Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా?!

[‘పాతాళ భైరవి’ రిలీజై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా (‘కలవరమాయె మదిలో..’ అనుబంధంతో సహా) ప్రత్యేక వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీ సముద్రాల హరికృష్ణ.]

“జనం కోరేది మనం తీయటమా మనం తీసేది జనం చూడటమా?!” అన్నది ఓ చిక్కుముడి, కొంచెమో ఘనమో సామాజిక బాధ్యతతో ఉండి విలువలు పాటించాలనుకున్న చలనచిత్ర ధనశ్రేష్ఠులకు, అనగా నిర్మాతలకు.

దానికి ఓ రాజమార్గం పట్టుకున్నారు ఈ నిర్మాతలు.

మనం తీసేది జనం కోరేదే అయ్యేట్టూ, అందులో వినోదం మూడు నవ్వులు ఆరు వెన్నెలరువ్వులూగా ఉండేట్టు తీద్దాం అని సంకల్పించుకుని ఆ ప్రయత్నంలో పూర్తి సఫలీకృతులైనవారు, ఇంటి పేరే విజయంగా మారిన ‘విజయా’ వారి నిర్మాతలు, ఈ సినిమాతో.

అన్నట్టు వీరికీ కొన్ని ఎదురుదెబ్బలు, నష్టాలూ ఎదురైనా, ప్రేక్షకుల మనసుల్లో మాత్రం వీరి ఇంటిపేరు విజయావారే! వారి సినిమాలే ఆ అపురూప బాంధవ్యం కల్పించింది, ఈ సంస్థకీ, సినీ ప్రేమికులకీ!

వారే – నాగిరెడ్డి గారు, చక్కన్న అనబడే ముక్తసరి చమత్కారి, చక్రపాణి గారు!

వీరికి తోడైనవారు, వీరిని మించినవారు!

మాటల గారడీడు పింగళి నాగేంద్రుడు.

పాటల అమృతకలశం ఘంటసాల వేంకటేశ్వరరావు.

సినిమెటోగ్రఫీతో మార్కస్ బార్ట్లీ,కెమెరా మాయావి!

కళా దర్శకుడు, మా గోఖలే, అందని ఎత్తుల శిల్పకళే!

ఇక ఈ నౌకకి ప్రధాన నావికులు, అసలుసిసలు దృగ్దర్శకులు ఖచ్చితంగా దర్శకులు, కె.వి రెడ్డిగారే!

మరి విజయా విడిదిలో ఈ ఆస్థాన నటకావతంసులు నటీమణీ లేకుండా ఎట్లా?!

ఎన్టీఆర్, ఎస్విఆర్, సావిత్రి, రేలంగి- అందరూ ఉన్నారు, ఉన్నారు కనుకనే ‘పాతాళ భైరవి’ వేయి ఢంకాలు బజాయించిన ఘన విజయం సాధించింది.

వీరిలో దాదాపు అందరూ ఇంకా పూర్తిగా నిలదొక్కుకోని వారే అప్పటికి, ఇంకా పెద్ద స్టార్లు కాని వారే!

కథ, ఫక్తు జానపదం.

మార్చి 15, 2026 తేదికి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకున్న, సినిమా కాసులు పండించే విద్యకు జ్ఞానపథం- ‘పాతాళభైరవి’!

కథ పెద్దగా ఏమీ ఉండదు!

‘ధైర్యే సాహసే లక్ష్మీ’ నానుడిని కళారూపంగా మలిచిన కథ అనవచ్చు. అందుకే అడుగడుగున సాహసం ప్రదర్శించే కథానాయకుడు. అలనాటి విక్రమార్కుడికీ, శాలివాహనుడికీ సరితూగగల, ఎవ్వరికీ తలవంచని ఉజ్జయినీ యువ సింహం!

ఈ సింహమూ, ఆ మాంత్రిక జంబుకమూ పాత్రల్లో NTR, SVR లు అద్భుతంగా నటన పండించిన కళాక్షేత్రమే ఈ పాతాళభైరవి!

అసలు కథ, కథనంలో ఉన్నది. ఆ మాటతూటాలలో ఉన్నది. ఆ పాటల సైయ్యాటలలో ఉన్నది.

ఆ నటీనటులు విజయం కోసం పడిన తపన, ఆ నిబద్ధతా – వీటీలో నిండుగా ఉన్నది.

తెలివిలో బుద్ధిలో చురుకైన రాజకుమారి, ధైర్యంలో సాహసంలో మెరికైన తోటరాముడు.

గొప్పింటి నాయిక, పేద కథానాయకుడు.

ఆ రాజకుమారి తోటలోకి వచ్చే వేళకి తోటనంతా అలంకరించి తోటరాముడు కళకళలాడేట్టు చేయడంతో వీరి వలపువిరి మొగ్గ తొడుగుతుంది.

పాము కాటు నుంచి ఆమెను రక్షించటంతో అది పూర్తిగా వికసించి అంతరాలను ఖాతరు చేయకుండా దగ్గర చేస్తుంది.

కానీ “హాయ్ అమ్మా! నువ్వెక్కడ ఆ పూల తోటలో!, మేమెక్కడ ఈ మణుల కోటలో! ఏమైనా సాపత్యం ఉన్నదా, ఆ మాత్రం అర్హత చూసుకోవద్దూ, ఊఁ!? భవనాలు, పల్లకీలు పరివారాలు సంపదలు సంపాదించి అంతటి సామంతుడివై చూపించు, అప్పుడాలోచిద్దాం! అంతదాకా మా అమ్మాయి ఊసెత్తావో, కంటితో చూశావో ఖబడ్దార్”, అని ముసలి రాజు అంటే పడుచు రాజకుమారి తండ్రి ఆంక్షలు విధిస్తాడు.

ఇదిగో సరిగ్గా దీనికి ముందరే, రాకుమారి భవనంలోకి తోటరాముడు ప్రవేశించాడని తెలిసి కోపంతో ఊగిపోతూ రాజుగారు తోటరాముడి చెంప ఛెళ్ళుమనిపిస్తారు, అతనన్న ఒక వాక్యానికి!

అంతకు ముందు రాజు గారితో వాడిన ముక్కే అది,

“నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా” అని, శూరసేనుడిని కొట్టాడన్న విషయం మీది విచారణ సందర్భంలో!

కూతురి విషయం వచ్చేటప్పటికి ఏ తండ్రి మాత్రం వినోదపు మాటలు సహిస్తాడూ?!

ఏది ఏమైనా, ఆ ముక్కే, పింగళి గారి చిలిపితనాల డైలాగులకు ఓ మచ్చుతునక! – “నిజం చెప్పమన్నారా, అబధ్ధం చెప్పమన్నారా మహారాజా?!”

సరే సంపాయించుకొస్తాను కానీ ఎట్లా అని మథన పడుతున్న తోటరాముడికి ముంతలో నుంచి కాకీ కోకా మాణిక్యాలు కావాలి, మామామీమీ మణులు కావాలి అంటూ మాయలు చేస్తున్న నేపాళ మాంత్రికుడు తటస్థపడతాడు.

ఆ గడ్డాల మీసాల నేపాళమాంత్రికుడే (ముళ్ళపూడి వారన్నట్టు క్రూరంగారావే – ఎస్.వి. రంగారావు) మధ్యలో అడ్డమై కూచుంటాడు, రాకుమారికీ నాయక రాముడికీ.

ఇంతకీ నగరానికి మాంత్రికుడొచ్చింది – సన్మార్గుడూ సాహసియైన యువకుణ్ణి అంబకు బలి ఇస్తే, తనకు కోరినది క్షణంలో ఇచ్చే పాతాళభైరవి కరుణ సిద్ధిస్తుందన్న ఆశతో!

దుర్భిణిలో చూసి మాంత్రికుడు కనుక్కున్న ఆ ఉత్తమ పురుషుడూ సాహసీ పాపం తోటరాముడే.

అతనికి ఈ మోసం తెలియక, వాడు చెప్పిన సాహసం చేయటానికి ఒప్పుకుంటాడు, అదేమిటో తెలియకుండానే!

పైగా, ఏదైనా చేయగలను అనే ధీమా, దేనికైనా తెగించే సాహసమూ రాముడికి తోటతోనే వచ్చిన గుణాలు మరి! అనగా, పుట్టుకతోనే!

సరే, రాజకుమారి దక్కుతుందన్న ఆశతో వాడి వెంట వెళతాడు కొండలు నదులు గుట్టలు అడవులూ దాటి.

వాడి ఉద్దేశం ఈ కుర్రకుంకని అమ్మవారికి బలియిచ్చి సర్వశక్తుల సమాహారం ‘పాతాళభైరవి’ శక్తిని సంపాదించటం!

ఏదో సాహసం అంటున్నాడు, అదేదో చేసేస్తే ఎంచక్కా రాకుమారితో కలకాలం సుఖంగా ఉండవచ్చు కదా అని కుర్ర నాయకుడి ఆలోచన.

నవనవలాడుతూ, ధైర్యపు వర్చస్సుతో వెలిగేపోయే తోట రాముడు ఒకవైపు! నడుము సగం వంగి ‘జీంబోతు’ చూపుల, టక్కుటమారాల మాయగాడు, మరోవైపు!

పైగా దరిమిలా రాకుమారి పై తన దుష్ట కన్నేయబోయేవాడు కూడా!

ఆ వంకర చూపులు, ఆ తల ఒక వైపుకి వాల్చి మాట్లాడటం, ఆ వంగి నడవడం – అన్నింటినీ మించి ఒక విచిత్రమైన జారుతో ‘జై పాతాళభైరవి’ అనటమూ;

తన మంత్ర శక్తితో భూమ్మీద ఎవరినైనా, ఏదైనా చేయగలననే ఆ డాంబికం – అన్నీ కలసిన నేపాళమాంత్రికుణ్ణి మన కళ్ళముందు నిలబెట్టి,పిల్లల కలలలోకి కూడా వచ్చి భయపెట్టిన నటనా మాంత్రికుడు ఎస్వీఆర్!

ఇప్పుడైతే ఏ పిల్లా పిల్లాడూ దడుచుకోరు సరికదా నవ్వుకుంటారేమో! అప్పుడు పిల్లలుగా ఉన్నవారి కలల మాటలెండి!

తోటరాముడిని మభ్యపెట్టీ, ఆశ చూపించీ, మాంత్రికుడు తన వెంట తీసుకెళ్లడంలో కెవిరెడ్డిగారు చూపించిన దర్శక ప్రతిభ గురించి చెప్పుకుని తీరాల్సిందే.-

వాడి పిరికితనం, కుర్ర నాయకుడి సై సవాల్ అనే సాహసోపేతమైన ప్రవర్తనా – చెప్పకుండానే చెప్పటం అనే పద్ధతిలో చేశారు కెవి రెడ్డిగారు ఇక్కడ.

ప్రతి చోటా రాజకుమారి దక్కుతుందని ఆశతో ఏదైనా సరే చేయడానికి సిద్ధపడిన తోటరాముడితో ఆడుకున్నాడనవచ్చు దుష్ట మంత్రగాడు!

తాను దూరంగా ఉండి మాత్రమే, “అదిగో అది చేయ్, ఇదిగో ఇది చేయ్”, అంటూ, అన్ని ప్రమాదాల్లోకీ దించుతాడు మాంత్రికుడు.

అది మంత్రాల మర్రి నెక్కి దూకడమైనా, పాతాళబిల ప్రవేశమైనా, విచ్చు కత్తులద్వారం దాటి లోపలికి వెళ్ళటమైనా, బొడ్డు దేవర బొజ్జ రాతిగదతో మోదటమైనా!

ఒక్కొక్కటీ చెప్పి చేయిస్తూ ఒక రకమైన అనుమానం చేయగలడా, చేయటానికి ఒప్పుకుంటాడా అనీ;

చేసిన తరువాత ఆనందమూ తన లక్ష్యానికి చేరువౌతున్నాననీ – మాంత్రికుడిగా SVR చూపిన హావభావాలు, ముఖకవళికలూ, న భూతో నభవిష్యతి!

“రాజకుమారి దక్కేను సాహసం సేయరా డింభకా” ఆని నొసలు చిట్లించి ప్రోత్సహిస్తునట్లు చెప్పటం, ఆ పని అవగానే, క్షణంలో స్థాయి మార్చి”ఆహా సాహసివి వరపుత్రుడవురా” అని మెచ్చుకోవడం అతి సహజంగా చూపించిన ఆ కళాకారుడి ప్రతిభకు తార్కాణం.

అంటే వాడి ఉద్దేశం రాముడికి ఏ ప్రమాదమూ జరగకపోతే, అప్పుడే తాను దిగాలని. ప్రమాదం కలిగి తోటరాముడికి ఏదైనా అయితే, తోక ముడిచి వెళ్ళిపోవాలన్న యోచనలో ఉంటాడు మాంత్రికుడు.

అప్పుడు దేవి బలికి ఇంకొకరిని వెతకాలి కూడా, తాను ముందుకు వెళ్ళీ ప్రయోజనం లేదు.

ఇంత ఆలోచించి గొప్ప ఊహాబలంతో చిత్రీకరించిన సన్నివేశాలుగా కనపడతాయి ఇవి, నిశితంగా ఆలోచిస్తే!!

ప్రమాదాల మార్గాలు రాముడు ముందు నిష్కంటకం చేస్తే, అప్పుడు ఈ మంత్రగాడు ప్రవేశిస్తాడన్నమాట, రంగంలోకి.

అన్నీ దాటి వస్తే దేవికి బలి ఇద్దామని, మధ్యలోనే ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాడికింతే అని తను జారుకుందామన్న కుట్రబుధ్ధిగాడు ఆ నేపాళం మాయావి!

ఏ దిగులూ, భయమూ లేని సాహసీ, రాకుమారి ప్రేమ దక్కాలంటే ఏదైనా సరే చేయాల్సిందే అనే నైజమూ, తోటరాముడిదీ!

రెండూ బహు బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు దర్శకులు, ఇద్దరు మేటి నటుల ద్వారా!

తరువాత తోటరాముడు మాంత్రికుడిని బురిడీ కొట్టించి తనే వాణ్ణి చంపేసి పాతాళభైరవి దక్కించుకోవటమూ, సంజీవని మంత్ర సాయంతో మాంత్రికుడి శిష్యుడు తన గురువుని బతికించటమూ,

వాడు రాముణ్ణీ రాకుమారినీ బంధించడమూ రాము స్నేహితుడు అంజికి భూతాల ద్వారా మాయ వస్తువులు దొరకటమూ, వాటి సాయంతో ఉపాయంగా రాము దుష్ట మాంత్రికుడిని చంపేయడమూ, తోటరాముడు రాకుమారిని పెళ్ళి చేసుకుని సుఖంగా జీవించటమూ మిగతా కథ – అందరికీ తెలిసినదే, రామాయణ భారత కథలంత పరిచయమైనదే, పాత సినిమాల ప్రేమికులకి మరీ!

***

తాను సంభాషణలు రాసిన ఏ సినిమాకైనా ఎట్లాగో, అదే రకంగా పింగళి నాగేంద్రరావుగారి మాటలు పెట్టని కాదు, ‘పెట్టిన కోటలే’, ఇందులోనూ!

మొదట్లోనే తోటలో ఒక ముత్యం లాంటి వాక్యం వినిపిస్తారు పింగళి.

పూలతోటలో ఉన్న రాముడు అడుగుతాడు స్నేహితుడు అంజిని, “ఈ పూల పందిరితో తోటకంతకు అందం రాలా?!” అని.

“ఎందుకు రాదయా! మనసు కళగా ఉంటే పని కూడా కళకళలాడుతూ ఉంటుంది” ఇదీ ఆ మిత్రుడు పలికే అర్థాంతరన్యాసం, అతి సామాన్యమైన భాషలో ఒక తిరుగులేని జీవనసత్యం! అంతా మనసును బట్టే అని!

ఆలాగే ఈ మొదట్లోనే ఒక నిర్వచనం లాటిదీ, ఒక సుందరమైన అలంకారం ప్రాయమైన వాక్యమూ అనిపిస్తారు, రెండూ – హాస్యగాడు అంజితోనే!

అల్లరి చిల్లరిగా తిరుగుతున్న తన కొడుకు తోటరాముడితో అంటుంది తల్లి శాంతమ్మ: “ఓరి భగవంతుడా! ఒక కొడుకు నిమ్మంటే ఈ రాక్షసుడి నిచ్చావేమిరా” అని!

ఒక విచిత్రమైన జారులబండ నవ్వుతో హీరోకు చేదోడువాదోడుగా ఉండే స్నేహితుడు అంజి అంటాడు, దానికి జవాబుగా: “పిన్నీ, రాక్షసుడుంటే రక్షించేవాడే. అంటే.. రాజు పిన్నీ.” అని!

మనవాడు రాజౌతాడు చూడు అని ఆ ప్రియ స్నేహితుడి భవిష్యవాణి అన్నమాట! రాక్షస శబ్దానికి ఈ వ్యుత్పత్తి ఉన్నదే యైనా సందర్భోచితంగా చొప్పించిన ఘనత మాత్రం, పింగళి వారిదే!

అట్లాగే కొడుకు తలచుట్టూ కట్టుతో, కారాగారం నుంచి వచ్చినపుడు, తల్లి శాంతమ్మ, రాజుగారు మంచివారు కాబట్టి విడిచిపెట్టారు అంటుంది.

అప్పుడు పక్కనే ఉన్న అంజి “రాజుగారు సాక్షాత్తూ జనకమహరాజే పిన్నీ! ఉరి తీయకుండా ఉపదేశం చేసి పంపించాడు చూడు” అంటాడు.

అట్లాగే బాధపడుతున్న పిన్ని శాంతమ్మను అంజి ఊరడించడం- “రాజకుమారి స్వయంగా తన చీర చెంగు చింపి, కట్టు కట్టిందీ అంటే, ఆహా, విజయలక్ష్మి కిరీటం పెట్టిందని కదూ” అని.

ఉన్న పరిధిలో సంభాషణల స్థాయిని అవలీలగా, అతి సరళమైన భాషలో ఒక ఉన్నతికి పెంచడంలో బహు నేర్పరి కదూ మన పింగళి!

అట్లాగే రాణీ గారి తమ్ముడూ రాజుగారి బావమరిదీ హోదాలో వీరకథ నడుస్తున్న చోటుకి వచ్చి నానా యాగీ చేస్తాడు ధీరసేన శూరసేనుడు (రేలంగి).

సత్రంలో ఒదిగి కూచున్న ఒకణ్ణి అడుగుతాడు,”ఏయ్, ఏ ఊరోయ్ నీది?” అని.

“నాది నేపాళం”, అంటాడు వాడు.

దానికి పొగరుబోతు శూరసేనుడి చేత పింగళి పలికించిన సమాధానం- “నేపాళం ఏవిఁటి నేపాళం! భూపాళం పగిలేను. టోపి టింగు రంగా అంటోందే, తీసుకోండ్రా.”

అనుయాయులు ఆ అభాగ్యుడి టోపీని వెంటనే లాగేసుకుంటారు.

ఇక గారడీ చేస్తూ నాయకుడి రాకకు ఎదురుచూస్తున్న వేళ, సదాజపుడు మాంత్రికుడితో ఆడే మాటలు పరోక్షంగా ఆనాటి సినీ దర్శకనిర్మాతలను హెచ్చరించటానికే అట్లా రాశారా కథలో ఇమిడ్చి, అన్నట్టు ఉంటాయి.

“అయితే డింగరి, జనం కోరేది మనం శాయడమా, మనం చేసేది జనం చూడడమా” అనడుగుతాడు మాంత్రికుడు తన శిష్యుడు సదాజపుణ్ణి!

దానికి శిష్యుడి జవాబు- “మన కన్నే మన చెవే మన మాటే మన జనం. జనమంతా నేనే. మనం కోరతాం, మీరు శాయండి” అని!

తరువాత ఓ హెచ్చరిక అనిపిస్తారు మాంత్రికుడితో, “మనం ప్రజారంజన సేయవలెరా” అని.

ఎంత బాధ్యతతో చూపించాలో ఏ కళ యైనా (వినోద ప్రధానమైన సినిమా ఎలా హద్దులలో తీయాలో వెర్రితలలు వేయకుండా అన్న సూచన ఇందులో ఇమిడ్చినట్లు అనిపించక మానదు) అన్నదానికి ఇట్లా అనిపించారు పింగళి.

వినోదంలో మార్మికంగా చెప్పబడిన సందేశం! అదీ పింగళీయం!

ఇట్లా చెపుతూ పోతే, అసలు ఔచితీమంతం కానిది, ఏ సంభాషణా లేదనే తేలుతుంది వీరి రచనలో.

అది కూడా చాలా తేలికైన పదాలతో సాగే శిష్టమైన, సముచితమైన సంభాషణలు- వాటిలోనే చమత్కరాలూ, శొంఠీమిరియాలూ, గంధపుచలువలూ, పన్నీటిచల్లదనాలూ – అన్నీ!

ఆత్మహత్యకు పూనుకుని, మెడకు తాడు బిగించుకుని అది గుచ్చుకుంటుంటే శూరసేనుడు అనుకునేమాట: ‘ఇంత కష్టంగా ఉంటే ఎలా చావడం?’

ఆ మాట అని ఒక మెత్తటి బట్ట గుచ్చుకోకుండా ఉండటానికి తాడు మీద పెట్టుకుని, అప్పుడంటాడు – “ఇలా కాస్త మెత్తగానైనా ఉంటే ఎలాగైనా చావచ్చు.”

పైకి ఇది ఏదో యథాలాపంగా అన్నట్టు అనిపించినా, నెమ్మదిగా మళ్ళీ మళ్ళీ గుర్తుకువచ్చి నవ్వేట్టు చేసే మాట. చావటానికి వెళ్ళిన వాడికి గరుకేవిఁటి, మెత్తగా ఏవిఁటీ?!

చావడం అనుకున్నంత సులువు కాదనీ, పుట్టుభీరువైన శూరసేనుడికి దానికి తగ్గ ధైర్యం హుళక్కి అనీ, పింగళి వారి గిలిగింతలు పెట్టే చమత్కారం అది!

“వాసి గల వాక్యానికి వార్థక్యం లేదు”, అన్నది బుధవాక్యం.

అయితే పింగళి వారి కొన్ని పదబంధాలు, వాక్యాలకూ పాటల పల్లవులకూ, వార్థక్యం లేదు సరికదా, అవి నిత్యయౌవనాలై అలరారుతున్నట్టు కనబడతాయి.

పైన కొన్ని చెప్పటమైంది, అవి కాకుండా ఎన్నో ఆయన ప్రయోగించినవి సినిమా పేర్లుగా చలామణీ అయ్యాయి. ఆయన అన్ని సినిమాలలోని కొన్ని పాటల పల్లవులకు ఈ గౌరవం దక్కినా, ఈ సినిమా వరకే పరిమితమైతే, అట్లాంటివి కొన్ని ఇవి:

ఎంత ఘాటు ప్రేమయో

సాహసం సేయరా డింభకా!

కలవరమాయె మదిలో!

ఇటువంటి గౌరవం బహుశా ఇంకే తెలుగు సినీ రచయితకూ దక్కలేదు బహుశా!

***

ఇక ఈ సినిమా పేరు ‘పాతాళభైరవి’ లోనే ఒక భయం కొల్పే దేవీ మూర్తి ఎట్లా స్ఫురిస్తుందో, కాస్త సంగీతం వినికిడి, పరిచయం ఉన్నవారికి ఒక మహాద్భుతమైన కర్ణాటక సంగీతపు రాగమూ స్ఫురించక మానదు.

ఆ రాగం పేరు, ‘భైరవి!’

పేరులోనే రాగరాజాన్ని అలంకరించుకున్న సినిమాకి సంగీతం అందిస్తూ ఘంటసాల ఎంత రంజకంగా కలకాలం నిలబడే పాటలు, బాణీలు కట్టారో, వాటి సంగీత సాహిత్య విశేషాలు ఏమిటో స్థూలంగా చూద్దాం.

మొదట్లోనే వచ్చే మధురమైన బ్రృంద గానం- “తీయని ఊహలు హాయిగా సాగే వసంతగానమే హాయి..”.

రాకుమారి చెలికత్తెలతో వనవిహారం చేస్తూ వసంతనాట్యంతో పాడే వసంత గానం. కొత్త రాగాలతో కోయిల కొసరి కొసరి యౌవన రాగాలను మేల్కొలిపే గానం. మంచి ఉత్సాహంతో కన్యామణులు సరసాలాడుకుంటూ గొంతెత్తి ఆలపించిన, ఘంటసాల వారి సమ్మోహనకరమైన కూర్పు ఈ హాయి కూర్చే పాట!

సాహిత్యం చూస్తే, ఒక చరణంలో అంటారు పింగళి, “గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము సేయగా వని అంతా ‘ఝలఝలించెనే’ తనువెంతో పులకరించెనే..”

కలకల, గలగల లాంటి ధ్వన్యనుకరణ పదం వేశారు, సందర్భానికి నూరు శాతం సరిపోయేట్టు. నీరు వేగంగా పడటమో, ప్రవహించటమో సూచిస్తూ!

తరువాత వచ్చే ఒగ్గు కథ లాంటి పాట, ఘంటసాల గారి చేత రమ్యంగా జానపద బాణీలో మంచి మట్టి వాసనతో గుబాళించే పాట-”ఇతిహాసం విన్నారా..” ఒక ప్రత్యేకమైన నుడితో రాశారనాలి పింగళి, ఈ గీతాన్ని.

ఉజ్జయిని కేంద్రంగా నడిచిన కథ కాబట్టి ఆ నగరం ప్రాభవకారకుల చరిత్రలు స్పృశిస్తూ – విక్రమార్కుడు శాలివాహనుల ప్రసక్తీ ప్రశంసా చేస్తారు పింగళి.

యుగానికొకడు వస్తూనే ఉంటాడు వీరశూర కథానాయకుడు అని పాడి, మరి “నేటి కెవరు కథానాయకుడు”, అని, జనం చేత చెప్పిస్తారు, “ఉన్నాడున్నాడు మన తోటరాముడు” అని.

దశాబ్దాల ముందే పసికట్టారేమో, జనం మెచ్చిన నాయకుడు అవుతాడని! ఎన్టీఆర్‌కు రచయిత గడుసుగా ఇచ్చిన కితాబనుకోవచ్చు ఇది.

అంతటి చతురవచో శిఖామణే పింగళి నాగేంద్రరావు గారు!

ఇందులో పాటంతా కమలాదేవి బృందం పాడగా, మధ్యలో వచ్చే ధిమిధిమిత్త దరువులు ఘంటసాలే పాడటం ఒక విశేషం!

అట్లాగే “ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు” పాటలో కూడా మొత్తం వర్మ అనే గాయకుడు పాడితే, పై స్థాయిలో వచ్చే రాగాలాపన ఘంటసాలే చేస్తారు, పాటకొక నిండుదనం తెస్తూ!

ఇందులో మూడు ప్రణయ గీతాలు ఉంటే అందులో రెండు అభేరి రాగంలోనే ఘంటసాల గారు చేయటం విశేషం.

‘కలవరమాయె మదిలో’ ఒకటీ, ‘హాయిగా మనకింక స్వేచ్ఛగా’ రెండోది.

రెండూ వినసొంపువే అయినా ‘కలవరమాయె మదిలో’ బాగా ప్రసిధ్ధమై పాతాళభైరవి అంటే చాలు గుర్తొచ్చే పాటగా ఉండిపోయింది.

ఈ పాటలో పింగళి తమాషాగా నాయిక మదిలో వీణలు, నాయకుడి హ్రృదయంలో వేణువులు వినిపింపచేశారు.

“నాలో ఏదో నవభావనగా మెల్లన వీణ మోగింది”, అని రాజకుమారి అంటే తోటరాముడు,”నాలో ఏదో నవరసరాగం పిల్లనగ్రోవి ఊదింది”, అంటాడు.

వీణావేణువుల కలయిక- ఎంత మధురమో, అంత మధురమైన కలయిక అన్నమాట వారిది.

ఇక మూడవ ప్రణయ గీతం, ‘ఎంత ఘాటు ప్రేమయో!’

దీనిని ఘంటసాల విలక్షణమైన హిందూస్థానీ బాణీ రాగేశ్వరిలో కూర్చారు పదికాలాలు నిలబడే మధురమైన గీతంగా.

ఇందులో ఆరంభంలో వచ్చే వాద్య సంగీతమూ, మధ్యలోని ఇంటర్లూడ్సు కూడా అతి మనోహరంగా కూర్చారు రాగ మర్మజ్ఞులైన ఘంటసాల వేంకటేశ్వరరావు.

ఈ పాటలో నాయిక, “ఎంత తీవ్ర వీక్షణమో,.. కన్ను కాటు తిన్నదిగా” అంటుంది.

ఆ నాయకుడి వలపుచూపు తీయనైనదే కానీ మహా తీక్ష్ణం. తీక్ష్ణం కనుకనే కాటు అన్నది.

కాటే కానీ అమృతమయమైన చూపుతో వేసిన కాటు.

ఆ చూపు యొక్క ఘాటు చెప్పడానికి ‘కాటు’ అని వేశారు పింగళి స్వతంత్రించి. ‘కంటి కాటు’, అన్న ప్రయోగం, ప్రణయగాఢతా సూచకం!

అట్లాగే నాయకుడు “ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో” అంటాడు.

స్త్రీ సహజమైన మార్దవం సూచించటానికి, లేత అన్నారు,

వారి జీవనస్థాయిల్లో అంతరాలు ఉన్నాయి కాబట్టి, ఆమెకు ఇష్టమే ఉన్నా మనసులో, పైకి లేనట్టు ఉంటోంది అని సూచించటానికి “చాటు మోహము” అన్నారు భావగర్భితంగా.

దీనికి బలం చేకూర్చేవి ఒకటి రెండు సన్నివేశాలు ఉన్నాయి కూడా సినిమాలో!

పైగా ఈ నాయకుడు ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయమనే దుస్సాహసి.

“ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా, ప్రియురాలికి విరహాగ్నిని పెంపుసేయరే”, అని ప్రార్థిస్తాడు.

అంతకు ముందు ఆమె అవన్నీ తనకు విరహపు వివరాలు విప్పి చెపుతున్నట్టు పాడుతుంది పాపం.

వలపులో చిలిపితనం లేకపోతే ఏం బాగుంటుందనుకున్నారేమో సరస పింగళి, ఈ గిలిగింతల భావాలు పలికించారు, హీరో తోటరాముడితో.

అంత అర్థవంతమైన ప్రయోగాలతో ఉన్న రచనలు, సంగీతమూ కాబట్టే ఇంకా 75 ఏళ్ళ తరువాత కూడా సజీవంగా అనిపిస్తూ మనకు వినిపిస్తున్నాయి!

ఆ నాటికి ఒక బోల్డు సాంగ్ అని చెప్పుకోదగ్గ పాట కూడా ఉన్నది, ‘వగలోయ్ వగలూ’ అని! దానికి తగిన పదజాలంతో (పాడేది, మహాజనానికి మరదలు పిల్లయైన ‘గజ్జెలు కోడి’, ఆ కోడి ఎవరి కోసం పాడుతోంది అంటే జనంలో అందరూ బావలు, మావఁలు అని కవిగారి తీర్మానం).

నడివీథిలో మాంత్రికుడు కోతిని నాతిని చేసి సామాన్య జనాన్ని ఆకట్టుకోవడానికి చేసిన గారడీ సన్నివేశం! మరి దానికి తగ్గ పదాల హంగులు దానికి అద్ది అందించారు రచయిత.

ఆ హంగుల తళుకులు, ఇవిగో మచ్చుకు ఇట్లా ఉంటాయి –

కొంగు తాకిదంటే కుయికుయి కుయిలే..

మీరంత నావెంట గుమిగుమి గుమిలే..

దానికి తగ్గ ‘నాటు’ బాణీ, దీటుగా కట్టిన వారు ఘంటసాల మేస్టారు.

అయినా ఎంతవరకో అంతవరకే – అదీ దర్శకుడు కెవిరెడ్డి గారి చేతి చర్నాకోల మహిమగా అర్థం చేసుకోవాలి. ఏదీ శ్రుతి మించకూడదు ఆ బడిలో!

పైగా ఘంటసాల గారు ఏ రాగం ఎంతో, ఏ భావం ఎంతో, గాత్రంతో చేసే నటన ఎట్లా ఔచితీమంతంగా, మితిమీరకుండా ఉండాలో బాగా తెలిసిన రాగపారంగతులు, ఆ విద్యలో అద్వితీయులు.

అందుకే ఈ వీథినర్తకి పాటను కూడా ఎట్టి ‘ఎక్కువలు’ లేకుండా సంగీతం అందించి పాడించారు. సమపాళ్ళలో వండిన స్వాదు భోజనమే ప్రజలకు ఆరోగ్యకరంగా అందించాలన్న నిబద్ధత అది!

ఆ నిర్మాతలకు, దర్శక రచయితలకూ జోహార్ చెప్పకుండా ఉండగలమా?!

రేలంగి చేత పాడించిన పాట కూడా ఒకటి ఉన్నది- ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ.

జోడు కూడి తోడి రాగం పాడుకుందామంటాడు ధీరసేనశూరసేన రేలంగి తాను వలచిన (కానీ తనను ఒక విదూషకుడిగా చూసి నవ్వుకునే) రాకుమారి ఇందుమతినే మనసులో పెట్టుకుని!

ఇక ఒకే రాగఛ్ఛాయలతో చేసిన ఇంకో రెండు పాటలున్నాయి.

ఒకటి పైన ఉదహరించిన ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’. ఇంకోటి ఘంటసాల తాను స్వయంగా పాడిన ‘కనుగొనగలనో లేనో’ అనే పాట. రెంటికీ ఆధారం, భావవాహికగా ఒక సింధువు లాంటి రాగం సింధుభైరవే!

ఇంత మనోహరమైన సినీ పదాల వ్రాసిన ఆ రచయితకూ స్వరాలతో అందం కూర్చిన ఆ సంగీతదర్శకుడికీ వారి కళాప్రతిభకూ ఎన్ని ‘వీరతాళ్ళు’ వేసినా తక్కువే అని అంటే, అది సబబైన ‘పింగళీయం’ కాకుండా పోతుందా?!

పాటల ప్రసక్తి పాతాళభైరవిలో నటీమణి సావిత్రి లేకుండా పూర్తి చేయటం దోషం కిందకే వస్తుంది.

ఎందుకంటే ఆ మహా నటి తొలి దశలో చూపిన తళుక్కుమనే నటనాప్రతిభా ఇందులోనే ఒక నృత్య సన్నివేశంలో కనబడుతుంది కాబట్టి!

ఒక రకంగా, ఇది పాతాళభైరవిలో రెండో సాక్షాత్కారం. మొదటిది ఆ దేవి పాతాళభైరవిది అయితే, రెండవది నటన పరంగా తరువాతి కాలంలో రాజ్ఞిగా కీర్తి నార్జించిన కళాభినేత్రి సావిత్రి సాక్షాత్కారం.

అప్పటికింకా సినీరంగంలో కాలూనడానికి ప్రయత్నం చేస్తున్న భావికాలపు మహానటి సావిత్రి.

ఒక చిన్న నృత్య రూపకంలో “లాంగ్ షాట్ లోనే మంచి భావాలు స్పష్టంగా తెలిసేట్టు పలికించింది”, అని పెద్దల చేత ప్రశంసలు పొందేట్టు నృత్యం చేసిన,”ఇక రానంటే రానే రాను..”, పాటలో సావిత్రి గురించి!

పసుమర్తితో కలిసి జంటగా నటించిన ఆ సన్నివేశంలో నిజంగానే 16/17 ఏళ్ళ సావిత్రి – మొహంలో కనబరచిన అభినయ కౌశలం, హావభావాలు అవలీలగా మార్చి చూపిన ప్రతిభా, ఆ సినీ పెద్దల చేత ఆ ప్రశంస పలికించి వుంటుందని చెప్పవచ్చు.

సావిత్రి అనే అభినయ సౌగంధికం పూర్తిగా విరియక ముందే తన నటనాప్రతిభాపరిమళ పరిచయం లోకానికి చేసిన సందర్భం ఇది!

సంగీతం విభాగం గూర్చిన ప్రసక్తిలో ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్ర బ్యాక్‌గ్రౌండు మ్యూజిక్ ఇచ్చిన మాస్టర్ వేణు అండ్ పార్టీది.

ఇందులో ఆ గుహల్లో చూపిన శబ్దవిన్యాసాలు, మాయామహల్ వెళ్తున్నప్పుడు ఇచ్చిన, అనుసరిస్తూ మనని కూడా దానితో పాటు తీసుకెళ్ళే లాంటి ఎఫెక్టూ మొదలైనవి నిజంగా ఆయా సన్నివేశాలను పండించడంలో ఖచ్చితంగా ఒక పాత్ర పోషించాయనే చెప్పాలి.

ఇట్లాంటివి ప్రత్యేక ఆకర్షణలుగా నిలబడటానికి,బయట నుంచి తెప్పించిన Hammond Organ వాడారని సినీ విజ్ఞుల మాట.

కళా దర్శకులు మా గోఖలే కళాధర్‌ల కళా దర్శకత్వ ప్రతిభలు, ఆ సెట్టింగులు, విగ్రహాలూ చెయ్యడంలో చూపిన ఊహాశాలిత న భూతో న భవిష్యతి అని చెప్పాలి. విజయా వారి కళాశిల్పులు వారు.

అట్లాగే, మార్క్స్ బార్ట్లీ కెమెరా పనితనపు అద్భుతం కూడా సినిమా సన్నివేశాలు మరపురానివిగా ఉండటానికి బాగా దోహదపడ్డది. ఆయన ఆస్థాన విద్వాంసుడు, విజయా కళానిలయంలో మరి. లేనివి ఉన్నట్టూ, ఉన్నవి లేనట్టూ, వెలుగు నీడల లోగుట్లు తెలిసి కెమెరాను నడిపిన దృశ్యసారథి.

ఆ మాయలూ, మాయమవటాలూ, కలశాలు, పాత్రలు నడిచి రావటాలూ; ఎండలో వెన్నెలను సృష్టించటమూ, ఉన్న వెన్నెలను ఉన్పదాని కంటే వంద రెట్లు మనోహరంగానూ చూపించడంలో ఆరితేరిన వాడు.

ఇంకా ఈ మహాకళాయజ్ఞంలో పాల్గొన్న వారందరినీ తలచుకుని నమస్కరించ వలసినదే, వారి వారి అద్భుతమైన ప్రతిభను పంచుకున్నందుకు, ఈ సినిమా ద్వారా.

ముఖ్యంగా పేర్కొనవలసినది తరువాతి కాలంలో పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు గారు, కళాతపస్విగా ప్రఖ్యాతి గాంచిన కాశీనాథుని విశ్వనాథ్ గారూ!

వీరిద్దరూ వరుసగా స్క్రిప్టు & స్క్రీన్ ప్లే తయారీలో; సౌండు విభాగంలో పనిచేసిన వారు, పాతాళభైరవి సినిమాకి.

ఇందరి సమిష్టి కృషి పాతాళభైరవి అనే చిత్రరాజం.

నాడు సిల్వర్ జూబ్లీకి పైగానే ఆడిన సినిమా. అనేక చోట్ల శతదినోత్సవాలు జరుపుకున్న సినిమా. ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా. తెలుగు చిత్రసీమ ప్రపంచ సినిమాకు కానుకగా ఇచ్చిన జానపద చలనచిత్ర సమ్మోహనం! విజయా వారి చిత్రాల్లో ఓ కలికి తురాయి.

ఈ ఏడాది మార్చి 15 కి 75 ఏళ్ళు పూర్తైనా, ఇంకో 75 ఏళ్ళు గడిచినా ఎంత టెక్నాలజీ పెరిగినా ఏ కాలంలోనైనా పిల్లా పెద్దా అందరూ చూసి ఆనందించే చిత్రలోకపు చిరంజీవి పాతాళభైరవి సినిమా!

***

జై పాతాళభైరవీ!

తోటరాముడు రాజుగారి నడిగినట్టు,

“నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా” అని అడగలేదు తల్లోయ్!

అన్నీ నికార్సైన నిజాలే చెప్పటం జరిగింది!

ఇక నీ దయ!

డింగిళ్ళో డింగిళ్ళు!

***

అనుబంధం:

‘కలవరమాయె మదిలో..!’

ఎట్లాగైనా పాతాళభైరవి లాంటి జానపదం తీద్దామనే పిచ్చి ఉబలాటం ఉన్న పేరుమోసిన దర్శకుడు పరాంకుశం. ఉబలాటంతో పాటే, తీయగలనో లేదో అనే చిన్నది కాదు పెద్దదే ఓ కలవరం కూడా ఉంది అతని మనసులో!

ఆ రోజు రాత్రి ఆ సినిమాని తన బెడ్రూమ్‌లో నూటపాతికో సారి చూసి, ‘ఆహా ఓహో ఓహోహో’ అంటూ మురిసి ముక్కలైపోతూ నిద్రలోకి జారుకున్నాడు.

నిద్రలోనూ అనగా కలల్లోనూ – అవే సీన్లు – కత్తి నోట కరుచుకుని చెట్టు మీద నుంచి దూకుతున్న తోటరాముడు -ఎన్టీవోడు, చండీ ప్రసన్న చాముండీ ప్రసన్న.. అంటూ అస్త్రాయఫట్ అని దేవి ముందు మంత్రాలు చదువుతున్న మాంత్రికుడు – గంభీరంగారావు!

మళ్ళీ మళ్ళీ అదే మధురమైన బాధ చెప్పే విరహ గీతం, ‘ఎంత ఘాటు ప్రేమయో’ రాగేశ్వరి, కలవరం పుట్టించే ప్రణయ గీతం, ‘కలవరమాయే మదిలో నా మదిలో..’, మెత్తని భేరీలు మోగిస్తూ!

ఒకప్పుడు సరదాగా రాజుగారితో “నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజా” అని తోటరాము డన్నప్పుడు, ఉఁహుహుహుఁ అంటూ నవ్వి “నిజమే చెప్పవోయ్” అని ప్రోత్సహించిన పడుచు రాజకుమారి తండ్రియైన ముసలిరాజే, కూతురిని వలచానని చెప్పగానే దురన్యాయంగా, దురుసుగా, గర్వంతో నవనవలాడే తోటరాముడి చెంప ఛెళ్ళుమనిపించటం!

నా ఫేవరెట్ నాయకుడికి ఎంత నెప్పి కలిగిందో అని కలలో తెగ బాధపడ్డాడు ఆ వీరాభిమాని పరాంకుశం!

ఎంతసేపటికీ తనే ఆ మాయా మహల్ లో వెళ్తున్నట్టుగా కూడా అనిపించింది,ఏదీఁ ఆ ‘నిను వీడని మ్యూజిక్ నేనే’ టైపు ఘంటసాల/వేణు గార్ల బ్యాగ్ గ్రౌండ్ స్కోరుతో పదేపదే!

ఇంతలో పరమాశ్చర్యం!

సాక్షాత్తు ఆ దేవి, పరాంకుశానికి ప్రత్యక్షమై అడుగుతోంది “నరుడా ఏమి నీ కోరిక”, అని!

నరనరాల పట్టేసిందేమో ఆ సినిమా వందకు పైగా సార్లు చూసిన ఆ మనిషికి – మొదట నవ్వొచ్చింది ఆ మాటలు విని!

అయ్యో దేవి మీద చిన్న చూపుతో కాదు, అసలు సినిమాలో అవే మాటలు రేలంగి ఉరఫ్ శూరసేన ధీరసేనుడికి వినిపించినపుడు అతనన్న మాటలు గుర్తొచ్చి- “కోరికా?! తప్పు తప్పు, పరస్త్రీ పరస్త్రీ”, అన్నవి!

ఏది ఏమైనా తమాయించుకుని పరాంకుశం సాష్టాంగపడ బోయాడు దేవిగారి ముందు, భక్తిగా.

వెంటనే గ్యాపకమొచ్చింది, సినిమాలో సాష్టాంగపడ్డ మాంత్రికుడి గతి ఏమైందో – అందుకని సింపుల్‌గా నిలుచొని, కాస్త వంగి నమస్కారం మాత్రం పెట్టాడు.

‘అదుర్స్’ సినిమాలో మనవడు ఎన్టీఆర్, (చారి పాత్ర) “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను” అని తప్ప ఏమీ మాట్లాడనట్టు, “నరుడా ఏమి నీ కోరిక” అని మాత్రమే వచ్చేమో, దేవి మళ్ళీ అదే మాటలన్నది.

మొహమాటమూ, సిగ్గూ రెండూ ఒకేసారి పడుతూ అడగచ్చో లేదో అని సందేహిస్తూ, “దేవీ” అన్నాడు, పరాంకుశం మెల్లిగా.

ఏ ప్రశ్నకైనా పరీక్షలో ఒకే జవాబు వ్రాసినట్లు, మళ్ళీ దేవి నుంచి అవే చిలక పలుకులు, “నరుడా ఏమి నీ కోరిక”!

“నాకూ.. నాకూ.. ‘పాతాళభైరవి’ లాంటి చిత్రం తీసే శక్తి సమర్పించు తల్లీ” అన్నాడు మాటలు దొర్లిస్తూ, కంగారులో, తబ్బిబ్బైన పరాంకుశం.

“తథాస్తు” అని దేవి అనగానే కొత్త నోట్లు, 500/- రూపాయల కట్టలు, బస్తాలు బస్తాలు అతని ముందు ప్రత్యక్షమయ్యాయి.

“అయ్యో డబ్బు కాదు తల్లీ కావలసినది. దానికి మా జంబులింగం ఉన్నాడుగా, వాడే ఇస్తాడు కావల్సినంత రొక్కం” అన్నాడు పరాంకుశం కాస్త నిరుత్సాహంగా!

ఇంకా కొనసాగించాడు, మెల్లగా –

“నాక్కావలసినది ఆ శక్తి, ఆ మేధస్సు, ఆ ప్రతిభ, ఆ అది ఆ ఇది, మాతా”, అన్నాడు ఆవేశంగా, దేవితో కాస్త చనువు పెరిగిన ధైర్యంతో!

అప్పుడొక మహదాశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుందక్కడ!

దేవి, అనగా అతని ఆరాధ్యదైవం పాతాళభైరవి శక్తి స్వరూపిణి తన రొటీన్ డైలాగ్, “నరుడా ఏమి నీ కోరిక”, కాకుండా నాలుగు మాటలు మనసు విప్పి విడమరచి మాటాడింది.

శూరసేనుడితో కానీ తోటరాముడితో కానీ మాంత్రికుడితో కానీ ఎవ్వరితోనూ ఆ ఒక్క వాక్యం తప్ప నోరు మెదపని దేవి, పరాంకుశంతో తోచినన్ని సూక్తులు పలికింది, ఆసచర్యం కాదు మరీ!

బహుశా పరాంకుశం సినీ భక్తి, అందునా తన పేరిట ఉన్న చలనచిత్రరాజంపై ఉన్న భక్తినీ చూసి ప్రసన్నురాలైందేమో!

“నాయనా పరాంకుశం! నీ ఈ సినిమా మీది ఇష్టాన్ని ఇష్టంగానే ఉంచుకో, కష్టంగా మార్చుకోవద్దు. అది మళ్ళీ ఎట్లా తీస్తావు వత్సా, అది సాధ్యమేనా?! ఏడీ ఆ కేవి రెడ్డి లాంటి దిగ్దర్శకుడు నీకు?! మాటలు పుట్టించే ఆ చిరంజీవి పింగళి నాగేంద్రుడేడీ?! తేనెలూరించే కలశాలుగా పాటలను మలిచి పాడి, పాడించే ఆ గాన గంధర్వ ఘంటసాల కూడా లేడు కదా నాయనా?! ఇక ఆ స్కెచ్చులూ, మహళ్ళూ, ఆ గుహలూ, ఆ నా భారీ విగ్రహమూ, ఆ సెట్టింగులూ సృష్టించటానికి అంతటి గోఖలే కళాధర్‍లు ఏరీ? ఆ కెమెరా మాయావి బార్ట్లీ కూడా లేడు కదా నాయనా?!, వెలుగు నీడలతో ఆడుకుని అందమైన బొమ్మలను తెరపై చూపటానికి!

చిరంజీవి పింగళి ఇంకోచోట రాసినట్టు, కౌరవ సార్వభౌముడు దుర్యోధనుడికి ఎన్ని ఉన్నా అసలుదైన శాకంబరీదేవి ప్రసాదం గోంగూర లేందే ముద్దైనా దిగనట్లే, ఆ సినిమాకు అసలు ప్రాణాలైనా ఆ నటీనట దిగ్గజాలేరయ్యా నీకు?!

కనుక విరమించుకో ఆ ప్రయత్నం! చూసి ఆనందించు దోషం లేదు, కావాలంటే ఇంకో వంద సార్లు చూసుకో, లాభమే కానీ నష్టం లేదు. ఆ మహానుభావులందరి సమష్టి కృషితో తీసిన ఇట్లాంటివి చేయాలని పూనుకోవడం సాహసమౌతుంది నాయనా. మళ్ళీ మళ్ళీ పదేపదే ఇంటిల్లిపాదీ, మనవళ్ళు మనవరాళ్ళతో సహా కూచుని చూడాలనుకోవటం సజ్జన లక్షణం అవుతుంది కూడా, వత్సా! వివేకివై బ్రతుకు సాగించి సుఖించు నాయనా” అని తళుక్కున మాయమైంది పాతాళభైరవి.

***

మర్నాడు ప్రతిరోజూ కంటే బాగా ముందే ఆరింటికే నిద్ర లేచేశాడు పరాంకుశం.

లేచి అయిదు నిమిషాలు తన కల గురించే ఆలోచించాడు.

“ఆహా ఎంత జ్ఞానోదయం కల్గించింది తల్లి కలలోకి వచ్చి”, అని పాతాళభైరవికి వంద నమస్కారాలు పెట్టాడు.

తనకిప్పుడు ఏ డైలమా లేదూ ఏ కలవరమూ లేదు. తేటపడ్డట్టైంది మనసు.

బుర్ర హుషారుగా పనిచేస్తోంది, కొత్త సినిమా దిశగా.

మిత్రుడూ నిర్మాతా అయిన జంబులింగంకి ఫోను చేసి, “ఒరే జంబూ, పాతాళభైరవి తీయట్లేదురా, నిశ్చయాని కొచ్చేశాను. వివరాలు సాయంకాలం కలుస్తాంగా, అప్పుడు చెపుతా.”, అన్నాడు.

ఇంకా, “సరే గానీ, అన్నట్టు అతనెవరో కుర్రాడు చెప్పాడే, పోయిన వారం ఓ కథ – అదేంటదీ, ఆఁ, ‘ఆకాశయుధ్ధం’, అనుకుంటా దాని పేరు! ఏలియన్లు అదంతా కొత్తగా ఉంటుంది మన జనాలకు! అతనికి కబురు పెట్టు, స్టోరీ డిస్కషన్‌లో కూచుందాం! సరే మళ్ళీ కలుద్దాం సాయంత్రం, ఉంటానిక, బై”, అని తృప్తిగా కాఫీ కప్పందుకున్నాడు ఏదో పాట హమ్ చేసుకుంటూ!

ఇంకే పాట, ‘ఎంత ఘాటు ప్రేమయో..’నే!

మన.. పాతాళభైరవే!

జై పాతాళభైరవీ!!

Exit mobile version