Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిత్య నాదం

[డా. సి. భవానీదేవి రచించిన ‘నిత్య నాదం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


శిలలు శ్వాసిస్తున్న అమరగాథ
కాలపు కడలితీరాన కలల నగరం
సామ్రాజ్య స్వప్నాల సింహాసనం
వీరుల అడుగుల ప్రతిధ్వని
కొలోజియం గోడల్లో గర్జించిన వీరత్వం
రక్త సాక్ష్యాల నిశ్శబ్ద ప్రతిజ్ఞలు
విజయతూర్యాల ప్రతిధ్వనుల శిలాఫలకాలు
ప్యాంథియం గర్భంలో వెలుగు వర్షం
గోపురంలో ఆకాశ దివ్యత్వం
దేవతాయాత్రల వీణారవాలు
నిశ్శబ్దపు నాదబ్రహ్మ లయలు
రోమ్ వీథుల్లో నడుస్తుంటే
కాలం చేతులు పట్టుకుంటుంది
చరిత్ర మాట్లాడుతుంది
ప్రతి రాయి ఒక కథ చెప్తుంది
టైబర్ తీరంలో సౌందర్య సాయంకాలం
బంగారు వెలుగుల నగరం
ఒకప్పటి సామ్రాజ్య శిథిలగర్వం
ఇది కేవలం ఒక నగరమా..
కాలాన్ని జయించిన కవిత్వ దర్శనం
శాశ్వతత్వపు శిల్ప భాషణం
రోమ్.. ఒక నిరంతర నిత్య నాదం!
~

(ఇటీవలి నా యూరప్ యాత్రలో రోమ్ చూశాక)

Exit mobile version