Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంస్కృత న్యాయపథ చుక్కాని

[శ్రీ బి.ఎస్. శర్మ రచించిన ‘న్యాయ పథం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ కోవెల సంతోష్‍కుమార్.]

సంస్కృత న్యాయాలు లోకంలో ఉండే ధర్మాలను, అలవాట్లను, విశ్వాసాలను ఇతర అంశాలను సంక్షిప్తంగా చెప్తాయి. ఒక విధంగా ఇవి తెలుగు సామెతల వంటివి. ‘న్యాయం’ అనే మాటకు నడిపించేది అని అర్థం. ఈ నడిపించడం అనేది మన నాగరికతలో భాగం. ఈ సామెతల వంటి సంస్కృత న్యాయాలు అనుభవాలను సంగ్రహంగా చెప్పడానికి ఉపయోగ పడతాయి. ఈ సామెతలు, న్యాయాలు కాలాన్ని తట్టుకొని సార్వకాలీనమైనవిగా అన్నింటికీ అతీతంగా నిలబడతాయి. భారతీయ తాత్త్విక చింతనలో, సామాజిక జీవన సంప్రదాయంలో ఏర్పడిన సూక్ష్మాతి సూక్ష్మమైన తర్క సూత్రాలుగా వీటిని మనం అధ్యయనం చేయాలి. ఇవి సాధారణంగానే చాలా చిన్న చిన్న వాక్యాల రూపంలో ఉంటాయి. కానీ వాటిని లోతుల్లో విశ్లేషించినప్పుడు వాటి అంతరార్థం విస్తృతమైన ఆలోచనకు, సామాజంలోని ధార్మిక లక్షణాన్ని విశ్లేషిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, న్యాయ, మీమాంస, వేదాంత గ్రంథాల్లో, వ్యాఖ్యానాల్లో ఈ సంస్కృత ‘న్యాయాలు’ ఒక సైద్ధాంతిక ప్రాతిపదికన వినియోగించబడ్డాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. ఒక్కో న్యాయం సమాజంలోని అనేకానేక అంశాలను వివరిస్తుంది. సమాజపు లక్షణం ఏమిటో చెప్తుంది. సమాజంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ణయించుకొనే విశాలమైన ఆలోచనను కల్పిస్తుంది. భారతీయ ఫిలాసఫీలోని అత్యంత క్లిష్టమైన భావాలను నేరుగా నిర్వచించకుండా, ఒక ఉదాహరణతో కూడిన చిన్న వాక్యంతో న్యాయం రూపంలో మన ద్రష్టలు వెల్లడించారు. వీటిని చదివినప్పుడు దానిని తర్క బద్ధంగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలకు పదును పెట్టాలి. ఒక న్యాయంలోని ఈ సంక్లిష్టతలను సంపూర్ణంగా గ్రహించడానికి అవసరమైన దార్శనిక దృష్టిని కూడా ఈ న్యాయమే మనకు సూచిస్తుంది. ఉదాహరణకు అందరికీ బాగా తెలిసిన ‘జామాతా దశమ గ్రహః’ అనే మాటలో దశమగ్రహం అని అర్థం కాదు. ఇంటి అల్లుడు ఎప్పుడూ తృప్తి పడడు. అత్తవారింటి నుంచి ఏదో ఎప్పుడో కోరుకుంటాడు. ఏమి చేసినా అతను తృప్తి చెందడనే అర్థంలో ఉంటుంది. సుమతి శతకంలో కూడా మనకు అల్లుడి మంచితనం లోకంలో ఉండదు అని చెప్పటం జరిగింది. అజ్ఞానం, అపార్థం, అర్థ సంప్రాప్తి, తర్క లోపం వంటి వాటిని గుర్తించి.. మనం సరైన నిర్ణయం తీసుకునేందుకు మార్గాలుగా ఈ న్యాయాలు దిక్సూచిగా నిలుస్తాయి. బహుశా ఈ కారణంగానే చదువుకొనేటప్పుడు బోధనల్లో, శాస్త్రాలను వివరించటంలో, ఫిలాసఫీ ఆలోచనల్లో ఈ న్యాయాలు అనేక సందర్భాల్లో ఉదాహరణలుగా, అర్థవంతంగా ప్రయోగశీలంగా కీలక పాత్ర పోషించాయి.

ఆదిశంకరులు, రామానుజులు, మధ్వ, నింబార్క, ఆనందవర్ధనుల వంటి మహానుభావులు తమ వ్యాఖ్యానాల్లో ఈ న్యాయాలను విస్తృతంగా ఉపయోగించారు. వీటివల్ల భారతీయ ఫిలాసఫీని, ధర్మాన్ని సంక్షిప్తంగానే అయినప్పటికీ అత్యంత ప్రభావ వంతంగా చెప్పగలుగుతారు. ఈ సంస్కృత న్యాయాలను ఎక్కడెక్కడో విడివిడిగా ఉన్న వాటిని ఒకచోట చేర్చి బిఎస్ శర్మ గారు ‘న్యాయ పథం’ అన్న గ్రంథాన్ని మనకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇందుకోసం ఆయన అనేక గ్రంథాలను పరిశీలించారు. పరిశోధించారు. ఆనాటి న్యాయాలను.. ఈనాటి పరిణామాల అవగాహనతో, సమాజపు పోకడలతో అనుసంధించి చూశారు. నైతికతను మాత్రమే కాకుండా అంతరాలలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొలిపేవిధంగా ఉన్నవీ న్యాయాలు.

ఈ న్యాయాలలో ఏమున్నదో రచయితే ముందుమాటలో చెప్పుకుంటూ వచ్చారు. “ఈ న్యాయాలలో ఓ వ్యంగ్యం ఉన్నది. ఓ పరిశోధన ఉన్నది. చాలా నిశితమైన ప్రకృతి పరిశీలన కనిపిస్తుంది. చాలా గంభీరమైన వేదాంతం ఉన్నది. జీవన అనుభవం ఉన్నది. జీవిత పాఠాలు ఎన్నో ఇందులో వినిపిస్తాయి. ఈ న్యాయాలలో ఓ ఆప్తవాక్యం ఇమిడి ఉంటుంది. ఓ తత్త్వం ఉన్నది. ఓ సుభాషితం అందించే జ్ఞానం ఉంది.” (పే.18.).

ఇందులో మొత్తం 50 న్యాయాల గురించి శర్మగారు వివరించారు. వీటిలో మనందరికీ చాలా చిరపరిచితమైన, మనం రోజూ మన మాటల్లో, రాతల్లో, చేతల్లోనూ విస్తృతంగా వినియోగించే కొన్నింటిని ఇక్కడ ఉదహరిస్తాను. ఈ గ్రంథంలో మొదటిదే అందరికీ బాగా తెలిసిందీ.. అందరమూ రెగ్యులర్ గా వినియోగించేది. ఆ న్యాయం పేరు ‘కాకతాళీయం’ దీని వెనుక అర్థం ఏమిటో ఎంతమందికి తెలుసు? ఇదిగో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. మనం చాలా వాటికి అర్థం తెలియకుండానే వాడేస్తుంటాం. అలాంటిదే ఈ న్యాయం కూడా. ఈ న్యాయానికి శర్మగారి వ్యాఖ్యానం చూడండి.. ‘ఓ కాకి ఎగురుతూ వస్తున్నది. మనం చూస్తుండగానే బాగా ముగ్గిన తాటిపండు ఢభేల్ అని కింద పడింది. ఇదే కాకతాళీయం. కాకతాళీయంలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి కాకి, రెండు తాటిపండు.. ఇందులో చిత్రమైన అంశం ఏమిటంటే కాకి బరువుకు ఆ తాటిపండు రాలిందా? కానే కాదు.. ఆ మిగలముగ్గిన ఫలం ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవలసిందే కదా.. అలా పడే సమయానికే కాకి ఎగురుతూ వచ్చి తాటిచెట్టుపై కూచుంది. ఈ రెండు ఘటనల మధ్య పరస్పర సంబంధం ఏమాత్రం లేకపోయినా ఒకేసారి సంభవించాయి. ఇది కాక-తాళీయమే.” (పే.24).

ఒకే ఒక పదబంధంలో ఇంత సూక్ష్మంగా వివరణను విశ్లేషించడం అద్భుతం. ఈ న్యాయానికి ఈనాటి లోకంలోని ఘటనలను, సందర్భాలను కూడా జతపరచి విశ్లేషించారు.

కాలానుగుణంగా అనేక సంస్కృత న్యాయాలు కేవలం శాస్త్ర గ్రంథాలకే పరిమితం కాకుండా, సామాజిక ఆలోచనల్లో, ఆధునిక వ్యాస రచనల్లో కూడా ప్రవేశించాయి. రచయిత ఆలోచనను క్రమబద్ధీకరించడం కోసం, రచయిత వాదనకు మరింత బలాన్ని కలిగించడం కోసం, రచయిత సృజనలోని గాఢతను విశ్లేషించడానికి ఈ న్యాయాలు ఉపకరిస్తాయి. ఈ గ్రంథంలోని చివరి న్యాయం గోముఖ వ్యాఘ్రం. ఇది తెలియని వారెవరూ బహుశా ఉండరు. పైకి గోవులాగ కనిపించినా లోలోపల పులి లాంటి క్రూరత్వం కలిగి ఉండటం దీని అర్థం.

‘శాంతముఖో గోముఖవత్ అంతర్యస్యాంతరే వ్యాఘ్రః
తాదృశం న విశ్వాసేత్ మిత్రం, శత్రుం చ మానవః

గోవు మాదిరి శాంత ముఖం సాధుత్వం లోలోపల దాగి ఉండే వ్యాఘ్రం, క్రూరత్వం కలిగిన వారితో ఎలాంటి స్నేహం చేయకూడదన్నది. దీని పరమార్థం. ఎవరైనా అతి వినయంగా ఉంటూ, అతిగా పొగుడుతూ,  కృత్రిమంగా ప్రవర్తిస్తూ, స్నేహం చేస్తూ, తియ్యగా మాట్లాడుతుంటే ఏదో జరుగబోతుందని జాగ్రత్త పడాలన్నమాట” (పే.261).

మరో న్యాయం గురించి చాలా చక్కగా శర్మగారు వివరిస్తారు. దాని పేరు మలిన దర్పణ న్యాయం. మలినం అంటే మురికి, దర్పణం అంటే అద్దం. మురికి పట్టిన అద్దం. అద్దానికి మురికి పడితే ఏమీ కూడా సరిగ్గా కనిపించదు. అద్దం మురికి పడితే తప్పు అద్దానిది కాదు.. దాన్ని మురికిగా చేసిన వారిదే తప్పంటారు శర్మగారు. అద్దం అబద్ధం చెప్పదు అన్న తెలుగు సామెతకు అచ్చంగా సంస్కృత రూపమే ఈ మలిన దర్పణ న్యాయం అని చెప్పవచ్చు. దీన్ని మరో రూపంలో శర్మగారు విశ్లేషించారు. “మన హృదయం స్వచ్ఛమైనదైతే లోకం మంచిగా కనపడుతుంది. అది స్వచ్ఛంగా లేనప్పుడు లోకం అంతా దుష్టంగానే కనిపిస్తుంది. ఏ రంగుటద్దంలో చూసిన వాళ్లకు లోకం ఆ రంగులో కనపడుతుంది అన్న లోకోక్తి. దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన కళ్లతో ప్రపంచాన్ని చూసిన వారికి ప్రపంచం ఉన్నదున్నట్టుగా కనిపిస్తుంది. అదే ఎఱ్ఱ కళ్లద్దాలు పెట్టుకున్న వారికి లోకమంతా ఎర్రగానే కనిపిస్తుంది. వామపక్షీయులను ఉద్దేశించి ఇలా అంటుంటారు. వాళ్లు చైనా కళ్లజోడులో చూస్తారంటారు.” (పే.189).  ఈ న్యాయంతో శర్మగారు కమ్యూనిస్టులకు బాగా చురకలంటించారు.

ఈ గ్రంథంలో నాకు బాగా నచ్చిన న్యాయం ‘శ్వశ్రూనిర్గచ్ఛోక్తి న్యాయం’ ఈ న్యాయం ఇప్పటికే కాదు.. ఎప్పటికీ ఏ సమాజానికైనా ఇది వర్తిస్తుంది. ఒక పనిని చేసిన వారిని విమర్శించి, తిట్టిపోసి తాను కూడా అదే పనిని అలాగే చేయడాన్ని శ్వశ్రూనిర్గచ్ఛోక్తి న్యాయం అని అంటారు. శ్వశ్రూ అంటే అత్తగారు. నిర్గచ్ఛోక్తి అంటే పొమ్మని చెప్పటం. ఓ భిక్షువు యాచన చేస్తూ ఒక ఇంటి ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగినప్పుడు ఆ ఇంటి కోడలు ఏమీ లేదు వెళ్లు వెళ్లు అని పంపించిందిట. అప్పుడే గుడికి వెళ్లి తిరిగి వస్తున్న అత్తగారు ఆ భిక్షువును ఆపి తన కోడలు ఏం చెప్పిందో తెలుసుకొని.. చెప్తే తానే చెప్పాలి తప్ప కోడలు చెప్పటం ఏమిటంటూ.. ఆ భిక్షువును తిరిగి ఇంటిదాకా తీసుకెళ్లి.. అతనితో భవతీ భిక్షాందేహి అనిపించుకొని, ఏమీ లేదు.. వెళ్లు అని అన్నదంట (పే.167). ఇదీ ఈ న్యాయంలోని మర్మం. మన రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ తిట్టిపోసి.. తాము అధికారంలోకి రాగానే అదే పనిని చేయడం మనం చూస్తూనే ఉన్న సంగతి.

అందరికీ తెలిసిన మరో న్యాయం ‘సింహావలోకనం’. ఇది అందరికీ తెలిసిందే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం. అడవిలో జంతువులన్నింటిలోనూ సింహం రాజు. సింహం తాను ఠీవీగా ముందుకు నడుస్తూ వెళ్లి.. కొద్ది దూరం పోయాక.. వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిని చూసుకుంటుంది. ప్రతి మనిషి తన బ్రతుకు ప్రయాణంలో ముందుకు సాగుతూనే.. ఒకసారి వెనక్కి తిరిగి తన జీవితాన్ని చూసుకోవాలి. మన ప్రయాణం, పరిచయాలు, అనుభవాలను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ శర్మగారు రాజ్యాంగ సమీక్షను గురించి వివరించారు. ‘బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపోయే ముందుగానే 1946 నవంబర్ నుంచి మొదలుపెట్టి ప్రముఖులైన కొందరు అప్పటి అవసరాలకు అనుగుణంగా వ్రాసిన మన రాజ్యాంగాన్ని ఈ 70 సంవత్సరాలలో 106 సార్లు మార్పులు, చేర్పులు చేసుకున్నాం. చాలా మందికి తెలియని విషయం ‘ఇది నా రాజ్యాంగం కాదు.. తమ అభిప్రాయాలను కొందరు నా చేత రాయించుకున్నారు అంతే’ అని వాపోయారు రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన డా. అంబేద్కర్. ఒకసారి రాసిన దానిని దేశహితం కోసం మార్పులు చేసుకోవడం తప్పు కాదు. ‘మార్పులు చేయము అనటం మూర్ఖత్వం’ (పే.146).

ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని ప్రతి ఒక్క న్యాయాన్ని గురించి ఒక్కో గ్రంథమే రాయవచ్చు.

మన దేశ జ్ఞాన పరంపరలోని లోతులను వివరించేవి ఈ న్యాయాలు. మన మేధస్సుకు దిశానిర్దేశాలు ఈ న్యాయాలు. ఇవి భారతీయ మేధో సంపదలో ఒక ముఖ్యమైన మౌలికాంశంగా నిలిచి, గతం నుంచి వర్తమానం వరకు ఆలోచనా సంప్రదాయాన్ని అనుసంధానిస్తున్నాయి. మనిషి బుద్ధి సహజంగానే అసంపూర్ణమైందని పెద్దలు అంటారు. అంటే పరిమితమైన అనుభవం.. దానికితోడు భ్రమ, అసంపూర్ణ సమాచారం వల్ల ఎక్కువసార్లు తప్పుదారిలోనే ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు ఈ లోపాలను సరిదిద్దేందుకు ఈ న్యాయాలు ఉపకరిస్తాయి. ఏవైనా శాస్త్ర గ్రంథాల్లో ఒక శ్లోకార్థం లేదా సూత్రార్థం సందిగ్ధంగా ఉన్నప్పుడు, లేక రహస్య కథాకథన సంప్రదాయంలో చెప్తున్నప్పుడు వ్యాఖ్యాత ఈ న్యాయాన్ని పొందుపరిచనట్లయితే.. దాని ద్వారా మనకు ఆ సందిగ్ధత తేలికగా తొలిగిపోతుంది. ఒక భావాన్ని ఎలా తెలుసుకోవాలి.. దానికి ఆధారం ఏమిటి? ఎక్కడ అర్థం ఉంటుంది? ఎక్కడ అపార్థం కలుగుతుంది? ఆ అపార్థాన్ని కానీ, విపరీతార్థాన్ని కానీ నివారించడానికి ఈ న్యాయాలు సరైన సమాధానాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. న్యాయ–మీమాంసా–వేదాంతాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. అంతే కాకుండా ఈ న్యాయాలకు ఉన్న ముఖ్య లక్షణం ముందే చెప్పినట్టు సార్వకాలీనత. ఇవి ఒక కాలానికో, ఒక సమాజానికో, ఒక దేశానికి మాత్రమే సంబంధించినవి కావు. మనిషి ఆలోచన అనేది విశ్వవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆధునిక చరిత్ర రచనల్లో, సామాజిక విమర్శల్లో, రాజకీయ విశ్లేషణల్లో కూడా ఈ న్యాయాల ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుంది. భారతీయ మేధో సంప్రదాయంలో కనిపించే సిద్ధాంతాల వెనుక ఉండే ఆలోచనలు, తాత్త్విక చింతనకు సంస్కృత న్యాయాలు బలమైన మూల స్తంభాలు. ఇంతటి చక్కని గ్రంథాన్ని ఈ తరానికి అందించిన శర్మగారికి నమస్సులు.

***

న్యాయ పథం
రచయిత: బి.ఎస్. శర్మ
ప్రచురణ: ఋషిపీఠం
పేజీలు: 268
వెల: ₹ 300/-
ప్రతులకు:
ఋషి పీఠం ఛారిటబుల్ ట్రస్ట్
ప్లాట్ నం.37-93/138/2,
మధురా నగర్
నేరేడ్ మెట్, హైదరాబాద్,
తెలంగాణ -500056
ఫోన్: 040-79658274
ఆన్‌లైన్‌లో
https://www.hindueshop.com/product/nyaya-patham-tel/

Exit mobile version