[డా. గీతాంజలి రచించిన ‘నువ్వే రావచ్చు కదా!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ రాత్రి ఇక నన్ను నిద్ర పోనివ్వదు!
ఫోను డీపీలో నీ ఫోటో చూస్తాను
నీలో నన్ను నిద్రకి దూరం చేసే
చమక్కు ఏముందా అని..
అద్దం వైపుకి చూడమని
చెబుతావు ఫోటో లోంచి
……
నీ ఇంటి నుంచి నా కిటికీ వైపు వచ్చిన
చంద్రుడు నీ జాడ చెబుతాడు..
మన మధ్య చంద్రుడూ, మబ్బులూ
నక్షత్రాలు, పిల్ల తెమ్మెరలూ..
తోటలో పువ్వులూ..
కొమ్మ మీది పక్షులూ ఎందుకు చెప్పు?
నువ్వే రావచ్చుగా.. ఉహూ రావు!
సరే.. చంద్రుడితో ఏం చెప్పి పంపావెంటీ?
నీ విరహపు దుఃఖాన్ని
నా నిరీక్షణకి రంగరించి..
వెన్నెల లేపనంగా నా దేహానికి.,
నీ పేరు తపించే నా పెదవులకి..
నిన్ను చూడాలని వెర్రిగా ఆశ పడే
నా కనురెప్పలకీ.. ముద్దులుగా అద్ది వెళ్ళాడు!
నువ్వే రావొచ్చు కదా మరి?
సరే.. రాకపోతే ఎంతలే అనుకుంటానా..
అలకతో ముడుచుకుపోతానా..
నిలువెల్లా పాకే వియోగపు నొప్పిని భరిస్తూ
ఇంకేం వస్తావని తలుపులు మూసుకుంటానా?
ఇకప్పుడు.. తలుపు తడతావు చూడు!
ప్రాణమంతా పోయినట్లు..
నన్ను కలవడానికే
ఆ కొంచెం మిగిలావన్నట్లు
సరిగ్గా నా కిటికీ బయట..
మంచులో తడిసి ముద్దైన
మాలతీ పూల తీవెలా నిలబడి..
దీనంగా పట్టుబడినట్లు నవ్వుతావు.
నువ్వోడిపోతావని తెలిసీ..
నాతో పంతం ఎందుకు నీకు?
చేతులు చాపి నిన్ను నాలోకి తీసుకోవడం వినా..
ఇక నేను కూడా చేసేది ఏం ఉంది చెప్పు?
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964