[వాణి వేమవరపు గారు రచించిన ‘ఓ బిడ్డ ఎప్పుడొస్తావ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఓ బిడ్డ ఎక్కడున్నావ్,
ఓ బిడ్డ ఎప్పుడొస్తావ్.
తాప తాపకు నీవు వస్తావని చూస్తున్న ,
దర్వాజా చప్పుడైతే ఆ దిక్కే నిల్చున్న.
చాలా సమయం అయింది కనులరా నిన్ను చూసి,
కన్ను మసకడతాంది, మాట తడబడతాంది,
నీ చిన్నగున్న మాటలు తలుచుకుంటూ మురుస్తున్న.
ఏదో దూరపు కొలువున నీవు,
గుండె బరువుతో ఈడ నేను,
ఎంత ఎత్తో ఎదగాలని నిన్ను చూసి మురవాలని,
ఎప్పటికీ కోరుకున్నా, నీకై నే చూస్తున్న,
ఈ ముసలి తల్లితో వచ్చి నాలుగు ముచ్చట్లే చెప్పు,
తిరిగి నీవు వచ్చేవరకు దారెంటే నా చూపు.
ఓ బిడ్డ ఎట్లున్నావ్,
ఓ బిడ్డ ఎప్పుడొస్తావ్.
