Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరిత్ర గతి తప్పకుండా కాపాడడంలో తోడ్పడే పుస్తకం – ‘నిజాం పాలన చివరి రోజులు’

[కస్తూరి మురళీకృష్ణ అనువదించిన ‘నిజాం పాలన చివరి రోజులు – నా హైదరాబాద్ జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ ఎన్. వి. హనుమంతరావు.]

హైదరాబాద్ రాష్ట్ర విమోచనం గురించి అప్పుడప్పుడు చదవటం, వార్తలు వినటం తప్ప 1998 వరకు నాకు పెద్దగా అవగాహన లేదు. 1998లో హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దూరదర్శన్‌లో ఒక డాక్యుమెంటరీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి మధుసూదనరావుగారి ప్రోద్బలంతో ఈ డాక్యుమెంటరీ నిర్మించడం జరిగింది. అప్పుడే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది.. నిరంకుశ నిజాం రాజుకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు జరిగాయి.. ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా డాక్యుమెంటరీ కోసం ఆనాడు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, జీవించి ఉన్న వ్యక్తులు, మరి కొంతమంది ప్రముఖులతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. వారిలో కోదాటి నారాయణరావు, ఎమ్మెస్ రాజలింగం, కాళోజీ నారాయణరావు, సిహెచ్ విద్యాసాగర రావు, కె. కేశవులు, వందేమాతరం రామచంద్రరావు, చెన్నమనేని రాజేశ్వర రావు మొదలైన వారు ఉన్నారు. వీరందరూ ఆనాటి పోరాటంలో తమ అనుభవాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నో గ్రామాలు తిరగటం జరిగింది. ఆనాటి వరంగల్ జిల్లాలో మరో జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించిన బైరాన్‍పల్లి గ్రామానికి వెళ్లి రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇలా ఎన్నో అనుభవాలు..

అప్పటినుండి రాష్ట్ర రాజకీయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ సెప్టెంబర్ 17వ తేదీ ప్రాముఖ్యత కూడా మారుతూ వస్తోంది. ఈ మార్పులను ఉత్సాహంగా గమనిస్తూ ఉండేవాడిని. ఇదమిత్థంగా కారణం తెలియదు కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ 17వ తేదీ ఉత్సవాలను అధికారికంగా జరపడం లేదు. ఎవరి అవసరాలు, కారణాలు వారికున్నా నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం, భారతదేశంలో విలీనమవాలన్న బలమైన ఆకాంక్ష, ఆనాటి హైదరాబాద్ సంస్థానం ప్రజల దీక్ష మాత్రం అపూర్వం, అనిర్వచనీయం. ఇలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను గమనిస్తూ ఆ వివరాలను తెలుసుకుంటున్న పరిణామక్రమంలో కొంతమంది నిజాం ప్రభువుకు అనుకూలంగా పుస్తకాలు కూడా రాయటం జరిగింది. అందులో అత్యంత దుర్మార్గమైన పుస్తకం ‘ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ . ఆనాటి నిజాం ప్రధానమంత్రి లాయిక్ ఆలీ రచించిన ఈ పుస్తకం చదివిన తర్వాత ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి అయ్యాను. ఈ పుస్తకం ఏడేళ్ల క్రితం చదివినా ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. “ఇందులోని సన్నివేశాలను సందర్భాలను మీరు అంగీకరిస్తారా?” అని ఈ పుస్తకాన్ని అనువదించిన రచయితను అడిగాను. “వాటితో నాకు సంబంధం లేదు, నేను అనువాదకుడి మాత్రమే” అని ఆయన సమాధానం ఇచ్చారు.

మరి ఆనాటి సంఘటనలను ఎవరు వివరిస్తారు? వాటికి ప్రత్యక్ష సాక్షి ఎవరు?  అని వెతికితే కె.ఎమ్.మున్షీ పేరు గుర్తుకు వచ్చింది. ఆయన భారతదేశ ప్రతినిధిగా నిజాం చివరి రోజులలో హైదరాబాదులో పనిచేసిన గొప్ప రచయిత, చరిత్రకారుడు, దార్శనికుడు, రాజకీయ ప్రజ్ఞాశాలి. ఆనాటి మిలిటరీ చర్య, నిజాం లొంగుబాటు మొదలైన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. వీటిని వివరిస్తూ The End of an Era అనే పుస్తకం రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ ద్వారా తెలుగు అనువాదం మన ముందుకు వచ్చింది. కె.ఎమ్. మున్షీ ఈ దేశ ప్రజలకు అందించిన విషయాలు ఏమిటి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం.

హైదరాబాద్ రాష్ట్రం నేపథ్యం గురించి, ప్రారంభంలోనే రచయిత వివరిస్తారు. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటానికి తయారు చేసిన బిల్లు చిత్తుప్రతిని చూసి ఆనాటి నాయకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బిల్లు వల్ల దేశంలోని అనేక సంస్థానాలు స్వతంత్రం అవుతాయి. స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడుతాయి. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. నిజానికి హైదరాబాద్ రాష్ట్రం ఏనాడు సర్వ స్వతంత్రంగా లేదు. నిజాం రాజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అని రచయిత వివరిస్తారు. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం, నిజాం అధికార లాలస, డబ్బు మీద ప్రేమ, నిజామ్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు పన్నిన పన్నాగాలు, కుతంత్రాలు.. ఇత్యాది విషయాలు అనువాదకుడిగా కస్తూరి మురళీకృష్ణ మనందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించారు.

కె.ఎమ్. మున్షీ జనవరి 5న హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఒక మూడు నాలుగు నెలలు లోపలే భారత ప్రభుత్వం తలుచుకున్న కార్యం పూర్తి కాగలదని ఆశించారు. కానీ చివరకు ఆయన హైదరాబాద్ రాష్ట్రంలో 9 నెలలు ఉండాల్సి వచ్చింది. నిజాం ఆఖరి ప్రధానమంత్రి లాయక్ ఆలీ మున్షీకి న్యాయవాద వృత్తిలో క్లయింట్. వారిద్దరి మధ్య మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అయినా సరే ఆయనతో సహా హైదరాబాద్ రాష్ట్రంలో అధికార పక్షంలో ఎవరూ కూడా మున్షీ రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు.

నిజాం పాలనలో చివరి రోజులు అంటే మనం తప్పకుండా తెలుసుకోవలసింది రజాకార్లు,  వారి నాయకుడు ఖాసిం రజ్వీ గురించి. దీనికోసం రచయిత ఒక అధ్యాయాన్ని కేటాయించారు. ఆ రోజుల్లో రజాకార్లు భారతదేశం లోని ఇతర ప్రాంతాలకు మారు వేషాలలో వెళ్లి అక్కడ ముస్లింలను సమీకరించి వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలను అందించి హైదరాబాద్‌కు తీసుకువచ్చేవారట. అంటే ఈనాడు మనం చూస్తున్న తీవ్రవాదానికి మూలం ఒకరకంగా ఇక్కడే ప్రారంభమైందన్నమాట. ముస్లిం రాజ్యం స్థాపించాలని నిజాం కల. ఆ కలలకు అనుగుణంగానే ఆయన అనుయాయులు హైదరాబాద్ రాష్ట్రంలోని హిందువులను నిర్మూలించటం, మత మార్పిడులు చేయటము లేదా వారిని తీవ్రంగా హింసించి హత్యలు చేయడం జరిగింది.

భారతదేశ చిత్రపటాన్ని చూస్తే అందులోహైదరాబాద్ మధ్యలో ఉంటుంది. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో కలపాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ పుస్తకంలో వివరించిన చిన్న ఉదాహరణ.. ఆగస్టు 15న మద్రాసు – బొంబాయి రైలు హైదరాబాదులో ప్రవేశించగానే ఆ రైలులో ఉన్న జాతీయ జెండాలు పీకేసి హిందువుల మీద దాడులకు ఎగబడ్డారు ఖాసిం రజ్వీ అతని అనుచరులు. ఒక దేశం మధ్యలో మరొక దేశం ఏర్పడటం అన్న ఊహే భయంకరంగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు నిలయమై ఉంటుంది. అందుకే హైదరాబాదు రాష్ట్రం భారత్ యూనియన్‌లో కలపాల్సిన అగత్యం ఏర్పడింది.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్రానికి సర్వ స్వతంత్రుడుగా ప్రకటించుకున్నాడు. దీనికి కారణం బ్రిటిష్ వారి కుతంత్రం. సంస్థానాధీశులు  అందరూ భారతదేశంలో విలీనం అవ్వచ్చు లేదా పాకిస్థాన్‍తో కలిసి పోవచ్చు, రెండూ కాదంటే స్వతంత్రంగా ఉండటానికి కూడా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. అందుకే నిజాం ప్రభువు ఎవరితోనూ కలవకుండా స్వతంత్ర దేశంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. దానితో హైదరాబాద్ రాష్ట్రంలోని రజాకార్లు కాశీం రజ్వి నాయకత్వంలో రెచ్చిపోయారు. హిందువుల ఊచకోత ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రారంభమైంది. భారత్ యూనియన్‌తో అనేక ఒప్పందాలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. సర్దార్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ యూనియన్‌లో విలీనం చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. చివరికి రెండు వర్గాల మధ్య ఒక సంవత్సరం పాటు యథాతథ ఒప్పందం జరిగింది. ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అవుతుందని పటేల్, ఆయన అనుచరులు భావించారు. అదే సమయంలో భారత్ సైన్యాలను హైదరాబాద్ వదిలి వెళ్ళేటట్టు చేసి సంపూర్ణ స్వాతంత్రం సాధించేందుకు లభించిన సమయం అని నిజాం, అతని సమర్థకుల విశ్వాసం. కానీ చివరకు నిజాం కోరిక నెరవేరలేదు కదా..

హైదరాబాద్ రాష్ట్రంలో రజాకార్ల ఆకృత్యాలు పెరిగిపోతున్న సమయంలో కమ్యూనిస్టులు పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో తమ పట్టును ఎలా పెంచుకున్నారో రచయిత 12వ అధ్యాయంలో వివరిస్తారు. అనేక గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని సైతం ఆక్రమించి కమ్యూనిస్టులు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. చివరకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా కమ్యూనిస్టులు తమ లక్ష్యం సాధించాలని భావించారట. రజాకార్లు మాత్రమే కాదు ఇలాంటి పరిస్థితులలో కమ్యూనిస్టులను కూడా అణిచివేయకపోతే దేశవ్యాప్తంగా అరాచకం సంభవించే అవకాశం కలుగుతుందని రచయిత వివరిస్తారు.

నిజాం పోలీసులు, గూఢచారులు కె.ఎమ్.మున్షీ చుట్టూరా ఉండేవారు. నిజాం ఏర్పరచిన పటిష్టమైన గూఢచార వ్యవస్థ కె.ఎమ్. మున్షీ చుట్టూ పనిచేస్తూ సమాచారాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేరవేస్తూ ఉండేవారు. వ్యవస్థ ఇలా ఉండటంతో మున్షీ కూడా దానిని ఉపయోగించుకొని చాలా సమాచారాన్ని సేకరించారు. కేవలం కొద్దిమంది హిందువులు మాత్రమే స్వేచ్ఛగా రచయితను కలిసేవారట. ఇలా నిజాం రాజ్యం లోని అనేకమంది ప్రముఖులు మున్షీని కలిసిన సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా ఒక అధ్యాయంలో వివరించారు. నవాబ్ మంజూర్ జంగ్, పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్, నవాబ్ హోష్ యార్ జంగ్, సర్ మెహదీ యార్ జంగ్ మొదలైనవారు భారత్‍తో విలీనం హైదరాబాద్ సంస్థానానికి మేలు చేస్తుంది అనే నమ్మకంతో మున్షీకి దగ్గరయ్యారు.

నిజాం ప్రధానమంత్రి లాయిక్ ఆలీ ఢిల్లీ పెద్దల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. హైదరాబాద్ రాష్ట్రంలో రజాకార్లు సాగిస్తున్న అకృత్యాల గురించి వారి ద్వారా నిజాం సైన్యాన్ని పెంచుకుంటూ భారత్ మీద యుద్ధానికి కాలు దువ్వటం మొదలైన విషయాలు కె.ఎమ్. మున్షీ వివరించినా ఢిల్లీలో నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జబ్బు పడటంతో మున్షీకి మద్దతు లేకుండా పోయింది.

ఇదే సమయంలో కమ్యూనిస్టుల విజ్రంభణ ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్‌ను, నెహ్రూ ప్రభుత్వాన్ని దూషిస్తూ ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌కు కూడా శత్రువైన రజాకార్లను వ్యతిరేకిస్తున్న ముసుగులో కమ్యూనిస్టులు కొన్ని ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కమ్యూనిస్టులు సాగించిన నేరాలు ఘోరాలను ఈ రచయిత రికార్డ్ చేసి, వారు సాగించిన హింసను అక్షరబద్ధం చేసి ఢిల్లీకి నివేదించారు.

హైదరాబాద్ రాష్ట్రంలో అనేక వర్గాల నుండి రోజురోజుకు మున్షీకి పెరుగుతున్న ప్రతిష్ఠ లాయక్ అలీ, కాశీం రజ్వీ లకు కంటగింపుగా ఉంది. ఆయన హైదరాబాద్ వదిలి వెళ్ళే విధంగా చేయాలన్నది వారి లక్ష్యం. అందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. నిజాం సంస్థానంలో మొట్టమొదట స్వతంత్రాన్ని ప్రకటించుకున్న గ్రామం పరిటాల. ఆనాటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న నిజామ్‌కు చెందిన గ్రామం ఈ పరిటాల. ఈ పుస్తకంలో ‘పార్టీ యాల్’ అని ప్రచురింపబడింది. ఈ గ్రామం భారత్‍లో విలీనమైంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది.

భారతదేశంతో ఏదో ఒకరోజు యుద్ధం చేయాల్సి వస్తుందని నిజాం, అతని అనుచరులైన లాయక్ అలీ, కాశీం రజ్వీ లకు బాగా తెలుసు. అందుకే వారు హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసులు సైన్యం, ఆయుధాలను అనూహ్యంగా పెంచుకుంటూ పోయారు. ఇదే సమయంలో కమ్యూనిస్టులు నిజాం రాజుకు దగ్గరయ్యారు. బందీలుగా ఉన్న అనేక మంది కమ్యూనిస్టు నాయకులు విడుదలై హైదరాబాద్ రాష్ట్రంలో స్వేచ్ఛగా సంచరించసాగారు. హైదరాబాద్ భారత ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అంటూ ప్రచారం సాగించి ఎప్పటికైనా హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ గుప్పిటలో ఉంచుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

1948 మే నెల నుండి భారత్, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఒప్పందాలకు అనేక ప్రతిపాదనలు వచ్చాయి. లాయక్ అలీ వాటిని ఢిల్లీలో ఒప్పుకుని హైదరాబాద్ తిరిగి వచ్చి తిరస్కరించేవాడు. అదే సమయంలో చివరకు జూన్ 13న నాలుగు అంశాలతో కూడిన ప్రతిపాదనకు ఇరువర్గాలు మద్దతు తెలిపాయి. వీటివల్ల నిజాం బలవంతుడు అయ్యాడు. “భారత్ గర్భంలోని క్యాన్సర్ పెరుగుతూ పోతోంది” అని సర్దార్ వ్యాఖ్యానించారు. నిజాం భారత్‌తో చేసుకున్న నాలుగు అంశాల ఒప్పందం హైదరాబాద్ చేరుకునేసరికి అనేక మార్పులు చేర్పులకు లోనైంది. ఈ మార్పులు ఒక రకంగా మౌంట్‌బాటెన్, వాల్టర్ మాంక్టన్ లను చాలా ఇబ్బంది పెట్టాయి. హైదరాబాద్‌కు భారత్‌తో సంబంధం ఉందన్న భ్రమలో ఉంచి భారత్ నుంచి స్వతంత్రం సాధించాలని నిజాం లక్ష్యం. హైదరాబాద్ సమస్యను పరిష్కరించలేదు అన్న నిరాశతో మౌంట్ బాటెన్, వాల్టర్ మాంక్టన్ ఢిల్లీకి వీడ్కోలు చెప్పి ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.

హైదరాబాద్ రాష్ట్రంలో హిందూమంత్రులు దిగజారుతున్న పరిస్థితులను చూసి రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. నిజాం, లాయక్ అలీ రజాకార్ల చేతిలోకి వెళ్లి పోవడం వల్ల సైన్యాధ్యక్షుడు జనరల్ ఎద్రుస్ రాజీనామా సమర్పించాడు. జరుగుతున్న పరిణామాల పట్ల నిజాం కుమారులు కూడా తండ్రికి వ్యతిరేకులయ్యారు. సరిహద్దు గ్రామాలలో రజాకార్లు భారత్ సైన్యంతో యుద్ధాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలో సంక్షోభం ఏర్పడింది. మౌంట్ బాటన్ ప్రతిపాదనకు సిద్ధపడి లాయక్ ఆలీ చేత రాజీనామా చేయించి మంత్రివర్గాన్ని సమూలంగా మార్చటానికి నిజాం సిద్ధపడ్డాడు. కానీ లాయక్ ఆలీ తన చాతుర్యాన్ని ఉపయోగించి నిజామ్‌ను లొంగదీసుకున్నాడు. హైదరాబాద్ సమస్యను ఐక్యరాజ్యసమితి దాకా తీసుకువెళ్ళటానికి రాజు సిద్ధపడ్డాడు. దీంతో భారత్ శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది. ఈ అంశం ఐక్యరాజ్యసమితి దాకా వెళితే అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. హైదరాబాద్ సంస్థానానికి మద్దతుగా పాకిస్తాన్ ముందుకు రావచ్చు అన్న ఆందోళన కూడా ఎక్కువైంది.

1948 ఆగస్టు 15న కె.ఎమ్. మున్షీ తన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ భయాందోళనలతో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అందరూ అనేక వర్గాలుగా విడిపోయారు. రాజు, మంత్రులు, ప్రముఖులు చివరకు రజాకార్లు కూడా అనేక గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు అనుమానాస్పదంగా చూడటం ప్రారంభమైంది. నిజాం ఐక్యరాజ్యసమితికి ప్రస్తావన పెడతాడు అన్న వార్తలు వ్యతిరేకించినవారు, విమర్శించినవారు అనేక కష్టాల పాలవుతున్నారు, చివరకు పరిస్థితి షోయబుల్లాఖాన్ హత్య వరకు దారి తీసింది, చివరకు భారత్ ఏజెంట్ అయిన కె.ఎమ్. మున్షీను కూడా హత్య చేయటానికి రజాకార్లు పథకాలు రచిస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని మున్షీ భారత ప్రభుత్వానికి అందజేశారు. హైదరాబాదును పూర్తిగా దిగ్బంధనం చేయటం లేదా సైనిక చర్య తీసుకోవడం ఏదో ఒకటి సత్వరం నిర్ణయం తీసుకోవాలని సర్దార్‌కు సమాచారం పంపారు. రజాకార్ల నిషేధం, సికింద్రాబాదులో భారత సైన్యం ఉండేందుకు అనుమతి ఇవ్వటం నిజాం ఒప్పుకుంటే ఆయన స్థానానికి ఎలాంటి ప్రమాదం లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందుకు నిజాం ఆమోదం తెలుపలేదు.

విదేశీ జర్నలిస్టుల హడావుడి కూడా ఎక్కువైంది. అంతర్జాతీయ స్థాయిలో నిజామ్‌కు అద్భుతమైన ప్రచారం జరుగుతోంది. 1948 సెప్టెంబర్ నెలలో జరిగిన సంఘటనలు రోజువారీగా రచయిత ఒక అధ్యాయంలో వివరించటం, చదువుతున్నంతసేపు ఎంతో ఉద్విగ్నతను కలుగచేస్తాయి. చివరకు పదవ తేదీ రాత్రి మొయిన్ నవాజ్ జంగ్ తన కుటుంబాన్ని, వస్తువులను వెంట తీసుకొని భద్రతామండలికి ప్రయాణం అవుతాడు. పరిస్థితులు విషమించాయి. కె.ఎమ్.మున్షీ నివసించే దక్షిణ సదన్ ఖాళీ చేయించి వేరే చోట నిర్బంధించారు. రజాకార్లను కాపలాగా పెట్టారు. భారత సైన్యం హైదరాబాద్ వైపు దూసుకు రావడం ప్రారంభమైంది. ఇక్కడ రజాకార్లు తమ దగ్గరున్న ఆయుధాలతో హిందువులను ఊచకోత కోయడం ప్రారంభించారు. పరిస్థితులు అదుపు తప్పిన తర్వాత నిజాం, మున్షీ సహకారం అభ్యర్థించాడు. చివరకు ప్రధానమంత్రి లాయిక్ ఆలీతో సహా మంత్రివర్గం రాజీనామా చేసింది. రజాకార్ల మీద చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. అదే సమయంలో పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక మున్షీ జబ్బుపడ్డారు. ఇతర సమాచార వ్యవస్థలు ఏవి అందుబాటులో లేకపోవడం వలన మున్షీ సహాయంతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లుగా రేడియోలో సందేశం ఇచ్చాడు. ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ అంశం ప్రస్తావన వెనక్కి తీసుకున్నారు. హైదరాబాద్ లొంగిపోవడం పూర్తిగా సైన్యానికి సంబంధించిన విషయం. ఇందులో మున్షీ వేలు పెట్టకూడదని భారత్ నుంచి సూచనలు అందాయి. ఈ నిర్ణయం మున్షీని ఇంకా ఒత్తిడి లోకి నెట్టింది. మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యం హైదరాబాదుకు అతి దగ్గరగా వచ్చింది.

హైదరాబాద్ రాష్ట్రం మీద జరగబోయే సైనిక చర్య మీద దేశంలో, ప్రపంచంలో పలు వర్గాలు పలు విధాలుగా స్పందించారు. రాష్ట్రంలోని ముస్లింలు ఇత్తెహాద్‌లు, పాకిస్తాన్ తమకు అండగా ఉంటుందని భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు. నిజానికి భారత సైన్యం కన్నా హైదరాబాదు సైన్యం, రజాకార్లు, పోలీసులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ వారు సుశిక్షితులు కాదు. పైగా మెజారిటీ ప్రజల మద్దతు కోల్పోయి ఉన్నారు. 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన సైనిక చర్య ఐదు రోజుల పాటు సాగి 18వ తేదీన ముగిసింది. రాష్ట్రాన్ని నలుదిక్కుల చుట్టుముట్టిన భారత సైన్యం పెద్దగా ప్రతిఘటనలు లేకుండా విజయం సాధించింది. లాయక్ అలీతో సహా చాలా మందిని భారత సైన్యం బందీలుగా పట్టుకుంది. మేజర్ జనరల్ చౌదరి ప్రణాళిక, అమలుపరిచిన విధానం అద్భుతం అంటారు రచయిత.

తీవ్రమైన అనారోగ్యం, టైఫాయిడ్ జ్వరంతో వున్నా మున్షీ భారత సైన్యానికి స్వాగతం పలికారు. తన విధి నిర్వహణలో ఏ లోటు రానీయలేదు. భారత సైన్యం హైదరాబాదులో అడుగు పెట్టి పోరాటాలు చేసి విజయం సాధించాలి అనుకుంది. కానీ నిజాం తనంతట తాను లొంగిపోవడం సైన్యం కొద్దిగా నిరాశ చెందింది. నిజానికి అలా లొంగిపోవడం మున్షీ చాకచక్యం అనుకోవాలి. హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా చేయాలన్న ఆకాంక్ష సంపూర్ణంగా త్యజిస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ నిజాం ప్రకటన చేశాడు. సర్దార్ కిచ్చిన మాట ప్రకారం మున్షీ కర్తవ్య దీక్షతో ఎన్ని కష్టాలు ఎదురైనా తన బాధ్యతను పూర్తి చేశాడు.

కానీ ఈ సైనిక చర్య వల్ల తీవ్రంగా నష్టపోయింది ఏజెంట్ జనరల్, అతనితో కలిసి పనిచేసిన ఉద్యోగులది అంటారు ఈ రచయిత. 34వ అధ్యాయంలో రచయిత అందించిన వివరాల ప్రకారం భారత సైన్యం కె.ఎమ్. మున్షీను వ్యతిరేకించింది. నిజామ్‌ను పదవి నుంచి దించే అవకాశం మిలిటరీకి దక్కలేదని కొంతమంది ఆయన పై కోపం ప్రదర్శించారు. ఆయన కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఉద్యోగులను చాలాకాలం పాటు పట్టించుకోలేదు. చివరకు మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్షీ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ పుస్తకంలో అన్ని అధ్యాయాలు ఒక ఎత్తు ఆఖరి అధ్యాయం మరొక ఎత్తు. ఆఖరి అధ్యాయం ‘ముగిసిన అధ్యాయం’ అంటూ ఎన్నో వివరాలు ఇందులో పొందుపరిచారు. బ్రిటిష్ వాళ్లు తమ స్వార్థం కోసం నిజామ్‌ను నిలిపి ఉంచారు అంటారు రచయిత. లేకపోతే 18వ శతాబ్దాంతానికి నిజాం చరిత్ర చెత్త కుప్పలో పారేసేవారు మరాఠా వారు అని వివరించారు కె.ఎమ్.మున్షీ. నిజాం తన స్వార్ధానికి, మత ఛాందస వాదాన్ని వాడుకున్నాడు. ఇతర దేశాలలోని ముస్లింలను ఆకర్షించాడు. నిజాం, అతని అనుచరులు హైదరాబాదును ఒక ముస్లిం రాజ్యంగా మలచాలని చక్కని ప్రణాళికలు రచించారు. తద్వారా దేశమంతా ఇస్లాం అధిక్యతను సాధించటం వారి ఎజెండా అంటారు రచయిత. పలువురు సంస్థానాధీశులు దేశభక్తి వల్ల త్యాగాలు చేసి వారి రాజ్యాలను భారత్‌లో విలీనం చేశారు. ఒక్క నిజాం మాత్రం వ్యతిరేకించి అప్రతిష్ఠ మూట కట్టుకున్నాడు. హైదరాబాద్ కనుక భారతదేశంలో ఒక భాగం కాకపోయి ఉంటే ఇత్తెహాద్‌ల మత ఛాందసత్వం పెరిగిపోయి ఉండేది. హిందువులు కమ్యూనిస్టుల వలలో చిక్కేవారు అని రచయిత వివరించారు. అందుకే హైదరాబాద్ సంఘటన సమాప్తం అవటంతో భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయం సమాప్తమైనది.

చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవాలు, నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కోసారి భయకంపితులవటం కూడా జరుగుతుంది. ఈ పుస్తకం చదువుతుంటే అలాంటి భావనలే కలుగుతాయి. ఆయా సంఘటనలు అలా జరిగాయంటే ఈ తరం వారికి నమ్మబుద్ధి కాదు. దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడడానికి ఆనాటి పెద్దలు ఎన్ని త్యగాలు చేశారు, ఎన్ని సాహసాలు చేశారో ఇలాంటి పుస్తకాలు ఈ తరం చదివి తెలుసుకోవటం అత్యంత అవసరం. ఇలాంటి పుస్తకాలే చరిత్ర గతి తప్పకుండా కాపాడటానికి, సహాయపడతాయి.

ఉపసంహారం:

హిందూ రాజు, అధిక ముస్లిం జనాభా వున్న రాష్ట్రం కశ్మీర్. ముస్లిం రాజు, అధిక జనాభా వున్న రాష్ట్రం హైదరాబాదు. రెండూ కూడా ప్రశాంతంగా భారత్‌లో విలీనం కాలేదు. అధిక ముస్లిం జనాభా వున్న కశ్మీర్ ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే వుంది. హైదరాబాదు ముక్కచెక్కలయి ఇప్పటికి తెలంగాణా రూపంలో కుదుటపడింది.

ఒకనాడు భారతదేశంలోని అనేక సంస్థానాలను (జనపదాలను, గణాలను) ఏకం చేసి అఖండ భారత్‌ను సృష్టించి మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు అని చాణక్యుడి గురించి మనం చదువుకున్నాం. టీవీలలో, సినిమాలలో చూడటం జరిగింది. 565 సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారత్‌ను సృష్టించిన ఆధునిక చాణక్యుడు సర్దార్. దురదృష్టం ఏమిటంటే సర్దార్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకున్న ప్రస్తుత బిజెపి ప్రభుత్వం చిన్న రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతోంది. అందుకు వారి కారణాలు, వాదనలు వారికి ఉండొచ్చు. ఒకప్పుడు భారత్‌ను 100 రాష్ట్రాలుగా విభజిస్తాం అని చెప్పుకున్న పార్టీ అది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్ భవిష్యత్తులో చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే చరిత్ర చర్వితచరణం అవుతుందా..

***

నిజాం పాలన చివరి రోజులు
పేజీలు: 328
వెల: 250/-
ప్రతులకు:
సాహిత్య నికేతన్, బర్కత్‌పురా, హైదరాబాద్.
ఫోన్: 9441433188
~
నవోదయ బుక్ హౌస్
కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 9000413413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/nizam-paalana-chivarirojulu-na-hyderabad-gnapakalu
~
సాహితీ ప్రచురణలు,
చుట్టుగుంట, విజయవాడ.
ఫోన్: 9849992890
ఆన్‌లైన్‌లో:
https://sahithibooks.com/book/68c94cfdf55ae7213eb554c3

Exit mobile version