[‘నొటోరియస్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[ఈ వ్యాసం కేవలం ఒక పరిచయమో, సమీక్షో కాదు. ఇది ఈ చిత్రం పై విశ్లేషణ. ఈ చిత్రం నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ప్రయత్నమిది. చిత్రం కథ మొత్తం ప్రస్తావించబడింది. సినిమా కళని ఈ చిత్రం ప్రభావవంతంగా ఎలా ఆవిష్కరించిందో ఇందులో వివరించబడింది. చిత్రం చూసినవారు పూర్తిగా చదవవచ్చు. చూడనివారు కొంతవరకు చదవవచ్చు. వ్యాసంలో ఒక హెచ్చరిక (spoiler warning) ఉంటుంది. చిత్రం చూడాలనుకునేవారు అక్కడ చదవటం ఆపివేయవచ్చు. -వ్యాసకర్త]
దేశం కోసం గూఢచారులు ఎంత దూరమైనా వెళతారు. ఆడవారు తమ శరీరాన్ని ఎరగా వేసి దేశరక్షణకి కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. కానీ గూఢచర్యం అలవాటు లేని యువతిని ప్రియుడే వేరొకరి ప్రియురాలిగా పంపిస్తే ఎలా వుంటుంది? ఇదే హిచ్‌కాక్ చిత్రం ‘నొటోరియస్’ (1946) కథ. ఇందులో గూఢచర్యం కన్నా మానసిక సంఘర్షణే ఎక్కువ ఉంటుంది. హిచ్‌కాక్ తీసిన చాలా సినిమాల్లో ఉన్నట్టు కొడుకుని నియంత్రించే తల్లి పాత్ర కూడా ఈ చిత్రంలో ఉంటుంది. కాకపోతే ఇది విలన్ తల్లి పాత్ర. అతనేనా విలన్ అనే అనుమానం కూడా వస్తుంది చివరికి. హిచ్‌కాక్ తీసిన చిత్రాల్లో ఒక అపురూపమైన చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని ప్లెక్స్ ఓటీటీలో ఉచితంగా చూడవచ్చు. లింకు: https://watch.plex.tv/en-GB/movie/notorious
అలీషియా తండ్రి జర్మనీ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లి అమెరికన్. అలీషియా అమెరికాలో పెరిగింది. తల్లి మరణించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1946లో అలీషియా తండ్రి జర్మన్ గూఢచారి అని తెలిసి అమెరికాలోని కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. అలీషియా క్రుంగిపోతుంది. తాగుడు అలవాటవుతుంది. ఆనందం కోసం పురుషులని వలలో వేసుకుని సంబంధాలు పెట్టుకుంటుంది. దీనితో అపఖ్యాతి పాలవుతుంది. చిత్రం పేరులోని ‘నొటోరియస్’ (అపఖ్యాతి పొందిన మనిషి) ఆమే. ఆమెకి ఒక పార్టీలో డెవ్లిన్ పరిచయమౌతాడు. మొదటి చూపులోనే నచ్చుతాడు. అయితే అతను అమెరికా ఏజెంటు. అలీషియాకి అమెరికా పట్ల దేశభక్తి ఉందని తెలిసి ప్రభుత్వం అతన్ని ఆమె దగ్గరకి పంపించింది. జర్మనీకి చెందిన ఒక బృందం తలపెట్టే విధ్వంసక కార్యకలాపాలు తెలుసుకోవటానికి ఆమెని వాడుకోవాలని ప్రభుత్వం వ్యూహం. ఆమె తండ్రి ఎలాగూ జర్మనీ కోసమే పని చేశాడు కాబట్టి ఆమెని వారు శంకించరని వారి ఆలోచన.
డెవ్లిన్ అడిగితే మొదట అలీషియా ఒప్పుకోదు. తండ్రికి శిక్ష పడటంతో ఆమెకి మనసు చెదిరిపోయింది. డెవ్లిన్ ఆమె తన తండ్రితో వాదిస్తున్న రికార్డు ఆమెకి వినిపిస్తాడు. ఇది రహస్యంగా రికార్డు చేసినది. అందులో ఆమె తనకి అమెరికా అంటే ప్రేమ అని చెబుతుంది. డెవ్లిన్ ఆమెని దేశం కోసం గూఢచర్యానికి ఒప్పుకోమంటాడు. ఒక లక్ష్యం లేకుండా బతికే ఆమెకి ఒక దారి దొరికినట్టనిపిస్తుంది. ఆమె ఒప్పుకుంటుంది. జర్మనీ బృందం బ్రెజిల్లో ఉంటూ రహస్యంగా తమ కార్యకలాపాలు జరుపుతూ ఉంటుంది. డెవ్లిన్, అలీషియా బ్రెజిల్‌కి ప్రయాణమవుతారు. అలీషియా తండ్రి జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. అలీషియాకి తండ్రి నిజస్వరూపం తెలిశాక అతన్ని ద్వేషించింది. “ఇప్పుడు అయన్నీ ద్వేషించక్కరలేదు. నన్ను నేనూ ద్వేషించుకోనక్కరలేదు” అంటుంది. అలాంటి తండ్రికి కూతురైనందుకే ఆమె క్రుంగిపోయింది కానీ అతని మీద ప్రేమతో కాదు.
బ్రెజిల్ చేరిన తర్వాత మిషన్ ఏమిటో చాలా రోజుల వరకు తెలియదు. డెవ్లిన్ తన పై అధికారి ఉత్తర్వుల కోసం వేచి ఉంటాడు. అలీషియా తాగుడు మానేస్తుంది. డెవ్లిన్ని ఇష్టపడుతుంది. అయితే తన జీవితం గురించి అతనికి తెలుసు కాబట్టి తటపటాయిస్తూ ఉంటుంది. అతన్ని కవ్విస్తుంది. “నన్ను చూసినప్పుడల్లా నా తప్పులే కనిపిస్తాయి కదా. మారానని నమ్మవా?” అంటుంది. “నాకు ఆడవాళ్ళంటే నమ్మకం తక్కువ” అంటాడతను. “ఇప్పుడు నీ మీద నీకే నమ్మకం లేదేమో అనిపిస్తోంది కదా? నా ప్రేమలో పడతావేమో అని” అంటుందామె. “నన్ను హేళన చేస్తున్నావా?” అంటే “లేదు. నేనే పాపమెరుగని అమాయకురాలినైనట్టు ఊహించుకుని నవ్వుకుంటున్నాను” అంటుంది. “మంచి పగటికలే” అంటాడతను. ఆమె మనస్సు చివుక్కుమంటుంది. తర్వాత “అందరూ నవ్వుతారేమో అని నన్ను దూరం పెడుతున్నావుగా” అంటుంది. అతను ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. అయితే అతను మనసుతో సంఘర్షణ పడుతున్నాడు. ఆమె అందరు మగవాళ్ళతో మాట్లాడినట్టే తనతో మాట్లాడుతోందా లేక ప్రేమించిందా అర్థం కాక సతమతమవుతూ ఉంటాడు. ఇద్దరూ కలిసి సమయం గడుపుతారు కానీ ఇద్దరికీ అనుమానమే. ఆమె ఒకసారి “ఇదో వింత ప్రేమ వ్యవహారం. వింతేమిటంటే నీకు నా మీద ప్రేమ లేదు” అంటుంది కవ్వింపుగా.
ఒకరోజు డెవ్లిన్కి పై అధికారి నుంచి పిలుపు వస్తుంది. ఆలెక్స్ అనే అతను జర్మన్ బృందంలో ఉన్నాడని, అతను అలీషియా తండ్రికి స్నేహితుడని పై అధికారి చెబుతాడు. ఇప్పుడు అలీషియా అతనికి సన్నిహితమై అతని భవంతిలో జరుగుతున్న వ్యవహారాలు తెలుసుకోవాలని చెబుతాడు. ఆమెకి ఇలాంటి సంబంధాలు అలవాటే కదా అంటాడు. డెవ్లిన్ “ఆమెకి ఇలాంటి గూఢచర్యం అనుభవం లేదు. దొరికిపోతుందేమో” అంటాడు. మరి ఆమెని గూఢచర్యం చేయమని ఎందుకు తీసుకువచ్చాడు? ఎలాంటి గూఢచర్యమైనా ఆమెకి కొత్తే కదా? ఆమెకి ఏమన్నా అవుతుందని అతని భయం. గూఢచారి అన్నాక ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అతనికి తెలియక కాదు, మనసుకి చెప్పకోలేక. పై అధికారి “ఆలెక్స్ ఒకప్పుడు ఆమెని ప్రేమించాడు. ఆమే ఈ పనికి సరైనది” అంటాడు. డెవ్లిన్ ఖంగు తింటాడు. ఇక కాదనేందుకు ఏమీ లేదు, ‘నేను ఆమెని ప్రేమిస్తున్నాను’ అని చెప్పటం తప్ప. తమాషా ఏమిటంటే అలా అంటే అతని దేశభక్తినే శంకించే పరిస్థితి. ఒక పక్కన దేశానికి కీడు చేయలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ప్రేమా గీమా అంటావా? అంటారు. గూఢచారులకి మనసు ఉండదా? ఆ ప్రశ్న వేసేవాడు గూఢచారిగా పనికి రాడు అనేదే ఆ ప్రశ్నకి సమాధానం.
మరి అలీషియా గూఢచారి కాదు కదా? ఆమె తప్పుకోవచ్చు కదా? డెవ్లిన్ చెబితే తప్పుకుందామని ఆమె ఆశ. కానీ డెవ్లిన్ ఆమెకి ఏమీ సలహా ఇవ్వడు. ఆమె తప్పుకుంటే ఆమె ప్రేమ రుజువవుతుందని అతని అభిలాష. ఇద్దరూ మనసులో మాట చెప్పరు. అతని ప్రేమ మోసమని ఆమె అనుకుంటుంది. ఆమె ప్రేమ కేవలం వినోదం కోసమే అని అతను అనుకుంటాడు. చివరికి ఆమె ఆలెక్స్‌కి సన్నిహితం కావటానికి నిర్లిప్తంగానే ఒప్పుకుంటుంది. ఆమె ప్రియుడే ఆమెని హనీ ట్రాప్ లాగ విసిరాడు. మొత్తానికి అలీషియా ఆలెక్స్‌కి సన్నిహితమౌతుంది. డెవ్లిన్ని తన స్నేహితుడని ఆలెక్స్‌కి పరిచయం చేస్తుంది.
ఒక సాయంత్రం ఆమె ఆలెక్స్ భవంతికి పార్టీకి వెళుతుంది. అక్కడ జర్మన్ బృందం అంతా ఉంటారు. పైకి అందరూ పెద్ద మనుషుల్లా ఉంటారు కానీ తెర వెనుక విధ్వంసక ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అలీషియా అందరి పేర్లూ గుర్తు పెట్టుకుంటుంది. ఆలెక్స్ తల్లి అలీషియాని అనుమానంగా చూస్తుంది. ఆమెకి వింతగా అనిపించిన విషయం ఏమిటంటే అలీషియా తండ్రి కోర్టులో విచారణ ఎదుర్కొన్నప్పుడు ఆమె తండ్రికి అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి రాలేదు. ఎందుకు అనేది ఆమెని వేధించే ప్రశ్న. ప్రేక్షకులుగా మనకి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు. ఆలెక్స్‌కి ఈ అనుమానం ఎందుకు రాలేదు? ‘ఎంతవారలైనా కాంతదాసులు’ కదా! భోజనాల దగ్గర ఎమీల్ అనే ఆసామి వైన్ సీసాలు చూసి కంగారుపడతాడు. ‘అవేమిటి ఇక్కడున్నాయి?’ అని గాభరాగా అంటాడు. ఇది అలీషియా గమనిస్తుంది. ఆలెక్స్ ఎమీల్ని సముదాయించి కూర్చోబెడతాడు. తర్వాత జర్మన్ బృందమంతా సమావేశమవుతుంది, ఎమీల్ తప్ప. ఎమీల్ ప్రవర్తన ప్రమాదకరంగా ఉందని అందరూ అనుకుంటారు. ఇంతకు ముందు కూడా పొరపాట్లు చేశాడని అనుకుంటారు. ఒకతను “అతని సంగతి నేను చూసుకుంటాను” అంటాడు. తర్వాత ఎమీల్ వచ్చి సారీ చెబుతాడు. అతన్ని విశ్రాంతి తీసుకోమని.. అతని సంగతి చూసుకుంటానన్న వ్యక్తిని తోడిచ్చి పంపిస్తారు. ఎమీల్ ‘కథ’ అంతటితో ముగిసిపోతుంది.
మర్నాడు ఆలెక్స్, అతని తల్లి, అలీషియా గుర్రపు పందేలకు వెళతారు. అక్కడ వారు మాత్రమే కూర్చోవటానికి ఒక బాక్స్ వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అలీషియా గుర్రాలను చూస్తానని ట్రాక్ దగ్గరకు వస్తుంది. ఆలెక్స్ ఆమెని బైనాక్యులర్స్‌లో చూస్తుంటాడు. తల్లితో “ఆమెతో కొంచెం నవ్వుతూ మాట్లాడొచ్చుగా” అంటాడు. ఆమె “మనిద్దరమూ పళ్ళికిలిస్తూనే ఆమెతో మాట్లాడాలా?” అంటుందామె. డెవ్లిన్ అలీషియా దగ్గరకు వస్తాడు. ఆలెక్స్ చూస్తూనే ఉంటాడు. అలీషియా పార్టీకి వచ్చిన వారి పేర్లూ, ఒడ్డూ పొడుగూ, వయసూ చెప్పి ఎమీల్ అనే అతను వైన్ సీసాలు చూసి గాభరా పడ్డాడని చెబుతుంది. అయితే వాటిలో వైన్ తప్ప ఏమీ లేదని అంటుంది. “ఆ సీసాల వెనక ఏదో కిటుకు ఉంది” అంటాడతను. ఆమె “నా క్రీడించేవారి జాబితాలో ఆలెక్స్ కూడా చేరాడు” అంటుంది. అప్పట్లో సినిమాల్లో బాహాటంగా చెప్పేవారు కాదు కానీ దీని అర్థం వారిద్దరికీ శారీరక సంబంధం ఏర్పడిందని. “ఎక్కువ సమయం పట్టలేదు” అంటాడు డెవ్లిన్. “నీకు కావాల్సింది అదేగా. నువ్వే నన్ను అతనికి ఎరగా వేశావు” అంటుందామె కోపంగా. ఆలెక్స్ వస్తాడు. డెవ్లిన్ అతనికి అభివాదం చేసి వెళ్ళిపోతాడు. “నేను మీ ఇద్దరినీ చూశాను. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావేమో అనిపించింది” అంటాడు ఆలెక్స్. అదేం లేదు అంటుందామె. “నువ్వు అతన్ని ప్రేమించటం లేదని నేను నమ్మాలంటే ఒక పని చేయాలి” అంటాడతను. ఆ పని అతన్ని పెళ్ళి చేసుకోవటం!
ఆలెక్స్ ప్రేమలో పడి తొండరపడ్డాడు. ఆమెని పెళ్ళి చేసుకోకపోతే తనకి దక్కదేమో అనుకున్నాడు కానీ ఆమె అతన్ని బుట్టలో వేయటానికి వచ్చిందని తెలుసుకోలేకపోయాడు. వేరే అమ్మాయి అయితే ఆలోచించేవాడేమో. ఆమె తండ్రి జర్మన్ బృందం వాడు. ఆమె ఇంతకు ముందే అతనికి నచ్చింది. దాంతో ఎక్కువ ఆలోచించలేదు. అమెరికన్ ఏజెంట్లు కోరుకున్నది కూడా అదే. వారి వ్యూహం ఫలించింది. కానీ ఇంత దూరం వెళుతుందని వారూ అనుకోలేదు. డెవ్లిన్ విషయంలో అనుమానం రాకపోతే ఆలెక్స్ పెళ్ళి నిర్ణయం తీసుకునేవాడు కాదు. కాబట్టి ఆలెక్స్ పెళ్ళి ప్రస్తావన తేవటానికి ఒకరకంగా డెవ్లినే కారణం. డెవ్లిన్ది మరీ వింత పరిస్థితి. అలీషియా ఆలెక్స్‌కి దగ్గరవ్వాలని కోరుకున్నాడు కానీ పెళ్ళి దాకా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు అలీషియా గనక వద్దంటే మొత్తం మిషన్ విఫలమవుతుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. ఇంతకీ అలీషియా పెళ్ళికి ఒప్పుకుందా లేదా? ఇక్కడ హిచ్‌కాక్ మార్కు సస్పెన్స్ కనిపిస్తుంది. ఆలెక్స్ పెళ్ళి ప్రస్తావన మనకి చూపించడు. తర్వాతి సన్నివేశంలో అలీషియా అమెరికన్ ఏజంట్ల అధికారిని కలుసుకుని “ఒక విషయంలో మీ సలహా కావాలి” అంటుంది. డెవ్లిన్తో సహా మిగతా ఏజెంట్లందరూ అక్కడే ఉంటారు. అందరూ ఆత్రుతతో చూస్తుంటే అప్పుడు ఆలెక్స్ తెచ్చిన పెళ్ళి ప్రస్తావన గురించి చెబుతుంది. వారికీ, ప్రేక్షకులకీ ఒకేసారి షాక్ తగులుతుంది. ఆలెక్స్ వెంటనే జవాబు చెప్పమన్నాడని, ఏం చెయ్యమంటారో చెప్పమని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
అలీషియాగా ఇన్‌గ్రిడ్ బర్గ్‌మన్ నటించింది. ఆమె ‘కాసాబ్లాంకా’లో కూడా యుద్ధం ఆపటానికి తన ప్రేమని త్యాగం చేసిన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కూడా దేశం కోసం ప్రేమని వదులుకునే పాత్ర. డెవ్లిన్గా క్యారీ గ్రాంట్, ఆలెక్స్గా క్లాడ్ రెయిన్స్ నటించారు. ఆలెక్స్ పాత్ర క్లిష్టమైనది. ఆ పాత్రకి క్లాడ్కి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. హిచ్‌కాక్ ముద్ర చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత వచ్చే ఒక సన్నివేశంలో షాంపేన్ సీసాలు ఖాళీ అవుతుంటే ఉత్కంఠ పుట్టిస్తాడు. కాఫీ కప్పు చూపించి ఉత్కంఠ పుట్టిస్తాడు. ఇలాంటి చిన్న విషయాలని కూడా సస్పెన్స్‌కి వాడుకున్నాడు. ఇప్పుడు కెమెరా యాంగిల్స్ గురించి చెప్పుకుంటున్నాం గానీ అప్పట్లోనే కెమెరాతో కొత్త ప్రయోగాలు చేశాడు హిచ్‌కాక్. కాఫీ కప్పు తెరమీద పెద్దగా కనపడేలా కెమెరా పెట్టి వెనక పాత్రలు మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తాడు. ఆలెక్స్ నిజంగా విలనేనా అనిపించేలా చేస్తాడు చివరికి హిచ్‌కాక్. తల్లి పాత్ర తర్వాత ప్రముఖంగా మారుతుంది. ఆమె చాలా సన్నివేశాల్లో ఎంబ్రాయిడరీ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె తెలివి అమోఘం. ఆమె అనే ఒక డైలాగు గుర్తుండిపోతుంది. “You are protected by the enormity of your stupidity” (నీ మూర్ఖత్వం ఎంత బృహత్తరం అయినదంటే ఆ బృహత్తతే నిన్ను కాపాడుతుంది) అంటుంది. అంటే ఇంత మూర్ఖంగా ఎవరూ ఉండరు కాబట్టి నువ్వు మూర్ఖుడివి కాదనే అందరూ అనుకుంటారు అని అర్థం.
Spoiler warning: ఈ క్రింద మిగతా చిత్రకథ, ముగింపు ప్రస్తావించబడ్డాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపివేయగలరు.
పెళ్ళి ప్రస్తావన గురించి తెలియగానే ఏజెంట్ల అధికారి “ఇంత పెద్ద అడుగు వేయటానికి నువ్వు సిద్ధమేనా?” అని అలీషియాని అడుగుతాడు. ఆమె డెవ్లిన్ వైపు చూస్తుంది. అతను ఆమెతో చూపు కలపకుండా అటూ ఇటూ చూస్తాడు. “మీకు సమ్మతమైతే పెళ్ళి చేసుకుంటాను” అంటుందామె. డెవ్లిన్ కూడా “మనకి ఉపయోగపడే పనే” అంటాడు. ఇలా ఎంతమంది గూఢచారులు తమ అసలు ఉద్దేశాన్ని దాచుకుని పెళ్ళి చేసుకున్నారో? అది మోసంలా అనిపించవచ్చు కానీ దేశం కోసం వారు జీవితాలని పణంగా పెట్టారు. తప్పని ఎలా అనగలం? హనీమూన్ తొందరగా ముగించుకునే భారం కూడా అలీషియా మీదే వేస్తాడు అధికారి. మిషన్ ఆలస్యం కాకూడదనే అతని ఉద్దేశం. ఇదంతా కాస్త షాకింగ్‌గా ఉంటుంది కానీ గూఢచారుల జీవితాలు ఇలాగే ఉంటాయి.
ఆలెక్స్ తల్లి సహజంగానే పెళ్ళికి వ్యతిరేకంగా ఉంటుంది. “నేను ఏ స్త్రీని ఇష్టపడినా నీకు అసూయే. పెళ్ళి జరిగే తీరుతుంది. నువ్వొస్తే సంతోషం” అంటాడు ఆలెక్స్. పెళ్ళి జరిగిపోతుంది. హనీమూన్ కూడా పూర్తవుతుంది. ఇంటికి తిరిగి వచ్చాక తల్లి వద్దంటున్నా ఇంటి తాళాలు అలీషియాకి ఇస్తాడు ఆలెక్స్. ఇక్కడ అతను గొర్రె పిల్లలా మోసపోతున్నాడని అనిపిస్తుంది. వైన్ సెల్లార్ తాళం చెవి మాత్రం అతని దగ్గరే ఉందని అలీషియాకి తెలుస్తుంది. కీలక రహస్యం ఉన్నది వైన్ సెల్లార్లోనే. ఆమె డెవ్లిన్ని కలిసినపుడు ఒక పార్టీ ఏర్పాటు చేసి తనని ఆహ్వానించమని చెబుతాడు. ఈ లోపల వైన్ సెల్లార్ తాళం చెవి దొంగిలించమంటాడు. ఆమె పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఆలెక్స్ తాళాల గుత్తిలో నుంచి వైన్ సెల్లార్ తాళం చెవి కూడా దొంగిలిస్తుంది. పార్టీకి డెవ్లిన్ రాగానే రహస్యంగా తాళం చెవి అతనికి అందిస్తుంది. వారిద్దరినీ ఆలెక్స్ అనుమానంగా చూస్తుంటాడు కానీ అతని అనుమానం వారిద్దరూ ప్రేమికులనే గానీ ఇంకేం కాదు. నిజానికి ఈ అనుమానమే ఇతర అనుమానాలు రాకుండా ఉపయోగపడుతుంది.
షాంపేన్ సీసాలన్నీ ఐస్ బకెట్లో ఉంటాయి. “షాంపేన్ అయిపోతే వైన్ సెల్లార్‌కి వెళ్ళి తేవాలిగా” అంటాడు డెవ్లిన్. అంటే డెవ్లిన్ వైన్ సెల్లార్‌కి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చే ప్రమాదముంది. షాంపేన్ సీసాలు ఒక్కొక్కటీ మాయమవుతుంటే ఉత్కంఠ పెరుగుతూ ఉంటుంది. ఆలస్యం చేయకూడదని అలీషియా కింది అంతస్థుకి వెళ్ళి వెనక తలుపు తెరుస్తుంది. డెవ్లిన్ లోపలికి వచ్చి వైన్ సెల్లార్ తాళం తీస్తాడు. డెవ్లిన్ తనిఖీ చేస్తుంటే ఒక సీసా కింద పడి పగులుతుంది. అందులో ఇసుక లాంటి పదార్థం ఉంటుంది. డెవ్లిన్ ఆ ఇసుక నమూనా తీసుకుంటాడు. అనుమానం రాకుండా వేరే సీసాలోని వైన్ పారబోసి అందులో కింద పడ్డ ఇసుక నింపుతాడు. అలీషియా సాయం చేస్తుంది. ఇద్దరూ బయటకి వెళుతుంటే ఆలెక్స్ అక్కడికి రావటం కనిపిస్తుంది. షాంపేన్ కోసం నౌకరు అతన్ని తీసుకువచ్చాడు. ముందు ఆలెక్స్ వస్తాడు. ఇద్దరినీ చూస్తాడు. డెవ్లిన్ హఠాత్తుగా ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. ఆలెక్స్ నౌకరుని పంపించి వారి దగ్గరకి వస్తాడు. డెవ్లిన్ తాగి ఉన్నాడని, తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని ఆమె అంటుంది. డెవ్లిన్ “నేను ఆమెని ముందు కలిశాను. ముందు ప్రేమించాను. కానీ నీ అదృష్టం బావుంది” అని వెళ్ళిపోతాడు. “పైకి వెళ్ళు. తర్వాత మాట్లాడదాం” అని ఆలెక్స్ ఆమెని పంపిస్తాడు. ఆమె మీద వేరే అనుమానం రాకుండా డెవ్లిన్ ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. ఏజెంట్లు ఎంత చురుగ్గా ఉంటారో అనిపిస్తుంది.
ఇక్కడ కథలో ఒక లోపం కనిపిస్తుంది. షాంపేన్ కోసం వచ్చిన ఆలెక్స్‌కి తాళం చెవి లేదని తెలిసిపోతుంది కదా. మరి అనుమానం రాదా? అలీషియా, డెవ్లిన్ ఇది ఆలోచించలేదా? అతను షాంపేన్ కోసం రాలేదని, ఆమెని వెతుక్కుంటూ వచ్చాడని వాళ్ళు అనుకున్నారని ఒక వివరణ ఇవ్వవచ్చు. కానీ ఇది లోపం లాగే అనిపిస్తుంది. ఆలెక్స్ షాంపేన్ కోసం నౌకరుతో మళ్ళీ వస్తాడు. తాళాల గుత్తిలో తాళం చెవి లేదని తెలుస్తుంది. “ఉన్న షాంపేన్ చాల్లే” అని ఆలెక్స్ వెనక్కి వెళ్ళిపోతాడు. తాళం చెవి లేకపోవటంతో ఆలెక్స్‌కి తన భార్య ప్రేమాయణం మీద కంటే పెద్ద అనుమానం వస్తుంది. అతని ప్రేమ పొరలు విడిపోవటం ప్రారంభమవుతుంది. అందుకే తెలివిగా భార్యని ఏమీ అనకుండా “డెవ్లిన్ ముద్దు పెట్టుకోవటం పెద్ద విషయం కాదులే” అంటాడు. తాళాల గుత్తి బల్ల మీద పెట్టి పడుకుంటాడు. తెల్లారేసరికి మాయమయిన తాళం చెవి మళ్ళీ గుత్తిలో ప్రత్యక్షం! అతను వైన్ సెల్లార్‌కి వెళ్ళి చూస్తాడు. అక్కడి వైన్ ర్యాక్ కింద సీసా ముక్కలు, కాస్త ఇసుక కనిపిస్తాయి. ఒక సీసాలో ఇసుక కొంచెం తక్కువ ఉండటం కూడా కనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆలెక్స్‌కి తన భార్య గూఢచారని!
ఆలెక్స్ తల్లి దగ్గరకి పరిగెడతాడు. “నాకు అనుమానం వచ్చింది. కానీ ఏమిటో ఇదమిత్థంగా కనిపెట్టలేకపోయాను” అంటుందామె. “బృందం వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎమీల్ చేసిన చిన్న తప్పుకే అతన్ని చంపేశారు” అంటాడతను. “నీ అపారమైన మూర్ఖత్వమే నిన్ను కాపాడుతుంది. ఆమెని మనమే వదిలించుకోవాలి” అంటుందామె. ఆరోజు నుంచి అలీషియాకి కాఫీలో విషం ఇవ్వటం మొదలుపెడతారు తల్లీకొడుకులు. ఆలెక్స్ ప్రేమ ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అతన్ని తప్పు పట్టలేం. అతన్ని అలీషియా మోసగించింది. అలీషియాకి కొనాళ్ళకి కళ్ళు తిరగటం మొదలవుతుంది. మరో పక్క సీసాలో ఉన్న ఇసుకలో యురేనియమ్ ఉందని తెలుస్తుంది. ఎక్కడి నుంచో యురేనియమ్ తెప్పించి పరిశోధనలు చేస్తున్నారు. చివరికి బాంబు తయారు చేస్తారన్నమాట. అలీషియా ఏజంట్ల అధికారిని కలుస్తుంది. ఆ యురేనియమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోమంటాడు. డెవ్లిన్ స్పెయిన్‌కి వెళుతున్నాడని చెబుతాడు. ఆమెని నిస్సత్తువ ఆవరిస్తుంది. కొన్నాళ్ళకి డెవ్లిన్ని కలుసుకుంటుంది. సమాచారం ఏమీ లేదని, ఊరికే వచ్చానని అంటుంది. ఆమె ముఖంలో నీరసం అతనికి కనిపిస్తుంది. ఆమె హ్యాంగోవర్ అని కొట్టిపారేస్తుంది. అతను కూడా ఆమె తాగుడుకి మళ్ళీ అలవాటు పడిందని అనుకుంటాడు. ఆమె మీద అతనికి పూర్తిగా సదభిప్రాయం లేదు.
ఆమె ఆరోగ్యం బాగాలేదని తెలిసి బృందం సభ్యుడొకరు ఆమెకి గాలి మార్పు అవసరమని చెబుతాడు. అతను పొరపాటున ఆమె కాఫీ కప్పు తీసుకుంటే తల్లీకొడుకులు వెంటనే వారిస్తారు. ఇది చూసి అలీషియాకి తన అనారోగ్యానికి కారణం తెలుస్తుంది. విషప్రయోగం జరిగిందని గ్రహిస్తుంది. తాను భర్త, అత్తగారు పన్నిన పద్మవ్యూహంలో ఇరుక్కున్నానని అర్థమవుతుంది. ఆ షాక్ వల్ల ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమెని గదిలోకి తీసుకెళతారు. ఆమె భర్త “ఆమెకి పూర్తి విశ్రాంతి కావాలి. గదిలో టెలిఫోన్ తీసేయండి” అని నౌకర్లని ఆదేశిస్తాడు. ఆమె బయటివారెవరితోనూ మాట్లాడకుండా ఈ ఏర్పాటు.
ఆమె తనని కలవటానికి మళ్ళీ రాకపోవటంతో డెవ్లిన్కి అనుమానం వస్తుంది. ఆలెక్స్ ఇంటికి వెళతాడు. ఆలెక్స్ జర్మన్ బృందంతో సమావేశంలో ఉంటాడు. నౌకరు అతనికి డెవ్లిన్ రాక గురించి చెబుతాడు. ఆలెక్స్ ఆలోచనలో పడతాడు. ఈలోపల డెవ్లిన్ అలీషియా గదిలోకి వెళతాడు. అంతకుముందే ఆమెకి నిద్రమాత్రలు ఇవ్వటంతో ఆమె మత్తులో ఉంటుంది. తనకి విషం ఇచ్చారని డెవ్లిన్కి చెబుతుంది. అతను పశ్చాత్తాపంతో “నిన్ను ఇక్కడికి పంపటం నా తప్పు. నిన్ను ప్రేమించాను. నిన్ను కాపాడలేకపోయాను” అంటాడు. అతను తనని ప్రేమించాడని చెప్పగానే ఆమె ఆనందపడుతుంది. అతను ఆమెని పొదివి పట్టుకుని మెట్లు దిగుతూ ఉంటాడు. ఆలెక్స్ వచ్చి ఏమిటిది అని అడుగుతాడు. జర్మన్ బృందం కూడా వస్తుంది. “ఆమె ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్‌కి పోన్ చేశాను. వెంటనే వెళ్ళాలి” అని బిగ్గరగా అంటాడు. ఆలెక్స్‌కి, అతని తల్లికి మాత్రమే వినపడేలా “మమ్మల్ని వెళ్ళనీ. లేకపోతే ఈమె ఎవరో చెప్పేస్తాను. ఎమీల్కి పట్టిన గతే నీకూ పడుతుంది” అంటాడు. ఆలెక్స్ జర్మన్ బృందంతో “హాస్పిటల్‌కి వెళుతున్నాం” అంటాడు. అతని తల్లి కూడా బిడ్డ కోసం మౌనంగా ఉంటుంది. బయటకి వచ్చాక డెవ్లిన్ అలీషియాని కారు ఎక్కిస్తాడు. ఆలెక్స్ “నన్ను కూడా రానివ్వండి. వాళ్ళందరూ చూస్తున్నారు. అనుమానం వస్తుంది” అంటాడు. డెవ్లిన్ అతన్ని కారు ఎక్కనివ్వకుండా లాక్ చేసేసి అలీషియాని తీసుకుని వెళ్ళిపోతాడు. జర్మన్ బృందంలో ఒకతను “ఆమె గదిలో ఫోన్ లేదు. హాస్పిటల్‌కి ఎలా ఫోన్ చేశారు?” అంటాడు. దీంతో వాళ్ళు “ఆలెక్స్! లోపలికి రా. నీతో మాట్లాడాలి” అంటారు. ఆలెక్స్ భవంతి మెట్లెక్కి లోపలికి వెళ్ళగానే చిత్రం ముగుస్తుంది.
డెవ్లిన్, అలీషియా మెట్లు దిగి ప్రమాదానికి దూరంగా వెళితే ఆలెక్స్ మెట్లెక్కి తన మృత్యువు ఒడిలోకి వెళ్ళాడు. ప్రేమే అతని పాలిట యమపాశం అయింది. అతని మీద జాలి కలుగుతుంది. నిజానికి బాంబు తయారు చేసే బృందంలో సభ్యుడైన అతని మీద జాలి కలగకూడదు. కానీ అతన్ని ఒక ప్రేమికుడిగా చూపించి అతని మీద సానుభూతి కలిగించాడు హిచ్‌కాక్. మోసపోయానని తెలిసే దాకా అతను ప్రేమిస్తూనే ఉన్నాడు. డెవ్లిన్, అలీషియా మాత్రం ఒకరి ప్రేమని ఒకరు నమ్మలేదు. నమ్మి ఉంటే అలీషియా ‘నేను ఆలెక్స్ దగ్గరకి వెళ్ళను’ అని చెప్పేది. అమెరికన్ ఏజంట్లు ఆమెని బలవంతం చేసేవారు కాదు. డెవ్లిన్ ప్రేమని నమ్మకపోవటం ఆమె తప్పు కాదు. నమ్మించకపోవటం అతని తప్పు. మనసు చేసే మోసాలు ఇలాగే ఉంటాయి. అదృష్టం బావుండి అలీషియా బయటపడింది. బయటపడలేక బలైపోయిన గూఢచారులు ఎంతమందో! వారి కోసం మనం కన్నీరు కార్చకూడదు. వారి త్యాగాలకి సలాం చేయాలి. వారి దేశాలకి వారు ముద్దుబిడ్డలు.

