[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నిరాదరణ శిశిరం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవు నిష్క్రమించావు
నీ బతుకు దీపాన్ని
నిశ్శబ్ధంగా కొండెక్కించావు
మనదిగా మారిన నీ ప్రపంచం
కొత్తరంగులు చూపుతోంది కొద్దికొద్దిగా..
నిన్నాధారం చేసుకుని
బలపడిన బంధాలన్నీ
సడలిపోతున్నాయి మెల్లమెల్లగా..
నీ మీదుగా
చాచబడిన స్నేహహస్తాలు
వెనక్కెళ్ళిపోతున్నాయి కాస్తకాస్తగా..
నా చుట్టూ పరుచుకున్న
పరిచయాల పచ్చదనం
ఏమైందో కాని, ఎండి ఎడారిని తలపిస్తోంది
తెగతెంపులయిన
నా నీరవ నీరస జీవనంలో
ఒంటరితనం జంటకడుతోంది
ఎందుకో
ఒంటినంటుకున్న
ఈ బాధ్యతల ఆకులన్నింటినీ
ఒక్కొక్కటిగా రాల్చేసుకుని
మోడువారాలని అనిపిస్తోంది
తలదించుకోకుండా
తప్పేదీ నాపై మోపబడకుండా
నిటారుగా నిలబడి
అలా
నీలాకాశంలోకి నిశ్చలంగా చూస్తూ
అవును..
కనుమరుగైపోవాలనిపిస్తోంది
ఈ నిరాదరణ శిశిరంలోంచి..
కాలం గొంతులోకి
ఓ కత్తిని కస్సున దించేసి
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
