అసలు నిత్య పూజ అంటే ఏమిటి?
దాని ప్రాముఖ్యత ఏమిటి?
ఆ విధి – విధానంబెట్టిది?
అన్న సందేహం మనకు తప్పక కలుగుతుంది. కొందరు ఈ నిత్యపూజ చేసే వారిని అనాగరికులుగా, చాందస్తులుగా చూడటము కూడా కద్దు!
ప్రతి దినం చేసే ప్రార్థనే నిత్య పూజ.
దిన చర్యలో భాగముగా ఆ దినము ప్రశాంతతను కొనసాగింపుగా, ఈ జీవితాన్ని ఇచ్చిన పరమాత్మకు మనసా, వాచా నమస్కరించటము నిత్యపూజ.
కొందరు పూజ చెయ్యనిదే ఉదయపు అల్పాహారం అంటరు. నిత్యపూజలలో వారికిష్టమైన దేవత, దేవుడు, ఓంకారమో, అగ్నో వుంచుకొని కొలుచుకుంటారు.
పర్వదినములలో, ప్రత్యేక సందర్భాలలో చేసేది ప్రత్యేకమైన పూజ.

టూకీగా చెప్పాలంటే, మన ఫామిలీ ఫోటోలు ఎలానో, వాటి అర్థం పరమార్థం ఏమిటో, పరమాత్ముని విగ్రహం కూడా అంతే!
మరి మన కిష్టమైన విగ్రహం తెచ్చుకున్న తరువాత ఎలా ఈ నిత్య పూజ చెయ్యాలి? ప్రతిరోజూ చెయ్యాలా? అన్న ప్రశ్న వస్తుంది.
దానికి సమాధానం మనం ప్రతి దినం ఎలా మన పనులు చూసుకుంటున్నామో, మన పిల్లలను ఎలా సాకుతామో అంతే ప్రేమగా భగవంతుని విగ్రహంలో ఆరాధించి, ప్రేమించాలని నిత్య పూజను ఆచరించాలని పెద్దలు చెబుతారు.
నిత్య పూజ వలన కలిగే ఫలితాలు కోకొల్లలు. వెంటనే కనిపించేది మనలో భక్తి బలపడుతుంది. మనకు ఒక క్రమశిక్షణ వస్తుంది. జీవితం మీద ఆశా దృక్పథం ఏర్పడుతుంది. మన ఉదయం ధ్యానంతో కూడిన నిత్య పూజ వలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చన్నది కాదనలేని సత్యం.
తరువాత – మనకు కలిగే సందేహము ఈ నిత్యపూజ చేసే విధానం ఏమిటి అని.
పూజని షోడశోపచారములు (పదహారు), లేదా పంచోపచారము (ఐదు)లతో చేస్తారు.
ప్రతి దినం చేసే ఈ షోడశ పూజతో మానవులలో అహంకారం నశిస్తుంది. ఈర్షా, అసూయా, ద్వేషం వంటివి దుర్గణాలు మటుమాయమవుతాయి.
శరీరానికి వ్యాయామం ఎలాగో, మనసుకు ధ్యానం అలాంటిది. ఈ ధ్యానంతో కూడిన షోడశోపచారములతో పరమాత్మను అర్పించిన వారికి పరమార్థికమైన జీవితం తప్పక లభిస్తుంది. మానవులలో ఉండవలసిన స్వచ్ఛత ఏర్పడుతుంది. జీవితంలో కలిగే ఆటుపోటులతో మాయమౌతుంది.
అయితే ఈ 16 ఉపచారముల ఏమిటి? ఈ సంఖ్య ప్రత్యేకత ఏమిటి? అని చూసినట్లయితే:
అమ్మవారిని పదహరు కళలుగా చెబుతారు. ఆ పదహారు కళలను ఉపాసించటము, పదహారు అక్షరాల అమ్మవారి మంత్రరాజముతో సేవించటము శ్రీ విద్యా ఉపాసనలో వున్నది.
పదహరు కళలలో మనకు చంద్రుడు కూడా కనపడుతాడు. దినమునకు ఒక విధముగా శుక్ల పక్షములలో తరుగుతూ, కృష్ణ పక్షములో పెరుగుతూ వుంటాడు.
పదహారవ సంఖ్యకు, మానవ జీవితానికి కూడా గొప్ప లంకె ఉన్నది.
మానవులకు జీవితకాలంలో చేయు వివిధ వేడుకలు, లేదా క్రియల మొత్తం 16. గర్భాదామం, పుంసావనము, శ్రీమంతము, జాతకర్మ, చోడకర్మ, చెవులు కుట్టించటం, ఉపనయనం, కేశకండన సమావర్తనము, అంతేస్టి ” మొదలైన వన్నీ 16. వీటికి సింబాలిక్‌గా 16 ఉపచారములు.
మాములుగా మన ఇంటికి ఒక అతిథి వస్తే మనము వివిధములైన సేవలు చేస్తాము. ఆ వచ్చిన వారు ప్రియమైన వారైతే మరింత శ్రద్దగా వుంటాయి మన ఉపచారములు. మరి ఈ అండ పిండ బ్రహ్మాండాలని ఏలే ఆ పరమాత్మను పిలిస్తే ఎన్ని ఉపచారాలు చెయ్యాలి? ఎంత శ్రద్ధగా, భక్తిగా చెయ్యాలి? అందుకే ఈ షోడశోపచారములు.
ఉప అంటే దగ్గరగా, చారము అంటే సరితము, సేవ. దగ్గరగా వుండి సేవించుకోవటము -ఉపచారములు
అవి: ధ్యానము, ఆవాహనము, ఆసనము,పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము,దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణ, నమస్కారములు. ఇవి షోడోశోపచారములు.
- ఈ ఉపచారములు మరింత వివరముగా చెప్పాలంటే మన ఇంటికి, మన పూజా మందిరానికి రమ్మని “ధ్యానము” అన్నది ఆహ్వానము (Invitation) వంటిది. ధ్యానము వలన గురి కుదురుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
- ‘ఆవాహనము’ రమ్మని ప్రేమగా పిలిచిన భక్తిని వద్దకు భగవంతుడు విదురుని గృహానికి వెళ్ళిన కృష్ణునిలా వచ్చేస్తాడు. ఆ స్వామిని స్వాగతించటము ‘ఆవాహనము’.
- ‘ఆసనము’. అలా వచ్చిన భగవంతునికి ఆసనము లో కూర్చుండబెట్టటము.
- పాద్యము: మరి వచ్చిన వారికి కాళ్ళు కడుతాముగా. అదే పాద్యము.
- ఆర్ఘ్యము : చేతులు, ముఖము కడగటము కై నీరు ఇవ్వటము.
- ఆచమనము: త్రాగటానికి నీరు ఇవ్వటము.
- స్నానము: స్నానముకై నీరు అందివ్వటము.
- వస్త్రము: స్నానము తరువాత తడి తుడుచుకోవటము,నూతన వస్త్రాలు కట్టడము అన్నవి ఈ ఉపచారము.
- యజ్ఞోపవీతము: నూతన యజ్ఞోపవీతము సమర్పించటము.
- గంధము.; సుగంధపూరితమైన గంధము సమర్పించటము. దీని మూలముగా భక్తుని మనసు నెమ్మదిస్తుంది.
- పుష్పము: అధాంగ పూజతో, స్తోత్రంతో పుష్పములు, పుష్ప మాల సమర్పించి ఆనందపరుచుట.
- ధూపము: సంపూర్ణమైన అనుగ్రహానికై ధూపము సమర్పించవలెను.
- దీపము: భక్తుని హృదయములో, జీవితములో అజ్ఞానము తొలగి, సుజ్ఞానపు వెలుతురుకై దీపము వెలిగించటము.
- భగవంతునిది యధాశక్తి, ఫలమో, కాయో నివేదించటము ఈ సేవ.
- తాంబూలము: భోజనము తరువాత తాంబూలము వుంటుంది కదా.
- ప్రదక్షిణతో కూడిన నమస్కారము.
భక్తుల సౌలభ్యము కోసము వివిధ మంత్రాలను ఈ ఉపచారములలో వాడటానికి మనకు రుషులు ఇచ్చారు.
శైవులు, శివున్ని ఆరాధించి వారు రుద్ర మంత్రాలతో ఈ ఉపచారములు చేస్తారు. విష్ణవును ఆరాధించు భక్తులు పురుషసూక్తం, శక్తి ఉపాసకులు శ్రీ సూక్తంతో, ఇలా వివిధ మంత్రాలతో ఆరాధన అమలులో వుంది.
ఎలాంటి మంత్రాలు రాని వారు వారికి వచ్చిన, నచ్చిన నామముతో కూడా ఈ ఉపచారములు చెయ్యవచ్చు.
భగవంతుడు తమ బిడ్డగా మారితే తల్లికి కలిగే ప్రేమతో ఎంత గారాబముగా చూసుకుంటారో అలా చూసికోవటమే ముఖ్యంగా కావలసినది.
పదహారు ఉపచారములు నిత్యము చెయ్యలేని వారు కనీసము ఐదు ఉపచారాలన్నా చెయ్యాలి. వాటినే ‘పంచోపచారములు’ అంటారు.
‘గంధ పుష్ప ధూప దీప నైవేద్య’ములే అవి. అయితే ఇక్కడ ఒక సందేహము వచ్చితీరుతుంది. అదేమంటే, సర్వత్రా నిండి వున్న పరమాత్మకు, సర్వము ఇచ్చే ఆ దేవదేవునికి మనము మళ్ళీ తెచ్చి ఇచ్చేదేమిటని.
ఈ గంధ పుష్ప ధూప దీపాలన్నీ పరమాత్మా సృష్టే. సర్వత్రా ఆయనే వున్నాడు. అంతటా నిండి వున్నాడు. మరి అలాంటి స్వామికి మనము కొత్తగా మనమిచ్చేదేమిటన్న సందేహము నిజ భక్తులకు కలగక మానదు. అన్నీ ఆయనే ఇచ్చినా, వాటిని కూర్చి మన ప్రేమను, భక్తి నీ అద్ది తిరిగి ఆ భగవంతునకే అందిస్తే ఆ పరమాత్మ తృప్తి చెందుతాడు.
ఉదాహరణకు తల్లి ప్రేమతో పాలు, పంచదార కలిపి పాయసము చేసి పిల్లవాడికి పెడుతుంది. పిల్లవానికి పాయసము చెయ్యటము తెలియదు. రాదు. కమ్మని ఆ తినుబండారము తిన్నప్పుడు వాడికి కొంత తల్లికి తినిపించాలనే కోరిక పుడుతుంది. వాడు తల్లిని పిలిచి తన చేతులతో కొంత ఆమెకు తినిపిస్తాడు. పాయసము తియ్యని పదార్థమని తప్ప మరోటి తెలియని ఆ పిల్లవాడు పెడితే తల్లి ఆనందముతో పొంగిపోతుంది. ఆమెకు ఆ చర్యలో పిల్లవాణ్ణి ప్రేమ తప్ప మరోటి కనపడదు. ‘నే వండునది నాకే పెడతావా’ అనదు తల్లి. పిల్లవాడు ఇచ్చినది సంతోషముగా తింటుంది.
అలాగే మనము పిల్లలము. పరమాత్మ తల్లి వంటివాడు. అందుకే మనము శ్రద్దతో, చెదరని విశ్వాసముతో, మొక్కవోని నమ్మకముతో అను నిత్యము దేవునికి ఉపచారములు చెయ్యాలి. అందుకే గృహస్తులను తరించటానికి ఈ నిత్యపూజ వరముగా, పరమ సులభమైన మార్గము అన్నది నిస్సందేహము.
హైద్రాబాదులో పుట్టి పెరిగారు. వివాహనంతరం అమెరికాలోని అట్లాంటా లో స్థిరపడ్డారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ. డిగ్రీ పొందారు.
సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా పనిచేశారు. అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్ ఇత్యాది సంస్థలకు స్వచ్ఛంద సేవ చేసి ప్రస్తుతం వీటి సేవ ద్వారా గిరిజన, అంధ విద్యార్దులకై సేవలందింస్తున్నారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థవారి “Ramesh-Bakshi Leadership” అవార్డు అందుకున్నారు.

