Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నివురు తొలగింది.. నిజం నిప్పు ఎగిసింది

[నిజాం పాలన చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు గ్రంథంపై కోవెల సంతోష్ కుమార్ గారి సమీక్ష.]

ఏడు దశాబ్దాల క్రితం తెలుగులో రావాల్సిన రచన ఇప్పటికి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్ని పుస్తకాలు.. ఎన్ని వక్రీకరణలు.. ఎన్ని మసిపూసుకున్న మారేడుకాయలు.. ఏటికొక్కటిగా పుస్తకాల రూపంలో వచ్చి పడుతూనే ఉన్నాయి. చరిత్ర కథలు చెప్పుతూనే ఉన్నారు. భారతదేశంలో భారత దేశ సైన్యాన్ని.. యూనియన్ ఆర్మీ చొరబడిందన్నారు. ఊచకోతలకు పాల్పడిందన్నారు. దాష్టీకం చేసిందన్నారు. స్వతంత్ర రాజ్యాన్ని ఆక్రమించుకున్నదన్నారు. ఎర్రకోటమీద ఎర్ర జెండా ఎగురేయాలని కోరుకున్న వారు.. రష్యాకు పోయి మరీ భారతదేశంలో గరిమనాభి లాంటి ప్రాంతాన్ని రాచపుండులాగా మార్చాలని భావించారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఎవరికీ అక్కరలేకుండా పోయాయి. ఆనాడు బాధలు అనుభవించిన వారి మనోభావాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఒక నిజాన్ని అనేకరకాలుగా వంకరలు తిప్పి ఎలా చెప్పవచ్చో వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. చివరకు ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీలు కూడా ఇలాంటి చెత్త కుప్పలను పోషిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఇన్నేండ్ల తరువాత ఆ స్వాతంత్ర్య సిద్ధి కోసం ప్రత్యక్షంగా కృషి చేసి, సాధించిన ప్రత్యక్ష సాక్షి రాసిన నిజమైన చరిత్రను ప్రముఖ రచయిత కస్తూరి మురళీ కృష్ణ  తెలుగులో వెలుగులోకి తీసుకొని వచ్చారు. హైదరాబాద్ సంస్థానంలో భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ గా వ్యవహరించి కరడుగట్టిన రాచరికపు పాలన నుంచి హైదరాబాద్ సమాజానికి విముక్తం కలిపించిన వీరుడు కెఎం మున్షీ 1950లలో రాసిన The End of an Era – Hyderabad Memories గ్రంథాన్ని తెలుగు లోకి మురళీ కృష్ణ ‘నిజాం పాలన చివరి రోజులు, నా హైదరాబాద్ జ్ఞాపకాలు’ పేరుతో అనువదించారు. ఒక సంక్షుభిత కాలంలో  అత్యంత క్లిష్టమైన వాతావరణంలో జీవించి అనుభవించిన వ్యక్తి జ్ఞాపకాలకు అక్షర రూపం ఈ గ్రంథం. ఇది మామూలు చరిత్ర గ్రంథం కాదు. లేదా, ఒక ప్రిజ్యుడీస్‌తో, ఒక భావజాలాన్ని కుమ్మరించి మేకప్ వేసి పాఠకులమీద రుద్దే గ్రంథం ఎంతమాత్రం కాదు. నిజాం రాజ్యపు చివరి రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఇంతవరకు వచ్చిన అనేక ‘చరిత్ర’ అనబడే గ్రంథాలన్నింటినీ ఈ ఒక్క పుస్తకం ఒక్క ఉదుటన ఎత్తి చెత్త బుట్టలో పడేసింది. ఇంగ్లిష్‌లో ఉన్న గ్రంథం తెలుగు వారికి ఇంతకాలం పెద్దగా అందుబాటులోకి రాలేదు. ఈ గ్రంథం ఇప్పుడు తెలుగులోకి రావడం వల్ల కనీసం ఈ తరానికైనా.. ఇంతకు ముందు తరానికైనా నిజం ఏమిటో తెలిసే అవకాశం లభించింది. ఇంతకాలం నిప్పులాంటి నిజంపైన ఉన్న నివురును కస్తూరి మురళీకృష్ణ ఈ పుస్తకంతో తొలగించి వేశారు. ఇది కేవలం ఒక టైమ్ లైన్ రాయటమో.. లేక కొన్ని ఘటనలను గుదిగుచ్చి ఒకచోట కూర్చి పేర్చిన గ్రంథమో కాదు. ఏడవ నిజాం రాజ్యపు చివరి దశలో హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్న రాజకీయ సామాజిక పరిపాలన వ్యవస్థల్లోని గందరగోళాన్ని కేవలం ఘటనల రూపంలో కాకుండా మన అనుభూతులుగా చిత్రీకరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం పాలన చివరి రోజులకు ఈ గ్రంథం ఒక రికార్డు కాదు. ఇది ఒక సాక్ష్యం. ప్రబలమైన సాక్ష్యం.

ఈ అనువాదాన్ని తాను ఎందుకు చేయవలసి వచ్చిందో మురళీకృష్ణ చాలా స్పష్టంగా తన ముందుమాటలోనే చెప్పారు. 1948 సెప్టెంబర్ 17 న నిజాం స్వతంత్రంగా ఉండాలన్న కోరిక అంతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిపోయాయి. అయితే ఆ కాలంలో ఏం జరిగిందన్న అంశంపై రకరకాల పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒకే దృక్కోణంలో కూడబలుక్కొని రాసినట్టుగానే ఉన్నాయి. అదే సమయంలో ఆనాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మున్షీ రాసిన ఎండ్ ఆఫ్ ఆన్ ఎరా అన్న పుస్తకం తెలుగులో అందుబాటులో లేదు. కనీసం అలాంటి ఓ పుస్తకం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మార్క్సిస్టు చరిత్రకారుల పుస్తకాలు చదివి ఆవేశంగా మాట్లాడేవారికి ఈ పుస్తకంలోని  నిజాలు మింగుడు పడవు. ఈ క్రమంలోనే మురళీకృష్ణ ఈ పుస్తక అనువాదానికి పూనుకున్నారు. ఇందుకోసం భారతీయ విద్యాభవన్ వారి అనుమతి తీసుకొని దీన్ని అనువదించి సంచిక వెబ్ మ్యాగజైన్‌లో ధారావాహికగా ప్రచురించి తరువాత పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు.

ఇది కేవలం హైదరాబాద్ సంస్థానానికి మాత్రమే పరిమితమైన విషయంగా భావించవద్దు. మన దేశ స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఒక ముఖ్యమైన రాజకీయ మలుపును ఈ గ్రంథం రికార్డు చేసింది. ఇది మున్షీగారి జ్ఞాపకాల కథగానే మొదలైందేమో కానీ, అది వ్యక్తిగతమైన పరిధులను దాటి ఒక నిరంకుశ రాజ్యం అంతానికి సంబంధించిన చారిత్రక విశ్లేషణగా పరిణమిస్తుంది. 1947–48 మధ్య కాలంలో మున్షీ హైదరాబాద్ లో  నిర్వహించిన భూమిక ఈ గ్రంథానికి ప్రాథమిక మూలం. కాబట్టి తరువాతి కాలంలో రాసిన చరిత్ర రచనల మాదిరిగా ఊహాగానాలపై ఆధారపడింది కాదు. ఇది ఒక ప్రైమరీ రిసోర్స్.

మురళీకృష్ణ అనువాదం తెలుగులో మున్షీ రచనకు పెద్ద బలం అని చెప్పవచ్చు. ఇతరులు అనువదిస్తే ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను కానీ.. మూల రచనలో ఉన్న మానసిక ఒత్తిడులను, భయాలను, సంక్షుభిత పరిస్థితులను, అంతర్గతంగా మున్షీ చెప్పిన భావాలను చాలా సహజంగా కృత్రిమత్వం లేకుండా అనువాదం సాగుతుంది. మురళీకృష్ణ సహజంగా కథకుడు కాబట్టి.. అనువాదం చాలా బలంగా వచ్చింది. ‘చరిత్ర తెలియనివారు చరిత్రలో జరిగిన తప్పులను పదే పదే చేస్తుంటారు అన్న సూక్తి ఎంత నిజమో ఈ పుస్తకం నిరూపిస్తుంది’ అని అనువాదకుడు అన్న మాట అక్షర సత్యం.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు. మన దేశ రాజకీయ సమీకరణాల్లోనే మౌలికమైన మార్పును సూచించిన ఘటన. ఈ మార్పును లోపలి నుంచి గమనించిన వ్యక్తి వ్రాసిన గ్రంథం కావడం వల్ల The End of an Era కు ప్రత్యేకమైన చారిత్రక ప్రాముఖ్యం లభించింది. మున్షీ తన అనుభవాలను రాజ్యాంగ పరిమితులు, అంతర్జాతీయ చట్ట సూత్రాలు, బ్రిటిష్ పాలనా వారసత్వం వంటి విస్తృత అంశాలతో అనుసంధానిస్తూ వివరించారు. దీన్ని కస్తూరి మురళీకృష్ణ మరింత సున్నితంగా, నిజాయితీగా, చరిత్రలోని అష్టవంకరలను సరిచేస్తూ సాగింది. ఒక రకంగా చెప్పాలంటే మున్షీ మూల రచనకు కస్తూరి వారు తిరిగి ప్రాణం పోశారు.

మున్షీ తన రచనను చూసి రాసింది కాదు. తానే చరిత్రలో భాగస్వామి అయి రాసింది. ప్రజాస్వామ్య హక్కులు లేని పరిపాలనావ్యవస్థ, ప్రజల ఆమోదం లేకుండా ఉన్న ఏ రాజ్యాధికారమైనా ఎంతోకాలం నిలదొక్కుకోలేదనడానికి ఏడో నిజాం పాలన చక్కటి ఉదాహరణ. చరిత్ర కోణంలో ఈ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు నెహ్రూ కాలపు భారతదేశ చరిత్ర రచనలో అత్యంత ముఖ్య భాగంగా దీన్ని చూడవచ్చు. హైదరాబాద్ పరిణామాలను ఒక కేస్ స్టడీగా తీసుకొని మన దేశంలో సమాఖ్య వ్యవస్థ, జాతీయ సమైక్య సిద్ధాంతం ఎలా అమలయ్యాయో ఈ గ్రంథం మనకు చెప్తుంది.

హైదరాబాద్ సంస్థానం భారత ఉపఖండ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణంగా ఎదిగింది. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన అనంతరం, దక్కన్ ప్రాంతంలో ఏర్పడిన ప్రాంతీయ అధికార వ్యవస్థలలో హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది. నైజాం పాలకులు తమ అధికారాన్ని మొదట మొఘల్ చక్రవర్తుల ప్రతినిధులుగా ప్రారంభించినప్పటికీ, కాలక్రమేణా స్వతంత్ర రాజ్యాధికారులుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అయితే ఈ ‘స్వతంత్రత’ ఆధునిక రాజకీయ భావనలో సార్వభౌమత్వంగా పరిగణించదగినదేనా అన్న ప్రశ్నను మున్షీ తన గ్రంథంలో మూలస్థాయిలో లేవనెత్తారు. హైదరాబాద్ రాజ్యం ఏనాడూ సర్వస్వతంత్ర సార్వభౌమ దేశంగా లేదు. కేవతం బ్రిటిష్ వారు పారామౌంట్సీ సూత్రం ప్రవేశపెట్టి సంస్థానాల సార్వభౌమత్వాన్ని నిర్వీర్యం చేశారు. నిజాం రాజుకు అంతర్గతంగా  పరిపాలనలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ, రక్షణ, రవాణా, విదేశాంగ విధానం ఇవేవీ అతని పరిధిలో లేవు. వాళ్లు ఇక్కడి రెసిడెన్సీలో ఉండి నిజాంను నియంత్రించారు. ఈ అంశాన్ని మున్షీ చాలా స్పష్టంగా చెప్తారు. కానీ మన చరిత్రకారులు మాత్రం నిజాం స్వతంత్రరాజు అని ఇన్నేండ్లుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ‘1926లో రాజ్య అంతర్గత వ్యవహారాల విషయంలో తాను స్వతంత్రుడని నొక్కి చెప్పాడు నిజామ్.  ఫలితంగా మార్చి 27 న భారత వైస్రాయ్ లార్డ్ రిప్పన్ ఇచ్చిన సమాధానం చాలా ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ ఆధిక్యత తిరుగులేనిదని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. బ్రిటిష్ సర్వాధిక్యత అద్వితీయం’ అని స్పష్టం చేశాడు. దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడే బాధ్యత తమదేనన్నాడు.’ (పే.44) ఇప్పుడు చెప్పండి నిజాం ఎట్లా సర్వ స్వతంత్రుడు అయ్యాడో?

ఈ గ్రంథంలో మొదట చర్చించింది హైదరాబాద్ లో రాజ్యాధికారం ఉన్నట్టు పైకి కనిపించినా, చెదిరిపోయిన పరిపాలన, యంత్రాంగం పతనం కావడం, అధికారుల మధ్య అయోమయం, ఒక రకమైన భయంతో పనిచేయలేని పరిస్థితిని.

ఈ గ్రంథంలో ఆనాటి హైదరాబాద్‌లో పరిస్థితులను కూడా వివరంగా చెప్పుకొని వస్తాడు. ఇవాళ కమ్యూనిస్టులు మాట్లాడే భావ ప్రకటనస్వేచ్ఛ అన్నది ఆనాడు ఏ కోశానా లేదు. భారత సైన్యం వచ్చి విలీనం చేసుకున్న తరువాతే వీళ్లకు ఆ స్వేచ్ఛ మిగతా ప్రజలతో పాటు వచ్చింది. ఎట్లాంటి పుస్తకాలు రాయడానికైనా అవకాశం చిక్కింది. నిజాం చివరి రోజుల్లో నియతృత్వం అనేది పిశాచ తాండవం చేసింది. “ఓయి నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని”  అని దాశరథి అన్న మాట నిజం. ఈ గ్రంథంలో అలాంటి అనేక ఘటనలు మనకు కండ్లముందు కనిపిస్తాయి. ముఖ్యంగా రజాకార్లు అప్రకటిత రాజ్యాధికార శక్తిగా ఎలా మారారో మున్షీ చాలా స్పష్టంగా వివరిస్తారు. వారి దౌర్జన్యాలు, సామాన్య ప్రజల్లో వారు సృష్టించిన భయం, పరిపాలనలో వారికి ఎదురులేని తనం.. చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతాయి. మతం అనేది ఆధ్యాత్మిక సాధనకు కాకుండా.. రాజ్యాధికార సాధనకు ఉపకరణంగా ఎలా మారిందో మనం నిజాం పాలనలో చూడవచ్చు. మహమ్మద్ బిన్ ఖాసిం నుంచి ఇస్లాం చొరబాటుదారులు అనుసరించిన అరాచక సిద్ధాంతం హైదరాబాద్‌లో మరింత కఠినంగా అమలైంది. మతపరమైన సామాజిక ఉన్మాద వాతావరణంలోనే మజ్లిస్–ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్, రజాకార్ ఉద్యమం ఎదిగిందని మున్షీ విశ్లేషిస్తారు. ఆయన దృష్టిలో, రజాకార్లు కేవలం మతపరమైన స్వచ్ఛంద సైన్యం కాదు; వారు నైజాం పాలనకు మద్దతుగా నిలిచిన ఒక అర్ధసైనిక శక్తి. ప్రజాసమ్మతి కోల్పోయిన రాజ్యాధికారాన్ని నిలబెట్టేందుకు, హింసను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించిన ఉదాహరణగా ఈ ఉద్యమాన్ని మున్షీ చూపిస్తారు. రాజకీయ వ్యవస్థ మతాధీనంలోకి పోవడం ఎంత ప్రమాదకరమో రజాకార్లు విజృంభణ తరువాత నిజాం రాజ్యంలో జరిగిన పరిణామాలు ఉదాహరణగా చెప్పవచ్చు. మతం పేరుతో, మతం ఉనికితో సర్వ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని అనుకోవడం భారతదేశ జాతీయ భావనకు ఎంత ముప్పో మున్షీ చాలా క్లారిటీగా చెప్తారు. హైదరాబాద్ స్వతంత్ర దేశం కాకపోతే.. భారత గరిమనాభి రాచపుండుతో ఎప్పటికీ బాధ పడాల్సి వచ్చేది.

మున్షీ తన గ్రంథంలో హైదరాబాద్ సమాజాన్ని ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్న సమాజంగా ఎంత దయనీయ స్థితిలో ఉన్నదో ఉదాహరణలతో సహా వ్యాఖ్యానించారు. ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నదో పేర్కొంటారు. 1939 లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి రావటాన్ని నిషేధించడం, వందేమాతరం పాడినందుకు బంధించి ఆంక్షలు విధించడం వంటి అనేక ఘటనలను ఇందులో చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మెజార్టీ ప్రజలకు నిజాం రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ప్రజలు, రాజ్యం వేరువేరుగా విడిపోయాయి. ఈ కారణంగానే ప్రజల్లో పెరిగిన అసంతృప్తి నిరసన రూపంలో వ్యక్తమయ్యే అవకాశం లేక.. సాయుధ పోరాటం వైపు మారింది. ఇది తీవ్రమైన అణచివేతకు దారితీసింది. రజాకార్లు ఈ భయంకరమైన అణచివేతకు కారకులయ్యారు. దీనికి తోడు కమ్యూనిస్టులు భూపోరాటం పేరుతో మరోరకమైన తీవ్రమైన హింసకు దిగారు. ‘నల్గొండ జిల్లాపై పట్టు బిగించేందుకు చట్ట వ్యతిరేకంగా కమ్యూనిస్టులు హింసకు పాల్పడ్డారు. ఎక్కడెక్కడ కమ్యూనిస్టులు హింసకు పాల్పడ్డారో, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారో.. అక్కడ పోలీసులు ఉండేవారు కాదు.’ (పే.59) ఇట్లా పోలీసులతో కుమ్మక్కయిన కమ్యూనిస్టులు హైదరాబాద్ విమోచనకు కారకులు అంటే ఎలా నమ్మాలి? హైదరాబాద్ సమాజంలోని ఈ భయవాతావరణం భారత ప్రభుత్వానికి ఎదురైన ప్రధాన నైతిక సవాలుగా మున్షీ చెప్తారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటారు.  భారత సార్వభౌమత్వానికి, ప్రజల భద్రతకు ముప్పుగా ఆయన చెప్తారు.

1947 లో బ్రిటిష్ పాలన ముగిసిన తరువాత భారతదేశం ఒక కొత్త రాజ్యాంగబద్ధమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకునే దశలో ఉంది. ఈ దశలో సంస్థానాల సమస్య మారిన సంక్లిష్టతను తొలగించుకోవటం అనివార్యతగా స్పష్టంగా చెప్తారు. ఈ అనివార్యతకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన రూపం హైదరాబాద్ సంస్థానం. భారత ప్రభుత్వానికి, నిజాం పాలకుడికి మధ్యన జరిగిన స్టాండ్ స్టిల్ ఒప్పందం  హైదరాబాద్‌ను తక్షణ విలీనానికి బదులుగా, యథాతథస్థితిలో కొనసాగించే లక్ష్యంతో చేసుకున్నది. దౌత్య ప్రయత్నాలకు సమయం ఇచ్చే ఉద్దేశంతో మాత్రమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారే తప్ప శాశ్వత ఒప్పందం కాదు. కానీ నిజాం ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకోవాలని నిజాం ప్రయత్నించాడు. ఈ దశలోనే హైదరాబాద్ పై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అయింది.

ఆపరేషన్ పోలో భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన, నిర్మాణాత్మకమైన చారిత్రక ఘటన. దీన్ని కమ్యూనిస్టులు వివాదాస్పదం చేయడం ఒక వక్రీకరణ. ఇది సైనిక చర్య కాదు. పోలీస్ చర్య. ఇది విదేశీ ఆక్రమణ కాదు. భారత సమాఖ్యలో చట్టబద్ధత కోల్పోయిన ఒకానొక ప్రాంతాన్ని తిరిగి రాజ్యాంగ పరిధిలోకి తీసుకొని రావటమే. శాంతిభద్రతలు క్షీణించిన హైదరాబాద్‌లో సుపరిపాలనను పున:స్థాపించడానికి బలప్రయోగం అనివార్యమైంది. ఇదే అంశాన్ని మున్షీ చాలా బలంగా ఆధారాలతో సహా వివరిస్తారు. ఈ క్రమంలో సర్దార్ పటేల్ చొరవ, కాశిం రజ్వీ దుర్మార్గాలు, పటేల్ కు తాను రాసిన లేఖలు.. తరువాత పటేల్ నిర్ణయాత్మకమైన కార్యాచరణకు పూనుకోవడం వంటివన్నింటినీ మున్షీ మన కండ్ల ముందుంచుతారు. తెలుగువారి చరిత్రలో ఈ కాలానికి  ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. హైదరాబాద్ చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకోవడానికి ఇది మాత్రమే ఆధారం అని చెప్పవచ్చు.

ఈ రచనలో ఎక్కడా కూడా అనువాదకుడు కనిపించడు. మూల రచయితే ప్రత్యక్షంగా మన ముందు నిలబడి కథ చెప్తున్నట్టు ఉంటుంది. ఏ పేజీలో కూడా ఇది అనువాదం అన్న భావన ఒక్క సారి కూడా కలుగదు. మున్షీయే తెలుగులో రాశారా అన్నంత సహజంగా ఉంటుంది. మూలంలో ఉన్న సంక్షోభ భావనలను వర్ణించిన తీరు మురళీకృష్ణలోని సెన్సివిటీకి ఉదాహరణ. ఈ రచనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యక్తీకరణ. ఎక్కడా కూడా తీవ్రమైన పదాలు కనిపించవు. రెచ్చగొట్టే వాక్యాలు ఒక్కటి కూడా ఉండదు. ఇక్కడ ఆనాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మున్షీ స్వరాన్ని మాత్రమే వినిపించారు. చరిత్రను వక్రీకరించని వ్యక్తీకరణ ఇది. మతాలకు అతీతంగా.. కేవలం 80 సంవత్సరాల క్రితం నాటి కాలమాన పరిస్థితులను అభివ్యక్తం చేసే రచన ఇది. తప్పకుండా అందరూ చదివి తీరాల్సిన గ్రంథం. హైదరాబాద్ నిజమైన చరిత్రను తెలుసుకోవాలంటే ఉన్న ఏకైక ఆధారభూతమైన గ్రంథం ఇది.

***

నిజాం పాలన చివరి రోజులు
పేజీలు: 328
వెల: 250/-
ప్రతులకు:
సాహిత్య నికేతన్, బర్కత్‌పురా, హైదరాబాద్.
ఫోన్: 9441433188
~
నవోదయ బుక్ హౌస్
కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 9000413413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/nizam-paalana-chivarirojulu-na-hyderabad-gnapakalu

~
సాహితీ ప్రచురణలు,
చుట్టుగుంట, విజయవాడ.
ఫోన్: 9849992890
ఆన్‌లైన్‌లో:
https://sahithibooks.com/book/68c94cfdf55ae7213eb554c3

Exit mobile version