Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృద్యమైన కవితల మణిహారం ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’

[అవధానుల మణిబాబు గారి ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు డిసెంబరు 2023లో వెలువరించిన కవితా సంపుటి ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’. ఈ సంపుటిలో 48 కవితలున్నాయి. కొన్ని ప్రయాణాలు, కొన్ని ఘటనలు, కొందరు మనుషులు తనపై వేసిన గాఢమైన ముద్రలను అత్యంత సరళంగా, తాను పొందిన అనుభూతిని పలచన కానీయకుండా, ఆనంద విషాదాలని సున్నితంగా, హృద్యంగా కవితలుగా అందించారు మణిబాబు.

~

సాయంకాలమైంది’ అనే కవితలో ఒకప్పుడు కాకినాడ టౌన్ స్టేషన్ వెనుక మిత్రులతో కలిసి శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావుతో గడిపిన అనేక సాయంత్రాలను గుర్తుచేసుకుంటారు. ఆయనని వటవృక్షంగా పోలుస్తూ, ఆ చెట్టు చెంత వాలిన పక్షులం తాము అని చెప్తారు. అప్పుడా పరిసరాలు ఎలా మారిపోతాయో చెబుతున్నారు: “పదంగా, పద్యంగా/గద్యంగా, గేయంగా/సంభాషణల్లో సమ్మిళితమై/వేనవేల గ్రంథాల సురభిళంతో/పరిసరమంతా పరిమళిస్తుంది”. అలాంటి సాహితీ చర్చల్లో పాలుపంచుకోవాలని, నేర్చుకోవాలని, రచనాభిలాష ఉన్నవారంతా కోరుకుంటారు.

కునుకు’ కవితలో మధ్యాహ్నపు నిద్ర చేసే మేలుని వివరించారు. మధ్యాహ్నపు నిద్ర వృథా కాదని, అది ఎన్నో పనులు చేయిస్తుందని అంటారు. “మధ్యాహ్నపు కునుకంటే/పనిదినాన్ని రెండు చేసి పరవశంతో అతకడం/అన్నిటినీ విడిచిపెట్టి అచ్చంగా బతకడం” అన్న మణిబాబు గారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చలేం. ఈ కవితలో ప్రస్తావించిన హరిదాసు గారిని, రిక్షా రాజబాబుని తలచుకుంటే – నిద్ర సుఖమెరుగదన్న నిజం మరోసారి మనసుకు తడుతుంది.

అవయవ దానంపై ఓ కవితల పోటీ కోసం రాసిన ‘మృత్యోర్మా అమృతంగమయ’ కవితలో కీర్తిశేషులవడానికి అసలైన అర్థం చెబుతారు. మట్టిలో కలవడం కంటే మరో మనిషిలో నిలవడం మేలంటారు.

బ్రతుకు రూపకం’ అనే కవితలో ఆల్బమ్ చూస్తూ, కొందరు వ్యక్తులను కొన్ని సందర్భాలను నెమరువేసుకుంటారు. కొందరు క్షణాల్లో జీవితకాలపు అనుభూతులు పంచితే, మరికొందరు ఏళ్ళ తరబడి కలిసున్నా తలపుల్లో మెదలరని అంటారు. “ఉద్యోగ సేవలకు అవార్డునందుకునే ఫోటో/అర్ధరాత్రి ఆఫీసు పనితో గడిచిపోయాక/మా ఇరువురి నడుమ/మౌనంగా మిగిలిన రేయిలా అనిపిస్తుంది” అంటారు. ఈ నాలుగు వాక్యాలలో ఓ చేదు నిజం ఉంది – కెరీర్ కోసం, ఆఫీసులో గుర్తింపు కోసమో లేదా తప్పనిసరిగా అధిక సమయం కేటాయించి చేయాల్సివచ్చే కార్యాలయపు పనులలో లీనమైపోవడం వల్ల కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. అప్పుడప్పుడూ అయితే పరవాలేదు గానీ, అది నిత్యకృత్యమైపోతే, రాత్రి మౌనమవడం కాదు, మనవాళ్ళే మూగవాళ్ళవుతారు.

ఎవరైనా చనిపోయినప్పుడు రెండు నిముషాలు మౌనం పాటించమని ఎందుకు చెప్తారో ‘శవ దర్శనం’ కవితలో అద్భుతంగా వివరించారు మణిబాబు. ఎవరైనా చనిపోతే పరామర్శకి వెళ్ళినప్పుడు – ఆత్మీయులూ, రక్తసంబంధీకుల దుఃఖం తీరి, వారు తేలికపడేదాకా ఇతరులు అక్కడ హడావిడి చేయకుండా ఆగాలని ఈ కవితలో సూచిస్తారు.

డ్రింకుల బండి’లో ఓ చిరు వ్యాపారిని కలుస్తాం. అతని గొప్పతనాన్ని చిన్న పదాలతో చెప్పారు. “ఎన్ని చుక్కల ఎసెన్స్ ఎందరికి సరిపోతుందో/నిక్కచ్చిగా కొలవగల నిఖార్సైన పనోడే.. కానీ/డబ్బులు చాలక వన్ బై టు అడిగినప్పుడు/గ్లాసు సగమే నింపి ఆపడం ఎందుకో నేర్చుకోలేదు” అంటారు. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ అతన్ని కలిసి, తాతా గుర్తుపట్టావా అంటే, “ఆకలి దాహం/అందరిలో ఓలాగే వుంటాయ్/అవి తప్ప మరేటీ చూడ్డం రాదు బాబూ/గుర్తెట్టుకోడానికి” అన్నాడట. చేతులెత్తి నమస్కరించాలి ఈ సంస్కారికి!

చీకటి వెలుగులు ఒకదాని గొప్పదనాన్ని మరొకటి అద్భుతంగా చెప్పుకుంటాయి ‘దోబూచులాట’ కవితలో. వాటి ఔన్నత్యాన్ని గ్రహించిన కవి “ఇపుడు/‘వెలుగులో దాగిన చీకటి’/చీకటిలో వెలుగంత స్పష్టంగా తెలుస్తోంది” అంటారు.

కవితా ఎలా రాయాలో ‘ఓ కవిత రాయవూ’లో సూచిస్తారు. కొత్తగా కవిత్వం రాయాలనుకునేవారికి ఇది మంచి మార్గదర్శక కవిత. దీపావళి తనకేం నేర్పిందో ‘దీపావళి’ అనే కవితలో చెప్తారు.

సెలవు పాఠాలు’ కవితలో వేసవిలో – సీమచింత, మామిడి, ముంజు, చెరకు, ఐస్ పుల్ల – తనకేం నేర్పించాయో చెప్తారు. “వేసవి అంటే/గురుతుల గుడి/సెలవు పాఠాల బడి” అంటారు.

రెండు రాటల మధ్య’ కవిత చదువరుల మనసులను బరువెక్కిస్తుంది. బడుగు జీవులలో నిస్సహాయతల నుంచి కలిగే వేదనని హృద్యంగా అక్షరాల్లోకి ఒదిగించారు మణిబాబు. ఈ కవితలోని ఓ పాదంలోని వాక్యాన్ని పుస్తకానికి శీర్షికగా పెట్టారు.

ఆకాశంలో సగం’ కవితలో స్త్రీలు ఆకాశంలో సగం అంటే తానొప్పుకోనని అంటారు. మొత్తం వారేననీ, తాను రెండో వైపు చూడలేకపోతున్నానని అంటారు. స్త్రీలను పంచభూతాలను ఇముడ్చుకున్న శక్తులుగా చూస్తారు కవి.

సాగులోనే కాదు, సాహిత్యంలోనూ మొలకెత్తగల గింజలు కావాలంటారు ‘మొలకెత్తే గింజలు’ కవితలో.

అక్షరం’ అనే కవిత గొప్పగా ఉంది. అక్షర తత్వాన్ని అన్వేషించడంతో ప్రారంభమై, ఆరాధించడంతో ముగిసే ఈ కవిత చాలా లోతైనది. సులువుగా అర్థమవుతున్నట్టే అనిపిస్తుంది, కానీ చదువుతున్న కొద్దీ ఎన్నెన్నో అంతరార్థాలు స్ఫురిస్తాయి.

సామాజిక హితం కోసం కందుకూరి వీరేశలింగం గారు చేసిన కృషిని అత్యద్భుతంగా sum-up చేసిన కవిత ‘వారి కోసమే..’.

ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్లు సహజమే. ఊరు మారినప్పుడల్లా అన్నీ ప్యాక్ చేసి పట్టుకెళ్ళి, మరో ఊర్లో కొత్త ఇంట్లో విప్పుకుని సర్దుకుంటారు. కవి తల్లిదండ్రులు మాత్రం తాము నాటిన పూల మొక్కలని అక్కడే వదిలేసి, కొన్ని విత్తనాలను మాత్రం తీసుకుని కొత్త ఇంట్లో వేసుకునేవారట. తానూ కూడా అంతేనని, –

“పాదుకొల్పుకున్న అనుబంధాలను/వేళ్ళూనిన ఆత్మీయతలను/పెకిలించలేను/తరలించనూ లేను” అంటారు ‘బదిలీ’ కవితలో.

పుస్తకాల గూడును సర్దడం ఎంత కష్టమైన పనో ‘గూడు సర్దడం’ కవితలో చెప్తారు. ఒక్కో పుస్తకం ఒక్కోలా పలకరిస్తుందట. జాతిపిత గాంధీజీ గురించి పిల్లలకి కథలా చెప్పిన కవిత ‘నాన్న కథ’.

ఈ పుస్తకంలో కూతురు గురించి వ్రాసిన – ‘జ్వరం’, ‘ఎవరిది వాళ్ళదే’, ‘కృతి వాళ్ళ డాడీ’ కవితలు ప్రత్యేకమైనవి. తనకి జ్వరమొస్తే ఆఫీసు వాళ్ళు, తన భార్యకి జ్వరమోస్తే, ఇరుగుపొరుగు వారు సాయం చేశారనీ, కానీ పాపాయికి జ్వరమొచ్చి తగ్గాకా, ఒక్కర్తే ఆడుకుంటుందోని వాపోతారు ‘జ్వరం’ కవితలో. ఎంతటి ఆపేక్షో పాప మీద. ‘కృతి వాళ్ళ డాడీ’ కవితలో తనకి పదహారేళ్ళుగా లేని కొత్త గుర్తింపు కూతురు వల్ల వచ్చిందనీ అంటారు. ‘ఎవరిది వాళ్ళదే’ కవితలో కూతురు వెంటే ఉంటూ తనని నిరంతరం సురక్షితంగా చూసుకునే తండ్రి కనబడతాడు. బాల్యాన్ని అమితంగా ప్రేమించే మనిషి కనబడతాడు. అద్భుతమైన భావ వ్యక్తీకరణ!

ఇంతే కదా’ కవిత మార్మికమైనది. పైకి కవిత్వం రాయడం, కాఫీ కలపడం ఒకటే అన్న అర్థం ధ్వనించినప్పటికీ – రచనలలో సృజన కోసం ఎంత మథనం అవసరమో, ఇంటిపనులలోనూ గృహిణులకు అంతే ఏకాగ్రత, నైపుణ్యం, చాకచక్యం అవసరమని – అన్నీ సమపాళ్ళలో కలిసినప్పుడే అవి రుచిస్తాయని అర్థమవుతుంది.

యానం-అమలాపురం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా రాసిన కవిత ‘ప్రగతి కోరని ప్రాంతం వైపు’. అభివృద్ధి పనుల వల్ల, కొందరివి కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోతాయి. చెట్ల నీడ కరువవుతుంది, పిట్టలు గూళ్ళూ, తిండీ కోల్పోతాయి. ఎంత వాన పడినా తారు రోడ్డు తడిని ఇంకించుకోలేదని చెబుతూ – తడి లేని మన గుండెల్లానే అంటారు. నింగిలో పిట్టలు, నేలపై తానూ – ఇంకా ప్రగతి కోరని ప్రాంతల వెతుకుతూ బయల్దేరామంటారు. నేను అనువదించిన ‘బైపాస్ రోడ్’ (మూలం: టోనీ గాదర్‍కోల్, ‘ఏడు గంటల వార్తలు’ అనువాద కథల సంకలనం) కథ గుర్తొచ్చింది నాకు ఈ కవిత చదివాకా.

తల్లి – భార్య – కూతుళ్ళలో తాను గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్తుని చూశానని ‘మూడు కాలలు’ కవితలో చెప్పడం ఓ గొప్ప అభివ్యక్తి.

శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, విజయ దంపతులపై రాసిన ‘చేదోడు.. వాదోడు’ కవిత, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఏ చెట్టు కింద్ర కూర్చుని ‘ఆంధ్రపురాణం’ రాశారో, ఆ మహావక్షం 2022లో నేలకొరిగినపుడు మణిబాబు రాసిన ‘వంద అడుగుల వ్యాసపీఠం’ కవిత విశిష్టమైనవి.

పుస్తకాల ప్రాముఖ్యతని చెప్పిన కవిత ‘ఇటురా.. ఓసారి’. “ఓసారి ఇటురా, ఒక పుస్తకాన్ని తాకు./నీవేం కావాలో అది చెబుతుంది/నీకేం కావాలో అది నేర్పుకుంటుంది” అన్న వాక్యాలు అక్షర సత్యాలు.

ఉద్యోగ రీత్యా సుమారు రెండేళ్ళ పాటు కాకినాడ – అమలాపురం మధ్య బస్సు ప్రయాణం చేసిన కాలంలో, ప్రయాణ సమయమంతా పాటలు వింటూ గడిపేవారట మణిబాబు. సంగీతంలో ఆయనకున్న అభిరుచి ఓ కవితలో తెలుస్తుంది. ఆయనకి నచ్చిన గాయకులు, సంగీత దర్శకులు, గీత రచయితలను ‘సంగీత యానం’ కవితలో ప్రస్తావిస్తారు. ఆ పేర్లను చూస్తే ఆయన ‘టేస్ట్’ అర్థమవుతుంది. ఈ కవితలో ఆఖరి రెండు వాక్యాలు చమక్కుల్లాంటివి.

బ్రతుకు సారాన్ని అద్భుతంగా వివరించిన కవిత ‘అవునవును’. కూతురు పదబంధం పజిల్ నింపుతూ, ‘జీవితం’ ను సూచించే ఇతర పదాలని చెప్పమంటే, తండ్రి చెప్పిన పదాలని విని – “అలా కుదరదు, మొత్తం నాలుగక్షరాలు, మొదటిది, చివరిది ఆల్‍రెడీ ఫిక్స్ అయిపోయాయి” అంటుంది కూతురు. “అవునవును జీవితం కదా” అని అంటాడు తండ్రి. జననం, మరణం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, జీవితమనే పరమపద సోపాన పటంలో – మధ్య ఉన్న గళ్లలోనే పావుల్ని కదపాలని స్ఫురిస్తుంది.

ఒక అద్భుతమైన ప్రశాంతతని అనుభవించాకా, ఉద్వేగాలన్నీ సమసిపోయాకా, మనం ఏమవుతాం, ‘మౌని’ అవుతాం అంటుందీ ‘ఆసాంత ప్రశాంతత’ కవిత.

ప్రాణంలేని వస్తువులకి మాటలు వస్తే, తమని నిర్దేశించిన పనులకు మాత్రమే కాకుండా, బహుళార్థ సాధక పరికరాల్లా మార్చిన పిల్లల చేష్టలకు అవి ఎంతగా కృతజ్ఞతలు చెప్పేవో అంటారు ‘కదా’ అనే కవితలో. ఓ బస్సు ప్రయాణం సందర్భంగా తనలోకి తాను చూసుకుంటూ అంతర్ముఖుడవడాన్ని ‘ఎందుకో ఈ వేళ’ కవితలో చెప్తారు మణిబాబు.

ఋతువులని చేపలతో పోలుస్తూ – ఆరు చేపలు ఆరు రకాలని చెబుతూ – ఋతువును బట్టి కాలంలో చోటు చేసుకునే మార్పులను, తదనుగుణంగా మనలో రావలసిన మార్పును ‘కాలం ఒక చేపల తొట్టె’ కవితలో చెప్తారు. “ప్రాంతాలు, పరిణామాలు/రంగులు రూపాలతో నిమిత్తం లేకుండా/సమరసతో మనగల సహజాతం సాధన చెయ్” అంటారు కవి.

ముద్ర’ కవిత విశిష్టమైనది. బతుకుబాటలో మనదైన ముద్రని ఎలా వేయాలో చెబుతుంది. ‘అసలు సంగతి’ చక్కని చిరు కవిత. ఎల్లప్పుడూ శ్రమిస్తే, కలిగే ప్రయోజనాన్ని వ్యక్తం చేసే ఈ కవితలో “నే లేచే సరికే పూలైన/ నిన్నటి మొగ్గలనడిగా/వికాసం ఇంత సులభమా? అని/అవి ‘రాత్రంతా మేము నిద్రపోలేదుగా అన్నాయి’”. ఈ భావనను మనకు వర్తింపజేసుకుంటే, జీవితంలో ఎదగాలంటే (వికసించాలంటే) తగిన కాలాన్ని వెచ్చించి కృషి చేయాలనీ, అపుడే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చునని తెలుస్తుంది.

నాతో నేను, అసంపూర్ణ స్వప్నం, మళ్ళీ చిగురించాలంటే కవితలు – మిగతా కవితలతో పోలిస్తే లోతైనవి. డా. శిఖామణి గారి ముందుమాటతో మొదలైన పఠనం, వసీరా గారి వెనుకమాటతో ముగుస్తుంది.

~

క్లుప్తత, సరళత, ఆర్ద్రత, గాఢత లక్షణాలుగా భాసిల్లిన కవితల సంపుటి ఇది. పుస్తకానికి ముఖచిత్రం కూడా అందంగా అమరింది. అరసవెల్లి గిరిధర్ గారు గీసిన ముఖచిత్రం ఆధునికంగా ఉంటూనే పుస్తకం శీర్షికను ప్రతిబింబించింది. కవితా ప్రేమికులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’. పాఠకులను ఏ మాత్రం నిరాశపరచదీ పుస్తకం.

***

నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా.. (కవితాసంపుటి)
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 92
వెల: ₹ 180/-
ప్రతులకు:
అవధానుల మణిబాబు,
#3-62, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర,
సర్పవరం, కాకినాడ
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533005
ఫోన్: 9948179437

 

~

శ్రీ అవధానుల మణిబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-avadhanula-manibabu/

Exit mobile version