[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘నిందితుడు’. రచన భమిడిపాటి వంశీ మిత్ర.]
“గుడ్ మార్నింగ్ సార్!” అని ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చిన సీఐ సూర్యకి వెల్కమ్ చెప్పాడు కానిస్టేబుల్ రమణ. “గుడ్ మార్నింగ్!” అంటూ తల ఆడించి, డీఎస్పీ రూమ్ లోకి వెళ్ళాడు సూర్య. “మీ గురించి చాలా గొప్పగా విన్నాము, మీరు ఇప్పటివరకు పని చేసిన ఏరియాల్లో క్రైమ్ రేట్ తక్కువ. కానీ ఈ ఊర్లో అలా కాదు!” అని చెబుతూ ఉండగా కానిస్టేబుల్ రమణ వచ్చి, “సార్ రైల్వే ట్రాక్ దగ్గర డెడ్ బాడీ ఒకటి దొరికింది” అని చెప్పాడు.
“చూసావుగా సూర్య! ఇది ఇక్కడ పరిస్థితి. ఎప్పుడూ ఏదో ఒక క్రైమ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి 10 రోజులకి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి”, ఇదో తలనొప్పిగా మారింది అన్నట్టుగా తల విదిలించి, పైకి లేచి, “నేను అర్జెంటుగా ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. ఓ ఐదు రోజులు నేను ఇక్కడ ఉండను. హ్యాండిల్ విత్ కేర్” అంటూ అక్కడి నుంచి కదిలాడు డీఎస్పీ. “ఓకే సార్!” అంటూ సూర్య కూడా బయటకి నడిచాడు.
సూర్య అక్కడి నుంచి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీని పరిశీలించాడు. తర్వాత ఆ బాడీని అక్కడ నుంచి పోస్టుమార్టం చేయడం కోసం తరలించారు. సూర్య అక్కడ నుంచి స్టేషన్‌కి వెళ్తూ, మధ్యలో టీ షాప్ దగ్గర ఆగాడు. “భార్యాభర్తల గొడవ, వృద్ధుల హత్య, జాబ్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై దాడి, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన” అని సత్య టీ తాగుతూ న్యూస్ పేపర్ లోని వార్తలు పైకి చదువుతున్నాడు. సూర్యని చూడగానే సత్య ఆప్యాయంగా పలకరించాడు. వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు. సూర్య సత్య పక్కన కూర్చుంటూ “నాకు ఇక్కడికి ట్రాన్స్‌పర్ అయింది, చాలా సంవత్సరాల తర్వాత సొంత ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ వచ్చిన మొదటి రోజే డెడ్ బాడీ, ఇన్వెస్టిగేషన్ అని తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పని మీద వెళ్లి వస్తున్నాను” అని చెప్పి కాసేపు చిన్ననాటి విషయాలు ముచ్చటించి ఇంటికి బయలుదేరాడు.
సూర్య లంచ్ ముగించుకుని, హాల్లో కూర్చుని కేసు గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోగా సూర్య చెల్లి కాంచన బయటి నుంచి అప్పుడే ఇంట్లోకి వస్తూ ఎందుకో చాలా కంగారుగా టెన్షన్ పడుతున్నట్టుగా కనిపించింది అతనికి. ఆ విషయమే అతను అడిగితే సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ‘రైల్వే ట్రాక్ దగ్గర దొరికిన బాడీ యాక్సిడెంటా? లేదా హత్య! అనే విషయం అర్థం కావట్లేదు, ఏదైనా బలమైన ఆధారం దొరికితే గానీ ఈ కేసులో ముందుకు వెళ్లలేం’ అని ఆలోచిస్తూ ఉండగా, కానిస్టేబుల్ వచ్చి “మిమ్మల్ని కలవడానికి ఒకతను వచ్చాడు” అని చెప్పాడు.
సూర్య లోపలికి పంపించు అని కళ్ళతో సైగ చేశాడు. కానిస్టేబుల్ చెప్పిన వ్యక్తి సూర్య దగ్గరకు వచ్చి, “నిన్న రాత్రి సుమారుగా ఒంటిగంటకి ఒకతను ఆటో నుంచి ఒక పెద్ద మూటను తీసుకొని రైల్వే ట్రాక్ వైపు వెళ్లడం చూశాను. ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇందాక అక్కడికి పోలీసులు రావడం గమనించాను.
రైల్వే ట్రాక్‌కి దగ్గర్లోనే నా టీ షాప్ ఉంది, నేను మీ డీఎస్పీకి గారికి బాగా తెలుసు” చెప్పాడు అతను. ‘రైల్వే ట్రాక్ దగ్గర దొరికిన డెడ్ బాడీకి దీనికి ఏదో సంబంధం ఉంది’ అనుకొని, “సరే మేము దాని గురించి ఎంక్వయిరీ చేస్తాం. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు” అని అతనితో భరోసా ఇస్తున్నట్టుగా చెప్పాడు సూర్య.
అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం సూర్య డీఎస్పీకి ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలో కానిస్టేబుల్ సూర్య దగ్గరకు వచ్చి, “సార్ ఇంకో డెడ్ బాడీ దొరికింది, ఇది కూడా పొద్దున మనకు దొరికిన డెడ్ బాడీకి దగ్గర్లోనే దొరికింది” అని చెప్పగానే.. ‘ఏంటి? వరుసగా ఇలా జరుగుతున్నాయి! ఒక కేసు సాల్వ్ కాకుండానే ఇంకొకటా!’ అనుకుని కంగారుపడ్డాడు సూర్య. కానీ అది పైకి కనిపించకుండా ఓకే చూద్దాం అన్నట్టుగా తల ఊపాడు.
“సరే నువ్వు వెళ్లి, ఆ డెడ్ బాడీ దగ్గర ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో క్షుణ్ణంగా పరిశీలించు” అని కానిస్టేబుల్ రమణకి చెప్తూ ఉండగా.. సూర్య చెల్లి నుంచి ఫోన్ వచ్చింది. “అన్నయ్య! అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి”అని కంగారుపడుతూ చెప్పింది. “ఏంటో చెప్పు!” అన్నాడు సూర్య. “అది.. అది.. ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు ఇంటికి త్వరగా వస్తే చెప్తాను. కానీ విషయం విన్న తర్వాత నువ్వు కోప్పడకూడదు” అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ‘ఎప్పుడు లేని విధంగా కాంచన ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది?!’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు. సూర్య వెంటనే ఇంటికి వెళ్లి ఏమైందని అడిగాడు. తను ఎందుకు టెన్షన్ పడుతుందో చెప్పింది కాంచన. సూర్య తన చెల్లెలు చెప్పింది విని షాక్ అయ్యాడు.
నాలుగు రోజుల లీవ్ తర్వాత, డీఎస్పీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సూర్య అప్పటివరకు కేసు గురించి స్టడీ చేసిన రిపోర్టు పట్టుకుని, డీఎస్పీ దగ్గరికి వెళ్ళాడు. “సార్! డెడ్ బాడీస్ పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రెండు మరణాలకి కారణం ట్రైన్ ఆక్సిడెంట్ అని తేలింది” ఫైల్ చూపిస్తూ చెప్పాడు సూర్య. “అదేంటి! ఆటోలో ఒక బాడీని మూటగట్టి తీసుకెళ్లడం చూశానని ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పావు కదా!” అడిగాడు డీఎస్పీ.
“ఆటోలో బాడీని తీసుకెళ్లడం నిజమే సార్ కానీ అది కుక్క డెడ్ బాడీ అని తెలిసింది. ట్రాక్ దగ్గర డెడ్ బాడీస్ దొరికిన ప్రాంతంలోనే ఒక కుక్క డెడ్ బాడీ కూడా మూటగట్టి పడేసి ఉంది. ఇంతకుమించి ఈ డెడ్ బాడీస్ మధ్య ఎలాంటి మిస్టరీ లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎవరూ రాలేదు, మనకు ఆ ఏరియాలో అవి హత్యలు అని చెప్పడానికి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు” చెప్పాడు సూర్య. వీరిద్దరి డిస్కషన్ గోడ పక్కన నుంచుని కానిస్టేబుల్ రమణ వినడం సూర్య గమనించాడు.
సూర్య బయటకు వచ్చి, “ఏంటి సీక్రెట్‌గా వింటున్నావ్? ఈ కేసు విషయంలో చాలా కుతూహలంగా ఉన్నట్టున్నావ్!” అడిగాడు సూర్య రమణ కళ్ళలోకి సూటిగా చూస్తూ. “అదేం లేదు సార్. మామూలుగానే వింటున్నాను” చెప్పాడు రమణ. “ఆ రైల్వే ట్రాక్ మరణాల్లో మనం అనుమానించదగింది ఏమీ లేదు” అన్నాడు.
ఆ మాటతో కానిస్టేబుల్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్య స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో టీ షాప్ దగ్గర ఆగాడు. అదే సమయంలో టీ తాగుతూ పేపర్ చదువుతున్న తన ఫ్రెండ్ సత్య దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సూర్య. సూర్యని చూస్తూనే చిరునవ్వుతో పలకరించి “ఏంటి రైల్వే ట్రాక్ కేసు విషయంలో క్లూస్ ఏమైనా దొరికాయా?” చదువుతున్న పేపర్ పక్కన పెట్టి అడిగాడు సత్య.
“ఆ కేస్ క్లోజ్ అయిపోయింది. దాంట్లో ఎలాంటి మిస్టరీ లేదు. అవి సాధారణ మరణాలే. ట్రైన్ యాక్సిడెంట్ వల్ల జరిగాయి అని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది” చెప్పాడు సూర్య టీ తాగుతూ. “ఓ.. అవునా!” అని ఆశ్చర్యపోతూ అన్నాడు సత్య. కేసు గురించి సత్య ఇంట్రెస్ట్ చూపించడంతో..సూర్య ఆ కేసు గురించి కొన్ని విషయాలు చెప్పాడు.
“ముందు ట్రాక్ దగ్గర దొరికిన డెడ్ బాడీకి, తర్వాత అదే ట్రాక్ దగ్గర్లో దొరికిన ఇంకో డెడ్ బాడీకి సంబంధం ఉంది. వాళ్ళ ఇద్దరి ఫోన్లలో ఒకరి నంబరు మరొకరి దగ్గర ఉన్నాయి. వాళ్ల డెడ్ బాడీస్ మధ్య ఒక కిలో మీటర్ దూరం మాత్రమే ఉంది. ఆ మధ్యలో కొన్ని నోట్ల కట్టలు కూడా మాకు దొరికాయి. కానీ నేను వీటిని కేసు షీట్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. డబ్బు విషయంలో వాళ్ళిద్దరికీ గొడవ అయిందని అర్థమైంది. వాళ్ళిద్దరూ తాగి గొడవ పడుతున్న సమయంలో ట్రైన్ రావడం వాళ్లు గమనించలేదు. ట్రైన్ గుద్దడంతో వాళ్ళిద్దరూ చనిపోయారు.
అయితే ఒకరి బాడీ ఎగిరి ట్రాక్ అవతల పడగా, ఇంకొక బాడీని మాత్రం ట్రైన్ ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకెళ్లిపోయింది. వాళ్ళిద్దరి శరీరంలో ఎక్కడైతే కత్తిపోట్లు ఉన్నాయో అక్కడ ట్రైన్ చక్రాలు వెళ్లడం వల్ల పోస్టుమార్టంలో వాటిని కనిపెట్టలేకపోయారు. కానీ జరిగింది అయితే ఇదే” అని సూర్య సత్యతో చెప్పాడు.
‘అవునా!’ అన్నట్టుగా సూర్య చెప్పేదంతా చాలా ఇంట్రెస్ట్‌గా వింటున్నాడు సత్య. “చనిపోయిన ఆ ఇద్దరు కూడా చాలా తక్కువ ఏజ్ ఉన్నవాళ్లే. సుమారుగా 26 సంవత్సరాలు ఉండొచ్చు అంతే!” అని చెబుతున్న సూర్యకి అడ్డుపడుతూ. “అసలు డబ్బు విషయంలో వాళ్లకు గొడవలు ఎందుకు వచ్చాయో మరి” అని అన్నాడు సత్య.
“ప్రపంచానికి తెలియని ఇంకో కోణం ఈ కేసులో ఉంది. దాదాపు సంవత్సరం నుంచి పీడిస్తున్న ఒక పెద్ద సమస్యకి వీరి చావులు అద్దం పట్టాయి” తనకు తెలిసిన రహస్యం తలుచుకొని చిన్నగా నవ్వుతూ చెప్పాడు సూర్య. సత్యకి విషయం అర్థం కాక “అదేంటో వివరంగా చెప్పు” అన్నాడు ఎంతో కుతూహలంగా.
“నేను డీఎస్పీకి ఇచ్చిన రిపోర్టు తప్పు. అవి ట్రైన్ యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణాలు కాదు, అవి రెండూ పక్కా మర్డర్లే. నాకు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవ్వక ముందు నుంచి ఈ ఊర్లో ప్రతి సమస్య గురించి నాకు తెలుసు. ఇది నా సొంత ఊరు, అందుకే ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయి. ఈ ఊర్లో దాదాపుగా సంవత్సరం నుంచి మర్డర్స్ ఎక్కువ అవుతున్నాయని మా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రమణ నాకు చెప్పాడు. రమణ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. వాడు, నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం వాడు నాతో ఎప్పటికప్పుడు చెప్పేవాడు. ఇక్కడ జరిగిన ఎన్నో మర్డర్స్ వెనకాల ఎవరి ప్రమేయం ఉందా అని ఎంక్వయిరీ చేశాడు. కానీ చేసింది ఎవరు అనేది కనిపెట్టలేకపోయాడు.
హత్యలు చేస్తున్న వాడు దొరికితే శిక్ష పడేలా చేద్దాం అనుకున్నాను. అలా అనుకుంటున్న సమయంలోనే నాకు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. నువ్వు న్యూస్ పేపర్‌లో భార్యాభర్తల గొడవ, వృద్ధుల హత్య అంటూ కొన్ని వార్తలు ఈ మధ్య చదివే ఉంటావు. అందులో వృద్ధులను హత్య చేసింది, సంవత్సరం నుంచి ఈ ఊర్లో జరుగుతున్న హత్యలకి కారణం ఒకరే. సంవత్సరం నుంచి ఇక్కడ హత్యలు చేస్తున్న ఆ ఇద్దరే చచ్చి రైల్వే ట్రాక్ దగ్గర దొరికారు” చెప్పాడు సూర్య పీడా విరగడయింది అన్నట్టుగా. “అయితే వాళ్ళిద్దరూ డబ్బు విషయంలో గొడవపడి, ఒకరిని ఒకరు పొడుచుకుని చనిపోయారా?” అడిగాడు సత్య అనుమానంగా.
“తాగిన మత్తులో డబ్బు విషయంలో గొడవ పడి ఒకరినొకరు కత్తితో పొడుచుకున్నారు అనేది కూడా నిజం కాదు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో వారిది సాధారణ ట్రైన్ ఆక్సిడెంట్ అని రాయించాను. యాక్చువల్‌గా వారి శరీరంలో ఒక చోట కత్తి పోటును డాక్టర్ గుర్తించాడు. కానీ ఆ డాక్టర్ నాకు ఫ్రెండ్ అవడం వల్ల అది జనరల్ డెత్, హత్య కాదు అని రాయమని చెప్పాను. అలాగే ఒకతను పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఆటోలో ఒక డెడ్ బాడీ తీసుకెళ్లడం చూశానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది కుక్క డెడ్ బాడీ అని మెన్షన్ చేశాను. కానీ యాక్చువల్ గా అది మనిషి శవమే. అతను చెప్పింది కరెక్టే. నేనే వేరే చోట దొరికిన ఒక కుక్క డెడ్ బాడీని అక్కడ పడేసేలా చేశాను” అన్నాడు సూర్య.
ఇదంతా వింటున్న సత్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు సూర్యవంక. సూర్య టైం ఎంత అయ్యిందో చూద్దామని ఫోన్ తీసి, ఫోన్ వాల్ పేపర్‌లో ఉన్న తన చెల్లెల్ని చూసి నవ్వాడు విరక్తిగా. “నిన్నటి వరకు నా చెల్లి నాతోనే ఉంది, ఇక నుంచి నాతో ఉండదు. తను చేసిన పని నాకు కోపం తెప్పించినా చేయక తప్పట్లేదు” అన్నాడు అతని చెల్లి ఫోటో వైపు చూస్తూ. సూర్య చెప్పే విషయం అర్థం కాక బుర్ర గోక్కుంటూ.. “చెల్లికి ఏమైంది?” అడిగాడు సత్య.
“ఓ రోజు నా చెల్లి చాలా టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేసింది. ఏమైందో అని కంగారుగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు విషయం చెప్పింది. తను ఒక అబ్బాయిని ప్రేమించిందట, అయితే ఆ అబ్బాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే వెళ్లి వాళ్ళతో మాట్లాడి మా పెళ్లికి ఒప్పించమని అడిగింది.
అసలే స్టేషన్లో కేసులు ఒక కొలిక్కి రాక టెన్షన్ పడుతుంటే మళ్లీ ఇదొక టెన్షన్ అని తన మీద కోప్పడబోయి, తల్లి తండ్రి లేని పిల్ల, అన్నీ నేనే తనకి అని తమాయించుకుని, వాళ్ళిద్దరి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను” అన్నాడు సూర్య.
‘ఓ అంతేనా! ఇంకా ఏదో అనుకున్నాను!’ అనుకుంటూ “ఇంతకీ ఆ హత్యల విషయం గురించి పూర్తిగా చెప్పలేదు!” ముందు ఆ విషయం చెప్పు అన్నట్టుగా అడిగాడు సత్య.
“ఈ ఊర్లో హత్యలు చేస్తున్న వాళ్లే, వృద్ధులను హత్య చేశారు. మూడు సంవత్సరాలకు ముందు హంతకులు ఇద్దరు ఆ వృద్ధుల ఇంటి ఎదురుగానే ఉండేవారు. మొదట్లో వీళ్ళు వాళ్లతో చాలా క్లోజ్‌గా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. కానీ సంవత్సరం కిందట ఈ ఇద్దరు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చి డబ్బు కోసం హత్యలు చేయడం మొదలుపెట్టారు.
ఆ క్రమంలో వాళ్ళు ఎంతో డబ్బు దోచుకున్నారు. ఎంతోమందిని హతమార్చారు, కానీ వాళ్లను పోలీసులు కనిపెట్టలేకపోయారు. వారికి పరిచయం ఉన్న ఈ వృద్ధులను కూడా చంపుదామని వారం రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వాళ్లను చంపి, డబ్బు తీసుకొని పారిపోయారు. పాపం ఆ వృద్ధ దంపతులు చనిపోయారు అన్న విషయం మూడు రోజుల తర్వాత గాని ఎవరికీ తెలియదు. పక్కింటి వాళ్లకి దుర్వాసన రావడంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించారు. ముంబైలో ఉంటున్న వాళ్ళ మనవడికి ఈ విషయం తెలిసి, వెంటనే బయలుదేరి వచ్చాడు. వాళ్లు అలా హత్య చేయబడడం తట్టుకోలేకపోయాడు. అతను ఆ వృద్ధులకు సొంత మనవడు కాదు, వాళ్లు అతన్ని చిన్న వయసులోనే దత్తత తీసుకున్నారు. చాలా ప్రేమగా చూసుకునేవారు. అతను బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. ఉద్యోగం రావడంతో ముంబాయి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల్లో వీళ్ళని తన దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పాడు. ఈ లోగా వాళ్ళు ఇలా హత్య కావడంతో చాలా బాధపడ్డాడు. ఎవరు ఎందుకు వాళ్లను చంపారో తెలియదు. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు.
మా పోలీస్ స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్ రమణ అతన్ని పక్కకు తీసుకెళ్లి, ఆ మర్డర్ గురించి అతనికి తెలిసిన వివరాలు చెప్పాడు. ఆ వీధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు మీ ఇంటిలోకి ప్రవేశించారు. వాళ్ళు ఎవరా అని ఎంక్వయిరీ చేస్తే, వాళ్ళిద్దరూ అంతకుముందు మీ ఇంటి ఎదురుగా ఉండే వారని నా ఎంక్వయిరీలో తేలింది. వాళ్లని ఎలాగైనా పట్టుకుని మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని చెప్పాడు కానిస్టేబుల్” చెప్పడం ఆపాడు సూర్య.
“అవునా! మరి ఆ తర్వాత ఏమైంది? నిందితులు దొరికారా?” అడిగాడు సత్య కంగారుగా.
“ఇంకేముంది అతను కానిస్టేబుల్ రమణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఆ వృద్ధులను హత్యలు చేసిన ఇద్దరినీ పట్టుకోవడం కోసం కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మనవడు నిందితులను పట్టుకున్నాడు. వారిని బంధించి పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. ఆ క్రమంలో వాళ్ళ మధ్య పోరాటం జరిగింది. అది రాత్రి సమయం కావడం వల్ల వీళ్ళ గొడవని ఎవరు గుర్తించలేదు. ఆ నిందితులిద్దరూ కలిసి ఆ మనవడి మీద దాడికి దిగారు. అతను ఇక చేసేదేమీ లేక, రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వారిద్దరి మీద దాడి చేశాడు. ఆ ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ వెళ్లిపోయారు.
అతను వేగంగా పరిగెత్తి వాళ్ళిద్దర్నీ పొడిచేశాడు. అది హత్య కాదు ఆత్మహత్య అనుకోవాలని, ఆ డెడ్ బాడీలను ఆటోలో మూటకట్టి తీసుకెళ్లి, ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయాడు. ట్రైన్ డెడ్ బాడీల మీదుగా వెళ్ళిపోయింది. ట్రైన్ గుద్దేసి బాడీ నుజ్జు నుజ్జు అయినా కూడా కత్తిపోట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో క్లియర్ గానే కనపడ్డాయి. కానీ నేను అది ఆత్మహత్య అన్నట్టుగా రాయమని చెప్పాను డాక్టర్‌కి. ఆ మనవడు అంతా బాగానే మేనేజ్ చేసాడు గాని అతనికి తెలియకుండానే ఒక క్లూ వదిలేసాడు.”
“ఏంటది?” క్యూరియాసిటీతో అడిగాడు సత్య.
“నిందితుల డెడ్ బాడీస్‌ని ట్రాక్ మీద పడేసేటప్పుడు అతని పర్స్ అక్కడ పడిపోయింది. నాకు అతని పర్స్ దొరికింది. ఆ పర్స్ అక్కడే వదిలేసి, దాన్లో క్లూని మాత్రం నా దగ్గరే పెట్టుకున్నాను” చెప్పాడు సూర్య. “ఆ వృద్ధ దంపతుల్ని చంపడం పాపం కదా! ఇంతకీ ఆ మనవడు ఎవరో కనిపెట్టావా?” అడిగాడు సత్య.
“ఆ మనవడు ఎవరో కాదు, అన్నీ చేసి ఏమీ తెలియనట్టు నటిస్తూ, నా ముందే కూర్చున్న నువ్వే. ఆ వృద్ధుల మనవడు అలియాస్ సత్య” అని చెప్పాడు సూర్య.
సత్య కంగారు పడటం చూసి, “నువ్వేం కంగారు పడకు. నువ్వు కత్తితో పొడిచినా కూడా, రికార్డు ప్రకారం వాళ్లు ట్రైన్ ఆక్సిడెంట్ లోనే చచ్చారు. అలాంటి వాళ్ళు చావడమే మంచిది. ఈ కేసు కోర్టుకు వెళితే నిరూపించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వాళ్ళు సంపాదించుకున్న డబ్బుతో లాయర్‌ని పెట్టుకొని మేనేజ్ చేసి హాయిగా బ్రతికేస్తారు. కానీ వాళ్లకి అలా స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదు. నువ్వు చేసింది తప్పే అయినా, మీ తాత, అమ్మమ్మల ఆత్మలకి శాంతి కలిగేట్టు చేసావు. ఇక ఈ కేసు గురించి నువ్వేం బాధపడకు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీకు జరిగిన అన్యాయం మన స్నేహితుడైన రమణ ఇక్కడికి వచ్చిన రోజే నాతో చెప్పాడు. హత్యలు చేసిన వాళ్లు అవి కప్పిపుచ్చుకోవడానికి డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు. నేను నువ్వు చేసిన తప్పుని మన ఫ్రెండ్షిప్‌తో మేనేజ్ చేసి, తప్పుడు సాక్షాలు సృష్టించి, ఈ కేసు నుంచి నిన్ను బయట పడేసాను” అని చెప్పి సత్య భుజం తట్టి, తన జేబులోని సత్య తాత అమమ్మల పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసి, సత్య చేతిలో పెట్టి, “క్లూస్ జాగ్రత్త!” అని చెప్పి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ చుట్టూ చీకటి అలుముకుంటుంది. కానీ తన బ్రతుక్కి భరోసా ఇచ్చి వెళ్తున్న సూర్యలో ఆశాకిరణం కనబడింది సత్యకి.
