Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిశీధ దర్పణం

[మైత్రేయగీతిక గారు రచించిన ‘నిశీధ దర్పణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

వెలుతురు లేని ఆ నిశిరాత్రిలో కాకినాడ నుంచి సమీపంలోని ఒక చిన్న పల్లె వైపు వెళ్ళే రహదారి పొగమంచుతో కప్పుకుపోయింది. మధ్య రాత్రివేళలో రోడ్డు పక్కన పంట పొలాల మధ్య తక్కువ వెలుగుతో మెరిసే పాత ఇల్లు ఒకటి కనిపించింది. ఆ ఇంటి గోడలపై పెరిగిన పచ్చిక, తలుపులపై పట్టిన తుప్పు, కిటికీలకి చిట్లిన అద్దాలు.. వీటన్నిటిని చూసిన వారికీ అక్కడ ఆ ఇంట్లో ఏదో వింత ఉందనిపించక మానదు. మంచుతో గడ్డకట్టే వాతావరణంలో రాత్రి వేళలో ఆ ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను చూస్తే భయం కలిగిస్తాయి.

ఆ ఇంటి పేరు ‘వీరేశలింగం వాసం’ అని పల్లెలో ఇప్పటికీ భయంతో ఉచ్ఛరిస్తారు.

అది ఒకప్పుడు ఓ జమీందారు గారి గృహం. అప్పట్లో ఆయన తరం మొత్తం అక్కడే నివసించింది. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం, నలభై ఏళ్ల క్రితం ఒక రాత్రి, ఆ కుటుంబం మొత్తం అనూహ్యంగా హత్యకు గురైందని చెబుతారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. అప్పటి నుంచి ఆ ఇల్లు మూసి వేసారు. ఇంతవరకు ఆ ఇంటి లోపలకి ఎవరూ అడుగుపెట్టలేదు అంటే అతిశయోక్తి కాదు.

అయితే, నలుగురు కాలేజీ విద్యార్థులు అయిన రాజు, సుధీర్, పూర్ణ, శిల్ప.. తమకు భయమనేది ఏదీ లేదని నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ ఇంట్లో ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు.

ఆ నలుగురు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళ..

“ఏరా.. ఈ తలుపు ఎప్పుడో గట్టి బోల్టులు వేసి మూసేశారు,” అన్నాడు రాజు.

సుధీర్ గట్టిగా నెడుతూ, తుప్పుపట్టిన గేటు తెరిచాడు. వెంటనే లోపల నుండి ఒక అరుపు లాంటి చప్పుళ్లు వచ్చాయి. లోపలికి అడుగు పెట్టగానే వింత చలికమ్మేసింది నలుగురిని.

ఇంటి ప్రాంగణంలో ఒక పెద్ద కళ్లు లేని విగ్రహం ఉంది. దాని ముఖం అద్దంలా చిట్లిపోయి ఉంది.

“ఇదేంటి బాబూ? మనం వచ్చిన ప్రదేశం నుండి వేరే ఊరికి వచ్చేశామేమో అనిపిస్తోంది. ఈ వాతావరణం విచిత్రంగా మారిపోయింది.” అని అంటూ శిల్ప మెల్లగా శ్వాస తీసుకుంది.

“ఓయ్, అమ్మాయ్, ఇవన్నీ పిచ్చి గాసిప్స్. దెయ్యమో, భూతమో ఉందంటావా ఏంటి? ఇవన్నీ మనిషి భయాలే,” అన్నాడు పూర్ణ.

వాళ్లు లాంతర్లు వెలిగించి లోపలికి అడుగుపెట్టారు.

వారు హాలులోకి అడుగు పెట్టగానే.. వంకర చూపులతో వారినే చూస్తున్నట్టుగా గోడలపై పాత చిత్రాలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద అద్దం కట్టారు.. దానిపైన దుమ్ము పేరుకుపోయింది. వెంటనే సుధీర్ అద్దంను తుడిచాడు.

కానీ అలా అతడు తుడిచిన క్షణంలో..

ఆ అద్దంలో కనిపించింది వారు నలుగురు మాత్రమే కాదు. ఆ నలుగురి వెనక నిలబడి ఉన్న ఐదో నీడ స్పష్టంగా కనిపించింది.

“ఒరేయ్, అటు చూడండి రా.. ఎవరో మన వెనకాలున్నారురా?” అని రాజు అరవగా వెనక్కి తిరిగారు. ఎవ్వరూ లేరు.

శిల్ప ముఖం భయంతో చెమటలు పట్టి చల్లగా మారింది. “మనల్ని ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది.” అని గోల చేసింది శిల్ప.

అంతలో గాలి వీచి, ఒక పాత తలుపు క్రమంగా తెరుచుకుంది. లోపల అంతా చీకటే. వాళ్లు లోపలకి వెళ్లగా, గదిలో పాత కుర్చీ, గోడలపై ఎరుపు మరకలు, నేలపై పగిలిన బొమ్మల తలలు ఉన్నాయి.

ఒక మూలన పెద్ద దర్పణం ఉంది.

దాని చుట్టూ ఎండిపోయిన నల్లని పూలమాల అలంకరించబడి ఉంది.

“ఇదేనా ఆ ‘నిశీధ దర్పణం’? మనం విన్నది దీని గురించే కదా?” అన్నాడు పూర్ణ.

“అవును.. రాత్రి 12 గంటలు దాటాక ఎవరైనా దీనిని చూస్తే, తమ అసలు ముఖం అద్దంలో కనిపించదని చెబుతారు. తమ ముఖంలో మరణించిన ఆత్మల రూపం కనిపిస్తుందని గాసిప్స్ విన్నాను,” అన్నాడు రాజు.

రాజు మాటలకు తక్కిన వాళ్లు నవ్వేశారు. కాని శిల్ప మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది.

ఆ తర్వాత గడియారం పన్నెండు కొట్టింది.

అద్దంలో వాళ్ల ప్రతిబింబాలు ఒక్కొక్కటిగా మారాయి.

రాజు, ముఖం రక్తంతో కప్పబడినట్లు ఉంది. సుధీర్, గొంతు కోసినట్లు కనిపిస్తోంది. పూర్ణ, కళ్లులేని మృతదేహంలా కనిపిస్తోంది .

శిల్ప, ఆమె రూపంలా కాకుండా.. ఒక ముసలి స్త్రీ వణుకుతూ, “ఈ ఇల్లు మాదే.. వెళ్ళిపోండి..” అని అరుస్తూ నోరు తెరిచింది.

వెంటనే వారు కేకలు వేస్తూ వెనక్కి పరుగులు తీశారు. కానీ వారు వెళ్లడానికి వీలు లేకుండా తలుపులు గట్టిగా మూసుకుపోయాయి.

ఆ ప్రదేశంలో గాలి సుడులు తిరిగింది.

ఆ సమయంలో ఒక పాత దినపత్రిక పేజీ ఒకటి గాలికి ఎగిరి కింద పడిపోయింది. సుధీర్ దాన్ని చదవడం మొదలుపెట్టాడు.

ఆ పేజీలో “జమీందారు గారైన వీరేశలింగం కుటుంబం మొత్తం గతంలో ఒక రోజు రాత్రి హత్యకు గురైంది. ఆ హత్యల నిందితురాలు.. వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి సుబ్బమ్మ అనీ.. తనకు చేసిన అవమానం తట్టుకోలేక, వారందరినీ నరికి చంపిందని చెబుతారు. కానీ ఆ తర్వాత సుబ్బమ్మ శరీరం ఎప్పుడూ, ఎక్కడా దొరకలేదు అని కూడా చెబుతారు.” అనే వార్త ప్రచురింపబడింది.

“అంటే.. ఆ ముసలి స్త్రీ ఎవరో ఇప్పుడు అర్థమవుతోంది,” అన్నాడు రాజు.

ఆ సమయంలో హఠాత్తుగా హాలు మొత్తం ఎరుపెక్కింది. గోడలపై రక్తపు చేతుల ముద్రలు పడుతూ పోయాయి. అద్దంలోనుంచి ఒక పెద్ద కేక వినిపించింది.

“నా రక్తం ఇంకా చల్లారలేదు.. మీరు ఎందుకు ఇక్కడకి వచ్చారు..?” అని కేకలు వినిపించాయి.

పూర్ణ వెనక్కి తిరగగానే ఒక నల్లని నీడ అతనిపై దూకింది. అతని గొంతు నులిమేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది.

సుధీర్ అతన్ని గట్టిగా లాగగా, అతని ముఖం అంతా నల్లని మచ్చలతో భయంకరమైన రూపులోకి మారిపోయింది.

“ఈ దర్పణం శపించబడి ఉంది. దీన్ని పగలగొట్టకపోతే మనం బ్రతకము!” అని శిల్ప కొంచెం కుదుటపడ్డాక చెప్పింది.

రాజు ఒక రాయి తీసుకుని అద్దంపై బలంగా కొట్టాడు.

అద్దం పగిలింది.. కానీ అద్దం పగిలినప్పుడు వందల కేకల అరుపులు వినపడ్డాయి.

ఆ కేకలతో కూడిన అరుపులకి గోడలు కంపించాయి. పైకప్పు చీలిపోయింది.

అద్దం నుండి ఒక తెల్లని ఆత్మ బయటకొచ్చి, వారందరి వైపు గుర్రుగా ఒకసారి చూసి, “ఇప్పటికైనా నేను స్వేచ్ఛ పొందాను.. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి..” అని చెప్పి మాయమైంది.

కానీ హఠాత్తుగా ఆ క్షణంలోనే పూర్ణ నేలపై కూలిపోయాడు. అతని శరీరం గడ్డకట్టిపోయినట్లు అయింది. మిగతావారు కేకలు వేస్తూ బయటకి పరుగులు తీశారు.

ఆ సంఘటన జరిగిన మూడురోజుల తరువాత గ్రామస్తులు ఆ ఇంట్లోకి వెళ్లారు.

అందులో ఇపుడు ఎవరూ లేరు. కాని గోడలపై “వెళ్ళిపోండి” అనే రక్తపు అక్షరాలు స్పష్టంగా రాసి ఉన్నాయి.

ఇప్పటికీ ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్ళరు. ఒకవేళ వెళ్లినా అక్కడ ఉన్న యే వస్తువును తాకరు.

రాత్రి వేళ దాని అద్దాలు ఇంకా ఇప్పటికీ అరుస్తాయని చెబుతారు ప్రజలు.

ఆ నలుగురు స్నేహితులలో ముగ్గురు బయటపడ్డారు. కానీ వారిలో ఎవరూ మళ్లీ తమ జీవితంలో నవ్వలేకపోయారు. వారు నవ్వడాన్నే మర్చిపోయారు.

మానవ రక్తంతో ముడిపడిన ఆ అద్దంలో నుండి వచ్చే అరుపులు కేవలం ఊహ కాదు.. అందులో ఒక నిజం దాగుంది.

***

ఆ తర్వాత ఒకరోజు అర్ధరాత్రి అద్దం లోపల వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి.

అద్దం పగిలిన తర్వాత నిశ్శబ్దం ఏర్పడింది.

కాకినాడ సమీపంలోని ఆ పల్లెలో, మూడో రోజు సాయంత్రం గాలి వింతగా వీచడం మొదలుపెట్టింది.

రహదారుల చివర ఆ జమీందారు ఇంటి వైపు చూసిన ప్రతీ ఒక్కరికి భయంతో దడ పుడుతూ, వణికిపోవడం మొదలైంది.

ఆ రాత్రి తర్వాత ఎవ్వరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్లలేదు. కానీ వారిలో భయం అంత తొందరగా సద్దుమణగలేదు.

రాజు, సుధీర్, శిల్ప – ముగ్గురు తమ పట్టణానికి చేరుకున్నారు.

కానీ వారి కళ్లలో భయం ఇంకా పోలేదు. మాటిమాటికి ఆ అద్దంలోని ప్రతిబింబం తిప్పలు పెట్టడం గుర్తుకు వస్తోంది.

ఎక్కడ చూసినా ఆ ముసలి స్త్రీ ముఖం, ఆ ఎర్రని కళ్ల వెలుగు కనిపిస్తూ భయానికి గురవుతున్నారు.

“పూర్ణ గురించి పోలీసులు ఏం చెబుతున్నార్రా?” అని శిల్ప చప్పున అడిగింది.

“పూర్ణ గుండె ఆగిపోయిందని పోలీసులు చెబుతున్నారు.. కానీ అతని ముఖం ఎందుకలా మచ్చలతో కప్పబడి ఉందో ఎవ్వరికీ అర్థం కాలేదు.” అని చెబుతున్నప్పుడు, రాజు మాటల్లో వణుకు మొదలైంది.

ఆ రాత్రి ముగ్గురూ ఒక్కొక్కరుగా తమ ఇళ్లకు వెళ్లినా, ఆ భయం వారిని వెంటాడటం మాత్రం మానలేదు.

తన ఇంటికి వెళ్లిన శిల్ప ఆ రాత్రి నిద్రపోలేదు.

గదిలో లైట్ ఆఫ్ చేసిన వెంటనే అద్దం మీద ఏదో కదిలినట్టు అనిపించింది.

ఆమె బెడ్ నుండి లేచి అద్దం వైపు పరికించి చూసింది. అద్దం మీద పగిలిన చారలా ఒక రక్తపు గీత కనిపించింది.

కళ్ళు రుద్దుకుని తిరిగి చూసేసరికి, గీత మాయమయింది. కానీ ఆ ప్రతిబింబంలో తాను కాదు..

అద్దంలో తన ప్రతిబింబం బదులుగా ఆ ముసలి స్త్రీ ముఖం నెమ్మదిగా దగ్గరవుతూ,

“నువ్వు నన్ను విడిపించలేదు.. ఇంకా నా రక్తం ఇక్కడే ఉంది..” అని గుసగుసలాడినట్లు చెబుతూ భయపెట్టింది.

శిల్ప అరుస్తూ పడక మంచం మీద నుంచి లేచింది.. ఆ రాత్రంతా ఆమెకు నిదుర పట్టక భయంతో గడిపింది.

తర్వాతి ఉదయం ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు, చేతులపై పసుపు మచ్చలు కనిపించాయి.

“ఇలా భయంతో బ్రతకలేమురా,” అన్నాడు సుధీర్.

“పూర్ణ చనిపోయాడు కానీ మనమేం చేయలేకపోయాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. ఆ దర్పణం ఎవరి చేతిలో తయారైంది? ఆ సుబ్బమ్మ కథ ఎంతవరకు నిజం?” అని బాధపడ్డాడు సుధీర్.

సుధీర్ మాటలకు రాజు అవునన్నట్లుగా తల ఊపుతూ, “మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్దాం. కాని ఈసారి ఒంటరిగా కాదు.

ఒక వీడియో కెమెరా, రికార్డర్ – అన్నీ తీసుకెళదాం. ఏదోలా అసలు నిజం తెలుసుకుంటే మన భయం తగ్గిపోతుంది.” అని అన్నాడు.

తిరిగి ‘వీరేశలింగం వాసం’ వద్దకు వెళ్లడానికి బయలుదేరారు వాళ్ళిద్దరు.

అర్ధరాత్రి సమయంలో వారు ఒక చిన్న కారులో ఆ ఇంటి ముందు ఆగారు. మబ్బులు కమ్ముకున్న చంద్రుడు, కొంతసేపటికి వెలుపలికి వచ్చి గాజు కిటికీలపై రక్తం రంగు వెలుగును విరజిమ్మాడు.

ఎవరో ఎదురు చూస్తున్నట్టుగా ఆ వాసపు తలుపు దానికదే తెరుచుకుంది..

లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి విసురుగా వీచింది.

గతంలో పగిలిపోయిన అద్దం, ఉండాల్సిన చోట ఇప్పుడు మళ్లీ అది సంపూర్ణంగా మునుపటిలా యథాస్థితిలో ఉంది.

“ఇది అసంభవం!” సుధీర్ కంఠం గట్టిగా పలికింది.

రాజు కెమెరా ఆన్ చేసి, “చూడరా, ఇదే ఆ దర్పణం.” అని అన్నాడు.

అద్దం మీద కాంతి పడగానే దాని లోపల ఏదో కదిలినట్టు అనిపించింది.

లోపల నలుపు నీడల వలయం కనిపించింది.

వాటిలో ఒకటి సుబ్బమ్మ ఆత్మ కాదు.. అది పూర్ణదే.

“రా రాజూ.. నన్ను బయటకు తీసుకుపో ..” అని అద్దం లోపల నుంచి ఒక స్వరం వినిపించింది.

భయంతో రాజు చేతులు వణికాయి. “అతడు.. మన పూర్ణే రా!” అని వణుకుతూన్న స్వరంతో అన్నాడు.

సుధీర్ అద్దానికి దగ్గరగా వెళ్లగానే ఒక్కసారిగా అతను లోపలికి లాగబడ్డాడు.

రాజు కేకలు వేస్తూ అద్దం వెనుక భాగాన్ని గట్టిగా తడమగా.. అతను కనిపించడం ఆగిపోయింది.

అద్దంలో చీకటి, పొగమంచు కనిపించింది.

ఆ లోపల సుధీర్ పరుగులు తీస్తున్నాడు, పూర్ణ వెనుకకు తిరిగి చూస్తూ, “వెంటనే బయటకు వెళ్లు!” అని అరుస్తున్నాడు.

కానీ ఆ చీకటిలో ముసలి స్త్రీ స్వరం, “మీరు నన్ను మళ్లీ కదిలించారు.. ఇప్పుడు మీరు ఎవరూ బ్రతకరు..” అని కఠోరంగా పలికింది.

వెంటనే అద్దం పగిలిపోయింది.

రాజు వెనక్కి లాగబడ్డాడు. గది మొత్తం పొగతో నిండిపోయింది.

ఆ సమయంలో శిల్ప తన గదిలో ఒంటరిగా ఉంది.

ఆమె చేతుల మీద నల్ల రేఖలు పెరుగుతున్నాయి.

అద్దం వైపు చూస్తే, ఆమె ముఖం నెమ్మదిగా సుబ్బమ్మ ముఖంలా మారుతోంది..

ఆమె తల్లి గదిలోకి రాగానే, “అమ్మా, నన్ను దూరంగా ఉంచు..” అని ఆమె అంటూ ఉండగానే ఆమె అద్దం దగ్గర నుండి వెనక్కి లాగింది.

ఆమె కళ్ళలో రెండు ఎర్రగా మండుతున్న వెలుగుల్లాగా కనిపించాయి. కాసేపటికి స్థిమిత పడినట్లు మామూలుగా మారిపోయింది శిల్ప. ఆ తరువాత తల్లి ఆ గదిలో నుండి వెళ్లిపోయింది.

రాత్రి రెండు గంటలకు శిల్ప ఇంటి తలుపు తెరచి, నిశ్శబ్దంగా బయటికి నడిచింది.

బయటకు వెళుతున్న కూతురును చూసిన ఆమె తల్లి, “ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి?” అని ప్రశ్నించింది.

“అదే ‘వీరేశలింగం వాసం’ వైపు” అని సమాధానమిచ్చింది శిల్ప. భయంతో వణికిపోయింది ఆమె తల్లి.

***

రాజు మూర్ఛ నుంచి లేచేసరికి గది ఖాళీగా కనిపించింది.

అద్దం ముందు కింద పాత దినపత్రికలు, ఒక లేఖ కనిపించాయి.

ఆ లేఖలో సుబ్బమ్మ చేతిరాతతో, “ఈ అద్దం నాకు శాపం కాదు, నా జైలు జీవితానికి అసలైన అర్థం ఇది. జమీందారు నన్ను నిందించాడప్పుడు, నేను న్యాయం పొందలేక, ఈ దర్పణంలోనే బంధించబడ్డాను. అతడికి వచ్చిన మంత్ర తంత్ర విద్యలతో నన్ను(నా ఆత్మను) అద్దంలో బంధించాడు. నా రక్తంతో ఈ అద్దం తయారైంది. ఎవరు దీన్ని తాకినా, నా బాధలో భాగమవుతారు.” అని లేఖలో రాయబడి ఉంది.

రాజు చెవుల్లో ఆ ముసలి స్త్రీ కేకలు మళ్లీ వినిపించాయి.

“నన్ను క్షమించు..” అంటూ ఆ లేఖను పట్టుకుని అద్దం వైపు నడిచాడు.

బయట ఉరుములతో, మెరుపులతో కూడన గాలి వాన కురుస్తోంది. ఆ సమయంలో పెద్దగా కేకలు వినబడ్డాయి.

అద్దం ముందు రాజు, లోపల పూర్ణ, సుధీర్.. నలుగురి ప్రతిబింబాలు కలిసిపోయాయి.

ఆ సమయానికే శిల్ప తలుపు దాటింది.

ఆమె కళ్లలో సుబ్బమ్మ ఆత్మ వెలుగులా కనిపిస్తుండగా,

“నేను మీ అందరినీ విడిపించాలి.. అప్పుడు నేనూ విముక్తి పొందుతాను,” అని చెప్పి

అద్దం ముందు నిలబడి, చేతిని గాయపరిచి, రక్తాన్ని అద్దంపై చిందించింది.

అద్దంలో నుండి గట్టిగా అరుపులు వినిపిస్తూ అద్దం పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది.

ఆ సమయంలో ఒక తుపాను గాలి లాగా తెల్లని వెలుగు, వారందరినీ చుట్టుకుంది. వెలుగు సద్దుమణిగినపుడు, అద్దం మాయమైంది. గది ప్రశాంతంగా మారిపోయింది.

కానీ నేలపై శిల్ప పడివుంది. ఆమె ముఖం మీద ఒక చిరునవ్వు ఉదయించింది.

ఆమె ఆత్మ నిశ్శబ్దంగా ఆ వెలుగులో కలిసిపోయింది.

తరువాతి ఉదయం గ్రామస్తులు ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు, అక్కడ అద్దం లేదు. చీకటి కూడా లేదు.. కేవలం తెల్లని పువ్వుల సుగంధ పరిమళం మాత్రం వ్యాపించి ఉంది.

ముగ్గురు యువకులు అక్కడే మూర్ఛతో పడివున్నారు.

వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ప్రాణాలు మాత్రం మిగిలాయి.

కానీ వారిలో ఎవ్వరూ ఆ రాత్రి గురించి మరి ఇంకెప్పుడూ మాట్లాడలేదు.

ఎవరైనా ‘వీరేశలింగం వాసం’ గురించి ప్రస్తావిస్తే, “అద్దంలో చూసుకుంటే మన రూపం మాత్రం కాదు, వేరే రూపం కనిపిస్తుంది.” అని ఒకే ఒక మాట అందరితో చెబుతున్నాడు రాజు.

కొన్నేళ్ల తర్వాత ఆ ఇంటి ప్రాంగణంను కూల్చేశారు.

కానీ రాత్రివేళ వాన పడినప్పుడు, ఆ స్థలంలో నీటి గుంటలో ఎవరిదో ప్రతిబింబం కనిపిస్తుందని చెబుతారు.

చాలా సార్లు అది ఒక అమ్మాయి నవ్వులా, కొన్ని సార్లు ముసలి స్త్రీ నీడలా కనిపిస్తుందని చెబుతారు.

ఎవరైనా ఆ గుంట దగ్గర నిలబడి, ‘నిశీధ దర్పణం’ అని పిలిస్తే.. పెద్దగాలి వీస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది.

అద్దం లేని చోట కూడా ఒక మసక ప్రతిబింబం పుట్టి, “నేను ఇక్కడే ఉన్నాను..” అని గుసగుసలాడినట్లు మాటలు వినిపిస్తాయి.

భయం మనిషి కళ్ళల్లోనే కాదు – ప్రతిబింబం కనిపించడం వల్ల మనిషి అణువణువు భయమే నిండి ఉంటుందెప్పుడూ. అద్దం పగిలినా నీడ ఎప్పుడూ నశించదు అనే నిజాన్ని తెలుసుకున్నారు గ్రామ ప్రజలు.

Exit mobile version