Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిశ్చితార్థం

[శ్రీమతి యం. ధరిత్రీ దేవి రచించిన ‘నిశ్చితార్థం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ధ్యాహ్నం పనంతా అయ్యాక, పడక్కుర్చీలో తీరిగ్గా నడుంవాల్చి ఏదో పుస్తకం చదువుకుంటూ అందులో నిమగ్నమై ఉన్న శారదమ్మ ఏకాగ్రతను భంగపరుస్తూ బయట గేటు కిర్రుమంది. ఎవరా అనుకుంటూ పుస్తకం మూసి మెల్లిగా లేచి నిలుచుంది. ఈ లోగానే తూనీగలాగా లోపల నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు ముందు ప్రత్యక్షమైంది ప్రసూన. బయటికి వచ్చేసరికి, ఇద్దరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ వస్తూ కనిపించారామెకు. శారదమ్మను చూడగానే,

“నమస్తే ఆంటీ,” అంటూ వినయంగా నమస్కరించింది ఆ అమ్మాయి.

“రామ్మా పావనీ, బాగున్నావా”

“బాగున్నానాంటీ, వచ్చే ఆదివారం నా పుట్టినరోజు. ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు నాన్న. అందుకే ప్రసూనను పిలుద్దామని వచ్చానాంటీ..”

“అలాగా, చాలా సంతోషమమ్మా..” అంటూ లోనికి ఆహ్వానించింది శారదమ్మ. కాసేపు కూర్చున్న పావని,

“వెళ్ళొస్తానాంటీ, ఇంకా కొందరు ఫ్రెండ్స్ ను పిలవాలి, ప్రసూనను తప్పకుండా పంపించండి ఆంటీ, ఏయ్ ప్రసూ, తప్పకుండా రావాలి..” అంటూ సెలవు తీసుకుంది.

పావని ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ప్రసూనతో కలిసి ఇంటికి వచ్చింది. కలవారింటి అమ్మాయి అయినా ఎంతో సామాన్యంగా అలంకరించుకుంటూ, అణకువతో ఉండే పావని అంటే శారదమ్మకు ప్రత్యేక అభిమానం.

శారదమ్మ ఓ ప్రైవేటు స్కూల్లో టీచరుగా ఉద్యోగం చేసి, సంవత్సరం క్రితమే రిటైర్ అయింది. కొడుకు ప్రభాకర్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఇంజనీరుగా చేరిపోయాడు. చిన్న వయసులోనే భర్త గతించినా, ధైర్యంగా నిలబడి పిల్లలిద్దర్నీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ కష్టపడిన ఆమె జీవితం ఇప్పుడిప్పుడే ఓ గాడిన పడింది. ప్రస్తుతం కూతురు ప్రసూన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

పావనిని గేటుదాకా సాగనంపి లోపలికి వచ్చిన ప్రసూన,

“అమ్మా, పావని చాలా బాగుంటుంది కదా..”

అంది.

“ఆ..”

“చాలా మంచిది కూడాను..”

“ఊ..”

“లక్షాధికారి బిడ్డయినా అహం అన్నది ఏమాత్రం లేదు..”

“ఆ..”

“ఏమిటమ్మా, అన్నింటికీ ఊ..ఊ అంటావు తప్ప మాట్లాడవు..”

“మరేమనాలే..”

కూతురి మాటలకు నవ్వుతూ నెత్తిమీద ఒకటిచ్చింది శారదమ్మ.

“అది కాదమ్మా, పావనిపై నీ అభిప్రాయం చెప్పు…”

సూటిగా అడిగేసింది ప్రసూన. ఒక్కక్షణం అవాక్కైనా.. వెంటనే తేరుకున్న శారదమ్మ,

“చెప్పేదేముందే, చూడచక్కని పిల్ల, ఏ ఇంట కాలుపెట్టినా, ఆ ఇల్లు పావనమే అవుతుంది..”

“ఆ ఇల్లు మనదే ఎందుకు కాకూడదు?”

తల్లి మొహం చూడకుండా పక్క చూపులు చూస్తూ సందేహిస్తూనే మెల్లిగా అడిగేసింది ప్రసూన.

“ప్రసూనా,!’

ఆశ్చర్యంతో ఇంకా చెప్పాలంటే కోపంతో కూతురి కేసి చూసింది శారదమ్మ.

“మనకు కాని వాటి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు ప్రసూనా. వాళ్లేమో లక్షాధికారులు. మన సంగతి తెలిసీ అలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తున్నాయి? పిచ్చి కాకపోతే..”

“అమ్మ వాళ్ళ నాన్నగారు అలాంటివారు కాదమ్మా. నాతో ఎంత చక్కగా మాట్లాడుతారో తెలుసా..! నేనంటే ఎంతో అభిమానం కూడాను..”

“చిన్నదానివి, నీకు లోకజ్ఞానం అన్నది ఇంకా తెలియడం లేదు. నీతో బాగా మాట్లాడినంత మాత్రాన అలా ఊహించుకుంటే ఎలా! కొందరికి అందరితో మంచిగా మాట్లాడే అలవాటు ఉంటుంది. బంధుత్వం కలుపుకోవడానికనేసరికి వాళ్ల ధోరణి వెంటనే మారిపోతుంది. అది నీకు ఇప్పుడే అర్థం కాదులే.”

“వాళ్లు అలాంటి వాళ్లు కాదమ్మా..”

“అందుకే నిన్ను పిచ్చిపిల్ల అంటున్నాను. సంబంధం కలుపుకోవడానికి మంచితనం చాలని అనుకుంటున్నావా! వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జీలు ఉండాలంటారు..”

“అది కాదమ్మా..”

అనుభవంతో పండిపోయిన శారదమ్మ, “ఇక చాలు, అవతలికి వెళ్ళు..” అంటూ మరో మాటకవకాశం ఇవ్వకుండా లోపలికెళ్ళిపోయింది.

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్తను కోల్పోయిన శారదమ్మ, ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది.మనుషుల మనస్తత్వాల్ని బాగా ఆకళింపు చేసుకుంది కూడా. కూతురి మాటలకు,తన అమాయకత్వానికి లోలోపలే నవ్వుకుంటూ మళ్లీ పుస్తకం అందుకుని మంచం మీద వాలిపోయింది.

***

“హలో శారదా, నేను ఈశ్వరి..”

ఉదయం ప్రసూన కాలేజీకి, ప్రభాకర్ ఆఫీసుకూ వెళ్లాక టిఫిన్ తినేసి తీరిగ్గా కూర్చున్న శారద ఫోన్లో తన ఒకప్పటి కొలీగ్ ఈశ్వరి కంఠం ఇట్టే గుర్తుపట్టేసింది.

“ఓ ఈశ్వరీ, ఎలా ఉన్నావ్! చాలా రోజులకు గుర్తొచ్చాను ఏంటి విశేషం!..” సంతోషంగా పలకరించింది శారద.

కుశలప్రశ్నల తర్వాత, “శారదా, ఓ విషయం అడగాలని చేశా. మీ అబ్బాయి జాబ్‌లో చేరాడని చెప్పావు ఆ మధ్య కలిసినప్పుడు. పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నావా?”

“ఇంకా లేదు ఈశ్వరీ, సంవత్సరమే కదా అయింది ఉద్యోగంలో చేరి.. తొందరేముంది. వాడూ కాస్త కుదురుకోవాలి కదా.. అదే కాక ముందు ప్రసూనకు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నాము..”

“మంచి సంబంధం వస్తే ఆలస్యం చేయకుండా చేసేయడం మంచిది కదా శారదా.. ప్రసూన డిగ్రీ పూర్తయాక చూడొచ్చు.. ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాగా తెలిసిన ఓ కుటుంబం. వాళ్ళ అమ్మాయి పీజీ చేస్తోంది. ఒక్కతే కూతురు. పరవాలేదు స్థితిపరులే. మంచి సంబంధం ఉంటే చెప్పమని ఈమధ్యే నాకు చెప్పారు.మీ అబ్బాయి ప్రభాకర్ గుర్తొచ్చాడు నాకు. ఆలోచించు శారదా. అమ్మాయి కూడా బాగుంటుంది. టైం తీసుకో. ఆలోచించుకొని ఏ సంగతీ చెప్పు. అన్నట్టు మరో మాట, ఆస్తులు బాగా ఉన్నాయి. కట్నకానుకలకు లోటన్నది ఉండదు..”

శారద వినసాగింది మౌనంగా.

“..పిల్లల చదువుల కోసం అప్పులు చాలానే చేశావు. అవన్నీ తీరే అవకాశం కూడా ఉంటుంది. ప్రభాకర్‌తో కూడా మాట్లాడు..”

ఫోన్ పెట్టేసింది ఈశ్వరి. శారద ఆలోచనలో పడిపోయింది. ఉద్యోగం వచ్చాక రెండు మూడు సంబంధాలు వచ్చాయి కొడుక్కి. వాడేమో అప్పుడే వద్దమ్మా కొన్నాళ్ళు జరగనీ అనేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఈశ్వరి..!

పిల్లల చిన్నతనం నుండీ కుటుంబం జరుగుబాటుకీ, వాళ్ల చదువులకూ తను చేసే ప్రైవేటు స్కూలు టీచర్ ఉద్యోగంతో వచ్చే జీతం ఏ మూలకూ సరిపోక అప్పులు చాలానే చేయాల్సి వచ్చింది శారదమ్మకు. అవన్నీ ఇప్పుడు వడ్డీతో సహా పేరుకుపోయాయి. ప్రభాకర్ తన జీతంతో ఎంతని తీర్చగలడు! అలాగని వచ్చే కోడలి కట్నంతో తీర్చడం భావ్యమా! ఆమె స్వభావానికి అది విరుద్ధమే. కానీ, తన ముందున్న సమస్య.. ఏం చేయాలని! ఒక్కోసారి పరిస్థితులు మనిషి ఆదర్శాలకు అడ్డుకట్టలు వేస్తూ ఉంటాయి. దాంతో ఈశ్వరి చెప్పిన సంబంధం గురించి ఆలోచనలు మళ్లాయి శారదమ్మకు.. అయినా ప్రభాకర్‌తో కూడా మాట్లాడాలి.. అనుకుంటూ అప్పటికి ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

***

“అమ్మా, ఎల్లుండి ఆదివారం పావని బర్త్ డే. తెలుసు కదా. సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది, నేను వెళ్ళాలి.”

ఉదయం కాఫీ తాగుతూ తల్లితో చెప్పింది ప్రసూన.

“..ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వో వెయ్యి, అన్నయ్య ఓ వెయ్యి అలా ఇచ్చేయండి మరి..”

“అబ్బో! అంత ఖరీదైన ఫ్రెండా ఏంటి!” కాఫీ తాగడం పూర్తి చేసి రూమ్‌లో నుండి బయటకు వచ్చాడు ప్రభాకర్.

“అవును మరి! ఖరీదైన ఫ్రెండే కాదు, చాలా విలువైన ఫ్రెండ్ కూడా.. అన్నట్లు నీక్కూడా తెలుసు, చూశావు కూడా..”

అవునా అన్నట్లు చూశాడు ప్రభాకర్.

“నన్ను కాలేజీ దగ్గర బైక్ మీద నువ్వు డ్రాప్ చేసేటప్పుడు, ఒక్కోసారి కారులో నుండి దిగుతూ వస్తుంటుందే ఆ అమ్మాయే. అప్పుడప్పుడూ వాళ్ల నాన్నగారు కూడా తనతో వస్తుంటారు..”

ప్రసూన మాటలతో గుర్తు చేసుకున్నాడు ప్రభాకర్. బాగా ఉన్నవాళ్ల అమ్మాయిలా ఉందే అనుకున్నాడు కూడా మొదటిసారి చూసినప్పుడు. కలిగినింటి పిల్ల అయినా, ఎంతో సింపుల్ గా పొడుగాటి జడతో, చక్కటి చిరునవ్వుతో కారు దిగి నడిచి వస్తున్న ఆ అమ్మాయి కళ్ళ ముందు కదలాడింది ప్రభాకర్‌కు. రెండు మూడుసార్లే చూశాడు. చూసినప్పుడల్లా, ‘ఎంత అందంగా ఉంది’ అనుకోకుండా ఉండలేకపోయేవాడు. కానీ, ఆమె స్థాయి ఊహించుకొని అంతకన్నా అతని ఆలోచనలు ముందుకెళ్లడానికి మొరాయించాయి.

“ఆ ఆ, గుర్తుందిలే. ఇంతకీ గిఫ్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు?”

తనలోని ఆలోచనలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ చెల్లిని అడిగాడు ప్రభాకర్.

“ఇంకా ఏమీ అనుకోలేదులే, డబ్బులు ఇవ్వండి మరి నాకు..” నవ్వుతూ డిమాండ్ చేసింది ప్రసూన.

“సరే సరే అలాగే..”

నవ్వుతూ అన్నారు ఇద్దరూ ఒక్కసారిగా. ఆ తర్వాత మెల్లిగా ఈశ్వరి చెప్పిన సంబంధం గురించి కొడుకుతో మాట్లాడటానికి ఉపక్రమించింది శారదమ్మ. చిన్నప్పటినుండీ తల్లిని చూస్తూ పెరిగిన ప్రభాకర్‌కు సర్దుబాటు ధోరణి బాగానే అలవడింది. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని, అప్పటికి చూద్దాంలే అంటూ తన సమ్మతి తెలిపాడు. వీలు చూసుకుని ఈశ్వరికి ఫోన్ చేయాలనుకుంది శారదమ్మ.

***

మరోవారం ఇట్టే గడిచిపోయింది. ప్రసూనకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర్లోకొచ్చేశాయి. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అలా ఉండగా ఓ రోజు సాయంత్రం..ఇంటిముందు కారాగింది. ఎవరబ్బా అనుకుంటూ ప్రసూన బయటికొచ్చింది. కారు దిగి పావని వాళ్ళ నాన్న రంగనాథంగారు వస్తూ కనిపించారు. సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయిన ప్రసూన, ఆయనేంటి.. మా ఇంటికి రావడం ఏంటని సందేహిస్తూనే ఎదురెళ్లి,

“అంకుల్ మీరా, రండి రండి..” అంటూ ఆహ్వానించింది.

“అమ్మా ప్రసూనా, తొందరగానే కనుక్కోగలిగాను మీ ఇల్లు.. పావని గుర్తులు చెప్పింది లే..” అంటూ ప్రసూనతో పాటు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నారాయన. వంటింట్లో పనిలో ఉన్న శారదమ్మ ఆశ్చర్యం నుంచి తేరుకుని వచ్చి నమస్కరించింది ఆయనకు. వాళ్ల మనోభావాల్ని పసిగట్టిన ఆయన,

“నేనెందుకొచ్చానని అనుకుంటూ ఉంటారు.. చెప్తానమ్మా, మా పావని మీ అమ్మాయి ప్రసూన బెస్ట్ ఫ్రెండ్. మీ గురించి చెప్పింది..”

“…………”

“..గత కొంతకాలంగా ప్రసూనను చూస్తున్నాను. ఆ విధంగా మీ కుటుంబం గురించి తెలుసుకోగలిగాను..”

ఆయన ఉపోద్ఘాతం వింటుంటే ప్రసూనకు ఏం చెప్పబోతున్నాడో చూచాయగా ఏదో తట్టింది, కానీ శారదమ్మకైతే ఏమీ పాలుబోవడంలేదు. పెద్దాయన.. పైగా తమ కంటే ఎంతో స్థితిపరుడు.. ఏ అంచనాకు రాలేక మౌనంగా వింటూ కూర్చుండిపోయింది.

“..సరేమ్మా, విషయంలోకి వస్తాను. భేషజాలకు పోయే మనస్తత్వం కాదు నాది. కష్టాలు పడి పైకి వచ్చిన వాణ్ణి. నా సంపాదనంతా స్వార్జితమే. పావని నా ఒక్కగానొక్క కూతురు. ఆస్తిపాస్తులెంత ఉన్నా ఆడపిల్ల జీవితం.. అదీ.. పెళ్లి తర్వాత ఎలా ఉంటుందన్న ఆందోళన కన్నవాళ్లకు ఉండడం సహజం. మీరు కష్టసుఖాలు ఎరిగినవాళ్లు. మీతో సంబంధం కలుపుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈరోజు మీ వద్దకు వచ్చానమ్మా..”

ఊపిరి బిగబట్టుకొని వింటున్నారు తల్లీకూతుళ్లు ఇద్దరూ.

“…ఏ మధ్యవర్తుల ద్వారానో సంప్రదించవచ్చు. కానీ స్వయంగా నేను రావడం సబబుగా తోచింది నాకు..”

ఒక్క క్షణం గుండెలయ తప్పింది శారదమ్మకు. ప్రసూన హృదయం ఆనందంతో గంతులు వేయడం మొదలెట్టింది.

“..మీ అబ్బాయిని కాలేజీ దగ్గర రెండు మూడు సార్లు చూశాను. పావని అభిప్రాయం కనుక్కున్నాను నేను. మీకూ సమ్మతమైతే మీ అబ్బాయితో మాట్లాడండి. ఇలా సడన్‌గా వచ్చి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టానో ఏమో.. అన్యథా భావించకండమ్మా.. మీరు బాగా ఆలోచించుకోండి.. నిదానంగానే మీ నిర్ణయం చెప్పండి. అది ఎలాంటిదైనా పరవాలేదు. మరిక ఉంటానమ్మా..”

నమస్కరిస్తూ లేచి నిలబడ్డారాయన. శారదమ్మకు నోట మాట రాలేదు. చేతులు జోడించి లేచి నిలబడింది. వెళ్ళొస్తానన్నట్లు ప్రసూనవైపు చూసి, బయటికి నడిచారాయన.

***

ఆ క్షణం నుండీ శారదమ్మ మనసు మనసులో లేదు. ఇప్పుడేమిటి పరిస్థితి! రెండు సంబంధాలు!! దేనికి ఔననాలి! దేన్ని వద్దనుకోవాలి? ఒకటి చూస్తే.. పరవాలేదు.. తమకంటే కాస్త ఉన్నవాళ్లయినా, తమ స్థాయికి సరిపోయే వారే.. మరొకటేమో, తమకు అందనంత ఎత్తులో ఉండే స్థాయి! ఏ మాత్రం ఊహించని విధంగా ఎదురుగా వచ్చి నిలబడింది. ఎటూ తేల్చుకోలేక పిల్లలిద్దరి ముందుంచింది శారదమ్మ. వినగానే.. ప్రభాకర్ మనసు అంతెత్తున ఉప్పొంగి గాల్లో తేలిపోసాగింది. తన ఊహల్లోకి అలా వచ్చి,అంతలోనే చటుక్కున మాయమైపోయిన స్వప్నసుందరి! ఇప్పుడు తన చెంతనే..! తనంత తానే వస్తానంటూ పిలుపు!!

అన్నవాలకం చూసిన ప్రసూన తల్లికి సైగ చేసింది చూడమన్నట్టు.. విషయం బోధపడ్డ శారదమ్మ మళ్లీ ఆలోచనలో పడిపోయి, తన సందేహాల్ని, భయాల్ని ఏకరువు పెట్టింది వాళ్ళతో. అంతటి స్థితిపరులు మనల్ని ఎలా చూస్తారు! చిన్నచూపు చూడరు కదా! తమకేమో ఆత్మాభిమానమెక్కువ. అవన్నీ తేరిగ్గా తీసిపారేసింది ప్రసూన,

“అమ్మా, వాళ్లు అలాంటి వాళ్లు కాదు.అలా అయితే తన స్థాయి మరిచి, స్వయానా పావని నాన్నగారే మన ఇంటికి వస్తారా..!” అంటూ.

ప్రభాకర్ కూడా పావని వైపే మొగ్గు చూపడంతో శారదమ్మ స్థిమితపడింది. ఆ వెంటనే ఈశ్వరికి ఎలా నచ్చజెప్పాలా అన్న ఆలోచనలోనూ పడిపోయింది.

***

పావని, ప్రసూనలకు ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి పెట్టుకుందామని ఇరువైపులా మాట్లాడుకున్నారు. ఈలోగా అప్పటికి నిశ్చితార్థం అనుకుని, అంతా ఆనందడోలికల్లో ఊగుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఏర్పాట్లలో మునిగిపోయారు.

అంతా అనుకున్నట్లుగా జరిగితే సంతోషానికి కొదవేముంటుంటుంది! నిశ్చితార్థం మరో వారం రోజుల్లో ఉందనగా పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవుతాయన్న నానుడి అక్షరాలా రంగనాథంగారి విషయంలో జరిగిపోయింది. ఊహించని రీతిలో ఆయన వ్యాపారం దెబ్బతినింది. అంతవరకు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోతున్న వ్యాపారం ఆయన మంచితనం, ఔదార్యం ఆసరాగా తీసుకుని ఎంతోకాలంగా నమ్మకంగా ఉన్న ఇద్దరు భాగస్థులూ నష్టాల్ని చూపించి, ఆయన్ని నిలువునా ముంచేశారు. అప్పులన్నీ ఆయన మీద నెట్టేసి, వాళ్లు మాత్రం జారుకున్నారు. జరిగిన మోసం, నమ్మకద్రోహం గ్రహించినా, ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ మరో దారి లేక మిగిలిఉన్న ఆస్తులన్నీ అమ్మి అప్పులన్నీ తీర్చేసి కట్టుబట్టలతో కుటుంబంతో అద్దె ఇంట్లోకి మారిపోయారు రంగనాథంగారు. ఊహించని ఈ పరిణామానికి ఆయన భార్య విశాలాక్షి తల్లడిల్లిపోయి మంచం పట్టింది. పావని అయోమయంలో అచేతనంగా మారిపోయింది. రంగనాధంగారు ఎలాగోలా గుండె దిటవుపరుచుకున్నాడు గానీ.. ఆయన దిగులంతా కూతురి గురించే! కుదిరిన సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనన్న ఆందోళనతో కృంగిపోసాగారు.

***

“ఏమిటి శారదా, ఇలా జరిగిపోయింది! ఎన్ని ఆశలు పెట్టుకున్నావు ఈ సంబంధం మీద..! ఇంకా నయం.. నిశ్చితార్థం అయ్యాక ఇలా జరగలేదు. అయినా, అయిపోయిఉన్నా పరవాలేదనుకో. అదేమీ పెళ్లి కాదు కదా! మీకు మంచే జరిగిందిలే సరే, ఇక అదంతా పక్కనపెట్టి, నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించు. వాళ్లకు నేను ఇంకా ఏ సంగతీ చెప్పలేదు కూడా..”

విషయం తెలుసుకున్న ఈశ్వరి కొద్దిరోజులాగి శారదమ్మ ఇంటికి వచ్చి మెల్లిగా మొదలెట్టింది. వంటింట్లో కాఫీ కలుపుతున్న ప్రసూన ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి నిటారుగా అయిపోయింది.

“..అయినా శారదా, నీ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా..! ప్రభాకర్ చదువు కోసం ఎంత కష్టపడ్డావు! వాడిని ఇంజనీర్ చేయడానికి అప్పులు కూడా చేశావు. ఎక్కడెక్కడికో పంపించి చదివించావు. ఇంకా నువ్వు కూతురు పెళ్లి కూడా చేయాల్సివుంది. కట్నకానుకలు ఇవ్వాలి కదా. నువ్వు తీసుకుంటేనే కదా అదంతా జరిగేది..! అందరూ కట్నాలు ఆశించని ఆదర్శవాదులే ఉండరు కదా..! అయినా..అది సంప్రదాయమేగానీ తప్పేమీ కాదు..”

శారదమ్మకు గతమంతా మెదిలింది ఓసారి. భర్త అకాలమరణంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న తనను ఆదుకోవాలని ఎవరికీ అనిపించలేదు. పైగా, పలకరిస్తే ఏ బాధ్యతలు తమను చుట్టుకుంటాయో అన్న సంకోచంతో దూరంగా ఉండిపోయారు మరికొందరు. అదంతా తలుచుకునేకొద్దీ పరిపరివిధాల ఆలోచనలు చోటు చేసుకోవడం మొదలైంది ఆమెలో. అవేవీ పైకి చెప్పుకోలేక, మౌనంగా తలదించుకుని వింటూ కూర్చుండిపోయింది. ఈశ్వరి చెప్తున్నది కూడా సబబుగానే ఉంది కదా! ఓ స్నేహితురాలిగా ఆమె మాటల్ని తీసివేయలేకపోతోంది, అలా చెప్పడంలో తన స్వార్థం ఏమీ లేదు గనుక.. పైగా వాస్తవం కూడాను. ఈశ్వరి అలా ఇంకా ఏదేదో మాట్లాడుతూనే ఉంది శారదమ్మతో.

నిజమే, ఆదర్శాలు మన సమస్యలు తీర్చలేవు గదా!ఆమె ఆలోచనలు మెల్లిగా మరో కోణంలోకి మళ్లడానికి ఎంతోసేపు పట్టలేదు. మరి కాసేపయ్యాక,

“..సరే శారదా, నేను చెప్పిందాని గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో, వస్తా మరి..” అంటూ లేచింది ఈశ్వరి.

ఆమె గేటు దాటి అలా వెళ్లడం, ప్రభాకర్ ఆఫీసు నుంచి రావడం ఒకేసారి జరిగాయి. లోపలికి వచ్చిన ప్రభాకర్ ఈశ్వరి ఆంటీ రాకకు కారణం అన్వేషిస్తూ ఆలోచనలో పడ్డాడు. పావుగంట తర్వాత ప్రభాకర్‌కు కూడా కాఫీ అందించి, తనూ కూర్చుంది ప్రసూన. కానీ గంభీరంగా ఉన్న తల్లిని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నతో విషయం ఎలా ప్రస్తావించాలో తెలీక మౌనం దాల్చింది. కానీ ఆ పిల్ల మనసంతా కకావికలమైపోయింది. తల్లీ, చెల్లీ ఉన్న తీరు చూసి ఏదో జరిగిందని అర్థమయిపోయింది ప్రభాకర్‌కు. ఈశ్వరి ఆంటీ రాకలోని ఆంతర్యం చూచాయగా స్ఫురించింది అతనికి.

“అమ్మా..”,

కాసేపటి తర్వాత దేవుడి ముందు దీపం పెడుతున్న తల్లిని గొంతు పెగుల్చుకుని పిలిచింది ప్రసూన.

“..అన్నయ్య పెళ్లి..!”

“జరుగుతుంది..”

 స్థిరంగా చెప్పి గదిలోకి వెళ్లిపోయింది శారదమ్మ. ప్రసూనకంతా అయోమయంగా అనిపించింది. స్పష్టత లేని ఆ జవాబు ఆమెను ఇరకాటంలో పడేసింది. తల్లిని అంత గంభీరంగా ఎన్నడూ చూడలేదు. ఏదైనా సరే, సందేహించకుండా టకటకా తల్లితో మాట్లాడేది. కానీ ఇప్పుడు ఆమె మొహం చూడాలంటేనే సంకోచిస్తోంది. వెళ్లి ప్రభాకర్ ముందు కూర్చుంది. అతని పరిస్థితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. ఒకవేళ తల్లి పావని సంబంధం వద్దనుకుంటే! తను ఏం చేయాలి!? చిన్నతనం నుండీ తమ కోసం తల్లి ఎంత కష్టపడిందీ, నాన్న లేని లోటు తెలియకుండా తననీ, చెల్లినీ ఎలా పెంచిందో అంతా మదిలో ఒకసారి మెదిలింది. దిక్కుతోచని స్థితిలో తల పట్టుకుని కూర్చున్నాడు.. ఆ రాత్రి అంతా జాగరణే అయింది ప్రభాకర్‌కు.

***

మరుసటి రోజు ఉదయం తొమ్మిది దాటింది. ప్రభాకర్ ఆఫీసుకు రెడీ అవుతున్నాడు. ప్రసూన బుక్స్ పట్టుకుని గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఇంట్లో ముగ్గురూ ముభావంగా ఉండటంతో మౌనం రాజ్యమేలుతోంది. తన సుఖం,సంతోషం తల్లి తర్వాతే అనుకున్న ప్రభాకర్ ఆమె నిర్ణయం ఏదైనా తలఒగ్గక తప్పదన్నట్లు ఉన్నాడు. మరోవైపు మనసంతా పావని నిండిపోయి ఉంది. ప్రసూన పుస్తకంలోకి తల దూర్చింది కానీ, అక్షరం ముక్క బుర్రలోకి ఎక్కడం లేదు. ఇంతలో ఫోన్ మోగింది.

“హలో ఈశ్వరి..”

ఇద్దరూ ఠక్కున తలెత్తారు.

“శారదా, రాత్రి అమ్మాయి పేరెంట్స్ ఫోన్ చేశారు. ఇది మూడోసారి చేయడం. ఏం చెప్పను! ప్రభాకర్‌తో మాట్లాడావా? ఏం నిర్ణయించుకున్నారు? వాళ్లేమో చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పేస్తే బాగుంటుంది కదా, వాళ్లు ఆశలు పెట్టుకోకుండా.. ఆడపిల్ల గల వాళ్లు మరి..”

“నిజమే ఈశ్వరీ, నేనూ అదే అనుకుంటున్నా.. ఈరోజు నేనే నీకు ఫోన్ చేయాలని అనుకున్నా కూడా..”

“…………….”

“..ప్రభాకర్ నిశ్చితార్థం ముందు అనుకున్న రోజే జరుగుతుంది..”

“…………..”

“…అదే సంబంధం, పావనితోనే. మార్పేమీ లేదు. వాళ్లకు నేను మాటిచ్చాను ఈశ్వరీ.. మాట తప్పలేను. నేనూ ఓ ఆడపిల్ల తల్లినేగా..! వాళ్ళతో చెప్పేయ్. మరోలా అనుకోకు.. ప్లీజ్”

ఆ తర్వాతి మాటలేవీ వినలేదు ప్రభాకర్, ప్రసూనలు. పట్టలేని సంతోషంతో పరుగున వచ్చి తల్లిని ఒక్కసారిగా వాటేసుకుంది ప్రసూన. ప్రభాకర్ కళ్ళు మెరిశాయి. ఒక్కసారిగా కొండంత భారం తల మీద నుంచి దిగిపోయిన భావన అతనిలో! కూతురి చేతులు ఆప్యాయంగా తనకేసి అదుముకుంటూ,

“పిచ్చిపిల్లా, వాళ్ళ సంపద పోగానే నేను మారిపోతాననుకున్నావా! నేను ఇష్టపడింది ఆ పిల్ల ఆస్తులు కాదు, ఆ చక్కటి స్వభావం. అలాగే ఆమె తండ్రి గొప్ప మనసు! ఏ భేషజం లేకుండా మన ఇంటికి వచ్చి మాట్లాడాడు చూడు.. ఆ ఉన్నత వ్యక్తిత్వం! నాకు కావలసింది నా పిల్లల సంతోషం. మీ అన్న ఇష్టపడ్డ అమ్మాయిని కాదని వాడిని ఎలా బాధపెట్టగలను!..”

తల్లి వైపు ఆర్ద్రంగా చూశారిద్దరూ.

“..ఈశ్వరిని తప్పు పట్టలేను. ఆమె నా కోణంలో ఆలోచించి చెప్పింది. అందులో కాస్తో కూస్తో వాస్తవం ఉన్నా, పావని స్థానంలో నిన్ను కాసేపు ఉహించుకోగానే నా కర్తవ్యం నాకు బోధపడింది. ఆశాశ్వతమైన సిరిసంపదలు కాదు మనుషుల్లోని మంచితనం, అంతకుమించిన విలువలు ముఖ్యం. ఇచ్చింది మాటే కదా అని తేలిగ్గా తీసుకోలేకపోయాను. మీ అన్న ఉద్యోగస్తుడయ్యాడు. నీ పెళ్లికీ మార్గం దొరక్కపోదు. అప్పులదేముంది.. తీరిపోతాయి. కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామంటే ఆ బాధ వెన్నాడుతూనే ఉంటుంది జీవితాంతం. మన స్థితిగతులు ఆలోచించేకొద్దీ నా మనసు కాస్త ఈశ్వరి ఆంటీ వైపు మొగ్గిన మాటయితే వాస్తవమే. కానీ, మనసుకు విరుద్ధంగా ప్రవర్తించడం తగదని అంతరాత్మ ఎదురు తిరిగింది..”

ప్రభాకర్ సంతోషంతో తల్లిని సమీపించాడు. కాలం మారినా, పరిస్థితులు తారుమారైనా మారని మనసుతో, చెదిరిపోని నిర్ణయంతో చెక్కుచెదరక నిలిచిన తల్లి వ్యక్తిత్వానికి మనసులోనే జోహార్లు అర్పించాడు. తల్లిని మించిన పెద్ద మనసుతో తన స్నేహితురాలి పట్ల చెల్లెలు చూపిన ప్రేమకు విచలితుడై ప్రసూనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు.

పిల్లలిద్దరినీ చూస్తూ, “పదండి, ముందు అన్నయ్యగారికి.. అదే, పావని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాలి, నిశ్చితార్థానికి సిద్ధంకమ్మని. బాగా టెన్షన్‌లో ఉండి ఉంటారు..”

“ఆ తర్వాత కళ్యాణవైభోగమే..పిపిప్పీ..డుండుం డుం..” ప్రభాకర్‌ను చూస్తూ ఆటపట్టించింది ప్రసూన.

“అది సరే, ఫ్రెండ్ మీద ప్రేమ ఇలాగే ఉంటుందా, లేక.. వదిన అయ్యాక ఆడబిడ్డ పెత్తనం లాంటివి ఏవైనా చలాయిస్తావా..!?” నవ్వుతూ చెల్లిని ఉడికించాడు ప్రభాకర్.

ఇద్దరినీ మురిపెంగా చూస్తూ ఫోన్ అందుకుంది శారదమ్మ.

Exit mobile version