Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-30

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

నిజానిజాలు గ్రహించిన ముస్లింలు అనేకులు హైదరాబాద్ భవిష్యత్తును ఇత్తెహాద్ చేతుల్లో పెట్టడం పట్ల విస్మయాన్ని వ్యక్తపరచారు. అలాంటి వాళ్ళను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అంతిమంగా హైదరాబాద్ ఓడిపోక తప్పదని నమ్మినవాళ్ళు, ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్య వ్యవస్థ పట్ల అసహ్యం కలిగినవాళ్ళు, నిజామ్ పట్ల విధేయత ఉన్నా, హైదరాబాద్ భవిష్యత్తు భారతదేశంలో విలీనమవటం పైనే ఆధారపడి ఉందని నమ్మినవాళ్ళు. ఇలాంటి వాళ్ళంతా నాతో సంబంధాలు పెంచుకున్నారు.

హైదరాబాద్ భవిష్యత్తు, నిజామ్ మేలు, భారత్‍లో విలీనమవటంపైనే ఆధారపడి ఉండని నమ్మినవాళ్ళలో అత్యంత ధైర్యవంతుడు నవాబ్ మంజూర్ జంగ్. ఆయన తెలివైన వాడు. విచక్షణ కలవాడు. నిస్వార్థపరుడు. కానీ ఇత్తెహాద్‍లు ఈయన పట్ల ఆగ్రహం పెంచుకున్నారు. నేను హైదరాబాద్ చేరటానికి ఎంతో ముందు నుంచీ ఈయన నిజామ్ అనుసరిస్తున్న పద్ధతి ఆత్మహాత్యా సదృశం అని నిరసన ప్రదర్శించాడు.

మంజూర్ నన్ను తరచూ కలుస్తూండేవాడు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దిల్దార్ హుస్సేన్ వంటి తన స్నేహితులను నాకు పరిచయం చేశాడు. దిల్దార్ హుస్సేన్ కూడా మంజూర్ దృక్పథాన్ని సమర్థించేవాడే. మార్చి నెల వచ్చేసరికి ఇత్తెహాద్ సమర్థకులు కింగ్ కోఠీ లోకి మంజూర్ జంగ్‍ను అడుగుపెట్టనివ్వవద్దని నిజామ్ పై ఒత్తిడి తెచ్చారు. చివరికి స్వతంత్ర అభిప్రాయాలున్నందుకు మంజూర్ జంగ్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా వ్యవహరించే మంజూర్ జంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పోలీసు చర్య జరిగిన వెంటనే ఈయన మరణించాడు. భారతదేశ ఆహార మంత్రిగా, నేను భారత్‍లో విలీనమైన ఇత్తెహాద్ రహిత హైదరాబాద్ వచ్చినప్పుడు అతని భార్యని కలిసి నా సంతాపం వ్యక్తపరిచాను.

ఉర్దూ పత్రిక ఇమ్రోజ్ సంపాదకుడు  షోయబుల్లా ఖాన్‍ను నాకు పరిచయం చేసింది మంజూర్ జంగ్. షోయబుల్లా ఖాన్ ఎంతో ధైర్యంగా, పత్రికలో తన శీర్షికల ద్వారా ఇత్తెహాద్‍కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అందుకు ప్రతిఫలం చెల్లించాడు కూడా.

నాకు బాగా సహాయపడ్డ ముస్లింలలో నవాబ్ హోష్‌యార్ జంగ్ ఒకడు. ఈయన నిజామ్‍కు సన్నిహితుడు. ఇష్టుడు. కానీ దీన్‌యార్ జంగ్ ఈయనను శత్రువుగా భావించేవాడు. నవాబ్ హోషియార్ జంగ్ చతురుడు. ఉర్దూ భాషలో ఉద్దండుడు. ఆయన నిజామ్‍ను సంతోషపెట్టాలనుకున్నప్పుడు హాస్య చాతుర్యంతో నిజామ్‍ని నవ్వించేవాడు. అతని మాటలు వినేవారు ఆయన అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఆయన తెలివైనవాడు. దూరదృష్టి కలవాడు. ఆయన నిజామ్ శ్రేయస్సు కోసం పని చేశాడు. భారత్‍తో స్నేహం చేయటం పైనే అసిఫా వంశ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్మినవాడు. ఈయన అంటే సర్ మీర్జాకు ఎంతో అభిమానం ఉండేది. హోష్ ప్రభావంతో ప్రధాని బాధ్యతలు స్వీకరించమని మీర్జాకు ఆహ్వానం అందింది.

హోష్‌కు నన్ను కలిసే అనుమతినివ్వలేదు నిజామ్. అంతేకాదు, నేను పంపే లంచ్ కార్యక్రమ ఆహ్వానాలను ఆమోదించే అనుమతిని కూడా ఇవ్వలేదు. కానీ ఓ రోజు, రాత్రి రెండు  గంటలకు నవాబ్ హోషియార్ జంగ్ నన్ను కలిసేందుకు వచ్చాడని నా ఆఫీసరు నన్ను నిద్రలేపాడు. తలపై టోపీ లేకుండా, కుర్తా పైజామా ధరించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. తనను కనిపెట్టుకుని ఉన్న వారి కళ్ళు గప్పి సేవకులు ఉపయోగించే ద్వారం గుండా దక్షిణ సదన్‍లోకి వచ్చాడు.

అతనితో  ఆ రోజు సుదీర్ఘమైన సంభాషణ నడిచింది. ఆ తరువాత నుంచీ నాకు అతని ద్వారా నిజామ్ ఆలోచనా విధానాన్ని తెలుసుకునే వీలు కలిగింది. అతడివల్ల  రోజు రోజుకీ మారుతున్న  నిజామ్ మానసిక స్థితి  తెలుసుకోగలిగేవాడిని. అతడికి నిజామ్ అంటే అమితమైన అభిమానం. ఎలాగయినా ఇత్తెహాద్‍ల నుంచి నిజామ్‍ను కాపాడాలని తీవ్రంగా ప్రయత్నించాడు. దీన్‍కు తెలియకుండా నిజామ్ నన్ను కలిసేటట్టు చేయటానికి ఎంతో ప్రయత్నించాడు.

ఎప్పటి లాగే ఓ అర్ధరాత్రి నన్ను కలిసినప్పుడు, నిజామ్ తల్లి మరణించిన రోజు జరిగే సాంవత్సరీకాల కార్యక్రమంలో భోజనానికి ఆహ్వానం వస్తే నేను ఆమోదిస్తానా అని అడిగాడు.

“తప్పకుండా” అన్నాను నేను.

ఆ డిన్నర్ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందేట్టు అన్ని ఏర్పాట్లు చేశాడు. అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాలో కూడా నాకు నేర్పించాడు. నేను సమాధిపై పూల చద్దార్‍ను కప్పాలి. రెండు మూడు రోజులలో నాకు ఆహ్వానం అందుతుందని చెప్పాడు.

కానీ నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. కొన్ని రోజుల తరువాత, మేము ఎప్పటి లాగే ఓ అర్ధరాత్రి కలిసినప్పుడు నాకు ఆహ్వానం అందకపోవటానికి కారణం చెప్పాడు. నిజామ్ నాకు ఆహ్వానం పంపమని ఆజ్ఞలు జారీ చేశాడు, కానీ లాయక్ అలీ, దీన్‍లు కలిసి ఆజ్ఞలను నిజామ్ రద్దు చేసేట్టు ఒప్పించారు.

‘మున్షీ ప్రమాదకరమైన వ్యక్తి. అతడిని కలవటం వల్ల లాభం లేదు’ అని నచ్చజెప్పారు. అయితే హోషియార్ జంగ్ చాలా తెలివైన వాడు.

‘నవాబ్ సాహెబ్ ఏమంటున్నాడో అలా హజ్రత్ గ్రహించారా? ఆయన ఏమంటున్నాడంటే అలా హజ్రత్ ఎంత బలహీనుడు, తెలివిహీనుడంటే, మున్షీతో మాట్లాడితే చాలు, తన మెదడుపై పట్టు కోల్పోయి, మున్షీ ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా చేసేసేంత బలహీనుడని అంటున్నాడు. ఇంతకన్నా గొప్పగా మిమ్మల్ని ఎవరూ పొగడలేదు’ అని వ్యంగ్యంగా అన్నాడు.

కానీ నిజామ్ దీన్ మాటలు విన్నాడు. ఆహ్వానం పంపవదన్న ఆజ్ఞ జారీ అయింది.

నేను హైదరాబాదులో ఉన్నంత కాలం తనని కలిసే ఒక్క అవకాశం కూడా నిజామ్ నాకు ఇవ్వలేదు. నా పరిస్థితి గురించి ‘హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్’ అన్న పుస్తకంలో నిజామ్ రాజ్యాంగ వ్యవహారాల మంత్రి నవాబ్ అలీ యావర్ జంగ్ ఇలా వ్యాఖ్యానించారు:

“హైదరాబాద్‍తో దశాబ్దానికి ఒకసారి సంబంధం ఏర్పడాలని మున్షీ జాతకంలో రాసిపెట్టి ఉన్నట్లుంది. 1938లో, బొంబాయి గృహశాఖా మంత్రిగా ఉన్నప్పుడు, హైదరాబాదులో ఆర్యసమాజ్ సత్యాగ్రహం తదనంతర పరిణామాల సందర్భంలో తొలిసారి హైదరాబాద్‍తో సంబంధం ఏర్పడింది మున్షీకి. మళ్ళీ 1948లో భారత్ ఏజంట్-జనరల్‍గా హైదరాబాదులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా బ్రిటీష్ వారి ప్రభావం తొలగని భవనంలో మున్షీ ఉంటే వారి అధికార దాహం మున్షీకి అంటుకుంటుందన్న భయంతో ఆయన నివసించాల్సిన భవనం విషయంలో చెలరేగిన దుమారం రెండవ అనుభవం. మున్షీ భద్రత కోసం, ఓ భవనం ‘దక్కన్ హౌస్’ను ఎంచుకున్నారు. అది భారత ఏజంట్ జనరల్ నివాసం. ‘దక్షిణ సదన్’గా మారింది.

కాబట్టి ‘షాహ్ మంజిల్’, ‘దక్షిణ సదన్’ భవంతుల నడుమ సంబంధాలు హైదరాబాద్, ఢిల్లీల నడుమ సంబంధాల లోని ఒత్తిళ్ళను, ఉద్విగ్నతలను ప్రతిబింబించటం సాధారణంగా  జరిగింది. కానీ ఈ ఉద్విగ్నతలు ఢిల్లీలోని హైదరాబాద్ ఏజంట్ జనరల్, ఢిల్లీ అధికారులు సంబంధాలలో కనిపించలేదు. జైన్ యార్ జంగ్ చర్చలలో పాల్గొనకపోవటం వల్ల రాజకీయ ఒత్తిళ్ళ హెచ్చుతగ్గులు అతనిపై ప్రభావం చూపించలేదు. మున్షీ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన భారత్‍కూ హైదరాబాద్‍కూ జరిగే చర్చలలో పీకల లోతు పాల్గొన్నాడు. దాంతో ఢిల్లీలో జైన్ యార్ జంగ్ ఏమీ పట్టనట్టు సంతోషంగా ఉంటే, హైదరాబాదులో మున్షీ, వాతావరణానికి సరిపోని వ్యవసాయం చేస్తున్న రైతులా తీవ్రమైన ఒత్తిళ్ళలోను, ఉద్విగ్నతలను అనుభవించాడు. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు ఆయన హిస్టారికల్ ఫిక్షన్‍ని ఆశ్రయించాడు. ‘దక్షిణ సదన్’ చుట్టూ అనుమానపు మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ఆ ‘దక్షిణ సదన్’లో శాకాహార భోజనం చేసి, మంచినీళ్ళు తాగేవారు కూడా తీవ్రమైన అనుమానితులు అయ్యారు. మున్షీ నుంచి ఆహ్వానం అందినవారు, ఆమోదించినా, ఆమోదించకున్నా అనుమానితులయ్యారు. పైకి ఎలాంటి చర్యలు చేపట్టనట్టు కనిపించినా మున్షీ ఎంతో చురుకుగా వ్యవహరించాడు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చర్య ఆయనకు తెలుసు. ప్రతి సంభాషణ ఆయనకు చేరేది. ఇలా, లాయక్ అలీతో హైదరాబాద్ సమస్య పరిష్కారానికి సెప్టెంబరు 11న జరిగిన చివరి డిన్నర్ చర్చ వరకూ సాగింది.

ఢిల్లీలో హైదరాబాద్ ఏజంట్ జనరల్ ఎవరంటే వారిని స్వేచ్ఛగా కలవగలిగే వాడు. గవర్నర్ జనరల్ నైనా, సెక్రటరీలనైనా కలవటంలో ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. ఎవ్వరూ అతని ప్రతి అడుగునూ గమనిస్తూండే వారు కారు. ఆయన ఎవరిని కలిసినా ఎప్పుడూ వెన్నంటి ఉండేవారు కారు. ఇందుకు భిన్నంగా హైదరాబాదులో మున్షీ నిజామ్‍ను కలవలేడు. మున్షీని కలవటం విషయంలొ నిజామ్‍కూ, అతని అనుచరులకు నడుమ తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు సాగేవి. మున్షీని ఒంటరిగా కలవాలని నిజామ్ కోరితే, తమలో ఎవరో ఒకరు వెంటలేకుండా నిజామ్ మున్షీని కలవటానికి వీలు లేదని మంత్రులు వాదించేవారు. చివరికి తాము కాక, నిజామ్ కార్యదర్శి నిజామ్ వెంట ఉండేందుకు కూడా మంత్రులు ఒప్పుకోలేదు. అంటే, ఇద్దరు మనుషులు కలిసి ‘టీ’ తాగే ఆలోచనను కూడా వారు వ్యతిరేకించారన్న మాట. మున్షీని కలిసేదుకు ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతిని సూచించమని నిజామ్ మంత్రులతో ప్రాధేయపడే దృశ్యం దయనీయంగా ఉండేది. ఇది చూస్తుంటే హైదరాబాద్ రాజ్యాంగం మారిపోయినట్టు అనిపించేది. గతంలో మంత్రిగా కొనసాగించాలంటే, నిజామ్ విశ్వాసం పొంది ఉండాల్సి ఉండేది. ఇప్పుడు తన మంత్రుల విశ్వాసాన్ని నిజామ్ పొందాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తోంది. చివరికి సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యే వరకూ నిజామ్ మున్షీని ఒంటరిగా కలవలేకపోయాడు. ఆ రోజు ఎంతో ఉద్విగ్నతతో, బాధతో బరువెక్కిన స్వరంతో నిజామ్ రేడియోలో ‘నా మిత్రుడు, మున్షీ’ అన్న సంబోధనతో ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.”

హైదరాబాదులో తెలివైనవాడిగా, రాజకీయ సామర్థ్యం ఉన్నవాడిగా పేరుపొందిన నవాబ్ అలీ యార్ జంగ్, రాజకీయ సన్యాసం స్వీకరించాడు. ఆయన ‘షియా’ అయినందుకు ఇత్తెహాద్‍లు అతడిని ద్వేషించారు. హైదరాబాద్ భారత్‍లో విలీనమవక తప్పదన్న నిజాన్ని గ్రహించినవాడతడు. అతడిపై నిజామ్‍కు అంతులేని విశ్వాసం ఉండేది.

(ఇంకా ఉంది)

Exit mobile version