[డా. గాదిరాజు మధుసూదనరాజు గారి ‘నిరీక్షణం జయప్రదం’ అనే పద్యకథని అందిస్తున్నాము.]
చం.:
అతనొక పట్టభద్రుడు! దయానిధి! సంపదలేని పేదయౌ!
నతనిని పెంచె తల్లి కలలాశలు దీర్చెడు కృష్ణుడంచు! ను
న్నతమగు కోర్సు జేర్చి ధనంబు ఘనంబుగ ఖర్చుపెట్టె! ను
న్నతమగు రీతిలో కొడుకు నౌకరి జేర్పగ నెంచి నెమ్మదిన్ (1)
వివరణ:
అతని పేరు దయానిధి. పట్టభద్రుడు. పేదవాడు. అతని తల్లి తన కొడుకును పెద్ద ఉద్యోగములో గొప్పగా చూడాలని కలలుకన్నది. ఆశగా ఎంతో ఖర్చుపెట్టి అతన్ని గొప్పకోర్సులో చేర్పించి చదివించి తృప్తిపడింది.
కం.:
తల్లి పడుచున్న కష్టము
లుల్లమునుడికింప చదివె నుత్తమ రీతిన్
పల్లె విడిచి చేరె నగర
ముల్లాసంబుగ వెదుకగ నుద్యోగంబున్ (2)
వివరణ:
తల్లి తన కోసం పడుతున్న కష్టాలను చూచి అతని గుండె చురుక్కుమనేది. అందుకే అతను కూడా చక్కగా చదివి ఉత్తమశ్రేణిలో నిలిచాడు. ఉద్యోగము వెతక్కోవటం కోసం ఉత్సాహంగా పల్లె విడిచి నగరం చేరాడు
చిల్లర ఖర్చులు నద్దెలు
చెల్లింపగ నప్పు మరల చేయుచు వచ్చెన్
మెల్లిగ పెరిగెన్ ఋణములు
పల్లెల యాస్తులు తరిగెను బరువై వడ్డీల్ (3)
వివరణ:
నగరంలో చిల్లర ఖర్చులు భరించటం కోసం అద్దెలు చెల్లించటం కోసం మరిన్ని అప్పులు చేస్తూ వచ్చాడు. చదువు కోసం చేసిన అప్పులకై వడ్డీ చెల్లించటం భారం కావటంతో పల్లెలోని ఆస్తులను అమ్మివేశారు (ఉద్యోగం వస్తుంది మిగతా అప్పులు తీర్చవచ్చునన్న ధైర్యంతో).
మ.:
దరఖాస్తుల్ కొలువిచ్చు సంస్థలకు శ్రద్ధన్ బంపె! చూడన్ వ్యథా
కరమయ్యెన్ విఫలంబులన్ గలుగు వ్యాఖ్యానావమానాదులున్!
బరువై జాప్యము వారముల్ నెలలు కూల్పన్ ధైర్యమున్నమ్మికన్
పురమాయించెను చావగా మనసు! నప్పుల్ క్రమ్మి పీడింపగాన్ (4)
వివరణ:
ఉద్యోగం కోసం ఎన్నో సంస్థలకు శ్రద్ధగా దరఖాస్తులు పంపాడు. ఉద్యోగ సాధనలో వైఫల్యాలు. వాటిపై ఇతరుల వ్యాఖ్యలు, అవమానాలు అవహేళనల వంటివి బాధాకరంగా మారాయి దయానిధికి. వారాలు నెలలు గడుస్తూ ఆలస్యమయ్యే కొద్దీ ఉద్యోగం వస్తుందన్ననమ్మకం ధైర్యం నశించిపోయింది. అప్పులబాధ దానికి తోడవటంతో చావటం మేలంటూ మనసు తొందరపెట్టింది.
చం.:
తలచిననిట్టి మాటలను తత్తరమందుచు తల్లడిల్లుచున్
విలవిలలాడు లేచి! నిలువెత్తున పొంగుచు కూలితూలి! వా
కిలి గడెకేసి కొట్టుకొని కేకలతో తల చిట్లుచుండవ్యా
కుల పడు తల్లి తీరు మది గుర్తుకు వచ్చుచు త్రెంచె యోచనన్ (5)
వివరణ:
తనను గురించి అలాంటి మాటలను తలచుకుంటే చాలు తత్తరపడుతూ తల్లడిల్లిపోతూ విలవిలలాడుతూ పడుతూ లేస్తూ తూలిపడుతూ ఇక నా వాకిట్లో నా కొడుకు అడుగుపెట్టటం చూడలేనా? అంటూ వెఱ్ఱికేకలేస్తూ తలుపు గడియతో తల పగులగొట్టుకుకొనే తన తల్లి తీరు గుర్తుకు రావటంతో ఆ ఆత్మహత్య యోచన ఆగిపోయింది.
చం.:
తలచెను తల్లి గూర్చి! ఫలితంబులనెంచుచు వేచి చూచె! ని
శ్చలముగ వ్రాయుచున్ కొలువు సాధనకై విధిగా పరీక్షలన్
నిలిచెను ధైర్యమొప్పనవనిన్ నగరంబున నేడు మాసముల్!
ఫలితము జాప్యమౌచు ప్రతిబంధకమయ్యెను కొల్వుపొందగన్ (6)
వివరణ:
తల్లి తపనను గురించి ఆలోచించాడు. ఉద్యోగం కోసం విధిగా పరీక్షలు వ్రాస్తూ ఫలితాల కోసం ఎదురుచూస్తూ నగరంలో ధైర్యంగా బ్రతికాడు. ఫలితాలు వెలువడడం ఆలస్యం కావడంతో ఉద్యోగం రావటం ఆలస్యమైంది. మరో ఏడు మాసాలు గడిచిపోయాయి.
ఆ.వె.:
అప్పుడచట నిల్చె అప్పునిచ్చిన శెట్టి
చదువలేదు నీవు చక్కగాను
గడిచెనేండ్లు రాదెకానగ కొలువేది
దొంగ డిగ్రియనియె దురుసుగాను (7)
వివరణ:
పల్లె నుంచి అతని వద్దకు అప్పు యిచ్చిన శెట్టి వచ్చాడు. నీది దొంగ డిగ్రి, దొంగచదువు. అందుకే ఇన్ని సంవత్సరాలు గడచినా నీకు ఉద్యోగం రాలేదు అని దురుసుగా మాట్లాడాడు.
ఆ.వె.:
చుట్టమొకడు వచ్చె మట్టిబుఱ్ఱని తిట్టె
నష్టజాతకుడనె నాల్క తిప్పి
తల్లి సొమ్మునంత తరగబెట్టితివంచు
తిట్టె పల్లెరైతు తేల్చి చెప్పి (8)
వివరణ:
మరొక బంధువు వచ్చి నీది మట్టిబుఱ్ఱ అని, నీవు నష్టజాతకుడివి అని, అందుకే నీకు ఉద్యోగం రాలేదు అని వెక్కిరించాడు. మరొక రైతు నీవు నీ తల్లి ఆస్తిని, డబ్బుని అంతా చదువు పేరుతో నాశనం చేశావు అంటూ అరిచాడు.
ఉ.:
ఉల్లము తల్లడిల్లె ఇక ఊరకె యుండుట తప్పు యంచు రైస్
మిల్లున కూలిగా కొలువు మేలని చేరె నిరాశ తోడ దుః
ఖిల్లుచు నుండె వారమునకే తగు లేఖ వచ్చె రం
జిల్లె! ఖరారు కొల్వనుచు చేరగ పంపిన లేఖ యద్దియౌ! (9)
వివరణ:
మనసు గాయపడింది. సహనం కోల్పోయి అతి చిన్న మిల్లులో కూలీగా చేరాడు దయానిధి. వారము దినములకే “ఉద్యోగం ఇచ్చేశాం. వచ్చి చేరండి” అంటూ మంచి సంస్థ వారు పంపిన నియామకపుటుత్తర్వు లేఖ అందుకున్నాడు.
ఆ.వె.:
కలిగె శుభమటు చిరు కాలవ్యవధితోన్!
వేచిచూడఁగలుగుఁ విజయమనుచు
నీ నిజంబునెఱిగె ఈ లోక మీ రీతి
ఈ దయానిధి కథ నిట్లు గాంచి!(10)
వివరణ:
ఆ విధంగా కేవలం కొద్ది కాలం తేడాతో కష్టాలు పోయి శుభాలు అదృష్టాలు లభించాయి. ఈ దయానిధి జీవితగాథ వలన.. ఓర్పుతో ఎదురుచూస్తే తప్పక విజయం లభిస్తుంది అనే సత్యం లోకానికి తేటతెల్లమయింది.
(సమాప్తం)
