[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘నిశ్శబ్ద లేఖా..!!’ పాఠకులకి అందిస్తున్నాము.]
నిశ్శబ్ద లేఖా..
నీవు మాటలకంటే మధురమైన మౌనం,
కాలాన్నికూడా ఆపి వినిపించే శబ్దరహిత స్వరమవు.
నీవు చేరని దారిలో
నీ అక్షరాల అడుగుజాడలు పరిమళిస్తుంటే,
మనసు పుటలపై పూలవాన కురుస్తుంది.
నీ సిరా కన్నీటి చుక్కలో పుట్టిన ముత్యం,
ఒక్క అక్షరంలోనూ శతాబ్దాల వేదన దాగి ఉంది.
ఆ వేదనలోనే నిన్ను తాకే మృదుత్వం ఉంది.
ఈ లేఖను తాకిన వేళ
కాలం క్షణం ఆగిపోతుంది,
అక్షరాలు శ్వాస తీసుకుంటూ
నా హృదయాన్ని తడిపేస్తాయి.
నీవు రాసిన విరామ చిహ్నం
నిజానికి ఒక ఆగిన ఊపిరి,
ఒక మౌన పిలుపు,
నీ హృదయపు లోపలి తపనకు ప్రతిరూపం.
నీ వాక్యాల మధ్య మౌనంలో
వేల పదాలు నిద్రిస్తున్నాయి,
ఆ మౌనం కూడా నీ భాష,
నీ ప్రేమకు కనిపించని సంతకం.
ప్రతి పంక్తి వెనుక
గతకాల చందమామ కాంతి మెరుస్తుంది,
జ్ఞాపకాల సముద్రంలో
నీ లేఖ తేలుతున్న పడవలా అనిపిస్తుంది.
నిశ్శబ్ద లేఖా..
నీవు దూరానుండి వచ్చిన హృదయ త్రాణం,
నీ సిరా వాసనలో నేను కరిగిపోతూ
కాలానికి చెరగని గీతగా మిగిలిపోతున్నా.
