[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నిశ్శబ్ద నిశీధి రాగం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
తూర్పు నుంచి పడమరకు జారుతూ
ఎన్నెన్నో అనుభవాలను తాకుతూ
తెల్ల కాగితం మీద నల్ల పూతలా
సుదీర్ఘమైన ప్రస్థానంగా జీవితం
కాలమంతా తరిగి కరిగిపోతూ
కళ్ళ ముందే ఆకులన్నీ రాలిపోతూ
వెలుగులన్నీ మలిగి వెలసిపోతూ
తెలియకుండానే చీకటి దుప్పటి పడిపోతుంది
బిగిసిన బంధం ఒక్కసారిగా సడలుతుంది
ఎన్ని ఉదయాలు పూసినా
మరెన్ని కాంతులు అద్దినా
ఆవల గట్టుకు చేరేసరికి
నిస్సందేహంగా వినిపించేది
నిశ్శబ్ద నిశీధి రాగం
రాగద్వేషం లేని భావం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
