Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసుని తడిపే ‘నులివెచ్చని గ్రీష్మం’

[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘నులివెచ్చని గ్రీష్మం’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘నులివెచ్చని గ్రీష్మం’ తొలుత తరుణి వెబ్ పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది.

అర్జున్, సుభద్ర దంపతుల అమెరికా ప్రయాణ సన్నాహాలతో ప్రారంభమవుతుంది నవల. అమెరికాలో కొడుకింట్లో కొన్ని నెలలు, కూతురింట్లో కొన్ని నెలలు ఉండి ఇండియాకి తిరిగి రావడంతో ముగుస్తుంది. ఇంతేనా కథ అనిపిస్తోందా? అంతే. కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ నవలలో.

ప్రయాణ స్నేహాలు:

హైదారాబాద్ నుంచి ముంబై, పారిస్ మీదుగా మినియాపోలీస్ చేరుతారా దంపతులు. పారిస్ విమానాశ్రయంలో అట్లాంటా వెళుతున్న రచన అనే ఆవిడ పరిచయమవుతుంది. కానీ అది ప్రయాణ స్నేహంగానే మిగిలిపోతుంది.

జెట్‍లాగ్, కాలక్షేపం:

మినియాపోలీస్‍లో కొడుకు ఇంట్లో తొలి మజిలీ. జెట్ లాగ్ తీర్చుకుని, వాతావరణానికి అలవాటు పడ్డానికి ఓ వారం పడుతుంది. అక్కడ భారతీయ కుటుంబాల వాళ్ళ పరిచాయాలు, వాళ్ళతో కబుర్లు పంచుకోడాలు ఉత్సాహాంగా సాగిపోతాయి. కోడలు శశి, కొడుకు అభీ వాళ్ళు అక్కడ మసలుకోవాల్సిన తీరుతెన్నులను వివరిస్తారు. సీనియర్స్ సెంటర్‌లో కొంతమంది భారతీయ, అమెరికన్ వయోజనులను కలుస్తారు, వారి జీవన విధానాలను అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తారు.

అమెరికా పౌరుల కుటుంబ సంబంధాలు:

కథలో భాగంగా, కొందరు అమెరికన్ దంపతుల మధ్య ప్రేమాభిమానాల గురించి చెప్తారు రచయిత్రి. అభీ ఇంటి పనుల కోసం వచ్చే హ్యాండీమాన్ బిల్ జీవితం ఆసక్తిదాయకంగా ఉంటుంది. అమెరికన్ వైవాహిక జీవితాలలోని వైరుధ్యాలను బిల్ జీవితం ప్రదర్శిస్తుంది. అయితే, అందులోని రెండో కోణాన్ని శశి అత్తగారికి వివరించినప్పుడు – ఒకరి వైపు మాటలే విని ఒక అభిప్రాయం ఏర్పర్చుకోకూడదన్న విషయం గుర్తొస్తుంది.

పక్షవాతం సోకిన తండ్రిని మంచానికి పరిమితం చేయకుండా, సీనియర్స్ సెంటర్‌కి తీసుకొచ్చి, ఆయన చెప్పే ముక్కలను వేస్తూ, తీస్తూ, బ్రిడ్జ్ గేమ్ ఆడిస్తుంది ఆయన కూతురు బాధ్యతల నిర్వహణకి నిదర్శనం, బంధాలను గౌరవించే పరిణతికి ఋజువు.

వయసు మళ్ళిన కారెన్‌ను బేబీసిట్టింగ్‌కి వాడుకుని ఆమెను శారీరకంగా నిస్సత్తువకి గురిచేసే కూతురు. పనీపాట లేకుండా తిరుగుతూ, కుటుంబ భారమంతా ఆమెపైనే మోపే రెండో మొగుడు..  అమెరికా కుటుంబాల మరో పార్శ్వాన్ని చూపుతాయి.

హెలెన్ తండ్రి సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఆసియా ఖండంలో ఉండగా, తప్పిపోవడం, కుటుంబంతో విడిపోవడం జ్రరుగుతాయి. అతను కొన్నాళ్ళు ఢిల్లీలో ఉంటాడు. ఎట్టకేలకు పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ కుటుంబంతో కలవడం, కూతురికి గాంధీ గారి త్రీ వైజ్ మంకీస్ వెండి బొమ్మ కానుకగా ఇవ్వడం జరుగుతుంది. హెలెన్ తన బాల్యం, తండ్రి జీవితం గురించి చెప్తున్నప్పుడు సుభద్రతో పాటుగా పాఠకుల కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి.

అమెరికాలో చూడదగ్గ ప్రదేశాలు/చరిత్ర:

మినియాపోలీస్ సిటీ ఆఫ్ లేక్స్ అనీ, మినెటొంలా లేక్ లో క్రూస్ ఉంటుందనీ శశి చెబితే, ఆ రాత్రి ఫోన్ చేసిన కూతురు స్ఫూర్తి మినియాపోలీస్ ప్రాంతం గురించి, చుట్టు ప్రక్కల ప్రదేశాల గురించి, అక్కడ పండే పంటల గురించి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.  లేక్ లో క్రూస్ ముగిసాకా, ఎక్సల్సియర్ అనే ఓ పాత ఊరికి తీసుకెళ్తాడు అభీ. అక్కడ వింతలూ విశేషాలూ చూసి ఇంటికి చేర్తారు.

ఇతర దేశాల ఆహార పదార్థాలు:

ఓ రోజు అభీ అందరినీ అమెరికన్ మాల్‍కి తీసుకువెళ్తాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లో సుభద్ర తిన్న జపనీస్ వెజిటేరియన్ వంటకం టెంపోరా గురించి తెలుసుకోడం బావుంటుంది.

అమెరికాలో తెలుగువారి ఉద్యోగాలు:

అభీ పర్సనల్ జిమ్ ట్రైనర్ కీర్తి వచ్చినప్పుడు – అర్జున్, ఆమెతో మాట్లాడి భారతీయులు/తెలుగువాళ్ళు విద్యార్థులుగా వచ్చి, చదువు పూర్తి చేసుకుని ఇక్కడే స్థిరపడడం గురించి అడిగితే, కీర్తి చెప్పిన సమాధానాలు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. ఇక్కడి పద్ధతులకు తగ్గట్టు వారు తమని తాము మలచుకునే పద్ధతి గొప్పగా ఉంటుంది.

అమెరికాలో భారతీయ కుటుంబాలు:

తెలుగువారే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి అమెరికా వచ్చిన పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి ఆర్నెలు ఉండి వెళ్తుంటారు. వాళ్ళల్లో గుజరాత్‌కి చెందిన పటేల్ ఒకడు. అర్జున్ అతనితో పరిచయం పెంచుకుని – పటేల్ గురించి, వాళ్ళ కొడుకుల గురించి తెల్సుకుంటాడు. కొడుకు వద్ద ఉంటున్న మనోహర్ అనే మిత్రుడు తీవ్రంగా జబ్బుపడ్డాడని చెప్పిన పటేల్, అర్జున్‌ని మనోహర్ ఇంటికి తీసుకెళ్తాడు. అతన్ని కలిసి వస్తున్నప్పుడు డెత్ విత్ డిగ్నిటీ, డెత్ డిక్లరేషన్ వంటి వాటి వివరాలు తెలుసుకుని అంతర్మథనానికి లోనవుతాడు అర్జున్.

శ్రమ విలువ:

మినియాపోలీస్ నుంచి కూతురు స్ఫూర్తి ఉండే అట్లాంటాకి వెళ్తారు అర్జున్, సుభద్ర. స్ఫూర్తి ఇంట్లో మనవడు మవరాలు టేబుల్ బిగించుకునే ప్రయత్నం చూసి హ్యాండీమాన్‌ని పిలవకపోయావా అని సుభద్ర అడిగితే, స్ఫూర్తి పిల్లలకి శ్రమ విలువ నేర్పే ప్రయత్నమది అని చెప్పి, అమెరికాలోని పద్ధతుల గురించి వివరంగా చెప్తుంది.

రాజకీయాలు:

ఆ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతూండంతో ఓ కాలనీలో రాజకీయాలపై చర్చ జరుగుతుంది. కమలా హారిస్ గురించి, ట్రంప్ అడ్వైజర్ తులసి గురించి మాట్లాడుకుంటారు.

బ్రైడల్ షవర్/తెలుగువారి వివాహాలు:

స్ఫూర్తి తల్లిని ఓ ఇండియన్ బ్రైడల్ షవర్‌కి తీసుకెళ్తుంది. సుభద్ర అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. హాబీగా చిన్న చిన్న అలంకరణ వస్తువులను తయారు చేసి, అందరి మెప్పు పొంది, వాటిని ఆన్‌లైన్ ద్వారా విక్రయించాలనుకున్న అపర్ణ ఆలోచనా విధానం ఇండియన్-అమెరికన్ పిల్లలకు ప్రతీక.

మౌంట్ రష్మోర్‌ సందర్శనం:

స్ఫూర్తి అమ్మానాన్నలతో, భర్త విజయ్ తోనూ పిల్లలతోనూ మౌంట్ రష్మోర్ వస్తుంది. ఆ పర్వత శిఖరంపై ఉన్న నలుగురు అధ్యక్షుల శిల్పాల గురించి, అవి చెక్కిన శిల్పుల గురించి, చెక్కడానికి పట్టిన కాలం, ఖర్చు గురించి విజయ్ అందరికీ వివరిస్తాడు. మర్నాడు లింకన్ బోర్ గ్లమ్ మ్యూజియం వగైరా చూసి ఇంటికి చేర్తారు.

మళ్ళీ మినియాపోలీస్‌కి, అక్కడ్నించి ఇండియాకి:

కూతురు దగ్గరనుంచి కొడుకు ఇంటికి వస్తారు అర్జున్, సుభద్ర. అమ్మానాన్నలతో పాటు స్ఫూర్తి కూడా తమ్ముడింటికి వస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుస్తుంది. అర్జున్, సుభద్రల తిరుగుప్రయాణానికి సమయం దగ్గరపడుతుంది. అభీ తన స్నేహితులని భోజనానికి పిలుస్తాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో అమెరికా గొప్పదనం ఏమిటో ఒక్కొక్కరు చెప్తారు. అయితే సమాజం డైనమిక్ అనీ, జనరలైజ్ చేయకూడదని తన అనుభవం నుంచి వివరిస్తాడు అర్జున్.

అభీ ఎన్నో జాగ్రత్తలు చెప్పి అమ్మానాన్నలను విమానం ఎక్కిస్తాడు. హైదరాబాద్ చేరిన అర్జున్, సుభద్రలు తమ రొటీన్‌లో పడిపోతారు.

ఎంతో ఆసక్తిగా సాగి, హాయిగా చదివిస్తుందీ నవల.

~

అమెరికా గురించి, అమెరికన్ల గురించి రచయిత్రి నేరుగా చెప్పకుండా, పాత్రల ద్వారా చెప్పించడం బాగుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల చదువుతున్నట్టు పాఠకులకు అనిపించే అవకాశం ఉంది. వింతలూ విశేషాలు చెప్తూనే, నవ్విస్తూ, మానవ జీవితాల లోని సంవేదనలను ప్రదర్శిస్తూ, మనసుని తడి చేస్తుందీ నవల.

ఒక సిటింగ్‌లో చదివేయగలిగే పుస్తకం!

***

నులివెచ్చని గ్రీష్మం (నవల)
రచన: మాలా కుమార్
ప్రచురణ: తపస్వి మనోహరం పబ్లికేషన్స్,
పేజీలు: 136
వెల: ₹ 175/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి: 9989051913
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Nulivechchani-greeshmam-Mala-Kumar/dp/B0DQWHLMSL/

Exit mobile version