వివరించబడ్డ రెండు అంగాలు మనస్సు, బుద్ధి ఇవి రెండు. ఇది నేరుగా మక్కీకి మక్కీ కాపీ కొట్టాడు కాంటు. మిగిలిన రెండు చిత్తము, అహంకారముల గూర్చి కాంటు గారికి తెలిసినట్టు లేదు.

వీటిని గూర్చి కాంటు గారికి అవగాహన లేనట్లు కనిపిస్తోంది.

ఫ్రెడరిక్ ఎంగెల్స్

ఇక ఎంగెల్స్ విషయం చూద్దాం

  1. ఎంగెల్స్, మార్క్సు తత్త్వ శాస్త్రంలో కవలపిల్లలు.
  2. ఇద్దరు కలిసే కమ్మ్యూనిస్టు మానిఫెస్టో రాసారు.
  3. దాస్ కాపిటల్ కూడా ఇద్దరి ప్రయత్నాల తోనే బయట పడ్డది.
  4. భారతీయ మార్క్సిస్టులకు వీరు ఇద్దరూ దేవుళ్ళు.

ఎంగెల్స్ Thesis, Antithesis నుండి Synthesis వస్తుంది అని వాదించాడు. ముఖ్యంగా ఈ పరివర్తన ద్రవ్యాలలో ఉంటాయని అభిప్రాయ పడి ‘Dialectical Materialism’ మొదలుపెట్టాడు. ఎంగెల్స్ మూడు సూత్రాలు:

  1. ఐక్యతా, వ్యతిరేక శక్తుల ఘర్షణ సూత్రము
  2. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారి తీస్తాయి
  3. కాదును కాదు అనడం. Negation of Negation.

వీటిల్లో మొదటిది గీత నుంచి డైరెక్టుగా వచ్చింది. వ్యతిరేక శక్తులు అంటే ద్వంద్వములు. జయాపజయాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు ఇంకా ఇతరాలు భవద్గీతలో ద్వంద్వములనే పదం కింద ఇవ్వబడిన వ్యతిరేక శక్తులు. మంచి జరిగినప్పుడు పొంగిపోయి, చెడు జరిగినప్పుడు కుంగిపోవడము జీవితానికి మంచిది కాదు, రెండు వ్యతిరేకశక్తులను సమంగా చూసుకుంటే లోభమూ,కోపమూ, కోరికా, గర్వమూ, అసూయ, మోహమూ పూర్తిగా తగ్గిపోయి, చివరకు మన మనస్సులనుండి తీసివేయబడి, జీవితం సాఫీ గా జరుగుతుంది అని గీతాకారుడు చెప్పుతాడు.

దుఃఖేష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః

వీత రాగ భయ క్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే|| 2-56

గర్వము,మోహమూ లేకుండా, అనుబంధాలు వదిలి,ప్రతి క్షణమూ అధ్యాత్మ లో మనస్సు ఉంచి,కోరికలు విసర్జించి,సుఖదుఃఖాలవంటి ద్వంద్వములకు అతీతంగా ఉండి అమూఢులు శాశ్వతమయిన పదమును చేరుతారు.

నిర్మాన మోహాజితసంగ దోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః

ద్వందైర్విముక్తాస్సుఖదుఃఖ సఙైః గఛ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్|| 5-15

జర్మనీలో గీత అనువాదాలు చాల ఎక్కువైపోయి, వేదాంతులను, తత్త్వవేత్తలను, తర్క శాస్త్రజ్ఞులను ప్రభావం చేశాయి. ఈ ద్వంద్వాల ప్రాముఖ్యత ఎంగెల్స్ రాసినా దాని ప్రతిపాదన ఫిక్టే చేసాడు. ఈ మూడు పదాలు Thesis, Antithesis, Synthesis ఫిక్టే వాడుక లోకి తెచ్చినవే.

ఫిక్టే కాంటు ఫ్రెండు. కాంటు కూడా గీత చదివాడు. వారిద్దరూ గీత గూర్చి చర్చలు చేసి ఉంటారు. వింతయిన విషయం ఏమిటంటే భారతదేశపు తత్త్వం చేత ప్రభావితుడయినా కాంటు పాశ్చాత్యేతర సిద్ధాంతాలపై చిన్న చూపు చూశాడు.

మార్క్సు ఫిక్టేతో అంగీకరించలేదు. ఎంగెల్స్ ఫిక్టేను కాపీ కొట్టాడు. ఫిక్టే భగవద్గీత చేత ప్రభావితుడయ్యాడు. ఎంగెల్స్ గురువు హెగెల్ కూడా గీత పై వ్యాఖ్యలు రాశాడు.. ఆర్థర్ షోపెనావరు తన మంచం పక్కనే ఉన్న చిన్న బల్ల మీద బైబిలుకు బదులుగా గీత పెట్టుకునేవాడని జగమెరిగిన సత్యం. ఎంగెల్స్ గీత రిఫరెన్సు ఇవ్వలేదు.

రెండవది వేమన శతకంలో ఉన్నది. ఎంగెల్స్ ముందు వేమన పుట్టాడు (వేమన 1652 పుట్టుక, ఎంగెల్స్ 1820 పుట్టుక).

గంగి గోవు పాలు గరిటె డైనను చాలు, కడివెడయిన నేమి ఖరము పాలు”

ఈ పద్యంలో గుణాన్ని కొలత తో పోల్చి గుణం కొలత కన్నా గొప్పదని అందరికీ అర్థం అయ్యేటట్లు గాడిద, గోవుల పాల ఉదాహరణతో మహాకవి వేమన విశదీకరించారు. ఎంగెల్స్ రెండవ సూత్రం ఇదే. ఎంగెల్స్ వేమన రిఫరెన్సు ఇవ్వలేదు.

మూడవది నాసదీయ సూక్తం ఋగ్వేదం (10-29-1) నుంచి వచ్చింది.

ఈ సూక్తంలో మొదటి శ్లోకంలో సృష్టి పై వాదం రేకెత్తించబడుతుంది.సత్తు (ఉనికి), అసత్తు(లేకపోవడం) ల మధ్య సంబంధం సూక్తకారుడు చర్చిస్తాడు. మొదట ఉనికి అనేది లేదు. ఉనికి లేకపోవడం అంటూ కూడా లేదు. “ఉనికి అనేది లేకపోవడం లేదు” అన్న పద జాలం ఎంగెల్స్ రాసిన “negation of negation” కు సరిపోతుంది. ఋగ్వేదం వేల ఏళ్ల కింద రాయబడింది. ఎంగెల్స్ 18 వ శతాబ్దం వాడు. ఎంగెల్స్ ఋగ్వేదం రెఫరెన్సు ఇవ్వలేదు.

ఒకే అంశం రెండు కాలాలకు చెందిన పండితులు రాస్తే తర్వాతి వాడు రాసినది అనుమానాస్పదం కాదా? జర్మన్ల భారత పుస్తకాల బోలెడు అనువాదాల ఆసక్తి పై మెట్టు అభ్యసనం. అభ్యసనం పై మెట్టు కాపీ కొట్టడం. దాని పై మెట్టు నింద.

ఆసక్తి – అభ్యసనం – కాపీ కొట్టడం- నింద

ఇది పాశ్చాత్యుల MODUS OPERANDI అని ముందే చెప్పుకున్నాము.

ఉపసంహారం

కాంట్, ఎంగెల్స్ అనే ఇద్దరి తత్త్వ వేత్తల సూత్రాలను పరీక్షించి మనం ఈ ఫలితం సాధించాం.

ఎంగెల్సును ఆకాశానికి ఎత్తి వేసే భారతీయులు ఎంగెల్స్ భావాలకు మూల ప్రాతిపదికలయిన గీత,వేమన శతకం, ఋగ్వేదము లంటే ఈసడిస్తారు.

ఇది భావ దాస్యం. దాస్య భావం.

మన గ్రంథరాజాలను గౌరవించడం నేర్చుకోవాలి.

మనం మారాలి. నిద్ర లేవాలి.

Exit mobile version