[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘నింగి.. నేల’ అనే కవితని అందిస్తున్నాము.]
నింగిపై నీటి మెయిలు ‘వారి’తావి హొయలు!
నేల మీద నింగి ‘వారి’జాలువారు వగలు!
ఓ మేఘమాలికా! వానజల్లు.. కురియుమా!
ఆ ‘సుధా’ధారలతో, అవని పులకరించగా!
బీజములు మొలకలెత్తి ధాత్రి పరవశించగా!
పుడమిపై హరితవర్ణ ‘సరము’ సింగారమాయె!
వర్ణరంజితమైన ‘వసుధ’ వనమాలికల హారాలు!
ఎన్నెన్నో వర్ణకుసుమాల దరహాస ‘సరిక’లు!
కేదార క్షేత్రాలహరిత, మరకత మణిహారాలు!
వర్ష హర్షనదీ, నదముల వయ్యారపు ఉరకలు!
నిండు గర్భనారి వలె మంద మందగమనములు!
ఆగమనము కనిన కనువిందు మది మురియు!
ఆ సవ్వడి ‘ఆగమము’ ఆరవళియె ‘నిగమము’
మదిని హర్షమావహింప ఆనందార్ణవమాయె!
సాగర మేఖిలమా! లవణ, రత్ననిలయమా!
ఆదిత్యుని సాంగత్యము గగనమెగయు ‘ఆవిరి’
అమృతధారలను ఇమ్ముగ కురియును ‘ఇలపై!’
‘సూర్య’ ‘చంద్ర’ గమన కరుణ కురిపించే ప్రకృతి
నీలి మేఘములు చూడ.. మది సందడించెనే!
మనసులో ఎన్నెన్నో భావనలు ఉదయించే!
మకరాలయమే గాని మౌక్తికముల ఆవాసము
మీనముల వన్నెలన్ని కన్నుల పర్వము కాదా!
నీ నీడన ప్రాణులన్ని చల్లగ నివసించునోయి!
మలయమారుతం తాకి మనసెంతో మురిసినది!
తారాపథమున ‘గంగ’ మనమాహ్లాద ‘తరంగ!’
అంబరమును గమనించ నల్లమబ్బు గుంపులు!
ఎన్నెన్నో రూపాలు కైలాస శిఖరాల ఆవళులు!
నదీ, నదములు, సరస్సులు ఉరుకుల, పరుగుల
తోడ.. నదులన్నిటి ‘ఎకిమీడు’ సాగరునే చేరుకొను!
అరుణ వర్ణ తేజమున ‘వినువీధి’ వెలుగులీనె!
దినరాజు.. రాకతో తూరుపు సిందూరమాయె!
ఉదకములు నింగికెగయ వరుణుని దయచే
ఆసలిలమె ‘అమృత’మై మేఘపుష్పమై కురియును
