[విలియం బట్లర్ ఈట్స్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of William Butler Yeats’s poem ‘When you are old’ by Mrs. Geetanjali.]
~
ప్రేయసీ.. నీ జుట్టు నెరిసిపోయి
ముసలిదానివైపోయినప్పుడు.,
నువ్వు పూర్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు..
లేదా మత్తులో జోగుతున్నప్పుడు..
నా ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని..
మెల్లిగా చదవడం మొదలు పెట్టు.
చదువుతూ.. ఒక కల కను.
ఒకప్పటి నీ కళ్ళల్లో ఉన్న మెత్తటి చూపుల్ని..
వాటి లోతైన నీడలతో సహా మళ్ళీ చూడు!
అప్పట్లో ఎంత మంది నీ సంతోషకరమైన క్షణాలను..
నీ అందాన్ని ప్రేమించి ఉంటారో కదా?
ఆ ప్రేమ నిజమో.. అబద్ధమో ఎవరికి తెలుసు?
బహుశా చాలామంది నిన్ను ప్రేమించే ఉంటారు!
కానీ.. నీలోపలి పవిత్రమైన ఆత్మను మాత్రం
అమితంగా ప్రేమించిన మనిషి ఒకడు ఉండేవాడు!
నిత్యం నీ లోపల నిండిపోతూ..
విషాదాలతో చిన్నబోతూ వాడిపోయే
నీ ముఖంతో సహా నిన్ను ప్రేమించాడు.
అతడు నీకు మెరిసిపోతున్న కడ్డీల పక్కకి వంగిపోయి..
కొద్ది విచారంగా.. గొణుగుతూ..
ఎలా ప్రేమ తనలోంచి ఎగిరిపోయిందో..
దూరాన ఉన్న పర్వతాల మీద కెలా చేరుకుందో..
మెల్లిగా తన ముఖం ఎలా నక్షత్రాల గుంపులో దాక్కున్నదో..
నీ నుంచి తను ఎలా దూరమైపోయాడో మెల్లిగా చెప్తాడు విను!
ప్రేయసీ పుస్తకాన్ని తీసుకో.. మెల్లిగా చదువు!
~
మూలం: విలియం బట్లర్ ఈట్స్
అనుసృజన: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964