సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. నందిని సిధారెడ్డి అన్నారు.
పాలమూరు సాహితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 న మహబూబ్ నగర్ నగరంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోని కాళోజీ హాల్ లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్ గౌడ్ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే..’ కవితాసంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశాడన్నారు. కవి నిరంతరం సమాజంతో మాట్లాడుతూనే చిత్రిక పట్టాలన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎస్. రఘు మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ కవిత్వం సమకాలీన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు.
పుస్తక సమీక్షకులు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, మూడు వరల్డ్ రికార్డుల విజేత డా. వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్, జాన్ కీట్స్, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్ గౌడ్ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. లక్ష్మణ్ గౌడ్ కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారస్వరం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ జలజం సత్యనారాయణ మార్గంలో కవి లక్ష్మణ్ గౌడ్ సమకాలీన సమస్యలను ఆవిష్కరిస్తూ రాయడం కవి లక్షణమన్నారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ జి. అరుంధతీరాయ్, లుంబిని పాఠశాల వ్యవస్థాపకులు జి. సంయుక్తా రాయ్, పాలమూరు సాహితి అధ్యక్షులు డా. భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

