[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పుట్టి నాగలక్ష్మి గారి ‘న్యాయం కావాలి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ పట్టణం. చుట్టూ చిన్న చిన్న గ్రామాలు, తండాలు ఉన్నాయి. ఆ ఊరిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే ఈ ‘జీవనధార’ హాస్పిటల్ ప్రత్యేకమయినది. ఎందుకంటే అది అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాదు. పెద్ద పెద్ద అద్దాలతో బాగా గొప్పగా ఉండదు. మామూలు సాదాసీదా హాస్పిటల్ – ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు.), వివిధ వ్యాధుల నిర్ధారిత లాబొరేటరీలు, పేషంట్ల కోసం సాధారణ గదులు, ప్రత్యేక గదులు ఉన్నాయి.
ఆ హాస్పిటల్‌కి అంత పేరు రావడానికి కారణం డాక్టర్ శ్రీనాథ్. ఆయన నరాల సంబంధిత డాక్టర్ (న్యూరో ఫిజిషియన్). చుట్టు ప్రక్కల గ్రామాలు, తండాలలో నరాల సాబ్, నరాల సార్ అని, ఆయన హస్తవాసి మంచిదని పేరు పొందాడు.
శిశువుల దగ్గరి నుండి వృద్ధుల వరకు మూర్ఛ, పక్షవాతం, నరాలవాతం, ఇంకా నరాల వ్యాధులు ఆయన ఖచ్చితంగా నయం చేయగలడనే నమ్మకం అందరిదీ. ఆ హాస్పిటల్ పేరు ‘నరాల హాస్పిటల్’ అయింది.
***
ఆ హాస్పిటల్‌లో ఒక రోజు పేషెంట్లు, వారి సహాయకులతో వెయిటింగ్ రూమ్‌లో కుర్చీలు నిండుతున్నాయి. డాక్టర్ శ్రీనాథ్ పేషెంట్లను చూస్తున్నాడు.
గుమ్మం దగ్గర నుండి “నేను నరాల సార్‌ని చూడాలి” అనే మాటలు విన్పించాయి.
తలెత్తి చూశాడు.
“చూస్తారు. ఇప్పుడేగా వచ్చావు. కుర్చీలో కూర్చో! వరసలో రావాలి. తెలుసుగా!” అనునయంగా అంది సిస్టర్.
“ఇటు రామ్మా! నీ పేరు చెప్పు” రిసెప్షనిస్ట్ పిలిచింది. అక్కడికి వెళ్ళి “నా పేరు లక్ష్మమ్మ” అని చెప్పింది. ఓ.పి. స్లిప్ తీసుకుని కుర్చీలో కూర్చుంది.
ఒక గంట గడిచింది.
“లక్ష్మమ్మా! లక్ష్మమ్మ ఎవరు? రండి.” పిలిచింది గేటు దగ్గరున్న ఆయా.
లక్ష్మమ్మ లోపలికి వెళ్ళింది.
“స్టూల్ మీద కూర్చోమ్మా!” డాక్టర్ సహాయకురాలు చెప్పింది.
“నీ పేరేంటమ్మా?” అడిగాడు డాక్టర్.
“లక్ష్మమ్మ”
“నీ బాధ ఏంటి?”
“తలనొప్పి”
“ఎక్కడ?”
తల వెనక ముచ్చిలిగుంట భాగాన్ని చూపించింది.
“ఎప్పటి నుంచి?”
“రాత్రి నుంచి”
“ఎందుకు వచ్చింది?”
“నీ మూలంగానే!”
“నా మూలంగానా?” ఆశ్చర్యపోయాడు.
“అవును. నీ మూలంగానే! అందుకే నువ్వు నాకు ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇవ్వు.”
అతని ఆశ్చర్యం రెట్టింపు అయింది. “నేనేం చేశానమ్మా!” అన్నాడు.
“డాక్టర్ గారిని అలా అడగకూడదు” నర్స్ వారించింది.
“ఏం? ఎందుకు అడగకూడదు? అంతా ఆయన మూలంగానే కదా!” అంది నర్స్‌తో.
“నువ్వు ఊరుకో సిస్టర్!” ఆమెని ఆపాడు డాక్టర్. “సరేనమ్మా! నేనేం చేశానో చెప్పు. నీకు నా మూలంగా తలనొప్పి రావడమేంటి?” అతని ముఖంలో పలురకాల ప్రశ్నలు..
“అప్పుడెప్పుడో నాలుగు నెలల కిందట మా ఆయనని తీసుకొచ్చానా?”
“ఆ! అవును. మీ ఆయన పేరేంటీ?”
“శీనయ్య.”
“ఏ శీనయ్య?”
“శింగనపల్లి శీనయ్య. మాది శింగనపల్లి.”
“ఓహో! అతనా? ఎలా ఉన్నాడు ఇప్పుడు?”
“ఆయనకేం? బాగానే ఉన్నాడు. నాకే ఈ నొప్పులు, బాధలు” నిష్ఠురం ధ్వనించింది ఆమె గొంతులో.
“వెనకాల చాలామంది పేషెంట్లు ఉన్నారమ్మా! త్వరగా చెప్పు” సిస్టర్ తొందరపెట్టింది.
“ఉండమ్మా! చెపుతాను” విసుగ్గా అందామె.
“నువ్వూరుకో! సిస్టర్!” వారించాడు డాక్టర్. “అసలు సంగతేమిటో చెప్పమ్మా!” లక్ష్మమ్మని అడిగాడు డాక్టర్.
“అప్పుడు మా ఆయనకి కాలు, చెయ్యి పడిపోతే నీ దగ్గరికి తీసుకొచ్చానా?”
“అవును.”
“ఆయనకి మంచి మందులిచ్చావు, నయమయింది.”
“అవును, ఇప్పుడు ఎలా ఉన్నాడు?”
“ఆయనకేం? మారాజు – నువ్విచ్చిన సూదిమందు, గోలీలు, అరుకు అన్నీ బాగా పని చేశాయి. సుబ్బరంగా తిని, తాగుతున్నాడు. పనిలోకి వెళ్ళట్లేదు.”
“పనిలోకి వెళ్ళట్లేదా?”
“లేదు.”
“ఏం?”
“మళ్ళీ నా కాలు, చెయ్యి పడిపోతే ఎట్లాగే? అంటున్నాడు.”
“అతను పనిలోకి వెళ్ళకపోతే నేను చేసేదేముంది? నీకు తలనొప్పికి మందులిస్తా! వేసుకో!”
“నాకు ఫ్రీగా మందులివ్వు.”
“అదేనమ్మా ! ఫ్రీగా ఫ్రీగా అంటున్నావు. ఫ్రీగా ఎందుకు చెయ్యాలి?”
“నువ్వు ఆయనకి మంచి మందులిచ్చావు. నయం చేశావు. మామూలుగా కాలు, చెయ్యి వచ్చేశాయి. ఆయన మంచం మీద పడుంటే నాకు హాయిగా ఉండేది. ఇప్పుడు రోజూ తాగేసొచ్చి గొడవ చేస్తున్నాడు. నిన్న బాగా ఎక్కువ తాగి ఒళ్ళు తెలియకుండా నామీదకొచ్చాడు. నేను ఎదురు తిరిగా! నా తల గోడకేసి కొట్టాడు.” వాక్ప్రవాహాన్ని ఆపింది.
“అయ్యో!” అన్నాడు.
“అయ్యో! అంటావేంటి? ఇంకా చెపుతా ఉండు. నీ మూలంగానేగా ఆయన బయటకెళతున్నాడు. తాగేసొచ్చి నన్ను కొడతన్నాడు. ఇప్పుడు తెలిసిందా? నా తలనొప్పి నీ మూలంగానే! అవునా?”
“అయితే ఏం చెయ్యమంటావు?”
“అందుకే నాకు ఫ్రీగా ట్రీట్‌మెంటివ్వు. కట్టిన ఫీజు తిరిగిచ్చెయ్యి. గోలీలు, సూదిమందు, అరుకు ఫ్రీగా ఇవ్వాలి.”
“ఆ!” డాక్టర్‌తో సహా స్టాఫ్ అందరూ అవాక్కయ్యారు.
లక్ష్మమ్మ డాక్టర్‌నే చూస్తోంది.
కొన్ని క్షణాలు గడిచాక “డాక్టర్ సాబ్! డాక్టరంటే దేవుడు కదా! మరి దేవుడు న్యాయం చెయ్యాలిగా!” అంది లక్ష్మమ్మ.
డాక్టర్ షాక్ నుంచి తేరుకుని, “అవునమ్మా! డాక్టరంటే దేవుడని మీరందరూ అనుకుంటారు. కానీ మేమూ మనుషులమే! ఆ దేవుడే అందరికీ సాయం చెయ్యాలి. ఆయనే మీ అందరికీ నాతో నయం చేయించాడు, చేయిస్తాడు. కూడా!” అన్నాడు.
“మరి మీరు నాకు కొంత సాయం చెయ్యండి. ఫీజు..”
డాక్టర్ మధ్యలోనే అందుకుని – “చూడమ్మా! ఇది నా హాస్పిటల్ కాదు. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇదుగో! ఈ సిస్టర్లనీ, ఆయాలనీ, అందరినీ చూశావుగా! వీళ్లకీ నాకూ జీతాలు ఇవ్వాలి. హాస్పిటల్ నడపడానికి చాలా ఖర్చవుతుంది. యజమానులకు చాలా ఖర్చులుంటాయి..”
“నా సంగతి చూడండి సాబ్!” మళ్ళీ మొదటికొచ్చిందామె.
“అదేనమ్మా! నేను చెప్పేది విను. నాకు చేతనయింది వైద్యం చెయ్యడం. అది నేను చేశాను. నీ సంసారంలో బాధలంటావా! దానికి ఏం చెయ్యగలను?”
“ఆయన పనిలో కెళితే బాగుంటది సాబ్! భయం లేదని మీరు ధైర్యం చెప్పండి.” అప్పటికి మనసు కుదుట పర్చుకుని అడిగింది.
“సరే! రేపు తీసుకురా! మాట్లాడుతాను.”
“సిస్టర్! ఇటు రా!” పిలిచాడు డాక్టర్.
“ఆమె బాధ చూడలేకపోతున్నాను. ఏం చేద్దాం” సలహా అడిగాడు. కాని తన మనసులో ఆలోచిస్తూనే ఉన్నాడు.
“మీ ఇష్టం సార్!” సిస్టర్ చెప్పింది.
…….
రెండు నిముషాలు గడిచాయి.
“చూడమ్మా! నా ఫీజులు తగ్గిస్తాను. మిగిలిన డబ్బులు ఈ హాస్పిటల్‌కు కట్టు. నేను ఇంతవరకే నీకు న్యాయం చెయ్యగలనమ్మా!” అన్నాడు ఆమెతో.
“సిస్టర్! బిల్లు తయారు చేసి పంపండి.” సిస్టర్‌తో అన్నాడు.
సిస్టర్ ఒకసారి డాక్టర్ వైపు సాలోచనగా చూసింది. ‘ఈ డాక్టర్ సాబ్ ఆమెకు ఇలా న్యాయం చేస్తున్నాడు’ అని మనసులో అనుకుంటూ బిల్లు తయారీలో మునిగింది.