Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-26

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

లాయక్ అలీ, మొయిన్ అలీలతో ప్రథమంగా జరిపిన చర్చలలో మేము అతి సులభంగా కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకున్నాము. భారత సమాఖ్య ప్రాదేశిక సమగ్రతను గౌరవించి తీరాలి. నిజామ్ పోలీసులు, నిజామ్ సైన్యం – వలస వెళ్ళేవారిని భారత్ సరిహద్దుల్లోకి చొరబడి వేధించవద్దు. సరిహద్దులు దాటి ఇళ్ళల్లోకి చొరబడవద్దు. ఇళ్ళల్లో వెతకవద్దు. సరిహద్దు దాటి కాల్పులు జరపవద్దు. సరిహద్దులు దాటి బారతదేశంలో పట్టుకున్నవారిని, ఎవరెవరి ఆస్తులను అయితే జప్తు చేశారో, వారి వారి ఆస్తులను వారికి ఇచ్చేయాలి. పట్టుకున్న వారిని, ఆయా ప్రభుత్వాలకు అప్పజెప్పాలి.

ఆ తరువాత యథాతథ ఒప్పందం అమలు పరిణామాల గురించి చర్చించటం ఆరంభించాలి. ఆ తరువాత అంశాల వారీగా ఒప్పందాన్ని విశ్లేషిస్తూ చర్చిస్తూ పోతుంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏ ఒప్పందం లోనూ ఇంతగా అసమ్మతి ఉండదు. ఎందుకంటే, ప్రతి ఒక్క అంశాన్ని రెండు పక్షాల వారూ వేర్వేరుగా అర్థం చేసుకున్నారు. ఏ ఒక్క విషయం కూడా ఇద్దరికీ ఒకే విధంగా అర్థం కాలేదు.

ఏదైన ఆంశం భారత్‍కు లాభకరంగా ఉందనిపిస్తే దాన్ని లాయక్ అలీ తిరస్కరిస్తాడు. అలాంటి అంశం బ్రిటీష్ వారి సార్వభౌమత్వం తొలగిపోవటంతోటే రద్దయిపోతుందంటాడు. లేకపోతే అనుషంగిక  లేఖల అర్థం మారిపోయిందంటాడు. ఒకవేళ ఏదైనా హైదరాబాద్‍కు లాభకరంగా అనిపిస్తే దాన్ని వెంటనే అమలు పరచాలని పట్టుబడతాడు. దాన్ని అమలు పరచటం వల్ల మిగతా అంశాల అమలు ఏవైనా అవసరం లేదంటాడు. సాధారణంగా న్యాయ సంబంధాలు ఒప్పందాలలో పరస్పర వాగ్దానాలు చేసుకునే సూత్రం లాయక్ అలీకి, మొయిన్ నవాజ్ జంగ్‍కీ తెలిసినట్టు లేదు.

వ్యాపారం ముసుగులో విదేశీ ప్రభుత్వాలతో సంబంధాలు ఏర్పర్చుకోవాలన్నది వారి అభిలాష. అన్నిటికన్నా వారికి హైదరాబాద్‌కు ఆర్థిక స్వతంత్ర్యం కావాలి. భారత్ సమాఖ్యతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తమ వనరులను అభివృద్ధి చేసుకోవాలన్నది వారి అభిలాష. హైదరాబాద్ నుంచి ఎగుమతుల ద్వారా అందే ధనం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు విదేశాలతో వ్యాపారం చేయగలగాలి. అదనంగా , వారి ఉద్దేశంలో భారత్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది కాబట్టి తమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు పాకిస్తాన్‍తో ఆర్థిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఇదంతా నాకు అర్థమవుతోంది.

ఓ వైపు ఇలాంటి కోరికలు కోరుతూ, మరో వైపు, భారత్ సైన్యం సికిందరాబాదును వదిలి వెళ్ళిపోవాలనీ, రాష్ట్ర సైన్యానికి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేయాలని కోరుతున్నారు. యథాతథ ఒప్పందం ప్రకారం అమలులో ఉన్న రాష్ట్ర సైన్య పథకం (బ్రిటీష్ వారు భారత్ పై ఆధిక్యం సాధించిన తరువాత సంస్థానాలు సైన్యం ఏర్పాటు చేసుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అమలు పరిచిన పథకం), బ్రిటీష్ వారు భారత్ వదిలి వెళ్లటంతో అంతమయిందని వాదించారు.

అయితే నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. లాయక్ అలీ ఎంతగా కాదని వాదించినా అతని ప్రథమ విధేయత జిన్నాకేనన్నది. మార్గదర్శనం కోసం ఆయన పాకిస్తాన్ ఆర్థిక మంత్రి గులామ్ మహమ్మద్ పై ఆధారపడ్డాడు.

హైదరాబాదులో నేను కలిసిన వారందరిలోకీ  అత్యంత తెలివైనవాడు నవాజ్ మొయిన్ నవాజ్. ఇత్తెహాద్‍ల మెదడు లాంటి వాడాయన అన్నది నిజం. చక్కటి ప్రవర్తన, చక్కటి భాషణంతో ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటూ, చూడగానే అసలైన దౌత్యాధికారి ఇతడు అనిపించేట్టుంటాడు. అయితే భారత్ వ్యతిరేకత విషయంలో మాత్రం ఈయన నిశ్చలమైన పర్వతం లాంటి వాడు. అతను పైకి ఎప్పుడూ అనలేదు కానీ హైదరాబాద్ సంపూర్ణంగా ముస్లింలకు చెందినది, ఎట్టి పరిస్థితులలోనూ భారత్‍తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండాల్సిందే అన్నది ఈయన నమ్మకం.  ఈయన లాయక్ అలీకి మనస్సాక్షి లాంటి వాడు. ఎప్పుడయినా లాయక్ అలీ కాస్త మెత్తబడినట్లు అనిపిస్తే, వెంటనే అతడిని వెనక్కు లాక్కు వచ్చేవాడు.  ఈ రకంగా హైదరాబాద్‌ను భారత్‍కు దూరం చేసే మార్గంలోకి లాయక్ అలీ ప్రయాణించేట్టు చూసేవాడితడు.

రజాకార్ల విషయంలో వీరందరూ, అన్యాయంగా నేరం మోపితే హృదయం గాయపడ్డ అమాయకుల్లా ప్రవర్తించేవారు. ఒక్కసారి లాయక్ అలీ – ఘోరమైన సంఘటన జరిగింది – అని ఒప్పుకున్నాడు. వెంటనే మొయిన్ నవాజ్ అతడి తప్పును సరిదిద్దాడు. మొయిన్ నవాజ్ ప్రకారం మారణకాండకు సంబంధించిన వార్తలన్నీ అబద్ధాలు లేక, అతిశయోక్తులు మాత్రమే. అతని ప్రకారం ఇత్తెహాద్ అన్నది స్వచ్ఛందంగా, సహజంగా, భారత్‍లో విలీనం అవటాన్ని వ్యతిరేకిస్తూ ఆరంభమయిన ముస్లిం ఉద్యమం. నిజామ్ ప్రభుత్వానికీ, దీనికీ సంబంధం లేదు. ఇత్తెహాద్‍లు ప్రమాదకారులు కాదు. వారు, కమ్యూనిస్టులు హింసిస్తున్న అమాయక ముస్లింలను రక్షించేందుకు కంకణం కట్టుకున్న దేశభక్త ముస్లింలు.

అన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్న రజాకార్ల ఘోర కృత్యాల వార్తలలో నిజానిజాలు తేల్చుకోవటం నాకు కష్టసాధ్యంగా అనిపించింది. రాష్ట్రంలో ఎలాంటి దుర్ఘటనలు సంభవించలేదని లాయక్ అలీ, మొయిన్ నవాజ్, నిజామ్ రేడియో, ఇత్తెహాద్ వార్తాపత్రికలు, రాష్ట్ర అధికార ప్రతినిధులతో సహా అన్నీ నొక్కి చెబుతున్నాయి. మరో వైపు ప్రతి హింసలా, ఇత్తెహాద్‌కి చెందని ముస్లింలంతా, ఎన్నో వ్యయప్రయాసలు సిద్ధపడి, ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టి మరీ అసమాన ధైర్యసాహసాలతో, వార్తాపత్రికల విలేఖరులు సేకరించిన విషయాలు నిజమేనని ప్రమాణాలు చేసి మరీ చెప్తున్నారు.

అప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులలో స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ కుదరని పని. రజాకార్లు, స్థానిక పోలీసులు చుట్టూ లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా గ్రామస్థుల దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరయినా తప్పనిసరిగా విషయ సేకరణ జరిపి విచారించాలని పట్టుబడితే, రజాకార్లు, పోలీసులు, గ్రామ ప్రజలను అతనితో కలవనిచ్చేవారు కాదు. ఒకవేళ ఎవరయినా కలిస్తే వారికే నష్టం కలుగుతుందని బెదిరించేవారు. ఒకవేళ ఈ అడ్డంకులన్నీ దాటుకుని ఎవరయినా గ్రామ ప్రజలను కలవగలిగితే, వెనక్కు వెళ్లిపొమ్మని వారిపై నిరంతంతం ఒత్తిడి ఉండేది.

జనవరిలో లాయక్ అలీని సంప్రదించి నేను బెజవాడ (విజయవాడ) కారులో వెళ్ళాలని నిశ్చయించాను. నా వెంట నిజామ్ ప్రభుత్వం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‍ను పంపించింది. నా పర్యటన విషయం పేపర్లలో ప్రకటించగానే దారి పొడవునా ఉన్న గ్రామాల ప్రజలు, దారిలో కాసేపు వారి దగ్గర ఆగాలని విజ్ఞప్తి చేశారు. నేను ఒప్పుకున్నాను.

అయితే విజయవాడ ప్రయాణమయిన తరువాత నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే హైవేలో రెండు వందల మైళ్ళు  ప్రయాణం చేసినా నాకు ఒక్క గ్రామం కూడా దారిలో తగల్లేదు. ఒకే ఒక్క స్థలంలో భయంతో వణికిపోతూ ఓ హిందువు పోలీసులవైపే దృష్టి కేంద్రీకరించి నాతో చెప్పాడు, కమ్యూనిస్టుల అకృత్యాలు వారి గ్రామంలో అధికంగా ఉన్నాయనీ, కమ్యూనిస్టులు తమని వేధిస్తున్నారని. నేను గ్రామాలను దాటే సమయంలో గమనించాను, నా కారు కన్నా ముందు రజాకార్లు సైకిళ్ళపై ప్రయాణిస్తున్నారు!

నేను సికింద్రాబాద్ తిరిగి వచ్చిన తరువాత, తమ గ్రామాల వద్ద ఆగమని నన్ను కోరిన ప్రజలు నన్ను కలవలేకపోయినందుకు క్షమాపణలు తెలిపారు. నాకన్నా ముందు గ్రామం చేరిన రజాకార్లు వాళ్లందరినీ బెదిరించారు. నా కారు ఆ దారి గుండా వెళ్ళే సమయంలో ఎవరైనా రోడ్డు చుట్టుపక్కలా కనిపిస్తే తరువాత వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కొన్ని  నెలల తరువాత బొంబాయి జర్నలిస్టు  హోమీ తాల్‌యార్ ఖాన్, హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, నివేదిక సమర్పించాలనుకున్నాడు. ఆయన రజ్వీని కలిశాడు. రజ్వీ మాటల ప్రభావంలో పడిపోయాడు. ఆ సమయంలో బీదర్ అకృత్యాల సంఘటన జరిగింది. బీదర్ వెళ్ళి పరిస్థితి చూసి నివేదిక రాయమని అతడికి సలహా ఇచ్చాను. అతడికి బీదర్ దర్శించేందుకు రజ్వీ కారును ఇచ్చి పంపాడు.

మరుసటి రోజు ఉదయం రజాకార్ల జెండా కారుపై రెపరెపలాడుతుండగా రజ్వీ కారు వచ్చి దక్షిణ్ సదన్ ముందు ఆగింది. తాల్‌యార్ ఖాన్‌ను బీదర్ తీసుకు వెళ్ళేందుకు వచ్చిన కారు హైదరాబాద్ దాటి ఓ పది మైళ్ళు ప్రయాణించిన తరువాత ఆగిపోయింది. కారు ఆపి దిగిన డ్రైవర్ అసలు విషయం చెప్పాడు. బీదర్ కాదు, నల్గొండ, వరంగల్‍కు తీసుకువెళ్ళి కమ్యూనిస్టుల అకృత్యాలను చూపించమని తనకు ఆదేశాలున్నాయన్నాడు డ్రైవర్. ఆగ్రహంతో తాల్‌యార్ ఖాన్ దక్షిణ్ సదన్‍కు తిరిగి వచ్చాడు.

జన్మభూమి పత్రిక సంపాదకుడు అమృత్‍లాల్ శేథ్‌కు కూడా ఇలాంటి అనుభవమే అయింది. లాయక్ అలీని ఆయన కలిసినప్పుడు బీదర్‍లో అలాంటి దుష్కృత్యాలే సంభవించలేదనీ, అవసరమైతే బీదర్ వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసి రమ్మనీ అన్నాడు. మరుసటి రోజు కారు పంపిస్తాననీ అన్నాడు.

అప్పటికే అతడికి నేను తాల్‌యార్ ఖాన్ అనుభవం గురించి చెప్పాను. బీదర్‍కు కాక మరో ప్రాంతానికి తీసుకువెళ్తారనీ చెప్పాను. ఇది విన్న తరువాత శేథ్ తనతో పాటు బీదర్ వచ్చేందుకు ఓ న్యాయవాదిని కూడా ఆహ్వానించాడు.

మరుసటి రోజు ఉదయం శేథ్ ఉంటున్న గ్రీన్‍ల్యాండ్స్ లోని ప్రభుత్వ అతిథి గృహానికి ఒక అధికారి వచ్చాడు. భారత్, హైదరబాద్‍ల నడుమ ఉన్న ఉద్విగ్నతల దృష్ట్యా  బీదర్ ప్రయాణానికి అనుమతించటం కుదరదని అత్యంత మర్యాదగా చెప్పాడు. ఈ సమయంలో శేథ్ ఆహ్వానించిన లాయర్ అక్కడికి వచ్చాడు. కానీ బయట నుంచున్న రజాకార్లు అతడిని తరిమి తరిమి కొట్టారు. రజాకార్ల నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయన ఏదో ఓ దుకాణంలో దూరి దాక్కున్నాడు.

ఇటువంటి పరిస్థితులలో నమ్మదగ్గ ఆధారాలను సేకరించటం ఎంతో కష్టసాధ్యమైన పని. అయితే, త్వరలో నేను గ్రామాల నుంచి సరైన సమాచారం అందే ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాను. ఇది అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే అందుతున్న సమాచారం ఎంత వరకూ నిజమో నిర్ధారించటంతో పాటు, నేను ఏదైనా సంఘటన జరిగిందనగానే ఢిల్లీ వెళ్ళినప్పుడు, లాయక్ అలీ, పత్రికలలో ప్రచురితమైన విషయాలు, భారత్ రేడియో ప్రకటించే వార్తలు అన్నీ అబద్ధాలని ప్రకటిస్తూ వస్తున్నాడు. కాబట్టి, నా మీద నమ్మకం నిలవాలంటే, నేను చెప్పేవి నిజమని నమ్మాలంటే, ప్రశ్నించే వీలు లేని ఆధారాలతో సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది.

ఢిల్లీలో, అభిప్రాయాలను ప్రభావితం చేయగల కొందరు పెద్దలు, పనిగట్టుకుని నేను భారత ప్రభుత్వానికి సమర్పిస్తున్న ప్రతి నివేదిక కట్టుకథలనీ, నమ్మదగ్గవి కావని ప్రచారం చేస్తున్నారు. వారి ప్రచారం తమ దుష్కృత్యాలకు రజాకార్లు కాదు బోనులో నిలబడాల్సింది, వారి గురించి అబద్ధపు నివేదికలు పంపిస్తున్న ఏజంట్ జనరల్ బోనులో నిలబడాలి. కాబట్టి నాకు అందిన ప్రతి వార్తను నేను క్షుణ్ణంగా పరిశీలించి తగ్గ ఆధారాలను సేకరించి, ఆధారాల విశ్వసనీయతను నిర్ధారించుకున్న తరువాతనే నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version