Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజం… ఓ అబద్ధం

వామనమూర్తిని ఓ రోజు హరిశ్చంద్రుడు (ఏ కంపెనీ నాటకంలోంచి పారిపోయి వచ్చాడోగాని) నేరుగా వాటేసుకున్నాడు. తిన్నగా గుండెలో దూరిపోయాడు. అక్కడినుంచి రిమోట్ కంట్రోల్ సాగించాడు. అందువల్ల వామనమూర్తికి జీవితంలో ఒక్కరోజైనా సత్యవంతుడి అబ్బలా బ్రతకాలనిపించింది. చచ్చినా ఈ రోజు అబద్ధం ఆడను కాసుకొమ్మని భార్య సత్యవతితో పందెం కాశాడు!

అలా అన్నాడో లేదో అప్పారావు రూపంలో తొలిగండం ఎదురైంది. “నీ నాలిక ఎల్లా పడితే అల్లా ఆడుతుంది. ఓ మాట మీద నిలబడవు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ కుక్క చెప్పు ఎత్తుకెళ్ళినట్లు అదే పోక పోయావు. ఇక ఇవ్వకపోతే చెప్పుదెబ్బలే! కాస్కో” అంటూ వట్టి అప్పారావు భీకర బేతాళుడు అయిపోయాడు.

‘అడ్డులే’ అంటు చిల్లర చేతిలోంచి జారి పడిపోయినట్టు ఘల్లుమనబోయి టైము కాదని నంగిరి పింగిరి తింగరి నవ్వు నవ్వబోయాడు వామనుడు. కానీ ఆ రోజు అబద్ధం ఆడనని పెళ్ళాంతో పందెం కాసిన సంగతి గుర్తుకొచ్చి ఏడవబోయిన నవ్వు నవ్వుతూ జేబులోకి చెయ్యి పోనిచ్చాడు. అందులోంచి ఆ నెల ఖర్చులకు పోను మిగిలిలాయనుకుంటున్న ఆఖరి ఐదు వేలు బయటకు తీశాడు. అప్పారావు చేతిలో నోట్లు పెట్టి లెక్కెట్టుకోమన్నాడు. మొదటిసారి మాట తప్పే అపాయాన్ని చాకచక్యంగా తప్పించుకున్న వీర సత్యంలా తలెగరేసి జుట్టు చేత్తో సర్దుకున్నాడు. “చూశావా మరి. మేం అప్పులాళ్ళం దురుసుగా అడిగేది ఇందుకే. ఇంకో వెయ్యి తగలేస్తే నాముఖాన, నీ అప్పు పూర్తిగా తీరిపోతుందోయ్” అని కరుణ కురిపించే నవ్వు నవ్వి అప్పారావు నిష్క్రమించాడు.

అంతలోనే ఇంకో డేంజరు మార్కులా కవిగాడు రవి ఎదురొచ్చాడు. అతని మారుపేరు ‘కసి’. వాడు కులుకుతూ చదివే కవితలు వినకపోతే ఆనక సినిమాకి టికెట్లు కోయించకుండా పీడిస్తాడు. వాడి కవితలు వింటే ఇంటిల్లిపాదికి సినిమా ఫ్రీ! కసి ప్రమాదకరంగా ఎదురొచ్చి మరింత ప్రమాదకరంగా ఘోరంగా జేబులోంచి తియ్యబోయాడు కవితను. చంపబోయాడు ఈ శ్రోతను.

“బాబ్బాబూ! ఈసారికి విడిచిపెట్టరా. తలనొప్పి, జలుబు, ఆఖర్న కొద్దిగా జ్వరం వచ్చినట్లు అనుమానం… ఎలర్జీకి తోడు ఆపైన ఒళ్ళంతా దురద” అని చెప్పి తప్పించుకోబోయాడు వామనుడు. పెళ్ళాకిచ్చిన సత్యవాక్య పరిపాలన మాటకి తోడు ‘కొత్త సినిమాకి టికెట్లు పట్రాండి’ అని సత్యవతి పురమాయించినట్లు గుర్తుకువచ్చింది. ‘కొత్త సినిమా ఎంత చెత్తగా ఉన్నా రేపు కూడా ఉంటుంది. కాని ఈ రోజు అబద్ధం చెబితే సత్యవతి ముందు ఇంతే సంగతులు’ అని బుద్ధి తెచ్చుకుని కసిగాడి కాయితాల కట్టరిగేదాకా ఫిక్సయిపోయాడు. ‘నువ్వంటే నాకు లవ్వే. మనం ఇక తినేది ప్రేమ బువ్వే’ ఫక్కిలో కసిగాడు చాలాకాలానికి దొరికిన శ్రోతని ఉతికి ఆరేశాడు. చివర్న వామనమూర్తిని నీ అభిప్రాయం ఏమిటని నిలేశాడు కసికవి. ‘పెళ్ళాంతో కాసిన పందెం, ఇచ్చిన మాట పొల్లు పోకూడదు. అవసరం వస్తే కొత్త సినిమా రేపు చూద్దాం’ అనుకున్నవాడై వామనమూర్తి నిజం అనే నిప్పుని కక్కేశాడు. తన మనసులో మాట చెప్పేశాడు. ‘ఏడిసి ముఖం కడుక్కునట్లున్నాయ్ నీ కవితలు’ అనేశాడు. కసికవి ముందు ముఖం మాడ్చుకున్నాడు. ఆ తరువాత వామనుడి మీదికి లంఘించాడు. అంతే- అరెఝు ఝుటక్ ఫటక్!

జుట్టు చెరిగి చొక్కా చిరిగి, ఓ ఎముక విరిగినా అబద్ధం ఆడలేదన్న కులాసాతో వామనమూర్తి వేగంగా ముందుకు నడిచాడు.

అప్పుడే ఎదురయ్యాడు ప్రమాద ఘంటిక మోగిస్తూ దుర్భిణి విలేఖరి (ఖరులందు విలేఖరులు వేరయా!) మొబైల్ ఆన్ చేసి రికార్డింగ్ బటన్ నొక్కాడు.

“ఆ ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుని చెప్పండి ఈ ‘రిపబ్లిక్ డే’కి ఏలినోరి ప్రజాకానుకలు బేషుగ్గా ఉన్నాయి కదూ?” అని క్వశ్నించాడు. పొద్దున్నే పేపర్లో ఉచిత సంక్రాంతి పిడకల దండలు, కచికపొడి డబ్బాల వార్త చదివి పెళ్ళాంతో కలిసి ‘న్యూఇయర్ జోక్! రిపబ్లిక్ ఫేక్’ అని నవ్వుకున్నాడు. ‘ఏలినోరి కానుకలు ఏట్లోకి పోనూ. వాగ్దానాల కుండకి చిల్లుపడినట్లున్నాయ్! అర్జంటు పనుంది – నడు పక్కకి!’ అని కసిరాడు దుర్భిణి రాతగాణ్ణి వామనుడు!

“అయితే రేపు మా పేపర్లో టెర్రరిస్టు అనుమానితుల జాబితాలో మీ ‘వామనమూర్తి’ పేరు చూసుకోండి” అంటూ రాతగాడు బెదిరింపు కూత పెట్టి పక్క వీధికి కదిలాడు, ఇంకో వామనమూర్తిని వెదుక్కోడానికి!

ఆమాట్న సత్యసంధ వామనుడికి పరీక్ష పెడుతూ ఓ సర్వేల పర్వ అనే సంస్థ నిపుణుడు (‘సర్వే’జనుడు అందాం ప్రస్తుతం) ఎదురొచ్చాడు. “ప్రస్తుత ఏలుబడి ఎంత ముచ్చట గొలుపుతుందో మీ మాటల్లో ఎలా పొగడుతారో పొగడండి” అని మైకు వామనమూర్తి నోటికి తగిలించాడు ‘సర్వే’జనుడు. “ఆహా! పరమ భేష్! ఆ పార్టీలో చేరి నామీద ఉన్న కేసు కడగేసుకోవాలనుకుంటున్నాను” అని ఆపద్భాంధవ పొగడ్త విసరబోయి సత్యవ్రతం గుర్తొచ్చి అట్టే ఆగిపోయాడు. “నేటి ఎకిమీడు పాలన పావక స్వామి ఏలుబడిలో గుడ్డెద్దు చేలోబడ్డది. ఆర్థిక వ్యవస్థ కోసం ఒంటెద్దుబండి రెడీ చేస్తున్నారు. సైకిల్ రిక్షా మీద జిడిపి రేటుని, నెత్తిమీద రూపాయి విలువ విగ్రహాన్ని ఊరేగిస్తారిక గూడుబండికి డబ్బులులేక. నిరుద్యోగ పకోడీలు తినే స్తోమతగలవాళ్ళు లేక జంగడిలో మూలుగుతున్నాయ్. మందికి ఉద్యోగాలొస్తేగాని ఆ పకోడీలు కదిలేలాలేవ్!” అని నిజం చెప్పేశాడు వామనుడు. ధరవరల నుంచి హామీల నిలుపుదల దాకా అంతా తినే తీరుగా ఉందని ఎడిట్ పేజీ వ్యాసం లాంటి పాఠం అప్పగించాడు. “ఏమిటో! అంతా ఇలానే అంటున్నారు. ఉన్న తిట్లన్నీ నిరసన రైతులకి ఖర్చయిపోతున్నాయి. వీళ్లని ఎలా ముద్రేయాలో” అనుకుంటూ ‘సర్వే’జనుడు ‘ఇలా అయితే ఇక విదేశీ సర్వేలే గతి!’ అనుకుంటూ నిష్క్రమించాడు.

ఇంటికెళ్ళాక సత్యవతి “వారిజక్షులందు… వైవాహికములందు… ప్రాణవిత్త మానభంగమందు ‘హాయిగా’ అబద్ధాలు ఆడొచ్చండి” అంటూ పాఠం చెప్తుంది వామనుడి నుదుట చెమట తుడుస్తూ.

“ఇంకో సౌలభ్యం కూడా ఉంది. అబద్ధాలాడుతూ సంసారం ఈదడం ఒక్కటే కాదు. దేశాల్ని ఏలేయొచ్చట” అని కూడా ముక్తాయించింది.

ఇక సర్వకాల సర్వావస్థలయందూ అబద్ధాలాడుతూ ‘వారిజాక్షులందు…’ పద్యాన్ని రూల్ బుక్ చేసుకోవాలని తీర్మానించుకొన్నాడు మన వామనుడు!

‘వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకితజోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చునఘము పొందదధిప!’

పద్యం కంఠతా పడుతున్నాడు ఆడబోయే అబద్ధాలకు రక్షణగా!

Exit mobile version