అనుభూతులు మూర్ఛిల్లిన
కోమాను మరపించే నీ మౌనం
నిషాగత నిస్తేజతను నింపి
నన్ను నిర్వికారుణ్ణి చేస్తోంది నేస్తం!
హిమానీ నిబిడ హేమంతాలూ
నయాగరా నయగారాలూ
నైలునదీ నిగనిగలెన్నో
ఒలికించే మన మృదు స్నేహం
ఏ సైమూన్ విలయ తాండవానికో
ఏ సైతాన్ ఘోర కరాళ నృత్యానికో
ఎర అయి
క్షతగాత్ర గోమాతలా
నిస్సహాయంగా అశ్రుతర్పణం చేస్తోంది!
నిశీధి రాజ్యం చేస్తున్న
మరుభూమిని మరపించే
యీ మౌనంలో… ఎన్నో
గతస్మృతుల కాయాలు కాలుతున్పై
మృతశృతుల కపాలాలు ప్రేలుతున్నై!
మన మధ్య పేర్చబడ్డ
యీ సుప్త మౌనాస్థికలను
ఏ సప్తస్వరాల నదీ గర్భంలోనో
నిమజ్జనం చేసెయ్ నేస్తం!
స్వరపేటికలో కలిగిన
ఏ చిన్ని కదలికకో
నాద తంత్రులు ప్రతిస్పందించి
ఆస్యకుహరంనుంచి వెలువడే
లాస్య మృదూక్తులు
ఆప్యాయతాత్మీయతా సోనలను
కురిపింపజేస్తూ ఎప్పటిలా
నా వీనులకు సుతారంగా
సోకాలి నేస్తం!
ఆ స్నేహామృత ధారలలో
తడిసి తడిసి…
ఆ సౌహార్ద ధామంలో
ఒదిగి ఒదిగి…
నాకు నేనే పునీతుడనై పోవాలనే
నా ఆశకు
నీ పలుకే ప్రణవం!
చిరునగవే ప్రాణం!!