[నేషనల్ రీడింగ్ మంత్ (జూన్ 19 నుంచి జూలై 18) సందర్భంగా శ్రీ రవి సింహాచలం వ్రాసిన ‘ఓ పుస్తకమా!’ అనే కవితని అందిస్తున్నాము.]
ప్రియతమా!
మరిచిపోయిన నిన్ను
మళ్ళీ గుర్తుకు తెప్పిస్తావు
కాలం గడుస్తున్నా
కదలకుండా నా కోసం వేచి ఉంటావు
ఏదో తెలియని ఆకర్షణతో
మళ్ళీ నీ దగ్గరికి రప్పిస్తావు
చేతుల్లోకి నిన్ను తీసుకొని
నీ వంకే చూస్తూ ఉంటే
నా కళ్ళు ఇంకో దిక్కుకు
తిప్పకుండా చేస్తావు
నువ్వు వర్ణించేవి అన్నీ
అర్థం చేసుకుంటూ ఉంటే
నిదుర పోతున్న ఊహలు
కదలడం మొదలు పెడతాయి
మొండిబారుతున్న మెదడుకు
పదును పెడతాయి
ఇంకాస్త సమయం
నీతోనే గడిపితే
ఈ లోకాన్నే మరిపిస్తావు
ప్రకృతిలో ఎక్కడా
చూడని లోకాన్ని
నా మదిలోనే సృష్టిస్తావు
ఓ పుస్తకమా!
అందుకే నీవంటే
నా మస్తకమునకు ప్రియతమ
