Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-45

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

ప్రస్తుతం సంభవిస్తున్న పరిణామాల పట్ల న్యూఢిల్లీలో సర్వత్రా సంతృప్తి కనిపించింది. హైదరాబాదు సమస్య పరిష్కారమైపోయిందన్న భావన కలిగింది వారికి. వారి దృష్టిలో లాయక్ అలీ గొప్ప సమన్వయవాది అయ్యాడు. అన్ని షరతులకు దాదాపుగా ఆమోదం తెలిపిన తరువాత, విషయాన్ని బహిరంగం చేసేముందు ఒక్కసారి హైదరాబాదులోని ఇతరుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు లాయక్ అలీ. హైదరాబాద్ ప్రయాణమయ్యాడు.

తరువాత రోజే లాయల్ అలీ మాట మార్చాడు. అసలు తాను ఏ షరతులకూ ఆమోదం తెలపలేదన్నాడు.

మే 28న లాయల్ అలీ నన్ను డిన్నర్‍కు ఆహ్వానించాడు. ఆయన నాకు చూపుతున్న అతి గౌరవం ఆశ్చర్యం కలిగించింది. గత కొన్ని వారాలుగా మా నడుమ సంబంధాలు అంత బాగా లేవు. అయినా అతిగా గౌరవం ప్రదర్శించాడు లాయక్ అలీ.

అతని ప్రవర్తన సంపూర్ణంగా మారిపోయింది. తాను శాంతి కాముకుడనని, ఎవరిపై ఎలాంటి కోపతాపాలు లేవని స్పష్టం చేశాడు. సార్వభౌమత్వం కన్నా విలీనం మరీ అన్యాయమైనదనీ, తాను చచ్చినా విలీనానికి ఒప్పుకోననీ అన్నాడు.

మౌంట్‌బాటెన్‌కూ తనకూ నడుమ జరిగిన చర్చల సారాంశాన్ని నాకు తెలిపాడు. హిందువులు 60 శాతం, ముస్లింలు 40 శాతం  ప్రాతినిధ్యం వహించే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. కానీ ఈ ప్రతిపాదనకు హైదరాబాద్ ముస్లింలు ఆమోదించేట్టు చేయటం కష్టమైన పని అన్నాడు. ఈ ప్రతిపాదన పట్ల నిజామ్‍కు ఎలాంటి వ్యతిరేకత లేదన్నాడు. కాసిమ్ రజ్వీ కూడా ఈ ప్రతిపాదనను  ఆమోదించవచ్చు కానీ అతని అనుచరులు అయిష్టంగా ఉన్నారన్నాడు.

నేను రజాకార్ల గురించి అడిగాను. ఇటీవలి కాలంలో వారు జరిపిన అకృత్యాల గురించి అడిగాను. కొన్ని రోజుల క్రితమే రజాకార్లు ఓ ధనవంతుడైన వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఆడవాళ్ళ ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు. ఆ ఇంట్లోంచి దోపిడీ చేసిన వస్తువులను ఓ లారీలో, జీపులలో నింపుకుని వెళ్లారు. ఒక వేళ ఒప్పందం కుదిరినా, ఓ ప్రత్యేక శక్తిగా ఎదిగిన భారత వ్యతిరేక సంస్థ అయిన రజాకార్లను ఎలా అణచివేస్తారని అడిగాను. ఏదో ఒక రకంగా పరిస్థితిని అదుపులో పెట్టగలమన్న ధీమా ఉందన్నాడు.

ఆయన ఓ అసాధారణమైన కోరిక కోరేసరికి పదకొండు గంటలయింది.

“మున్షీ, నాకు మీ సహాయ సహకారాలు అవసరం” అన్నాడు. “నేను ఓ ప్రయోగం చేస్తున్నాను. హైదరాబాద్, భారత్‍ల నడుమ సంబంధం మెరుగుపడాలని ఉంది నాకు. హైదరాబాద్ భారత్‌కు శక్తిలా ఎదగగలదని నిరూపించే అవకాశం నాకు ఇవ్వాలి. నాకు తెలుసు మీరు నన్ను విమర్శిస్తారని. ఈసారి దయ యుంచి నాకు సహాయం చేయండి. నా దారికి అడ్డు రావద్దని సర్దార్‍కు చెప్పండి. మీరు కూడా నా దారికి అడ్డు రావద్దు.”

ఈ కొత్త ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాదు కనుక భారత్‍తో సత్సంబంధాలు సాధించేందుకు నిజాయితీగా ప్రయత్నిస్తే నేను వీలయినంత తోడ్పడుతానని మాత్రం అనగలిగాను.

న్యూఢిల్లీ ప్రతిపాదనల విషయంలో నా అభిప్రాయం అడిగాడు లాయక్ అలీ. హైదరాబాద్, ఢిల్లీల నడుమ ఎలాంటి సంబంధాలు ఉండాలన్న నిర్ణయం న్యూఢిల్లీదేనని అన్నాను. ఒక వేళ స్నేహపూరితమైన చర్చల ద్వారా భారత్, హైదరాబాద్‍ల నడుమ బంధం బలపడితే వ్యక్తిగతంగా నేను సంతోషిస్తానని చెప్పాను. అయితే భారత్‍తో స్నేహం చేయటం విషయంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాల్సింది నిజామ్ అని చెప్పాను.

“ఇత్తెహాద్‍కు చెందిన వార్తాపత్రికలు భారత్‍ను దుర్భాషలాడటం మానివేస్తే ఎలా ఉంటుంది? రామానంద తీర్థను జైలు నుంచి విడుదల చేయవచ్చుగా?” అని అడిగాను.

“స్వామీ రామానంద తీర్థను విడుదల చేయటం కుదరదు. ఆయన హింసాత్మక కార్యక్రమంలో పాల్గొన్నాడనేందుకు నా వద్ద సాక్ష్యాలున్నాయి” సమాధానంగా అన్నాడు లాయక్ అలీ.

“ఇది నిజం కాదు” అన్నాను నేను. “స్వామీ రామానంద తీర్థకూ, హింసాత్మక సంఘటనలకూ సంబంధం లేదు. ఈ కాలమంతా అయన జైలులోనే ఉన్నాడు. పైగా ఎలాంటి హింసను ప్రోత్సహించనని ఆయన సర్దార్‍కు మాట ఇచ్చాడు. ఆయనను విడుదల చేయటం ఒక స్నేహపూరితమైన చర్య అవుతుంది. భారతదేశం అభినందిస్తుందీ చర్యను” అన్నాను. లాయక్ అలీ ఒప్పుకోలేదు.

“కమ్యూనిస్టుల సంగతి ఏమిటి?” అడిగాను. “కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎత్తివేశారు. స్నేహపూరిత వాతావారణాన్ని నెలకొల్పాలని మీకు నిజంగా ఉంటే, రజాకార్లు, కమ్యూనిస్టులతో ఎందుకని చేతులు కలిపారు? వీరిద్దరూ స్నేహితులవటం పట్ల భారతదేశం మొత్తం సందిగ్ధంలో పడింది”

“పొరుగు ప్రాంతాలలో కమ్యూనిస్టులపై నిషేధం లేదు. అలాంటప్పుడు హైదరాబాదులో నిషేధాన్ని ఎలా కొనసాగిస్తాం?” ప్రశ్నించాడు.

లాయక్ అలీతో నేను సాగించిన అసాధారణ సంభాషణ ఇది. ఆయన 60:40 నిష్పత్తిలో హిందూముస్లింల రాజ్యాంగ సభ ఏర్పాటుకు అంగీకరిస్తాడని నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అందుకు ఆయన అంగీకరించినా, మొయిన్ నవాబ్ జంగ్, రజ్వీలు ఆయన ఆమోదించేందుకు అంగీకరిస్తారా?

నిజామ్ జాగ్రత్తగా వ్యవహారించాడు. ఆయన ఇంగ్లండ్‍లో ఉన్న వాల్టర్ మాంక్టన్‍ను పిలిపించాడు. మౌంట్‍బాటెన్ ప్రతిపాదనలకు సంపూర్ణంగా ఆమోదం తెలిపే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే లాయక్ అలీని ప్రధాని పదవి నుంచి తొలగించే ప్రసక్తి లేదని ప్రకటించాడు.

మాంక్టన్ భారత్ వచ్చాడు. జూన్ 3న లాయక్ అలీతో కలిసి ఢిల్లీ వెళ్ళాడు. మళ్ళీ మాయ తెర పైకి వచ్చింది. అంతకు ముందు లాయక్ అలీ దాదాపుగా ఒప్పుకున్నంత పని చేసిన ప్రతిపాదనలు అదృశ్యం అయ్యాయి. కొత్త ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. వాటిని వి.పి. మీనన్ నిర్మొహమాటంగా తిరస్కరించాడు.

మళ్ళీ కొత్తగా చర్చలు ఆరంభమయ్యాయి. వాల్టర్ రోజుకో కొత్త ప్రతిపాదనల ప్రతిని తెర పైకి తెచ్చేవాడు. పండిట్‍జీకి లాయక్ అలీపై నమ్మకం పోయింది. అతడిని కలవటానికి కూడా నిరాకరించారు. ఎలాంటి ప్రతిపాదనలు చేయవద్దని సర్దార్ మీనన్‍కు సూచించారు. జూన్ 7, 1948న తన దృక్కోణాన్ని స్పష్టం చేస్తూ మౌంట్‍బాటెన్‍కు ఓ ఉత్తరం రాశారు సర్దార్.

ఆగస్టు 15 నుండి హైదరాబాదుతో మన సంబంధాల పరిణామక్రమాన్ని గమనిస్తే, ఇకపై ఎలాంటి ప్రతిపాదనలు చేయటం కూడా వ్యర్థం అనిపిస్తుంది. ప్రతిపాదనలు చేయటం వల్ల చర్చల్లో పాల్గొనే సభ్యులకు అందులోని అంశాలను బహిర్గతం చేసి ప్రచారం చేసుకునే వీలు లభిస్తుంది; అదీ, ఎలాంటి హామీలు ఇవ్వకుండా! ఇదేగాక, హైదరాబాదులో రోజు రోజుకీ దిగజారుతున్న పరిస్థితి పట్ల దేశమంతటా కనిపిస్తున్న ప్రతిస్పందన, సంభవిస్తున్న సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే చర్చలు ఆపేయటం ఉత్తమం అనిపిస్తుంది. ఇటీవలే జరిగిన మన భూభాగంలోని గ్రామంపై దాడి, బర్సీ లైట్ రైల్వేకి కల్పించిన అడ్డంకులు గమనిస్తే, హైదరాబాదు చర్చల సభ్యులతో నిర్మొహమాటంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. వారు బేషరుతుగా మనం ప్రతిపాదించిన మూడు అంశాలపై హక్కును భారత్‍కు అప్పగించాలి. దీనితో పాటు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వ్యవహారాలన్నీ సులభంగా జరిగిపోయేందుకు మధ్యంతర  ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఆయన ఇవే విషయాలు మౌంట్‌బాటెన్‌కు పండిట్‍జీ కూడా రాశారు. విలీనం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం పట్ల ఏర్పాట్ల విషయాన్ని నొక్కి ప్రస్తావించాలన్నారు. ఈ విషయంలో జాప్యం ఎంతగా జరిగితే అంతగా రాజకీయపరంగా, సైనికపరంగా భారత్ నష్టపోతుందన్నారు.

తన సలహాను ఆమోదించకపోతే, చర్చల నుండి వైదొలగుతానని గతంలో లాగే వాల్టర్ బెదిరించాడు.

సుదీర్ఘ చర్చల అనంతరం, జూన్ 23న అందరూ ఆమోదించిన ఒప్పందం ముసాయిదా ప్రతి, ఫర్మాన్‍లు సిద్ధం అయ్యాయి. వాటిల్లోని ప్రధానాంశాలు:

  1. భారత్  మూడు ప్రధాన  కేంద్ర అంశాలపై సంపూర్ణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
  2. రజాకార్లపై నిషేధం విధించాలి.
  3. 1939 నాటి స్టేట్ ఫోర్సెస్ పథకాన్ని అనుసరించి హైదరాబాదు సైన్యం సంఖ్య ఇరవై వేలకి మించకూడదు.
  4. భారత దౌత్య ప్రతినిధి పర్యవేక్షణలో నిజామ్ ప్రభుత్వం ఇతర దేశాలతో వ్యాపార, ఆర్థిక, ధన సంబంధిత లావాదేవీలను నెరపవచ్చు.
  5. ముస్లింలు – ఇతరులు చెరో 50% సంఖ్యతో తాత్కాలిక ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి.
  6. జనవరి 1, 1949 నాటికల్లా ముస్లిమేతరులు 60%, ముస్లింలు 40% ఉండే రాజ్యంగ సభను ఏర్పాటు చేయాలి.
  7. 60:40 నిష్పత్తిలో రాజ్యాంగ సభకు జవాబుదారీ కల కేబినెట్‍ను ఏర్పరచాలి.
  8. పదేళ్ల పాటు ముస్లింల మత, సాంస్కృతిక, పరిరక్షణను పరిగణనలోకి తీసుకుంటూ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  9. జనవరి 1, 1954 కల్లా ఉద్యోగాలలో మతపరమైన నిష్పత్తిని 60:40 కు మార్చాలి.
  10. భారత్‍తో  విలీనం  నిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణ వల్ల జరగాలి.
  11. అత్యవసర పరిస్థితులలో హైదరాబాదును సైనిక కేంద్రంగా మార్చుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది.

తాను తరువాత నిరాకరించే స్వేచ్ఛ ఉన్నంతవరకూ దేనికైనా ఒప్పుకునే లాయక్ అలీ ఈ అన్ని అంశాలకు ఆమోదం తెలిపాడు. ఈ అంశాలకు ఇత్తెహాద్ ఆమోదం తెలుపుతుందని అతడు ఎలా ఊహించాడో నాకు అర్థం కాలేదు.

పదవ తారీఖున లాయక్ అలీ, మాంక్టన్‍లు ఈ అంశాలపై నిజామ్ ఆమోదం పొందేందుకు హైదరాబాద్ వచ్చారు. ఏం జరుగుతుందని అనుకున్నామో అదే జరిగింది.

తాత్కాలిక ప్రభుత్వం విషయంలో, రాజ్యాంగ సభ విషయంలో ఎలాంటి ఒప్పందాన్ని ఆమోదించేందుకు నిజామ్ సిద్ధంగా లేడు. మూడు ప్రధాన అంశాలపై భారత ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఇచ్చేందుకు నిజామ్ ససేమిరా అన్నాడు.

జూన్ 12న వాల్టర్ కొత్త ప్రతిపాదనలతో మళ్ళీ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు.

జూన్ 13న డెహ్రాడూన్‍లో విశ్రాంతి తీసుకుంటున్న సర్దార్ దగ్గరకు మౌంట్‍బాటెన్, పండిట్‍జీ వెళ్ళారు. విషయాన్ని కూలంకుషంగా చర్చించిన తరువాత సర్దార్ కొన్ని సూచనలు చేశారు. వాటి వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆశించారు.

జూన్ 13న, హైదరాబాదులో ఉన్న ఇతర చర్చ బృంద సభ్యులందరినీ సంపూర్ణ నిర్ణయాధికారాలతో ఢిల్లీ రమ్మని మాంక్టన్ కోరాడు. సమస్యను పరిష్కరించేయాలని ఆశించాడు. సభ్యులంతా వచ్చారు. మరిన్ని చర్చలు సాగాయి.

ఓ నాలుగు అంశాలను ఆమోదించాలని నిజామ్ కోరాడు. అవి:

  1. చట్ట సభ, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు విషయంలో, ఏ నిష్పత్తిలో సభ్యులుండాలన్న విషయాలు తన నిర్ణయానికి వదిలివేయాలి.
  2. హైదరాబాదు సైనికుల సంఖ్య మరో ఎనిమిది వేలకు పెంచాలి.
  3. రజాకార్లను వెంటనే కాకుండా, మూడు నెలల తరువాత రద్దు చేస్తారు.
  4. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, సెక్షన్ 102 ప్రకారం భారతాదేశమంతా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడే భారత సైన్యాలు హైదరాబాదులో ఉండవచ్చు. మిగతా సందర్భాలలో భారత సైన్యం హైదరాబాదులో ఉండకూడదు.

నిజామ్ షరతులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా, భారత్ ఐక్యతకు, సుస్థిరతకు కీలమైన మూడు ప్రధానమైన అంశాలు నిజామ్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడతాయి. రాష్ట్రంలో హిందువులు సైతం నష్టపోతారు. కొన్ని శతాబ్దాలుగా వారు ఎలాగో నిజామ్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నారు. ఇప్పుడూ అలాగే జీవిస్తారు.

హైదరాబాదు సైనిక సంఖ్యను 28,000కి పెంచవచ్చు. వారికి సరిపడా ఆయుధాలను, మందుగుందు సామాగ్రిని, ఇతర అవసరమైన అంశాలను భారత్ సరఫరా చేయాలి. ఆ తరువాత, మూడు నెలల తరువాతనే నిజామ్ రజాకార్లను రద్దు చేస్తాడు!

నిజామ్ ఎలాగో తన ప్రధానిని మార్చే ప్రసక్తి లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానీ, రాజ్యాంగ సభ ఏర్పాటు కానీ హైదరాబాదు లోని ఇత్తెహాద్ నేతల ఇష్టాయిష్టాలపై ఆధారపడుతుంది.

లాయక్ అలీ మాత్రం హైదరాబాద్ ఆర్థికంగా, ద్రవ్యపరంగా స్వతంత్రంగా ఎదగటంపై ఆసక్తి చూపాడు. అది ఆయన దృష్టి. ఆయన ఆ విషయం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయానికి పండిట్‍జీని ఒప్పించి లాయక్ అలీకి పండిట్‌జీ రాసే ఉత్తరంలో పొందుపరిచేటట్టు చేస్తానని మౌంట్‍బాటెన్ ఒప్పుకున్నాడు. కానీ ఆర్థికమంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో, పండిట్‍జీ ఈ విషయంపై నిర్ణయం తెలపలేకపోయారు. దాంతో ఈ అంశంపై వివాదం మిగిలిపోయింది.

ఒప్పందం ముసాయిదా ప్రతిలోనూ, నిజామ్ జారీ చేసిన ఫర్మాన్ లోనూ ఈ విషయాలన్నీ పొందుపరిచారు. ఇక చర్చలకు ఎలాంటి ఆస్కారం లేదని అందరూ అభిప్రాయపడ్డారు. నిజామ్ ఈ ప్రతిపాదనలను సంపూర్ణంగా ఆమోదించటమో, తిరస్కరించటమో తప్ప మరో చర్యకు ఆస్కారం లేదని మౌంట్‍బాటెన్‍ అభిప్రాయపడ్డాడు.

న్యూఢిల్లీలో దాదాపుగా ఆమోదం పొందిన అంశాలు నాకు సంతోషం కలిగించలేదు. ఓ వైపు ఇత్తెహాద్‍లు, కమ్యూనిస్టులు ఇష్టం వచ్చినట్టు అరాచకం సృష్టిస్తుంటే, యథాతథ ఒప్పందం ముక్కలు ముక్కలయింది. ఫలితం లేని చర్చలు సాగుతూనే ఉన్నాయి. నేను ఎంతో బాధతో, ఓపికగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం ఒప్పందంలో ఉన్న అంశాలు ఎంతటి అనిశ్చితమైనవంటే, అంతులేని చర్చలు, కొన్ని నెలల పాటు సాగితే కానీ అసలు విషయం ఏమిటో ఎవరికీ అర్థమయ్యే వీలు లేదు.

మరో వైపు హైదరాబాదును నియంత్రించే అధికారులలో  కానీ, వాళ్ళ ఈ దృష్టిలో కాని ఎలాంటి మార్పు లేదు. ఇత్తెహాద్‍‌కు ఏ పరిస్థితులలోనూ ఈ కొత్త ఒప్పందాలను అమలుపరిచే ఉద్దేశం లేదని, సరైన సమయం కోసం ఎదురు చూస్తోందని నాకు అనిపించింది. వీటన్నిటి ఫలితం ఏమిటంటే ఇత్తెహాద్ శక్తివంతం అవుతుంది, మనం బలహీనులమవుతాం. హైదరాబాద్ ప్రజలు బాధలు పడుతూ, గొప్ప మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సర్దార్ అన్నట్టు ‘భారత్ గర్భంలోని కేన్సర్ పెరుగుతూ పోతోంది’.

భారత సమగ్రత ప్రశ్నార్థకమవుతుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version