Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిమజ్జనం

[శ్రీ రమణ బంధకవి రచించిన ‘నిమజ్జనం’ అనే కథని అందిస్తున్నాము.]

ఆండవన్ ఆశ్రమం ప్రాంగణంలో ఇంకా వెలుతురు పూర్తిగా పరచుకోలేదు. చెట్ల కొమ్మలపై కాకులు అప్పుడప్పుడు కేకలు వేస్తున్నాయి. హోమగుండం నుంచి పైకి లేస్తున్న పొగ, సమిధల వాసన, కలసి ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టించాయి. బ్రహ్మగారు మంత్రాలు చదువుతున్నారు. నేను వింటున్నాను. కానీ నా మనసులో మాత్రం మరో స్వరం వినిపిస్తోంది.

“జాగ్రత్తగా వెళ్ళు నాన్నా..” ఎన్నిసార్లు విన్నానో ఆ మాట.

అమ్మ పోయి వారం రోజులు అయింది. శరీరం అగ్నికి ఆహుతి అయిపోయింది. మిగిలింది కొన్ని అస్థికలు మాత్రమే. కానీ ఆ స్వరం? ఆ ప్రేమ? ఆ అనుబంధం? అవి కూడా అగ్నిలో కాలిపోయాయా?

“మనం ముందు స్వర్గధామం కెళ్ళి వాటిని తీసుకోవాలి” అన్నాను నేను సాయి, రఘులతో ఏడవ రోజు కర్మకాండ చేస్తూ. రఘు నాకు అన్న, సాయి తమ్ముడు

“వేటిని “ అన్నాడు అయోమయంగా సాయి.

“అమ్మ ఆస్థికలని” అన్నాను గంభీరంగా. సాయి మౌనంగా తల ఊపాడు.

“ఇక్కడ ఈ పని అయ్యాకా మనం ఆల్వాల్ స్వర్గధామం వెళ్లి అస్థికలు తీసుకుని అక్కడనుండి బీచుపల్లివెళ్దాం” అన్నాను. బ్రహ్మగారు అక్కడ పురోహితుడితో చేయవలసిన కార్యక్రమం మాట్లాడి పెట్టేరు.

ఆల్వాల్ స్వర్గధామంలో అమ్మ పార్ధివ దేహానికి వీడ్కోలు చెప్పేక, ఆండవన్ ఆశ్రమంలో రోజూ ఉత్తర కర్మలు జరిపిస్తున్నాము. ఆ రోజు ప్రొద్దుటే ఆరు గంటలకు మొదలు పెట్టేం. ఎందుకంటే ఆ రోజు కృష్ణా నదిలో అస్థి నిమజ్జనం చెయ్యాలి. కృష్ణానది మాకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో బీచుపల్లి దగ్గర ఉంది. కారులో సుమారు మూడు గంటల ప్రయాణం.

“ఆస్థికలు ఉంచిన లాకర్ రసీదు ఎవరి దగ్గర ఉంది?” అడిగాను

“నా దగ్గర ఉంది” అన్నాడు రఘు. ముగ్గురూ నా కారులో బయలుదేరాము. ఆల్వాల్ స్వర్గధామం చేరేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయింది. అస్థికల కలశం తీసుకుని రావడానికి రఘు, సాయి లోపలికి వెళ్ళారు. నేను కారులో కూర్చున్నాను. స్వర్గధామం ప్రవేశ ద్వారం దగ్గర సుమారు ముప్పై అడుగుల మహాశివుడి విగ్రహం ఉంది. చిద్విలాసం చిందిస్తూ, అందరు చివరకు చేరేది నా సన్నిధికే అన్న భావం అయన ముఖంలో కనబడుతోంది. భక్తిగా మనసులో హరహర మహాదేవా అనుకున్నాను. రఘు చేతిలో అస్థి పాత్ర భద్రంగా పట్టుకుని సాయితో పాటు బయటకు వచ్చాడు. సాయి నా పక్కన ముందు సీటులో కూర్చున్నాడు. రఘు వెనక సీటులో కూర్చుని పాత్రని పక్క సీటుపై పెట్టి ఒక చేయి వేసి పట్టుకున్నాడు.

“పాత్ర పడిపోకుండా చూడు” అని రఘుతో చెప్పి కారు స్టార్ట్ చేసాను.

***

కరీంనగర్ రాజీవ్ రహదారిపై కారు వేగంగా దూసుకు పోతోంది. ఒకసారి అస్థి పాత్ర వైపు చూసాను. మిగిలిన తన పాంచభౌతిక అస్థిత్వంతో అమ్మ, గుడ్డతో మూతి బిగించిన ఆ కుండలో భద్రంగా సమాధి స్థితిలో ఉన్నట్లు ఉంది.

అమ్మ ఆలోచనలు నా మెదడును కప్పేసాయి. సుమారు అరవై ఏళ్ల మా అనుబంధంలో గతించిన ముప్పై సంవత్సరాల బంధం ఇంకా బలీయమైనది. నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ నా దగ్గరే ఉందని చెప్పొచ్చు. మా పిల్లలు ఆవిడ పర్యవేక్షణలోనే పెరిగి పెద్దయ్యారు. నాతోపాటు భువనేశ్వర్, హైదరాబాద్, ముంబై నగరాలలో ఉంది. మేము లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు కలసి తిరిగాము. ముంబైలో ఉన్నప్పుడు మా పిల్లలు ప్రతి శనివారం ఆవిడని పొద్దుటే కారులో తీసుకుని వెళ్ళి సిద్ది వినాయక గుడి చూపించి, బాంద్రా షికారుగా వెళ్లి ఏదో మంచి రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ తిని తిరిగి వచ్చేవారు.

ఆవిడ లేని వెలితి నన్ను వెంటాడుతోంది. పొంగి వచ్చే కన్నీటిని అణుచుకుని భగవద్గీత శ్లోకం మననం చేసుకున్నాను.

“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ..”

పుట్టినవారు మరణించక తప్పదు, మరణించినవారు పుట్టక తప్పదు. అని తెలిసినా కూడా తనవాళ్ళ మరణం మనిషిని క్రుంగదీస్తూనే ఉంటుంది.

కారు విశాలమైన రోడ్డుపై దూసుకుపోతోంది. వాహనాల రద్దీ తక్కువగా ఉండటం వలన కొంచెం స్పీడుగా నడుపుతున్నాను. ఎందుకంటే బీచుపల్లి ఉదయం 11.30 కల్లా చేరాలి. లేకపోతే అక్కడి పంతులుగారు వెళ్ళిపోతారు. వాతావరణం మబ్బు పట్టి నా మనసులానే ఉంది.

మా ముగ్గురివి విభిన్న మనస్తత్వాలు. నేను రఘు, దైవ భక్తి, ఆధ్యాత్మ చింతన ఉన్న మామూలు ఆస్తికులం. సాయి ఇంజనీరింగ్లో డాక్టరేట్ ఉన్న హేతువాది. పూజలు, పునస్కారాలు, ఆత్మలు, అనాత్మలు, పునర్జన్మలు ఇలాంటివి ఏ కోశానా నమ్మడు. ఈ కర్మకాండలు అవీ ఫ్యామిలీ కోసం ఏదో తన వంతుగా మాతో కలసి చేస్తున్నాడు. నేనూ, రఘు పితృదేవతా వ్యవస్థపై పూర్తి నమ్మకంతో శాస్త్రం చెప్పిన పద్ధతిలో అన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము.

“కాసేపు రోడ్డు పక్కన ఆపి అల్పాహారం తిందాం” అన్నాడు సాయి. ఇంటి దగ్గరనుండి వచ్చేప్పుడు ఫ్లాస్క్‌లో వేడి కాఫీ, కాసిని బిస్కెట్స్ తెచ్చుకున్నాం. రోడ్డు పక్కన చెట్టు నీడన కారు ఆపి, బిస్కెట్లు తిని కాఫీ త్రాగి బయలుదేరాం.

***

కారు వెనుక సీట్లో భద్రంగా కుండలో ఉన్న అమ్మ తాలుకు ఆఖరి భౌతిక అనవాళ్ళ కేసి చూసాను. ఎన్నో వందల సార్లు నా కార్లో వెనుక సీట్లో కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుతూ అప్పుడప్పుడు జాగ్రత్తగా నడపమని హెచ్చేరికలు చేసేది. ఇప్పుడు మౌనంగా తను చేరవలసిన గమ్యం వైపు నా కారులో ఆఖరి ప్రయాణం చేస్తోంది. హృదయం ఆర్ద్రం అయ్యింది. కనులకు కమ్మిన నీటి పొర కనురెప్పలతోనే చిదిమేసాను.

భారంగా మారిన మౌనాన్ని చీలుస్తూ సాయి, “ఒక విషయం అడగనా?” అన్నాడు.

“అడుగు.” అన్నాను.

“నువ్వు నిజంగానే అమ్మ ఇంకా ఎక్కడో ఉందని నమ్ముతున్నావా?” అతని ప్రశ్నలో వెటకారం లేదు. నిజమైన కుతూహలం ఉంది.

“అవును” అన్నాను.

“ఎక్కడ ఉంది?”

“నాకు తెలియదు.”

“తెలియకపోయినా నమ్ముతున్నావా?”

“అవును.”

సాయి నవ్వాడు. “అదే నాకు అర్థం కాదు. మెదడు పనిచేయడం ఆగిపోయింది. జ్ఞాపకాలు పోయాయి. ఆలోచనలు పోయాయి. శరీరం కూడా లేదు, మరి మిగిలింది ఏమిటి?”

“ఆత్మ.” అన్నాను గంభీరంగా.

“ఆత్మ ఉందని ఎవరు చూశారు?” అడిగాడు సాయి.

“ప్రేమని ఎవరు చూశారు?” అన్నాను నేను.

“ప్రేమ ఒక భావోద్వేగం. న్యూరాన్ల రసాయనిక చర్య.” అన్నాడు.

“సరే. ఈ క్షణం నేను అనుభవిస్తున్న బాధ కూడా రసాయనిక చర్యేనా?”

“శాస్త్రీయంగా చెప్పాలంటే అవును.”

“అయితే అమ్మ బతికున్నప్పుడు అనుభవించిన ప్రేమ కూడా అదేనా?”

“అవును.”

నేను కాసేపు మౌనంగా ఉన్నాను.

“సాయీ, వీణలో సంగీతం వినిపిస్తే తీగలు కంపిస్తున్నాయని శాస్త్రం చెబుతుంది. కానీ ఆ సంగీతం మనసుని ఎందుకు కదిలించిందో పూర్తిగా చెప్పలేకపోతుంది.”

“తెలియకపోవడం వల్ల ఆత్మను మధ్యలో తీసుకురావడం సరైన వాదన కాదు.”

“అవును. కానీ తెలియనిది లేదని చెప్పడం కూడా సరైన వాదన కాదు.”

సాయి చిరునవ్వు నవ్వాడు.

“బాగుంది. మరి నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది?” అడిగాడు.

“నాకు తెలియదు.” అన్నాను.

“ఎంత బలహీనమైన సమాధానం!” నవ్వేడు సాయి.

“కాదు. నిజాయితీ గల సమాధానం.”

రఘు మధ్యలో కలగజేసుకున్నాడు. “మీ ఇద్దరూ ఇక ఆపండి బాబూ?” అన్నాడు విసుగ్గా.

నేను అపలేదు. “సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. నువ్వు నిద్రపోతావు. కలలు కంటావు. కలలో ఇంకో ప్రపంచం ఉంటుంది. మేల్కొంటే అది ఉండదు. ఆ రెండింటినీ అనుభవిస్తున్న ‘నేను’ ఎవరు?” అడిగాను.

“మెదడు.” అన్నాడు సాయి.

“మెదడులో ఏ భాగం?” అడిగాను.

సాయి కాసేపు ఆలోచించాడు. “ఇప్పుడైతే ఖచ్చితమైన సమాధానం లేదు.”

“అదే. వేల సంవత్సరాల క్రితం ఋషులు కూడా ఇదే ప్రశ్న అడిగారు. వాళ్లు ధాన్యంలో అంతర్ముఖంగా అనుభూతి చెందిన ఆ సమాధానాన్ని ఆత్మ అని పిలిచారు. దాన్ని బహుశా ఆధునిక శాస్త్రవేత్తలు చైతన్యం అని పిలుస్తున్నారు. పశ్చిమ దేశాలలో ‘నోయిటిక్ సైన్స్’ అనే పేరుతో జరిగే పరిశోధనలు ఆత్మ గురించే అని చదివే ఉంటావు. పేర్లు వేరైనా వెతుకుతున్న రహస్యం ఒకటే.”

“మీ ఇద్దరినీ చూస్తుంటే గీతా వ్యాఖ్యానం, సైన్స్ కాంగ్రెస్ రెండూ ఒకే కారులో ప్రయాణిస్తున్నట్టుంది.” అన్నాడు రఘు బుర్ర గోక్కుంటూ.

కొద్దిసేపు మౌనం నెలకొంది. వెనుక సీటులో అమ్మ అస్థికలు నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్నాయి.

నాకు అనిపించింది, మా వాదన అంతా ఆమెకు వినిపిస్తే బహుశా నవ్వేదేమో. “ఏదో ఒక రోజు మీ ఇద్దరికీ బుద్ధి వస్తుంది” అని చెప్పేదేమో.

***

ఎనభై మూడేళ్ళ పైచిలుకు జీవితంలో అమ్మ చివరి ఐదేళ్లు మంచం మీదే గడిపింది. మరి జీవుడు అలాంటి శిధిల పంజరాన్ని ఎంతకాలం అంటిపెట్టుకుని ఉంటాడు!

“వాసాంసి జీర్ణాని యధా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి..” గీతా శ్లోకం మనసులో మెరిసింది. మానవుడు జీర్ణ వస్త్రాలను వదిలేసి కొత్త బట్టలు తొడుక్కున్నట్లు, జీవుడు పాత శరీరాలను వీడి కొత్త శరీరాలను పొందుతాడు. పాపం ఈవిడ మళ్ళీ ఎప్పుడు ఎక్కడో?

నా దృష్టి రోడ్డు మీద ఉంది. పెబ్బేర్ చేరాము. రఘు, సాయి జగత్తు గురించి, భగవంతుడు ఉండటం, లేకపోవడం గురించి వాదించుకుంటున్నారు.

“డెస్టినీ.. అంతా విధి లిఖితం అనేది పెద్ద బుల్ షిట్” అన్నాడు సాయి

“మరి జరిగేవన్నిటికి కారణం ఏం చెబుతావు?” రెట్టించాడు రఘు

“ఏముంది అంతా రాండమ్ సంఘటనలే! అంత యాదృచ్చికం మాత్రమే!” అన్నాడు సాయి తేలిగ్గా.

“అంటే దేనికి కార్య కారణాలు అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండవా?” కలగజేసుకున్నాను నేను.

“ఏమీ ఉండవు. ఇప్పుడు అమ్మ చనిపోవడం, మనం ఇలా అస్థి నిమజ్జనంకి బయలుదేరడం ఇవన్నీ జీవితంలో జరిగే రాండమ్ సంఘటనలే. వీటికి ముందే నిర్ణయించబడిన ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు.” చెప్పాడు సాయి ఖండితంగా.

“నేనొప్పుకోను” అన్నాను.

“విశ్వంలో జరిగే ప్రతి కదలికకు, కారణము, పరస్పర సంబంధం ఉంటాయి.” అన్నాను నేను.

“అయితే నిరూపించు” ఛాలెంజ్ చేసాడు సాయి.

“ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. గ్రహాలు, నక్షత్ర మండలం అన్నీ ఏ ప్రణాళిక లేకుండా అవంతట అవే కోట్ల సంవత్సరాలుగా వాటికి ఇష్టమొచ్చిన కక్ష్యల్లో తిరిగేస్తున్నాయి అంటావా?” అడిగాను నేను.

“బావుంది. అవి ‘కాస్మిక్ లాస్’ అంటే విశ్వ నియమాలు అనుసరించి తిరుగుతుంటాయి!” అన్నాడు సాయి హేళనగా.

“మరి ఆ విశ్వ నియమాలు ఎవరు చేసారంటావ్?” అడిగాను నేను

“అంటే అవి మీ దేముడు చేసాడనా?” వెక్కిరించాడు సాయి. “వాటికి అవే ఏర్పడతాయి. సృష్టిలో జీవరాశులు అవంతట అవే ఏర్పడినట్టు” అన్నాడు సాయి.

“నిరూపించు” డిమాండ్ చేసాను.

“సైన్సు వాటి మీద పరిశోదిస్తోంది. ఒక రోజు తప్పక సమాధానం చెబుతుంది” అన్నాడు సాయి

“మంచిదే. అయితే బెస్ట్ అఫ్ లక్! అంతవరకు ఈ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి.” అన్నాను.

“మీరిద్దరూ వాదనలు ఆపండి బాబు. నాకు తల నొప్పి వస్తోంది” అన్నాడు రఘు బాధగా.

సాయితో వాదించటం, ఒప్పించటం ఎవరితరం కాదు. అతని వాదన ఆపటం అసాధ్యం.

***

సమయం పదకొండు దాటింది. అదుగో కృష్ణా నదిపై వంతెన వస్తోంది. కుడి వైపు తిరిగిన తరవాత ‘నది ఘాట్’ అని వున్న సైన్ పోస్ట్ అనుసరించి ముందుకు వెళ్లాను. అక్కడ చిన్న మండపంలో ఎంతోమంది గుమికూడి ఉన్నారు. గట్టిగా మంత్రాలు వినబడుతున్నాయి. పక్కనే కృష్ణమ్మ మందంగా ప్రవహిస్తోంది. మొన్న కురిసిన వానలకు ఓ పాటి నీళ్లు ఉన్నాయి.

మా బ్రహ్మ గారు చెప్పిన పురోహితుడికి ఫోన్ చేసి ఆయన్ను ఆ మండపంలో పట్టుకున్నాం. మండపంలో సుమారు ముప్పై మంది నిమజ్జన కార్యక్రమాలు చేయించుకోవడం కోసం ఒక పదిమంది బ్రాహ్మల చుట్టూ కూర్చున్నారు. మా పంతులుగారు సుమారు ముప్పైఏళ్ల వయసు ఉంటుందేమో, ఓ ముగ్గురు బృందాలను మూడు వైపులా కూర్చోబెట్టుకుని రిలే పద్ధతిలో మంత్రాలు చదివి కార్యక్రమం చేయిస్తున్నాడు. మధ్య మధ్యలో సెల్ ఫోన్ లో మరి కొన్ని తంతులు నడిపిస్తున్నాడు.

ఈ వ్యవహారం అంత చూసి సాయి ముఖం విసుగ్గా పెట్టి “ఇటువంటివి నా వల్ల కాదు. నేను ఆ మూల కూర్చుంటాను” మీరు కానివ్వండి అన్నాడు. ఈ లోగా మమ్మల్ని దీక్షా వస్త్రాలు కట్టుకుని నదిలో స్నానం చేసి రమ్మన్నారు.

మేము అక్కడికి వెళ్లి చూసేసరికి పరిస్థితి భీతావహంగా ఉంది. ప్రవాహం లేకపోవడం వలన నిలవ నీళ్లు మురికిగా ఉన్నాయి. నీటి నిండా విప్పేసి పడేసిన రకరకాల వస్త్రాలు, పూజా సామాన్లు, తేలుతున్నాయి. సాయికి ఒళ్ళంతా కంపరంగా ఉంది. వచ్చేప్పుడు రెండు లీటర్ల సీసాలో డెట్టాల్ నీళ్లు కలిపి తెచ్చేడు. ఈ నీళ్ళలోకి దిగేది లేదన్నాడు. కానీ ఏ కళ నున్నాడో తరువాత మనసు మారి ముందు మీరు చెయ్యండి అన్నాడు. రఘు నేను మెల్లగా నీటిలోకి దిగి కాళ్ళకు పాముల్లా చుట్టుకుంటున్న గుడ్డ పీలికలు వదిలించుకుంటూ వీలైంత దూరం వెళ్లి భక్తిగా ములిగి వచ్చాం. వచ్చిన వెంటనే సాయి మా తల నుండి క్రింది దాకా డెట్టాల్ నీళ్ళతో సంప్రోక్షణ చేసాడు. తరువాత ముఖం ముటముటలాడిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ అడ్డు వచ్చే చీరలు, లుంగీల నుండి ఒడుపుగా తప్పించుకుంటూ ఏదో స్నానం అయిందనిపించి హాడావిడిగా వచ్చి డెట్టాల్ నీళ్ళతో స్నానం చేసాడు.

తరువాత మండపంలో నేను రఘు పంతులుగారు చెప్పిన విధులు పూర్తి చేసి, ముగ్గురూ కలసి ఆస్థికలు భక్తిగా నదిలో నిమజ్జనం చేసాం. అమ్మకు ఆఖరిసారి వీడ్కోలు పలికాము. పంచభూతాల నుండి వచ్చిన ఉపాధి తిరిగి పంచ భూతాలలో కలసిపోయింది. నిమజ్జనం పూర్తయిన తరువాత నేను నదిలో కలుస్తున్న అస్థికల వైపు చూస్తూ నిలబడ్డాను. అవి నీటిలో కలిసిపోతున్నాయి. ఆ క్షణంలో ఒక ప్రశ్న మళ్లీ నా మనసులో మెరిసింది.

ఈ నీటిలో కలిసింది అమ్మేనా? లేక అమ్మ వదిలిపెట్టిన ఒక పాత వస్త్రమా? సమాధానం నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఈ ప్రపంచంలో నన్ను నిస్వార్థంగా ప్రేమించిన ఒక శక్తి ఉంది. దానికి నేను ‘అమ్మ’ అని పేరు పెట్టుకున్నాను. అటువంటి ప్రేమ పూర్తిగా నశించిపోతుందని నా హృదయం ఒప్పుకోలేదు.

కృష్ణమ్మ అమ్మని తన వొడిలోకి తీసుకుని మంద్రంగా ప్రవహిస్తోంది. ఆమె ఒడిలో కలిసిపోయిన అస్థికలు కనబడకుండా పోయాయి. కానీ అమ్మ జ్ఞాపకం మాత్రం నా లోపల మరింత స్పష్టంగా మిగిలిపోయింది.

“నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః”

ఆత్మను ఆయుధాలు చీల్చలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండించలేదు.

మరొక్కసారి గీతా వాక్యాలు నా మనసుకు ఊరట కలిగించాయి. జీవుడు శాశ్వతుడు.

కృష్ణమ్మ తల్లికేసి చూస్తుంటే సాయి అందుకున్నాడు;

“బాగా చూడండి. మీ కృష్ణమ్మ తల్లి దురవస్థ ఎలా వుందో. ఏమాత్రం ఇంగితం లేని ఈ మనుష్యులు నీటిని ఎంత కలుషితం చేస్తున్నారో. నాకు వొళ్ళు మండిపోతోంది. ఈ అజ్ఞానులను ఎవరు మార్చగలరు! చూడు చూడు.. అతగాడ్ని చూడు.. ఇప్పుడే నదిలో స్నానం చేసి బయటకు వచ్చి, కట్టుకున్న లుంగీ, చడ్డీ విప్పేసి నీళ్ళలోకి కసిగా ఎలా విసిరేస్తున్నాడో. అతడిని ఏం చేయ్యేదే మీ కృష్ణమ్మ?” అనుకుంటూ విసవిసా నడిచి కారు వైపు వెళ్ళిపోయాడు.

కృష్ణమ్మ కేసి మరొక్కసారి భక్తిగా చూసి దండం పెట్టుకున్నాను.

“కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి”

లోకంలో చెడ్డ పుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లులు ఎప్పుడూ ఉండరు. ఎంత సత్యం! పిల్లవాడ్ని తల్లి ఎత్తుకున్నప్పుడు వాడు ఆవిడ మీద మలమూత్ర విసర్జన చేస్తాడు. కానీ ఆ తల్లికి కోపం రాదు. ఎందుకంటే ఆవిడ తల్లి కనుక. “అమ్మ కృష్ణమ్మా, తెలిసో తెలియకో నీ పట్ల ఘోరమైన తప్పులు చేసే ఈ నీ పిల్లలను దయతో క్షమించి కాపాడు” అని భక్తిగా నమస్కరించాను. కృష్ణమ్మ తల్లిలా దయతో నవ్వుతున్నట్లు నాకు అనిపించింది. తృప్తిగా కారు వైపు నడిచాను.

Exit mobile version