[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
‘ప్రియమైన సోదరి లీలావతికి,
అయిదవ తారీఖున మీరు రాసిన ఉత్తరం అందింది. ఉత్తరంతో పాటు పంపిన వార్తా పత్రికల కటింగులు అందాయి. ఈ పత్రికలు తరచు నాపై అడ్డదిడ్డంగా దాడులు చేస్తుంటాయి. అలాంటి దాడులను మనం పట్టించుకోకూడదు. ప్రజలకు సేవ చేసే వారి గురించి చెడుగా మాట్లాడేవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. అలాంటి వారిపై కోపం తెచ్చుకోకూడదు మనం. మన పని మనం చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నంత కాలం ఇలాంటి దూషణలు మనల్ని తాకవు. హాని చేయలేవు. కాబట్టి ఈ విమర్శలను పట్టించుకోవద్దు.’
నవంబరు 6న నేను ఏజంట్ జనరల్‌గా రాజీనామాను పంపించాను. నా రాజీనామాను ఆమోదిస్తూ సర్దార్ తమ స్పందనను లేఖ రూపంలో రాశారు.
‘నవంబరు 6వ తేదీతో మీరు రాసిన ఉత్తరం అందింది. హైదరాబాద్ ఏజంట్ జనరల్‌గా ఆఫీసుకు రాజీనామా చేస్తున్న విషయం ప్రస్తావన ఆ ఉత్తరంలో ఉంది. మీ రాజీనామాను భారత ప్రభుత్వం ఆమోదించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీ రాజీనామా 15 నవంబర్ 1948 నుంచి అమల్లోకి వస్తుంది.
హైదరాబాదు, భారత్‌ల నడుమ సంబంధాలు ఉద్విగ్నతామయంగా ఉన్న సమయంలో మీరీ బాధ్యతను స్వీకరించారు. హైదరాబాద్ సమస్య విజయవంతంగా పరిష్కారమవటం కోసం మీరు మీ కర్తవాన్ని చిత్తశుద్ధితో, దీక్షతో, వ్యక్తిగత విషయాలను త్యాగం చేసి మరీ నిర్వహించారు. మీరు ఏజెంట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించిన ఈ పది నెలలు భారతదేశ చరిత్రలో , హైదరాబాద్ చరిత్రలో మరపురానివి. ఈ సమస్య పరిష్కారం కోసం మీరు కనబరిచిన అత్యుత్తమ కర్తవ్య నిర్వహణా దక్షతను భారత ప్రభుత్వం గుర్తించింది. మీరు మీ ఉద్యోగ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించటం సమస్య పరిష్కారంలో తోడ్పడిందన్నది నిర్వివాదాంశం. భారత ప్రభుత్వం ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహించినందుకు భారత ప్రభుత్వం శ్రీ మున్షీ పనితీరుపై సంతృప్తిని ప్రకటిస్తోంది.’
నవంబర్ 19న ఢిల్లీ వెళ్ళాను. నా స్నేహితులంతా హైదరాబాద్‌లో నేను బాధ్యతలను నిర్వహించిన తీరును ప్రశంసించారు. నేను ఎదుర్కున్న కష్టాల పట్ల సానుభూతి ప్రదర్శించారు. కానీ కొందరు వ్యతిరేకతకు ప్రదర్శించారు. నేను వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. నేనేదో పొరపాటుగా ప్రవర్తించినట్టు వ్యాఖ్యానించారు. నేను ఈ విషయం గురించి సర్దార్‌ను అడిగాను “హైదరాబాద్‌లో ఇత్తెహాద్ లను అణచివేయటం వల్ల నేనేం తప్పు చేశాను? నేనేదో ఘోరమైన తప్పు చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు వీరు?”
సర్దార్ నవ్వారు – “నువ్వు ఇత్తెహాద్లను నిర్మూలించటంలో దోహదపడ్డావని కోపంగా ఉన్నారు కొందరు. నువ్వు నిజామ్ను పదవి నుంచి తొలగించే అవకాశం వారికి దక్కనీయలేదని కోపంగా ఉన్నారు. కొందరు నాపై కోపం చూపించలేరు. అందుకని నీ మీద కోపం ప్రదర్శిస్తున్నారు.”
హైదరాబాద్‌లో నాకు అప్పగించిన బాధ్యత దౌత్యపరమైన బాధ్యతగా ప్రకటించినా అది సాధారణమైన దౌత్యపరమైన బాధ్యత కాదు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థపై భారత సమాఖ్యకు అధికారం ఉంటుందన్న ప్రత్యేక ఒప్పందం ద్వారా జనించిన అధికారం అది. ఆ ఒప్పందాన్ని నిజామ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తోందా లేదా, ఒప్పంద పరిధులు ఉల్లంఘించకుండా వ్యవహరిస్తున్నదా, లేదా పర్యవేక్షించాల్చిన బాధ్యత నాది. కాబట్టి హైదరాబాదులో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఆకాశంలో తారలను లెక్కవేస్తూ ఉండలేను. పాకిస్తాన్, పాకిస్తాన్‌కు మద్దతునిచ్చేందుకు జరుగుతున్న కుట్రలు, స్వతంత్ర సాధన కోసం నిజామ్, ఇత్తెహాద్ల ప్రయత్నాలు, సైన్య సమీకరణ, సమాచార వ్యవస్థలో జోక్యం చేసుకోవటం, వాళ్ల కుతంత్రాలు వంటి వాటన్నిటినీ, నేను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎదుర్కొవాల్సి వస్తుంది. వాటికి ప్రతిచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతల విషయాలను పరిశీలిస్తూ , ఈ దృక్కోణంలో , రజాకార్లు, కమ్యూనిస్టుల దృష్ట చర్యలను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
