Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ రేయి! తెలవారకోయి!

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సృజన గారి ‘ఓ రేయి! తెలవారకోయి!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆకాశంలో మబ్బులు ఏదో మార్నింగ్ వాక్ చేస్తున్నట్టు.. అటు ఇటు అలుపే లేకుండా కదులుతున్నాయి. సమయం ఆరు దాటిందే కానీ ఎక్కడా సూర్యుడి జాడ లేదు. చెట్లు కులాసాగా వూగుతున్నాయి. వాతావరణం ఆహ్లాదంగా వుంది. శైలజ గుమ్మంలో.. పక్షుల కువకువలని వింటూ.. వేడి కాఫీని తోడు తెచ్చుకొని మోకాళ్ళపైన గడ్డం ఆనించుకు కూర్చుంది. ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఈ ప్రశాంతత శైలజకి అరుదుగా దొరికే సంపద. రోజూ వురుకుల పరుగుల జీవితంలో.. కొట్టుకుపోయే ఆమెకి ఆగి తనని తాను పట్టించుకునే క్షణాలు ఎప్పుడో కానీ రావు.. చేసేది టీచరుద్యోగం కావడం చేత సెలవులకేం కొదవ లేకపోయినా.. ఆ సెలవునాడు కూడా చెయ్యడానికి ఇంట్లో బండెడు పనుంటుంది. అసలు ఆ సెలవెందుకు వచ్చిందిరా దేవుడా అనిపిస్తుంది ఆమెకొక్కోసారి.

“ఏమ్మా శైలూ! అంత తీరిగ్గా కూర్చున్నావ్.. స్కూల్ లేదూ!” పక్కింటి తాయారమ్మ పలకరించింది గోడకి అటువైపు నిల్చొని.

“ఈ రోజు ఆదివారం కదా పిన్ని గారు” – శైలజ.

“అవును కదూ మర్చేపోయాను చూసావా.. పేపరు ఇంకా రాలేదు కదూ.. అదొస్తే ఆ వీక్లీ పుస్తకం చూసి కనిబెట్టేదాన్ని”.. అంటూ దీర్ఘం తీసిందామె.

రోజులతో సంబంధం లేకుండా యంత్రాల్లా పనిచేసుకుపోయే ఆడాళ్ళకి ఆదివారాలు తెలియాలంటే సండే ఎడిషన్లే దిక్కైయ్యాయా.. అనుకుంది శైలజ విరక్తిగా.

“మోహనూ, పాప వున్నట్టు అలికిడి లేదే..” దిక్కులు చూస్తూ అడిగింది ఆవిడ.

“పాపకేదో ప్రోజెక్ట్ వర్కు పనుందట‌.‌. పల్లెటూరికి వెళ్ళి చెయ్యాలట.. తండ్రి, కూతురూ ఇందాకే అమ్మా వాళ్ళ వూరెళ్ళారు పిన్నిగారు సాయంత్రానికి వస్తారు” – శైలజ.

“అయితే నీకెలా వూసుపోతుందమ్మాయి..! నువ్వూ వెళ్ళలేకపోయావ్ అమ్మావాళ్ళని చూసినట్టు కూడా వుండేదిగా” – తాయారమ్మ.

ఏమేమో అనాలనుకొని చివరికి.. “లేదులెండి ఇంట్లో పనితో అవ్వలేదు” అనేసింది ఆమె. తాయారమ్మ కూడా ఆ విషయాన్ని రెట్టించకుండా.. “సరేనమ్మా నాకూ పనుంది వస్తాను”.. అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

శైలజ మళ్ళీ తన సొంత ఆలోచనల్లో మునిగిపోయింది. ఇంట్లోని స్పీకర్ నుంచి ఘంటసాల పాటలు మంద్రమైన గొంతుతో వినబడుతున్నాయి. ఆకాశాన్ని, గుమ్మంలో విరబూసిన మందారాలని చూస్తూ.. శైలజ కాఫీని ముగించింది. వంటగదిలో తాగిన కాఫీ కప్పు పెట్టి వస్తుండగా హాల్లోని టేబుల్ పైన ఆమెకి, తను ఎప్పటి నుంచో రాయకుండా వదిలేసిన డైరీ కనిపించింది. మనసు చాలా ప్రశాంతంగా వుండడం వల్ల శైలజకి ఏదో రాయబుద్దైంది. ఏం రాయాలో తెలియదు కానీ ఏదో రాయాలి. స్పీకర్ తాలూకు వాల్యూమ్ తగ్గించి.. టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. డైరీ తెరిచి‌‌.. మనసుకు ఏం అనిపిస్తే అది రాయడం మొదలు పెట్టింది. నాలుగైదు వాక్యాలు రాసి.. ఆపింది. రాసిందాన్ని చదువుకుంది. సంతృప్తిగా అనిపించిందేమో.. బలంగా శ్వాస పీల్చుకుని వదిలింది.

ఎప్పుడు రాసిందో.. మళ్ళీ ఇన్నాళ్ళకి కుదిరింది. ఇలా రాసే సందర్భాలు తన జీవితం నుంచి మెల్లిమెల్లిగా తప్పుకోవడం ఆమెకి దిగులుగా అనిపించింది. మోహన్ మంచివాడే! కానీ తనలో రాజుకునే ఉద్వేగాలను చెప్తే అర్థం చేసుకునే ఆలోచనా సరళి అతనికి లేదనిపిస్తుంది శైలజకి. ఆమె మంచిగా రాయగలుగుతుంది. అదొక వైవిధ్యంగా ఆమె భావిస్తుంది. కానీ అదొక ప్రత్యేకత అన్నట్టు మోహన్ వ్యవహరించడు. ఆ కళ అతన్నేం ఆశ్చర్యపరచదు. చేప ఈదగలదు.. పువ్వు వికసించగలదు అన్నవి ఎంత సహజమైన విషయాలుగా చూస్తాడో.. ఆమె రాయగలదు, ఆమె పాడగలదు, ఆమె ఒక అంశాన్ని సరళంగా చర్చించగలదు అనేది కూడా అంతే సహజంగా చూస్తాడు. శైలజకి ఆనందాన్ని.. ఉత్సాహాన్ని కలిగించే విషయాలు అతనికి చాలా సాదాగా అనిపిస్తాయి. ఆమెను సాధారణంగా చూసే మోహన్, శైలజకు.. ఈ విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతన్ని స్టడీ చెయ్యడానికి వీలైనంత ప్రయత్నిస్తుందామె. కానీ ఇప్పటికీ అతడి స్వభావం ఎందువల్ల అలా వుంటోందో.. ఆమె పూర్తిగా తెలుసుకోలేకపోయింది. చివరికి అది అతని అనుభవాల వల్ల ఏర్పడ్డ మార్పేమో.. లేదంటే అలా వుండడమే అతని వ్యక్తిత్వమేమోనని శైలజ తనని తాను సర్దిచెప్పుకుంది. మొదట్లో ఆమెకు బాధ కలిగించే అంశాలు, ఆనందపరిచే విషయాలు.. చాలా చెప్పుకునేది అతనితో. కానీ అతని తీరు అర్థమయ్యాక.. అలా చెప్పడం మానుకుంది. బహుశా అలా మానుకున్నదని కూడా మోహన్ గమనించి వుండడని శైలజ నమ్మకం.

ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగంలో చేరిందో.. క్రమేణ రాయడమూ మానుకుంది. కుటుంబం పెద్దదైంది.. బరువులు, బాధ్యతలు.. ఇంట్లోనూ, బైట తలమునకలయ్యే పని.. వీటితో శైలజ తనలోని రచనా శైలిని.. పఠానాశక్తిని క్రమంగా తగ్గించేసుకుంది. దానికి సమయాన్ని వెచ్చించలేకపోవడమే కారణమని ఆమెకి కూడా తెలుసు. ఈ గజిబిజి జీవితం నుంచి.. ఆమె కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవడం అతి పెద్ద లగ్జరీగా మారింది శైలజకి.

ఈ రాయగలగడం అనే విశిష్టతని కలిగి వుండడం ఏదో గతజన్మ సంగతైనట్టు లీలగా గుర్తున్న ఆమెకి.. తను రాసుకున్న నాలుగు వాక్యాలు చదువుకున్నాక.. ఇంకా తనలో ఆ ప్రత్యేకత అడుగంటిపోలేదనిపించింది. అదామెను ఆశ్చర్యపరిచింది. మెల్లిగా ఆ ఆశ్చర్యం కాస్త ఆనందంగా మారింది. శైలజ సంతృప్తిగా లేచి.. స్పీకర్ నుంచి వినిపిస్తున్న గుండమ్మ కథలోని.. “అయినా.. మనిషి మారలేదు”.. అన్న పాటని కూనిరాగం తీస్తూ వంటగదిలోకి వెళ్ళింది. ఏదో ఒకటి రుచికరంగా వండుకోవాలని అనిపించింది. ఏ కారణం చేతనైతేనేమి తనకి నచ్చినది వండుకు తిని చాలా కాలం అయిపోయింది. తన కోసం తాను ఆలోచించుకొని ఏదైనా చేసుకోవాలి అనుకోవడం ఎవరికో చేస్తున్న ద్రోహంగా అనిపిస్తుంది ఆమెకి అప్పుడప్పుడు. ఎంతో కొంత ఆలోచించగలిగే తనే ఇలా అనుకుంటే.. ఒక సామాన్యమైన స్త్రీ, ఏ అభ్యుదయాల గురించి తెలియని స్త్రీ ఇంకెలా ఆలోచిస్తుంది అనుకుంది శైలజ. ఇప్పుడు తనని శాసించే పరిస్థితులు లేవు కనుక ఎలా అయినా తనకి నచ్చింది వండుకొని తినాలని నిక్కచ్చిగా అనుకుంది. ఎందుకో వున్నపాటుగా.. వాళ్ళమ్మ పాలతో చేసి పెట్టే ఉప్మా గుర్తొచ్చింది. అనుకున్నదే తడువుగా చెయ్యడం మొదలు పెట్టింది. పావుగంట తర్వాత పొగలు కక్కే జీడిపప్పు ఉప్మా సిద్ధమైంది. దాన్ని ఎన్నో ఏళ్ళుగా ఆకలితో వున్నట్టు పరమానందంగా తిన్నది శైలజ. తలారా స్నానం చేసుకొని.. బీరువాలో సిపాయిల్లా క్రమశిక్షణతో నిలబడ్డ చీరలను చూసింది. అందులోనుంచి.. తనకెంతో ఇష్టమైన లేతాకుపచ్చ కాటన్ చీరను బైటకు తీసింది. దాన్ని చూస్తూ కాసేపు కూర్చుంది. ఏవో స్శృతులు కళ్ళముందు కదిలాయి. చదువుకునే రోజుల్లో.. తను ఇష్టపడ్డ శివ.. బలవంతం చేసి కొనిపించిన చీర అది. ఆ రోజులు శైలజకి చాలా స్పష్టంగా జ్ఞాపకమున్నాయి. ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అన్న బెరుకు భయం ఒక పక్క వున్నా.. సరే ఏదైతే అది అయ్యిందనే తెగింపు మరో పక్క వుండేది. ఓ రోజు వున్నపలానా వచ్చి, పద నీకు చీర కొనిపెడతా అన్నాడు ఆమెతో. “చీరనా ఇప్పుడెందుకు” అని అడిగింది శైలజ.

“అబ్బా ఎందుకు అని అడక్కు ముందు రా పోదాం…”అని బలవంతంగా తీసుకొని వెళ్ళి.. షాప్‌లో కూర్చోబెట్టాడు. శైలజ అప్పటికీ గందగోళంలోనే వుంది. శివ అక్కడ వరసగా పేర్చిన చీరలని శైలజని.. మార్చి మార్చి చూసి.. ఆమెకి ఏది అమురుతుంది అనిపిస్తే దాన్ని బైటకు తియ్యమన్నాడు. ఒక రెండు మూడింటిని చూసాక చిన్న ఇటుక పొడి రంగు అంచుతో వున్న లేతాక పచ్చ చీర శివకు భలే నచ్చింది.

“హా! ఇది ఎలా వుంది?” అని అడిగాడు ఆమెని.

“చాలా బాగుంది కానీ.. శివా..నీకు డబ్బులెక్కడివి?” – శైలజ.

“అబ్బా నీకవన్నీ ఎందుకు నాకు కొనాలనిపించింది కొన్నాను.. నీకు నచ్చిందిగా ఇంకేం ఆలోచించకుండా తీసుకో”..అని పేక్ చెయ్యమన్నట్టు సైగ చేసాడు.

ఆ షాప్ నుంచి బైటకొచ్చి.. ఒక బడ్డీ కొట్టు దగ్గర ఏదయినా తాగదాం అని ఆగినప్పుడు చెప్పాడు…

“నిన్న నాన్న అమ్మకి చీర కొని తెచ్చాడు. అమ్మకి ఆ చీర చాలా నచ్చింది. నాకెందుకో నువ్వు గుర్తొచ్చావ్. నీకింతవరకూ ఏమీ కొనివ్వలేదు కదా! ఒక చీరైన కొనిపెట్టాలనిపించింది. అందుకే.. ఎప్పటి నుంచో ప్రైవేట్లు చెప్తూ దాచిన డబ్బులతో కొన్నాను.” అన్నాడు శివ.

శైలజకి మొదట ఎం మాట్లాడాలో అర్థంకాలేదు. అతని ప్రేమని ఆస్వాదిస్తూనే..

“ఆ డబ్బులుంటే ఇంకెందుకైనా పనికొచ్చేవిగా.. ఇంట్లో అవసరాలు తీరే..” ఆమె నోట్లో మాట నోట్లో వుండగానే.. శివ శైలజ నోరు మూసేసాడు.

“దయచేసి ఇంకేం మాట్లాడకు. శైలూ..! నా సొంత సంపాదనతో నీకు ఒక చీర కొనగలగడం నాకు ఎంత సంతృప్తినిస్తుందో తెలుసా! దాన్ని పాడుచెయ్యకు” అన్నాడు. అతని మాటలకి శైలజ పెదవులు విచ్చుకున్నాయి‌. ఆ నిమిషం ఆమెకి అతడిని గట్టిగా హత్తుకోవాలన్న కోర్కే కలిగింది. అదో రకమైన గర్వం కూడా ఆమెలో ఆ క్షణం తొణికిసలాడింది. యవ్వనంలోని ఆడపిల్లలకి తనను ప్రేమించి, ఆరాధించి, తనకోసం ఏదైనా చేసే అబ్బాయి వుండడం ఎంత సంతృప్తిని, గర్వాన్ని ఇస్తుందో.. ఆ యవ్వనపు శైలజకి కూడా అదే ఇచ్చింది.

గతం తాలూకు జ్ఞాపకం ఆమెను నిలువరించలేకపోయింది. అది ఆనందమో, బాధో తెలియని స్థితిలోనే.. రెండు కన్నీటి బొట్లు ఆ చీరలోకి ఇంకాయి. శైలజ తేరుకని కన్నీళ్ళు తుడుచుకుంది. కాస్త స్థిమిత పడ్డాక ఆలోచిస్తే ఆమెకు ఒక సందేహం కలిగింది. శివకి ఇలా చీర ఎందుకు కొనాలనిపించిందా అని. తను స్త్రీ కాబట్టే చీర కొనేసాడా? దానికి బదులు ఏ పుస్తకామో కొనిచ్చి వుండొచ్చు! ఎందుకు చీర? ఈ ఆలోచన ఆ రోజు నాకు రాలేదేం? ఈ అవగాహన అప్పుడే వుంటే శివని తను ఇదే విషయం నేరుగా అడిగేదేమో! అలా ఆలోచిస్తూ.. తల విదిలించుకుంది. ఆ అమాయకత్వాన్ని, స్వచ్ఛతని ఆస్పాదించకుండా ఏమిటి నేను అనుకుంది మందలింపుగా. ఆ తరువాత గబగబా టేబుల్ దగ్గరకి వెళ్ళి డైరీ తెరిచి శివతో తన స్నేహాన్ని తనకి తప్ప ఎవరికి అర్థం కాని రీతిలో రాసుకుంది.

ఎవరైనా ఎంత తలమునకలయ్యే ప్రేమలో వున్నా కుటుంబ పరిస్థితులు.. ఒక్క కుదుపు కుదిపినప్పుడు వారిలో ఒక వింతైన మార్పు వస్తుంది. బాధ్యతలు బరువులు.. తమని చెరోపక్కకి నెట్టేస్తాయి. శివ, శైలజల విషయంలో కూడా అదే జరిగింది. చదువు పూర్తయ్యాక.. ఏదో ఒక ఉద్యోగంలో చేరి తల్లితండ్రులకి వాళ్ళ విషయం చెప్పాలనుకున్న ఇద్దరికీ.. జీవితం, దాని మరో కోణాన్ని చూపించింది. శివ తండ్రి అకాల మరణంతో అప్పుల వాళ్ళు వాళ్ళ ఇంటి మీద పడి దౌర్జన్యం చేసారు. ఆ సమయంలో ఏమీ పాలుపోని శివ, తన కుటుంబం ఒక అర్థరాత్రి మూటముళ్ళే సర్దుకొని వూరు వదిలి వెళ్ళిపోయారు. శైలజకి విషయం చెప్పే అవకాశం కూడా శివకి లేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళ నుంచీ.. విషయం తెలుసుకున్న శైలజ.. చాలా కాలం అతని రాక కోసం.. మరికొన్నాళ్ళు ఒక ఉత్తరం కోసం ఆశగా ఎదురు చూసింది. ఆ రెండూ ఆమెను చేరలేదు. ఆ రాత్రి పారిపోయిన శివ ఏమయ్యాడో ఆమెకి ఇప్పటికీ తెలియదు. శైలజ ఆశలు ఆవిరైపోయాయి. చివరికి అతని జ్ఞాపకంగా ఈ చీరొక్కటే ఆమెకి మిగిలింది.

గతం గుర్తొచ్చి మనసంతా చేదుగా అయిపోయిన శైలజ.. ఆ గుర్తుల నుంచి బైట పడడానికన్నట్టు.. ఆ లేతాకుపచ్చ చీరను మళ్ళీ తీసిన దెగ్గరే పెట్టేసింది. దానికి బదులుగా పెళ్లైన కొత్తలో మోహన్ కొనిచ్చిన ఊదా రంగు చీర తీసి కట్టుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చాలా సేపు నిలబడిపోయింది. ఎప్పుడూ రెండు నిమిషాల కన్నా ఎక్కువ సేపు అద్దం ముందు నిల్చునే అలవాటు చేసుకోని శైలజ.. ఆ రోజు.. చాలా సేపు తెరలు తెరలుగా జ్ఞాపకాలు సుడులు రేపుతుంటే అలాగే నిలబడిపోయింది. నుదిటి మీద.. కళ్ళ కింద వయసు తెచ్చిన మార్పులు కనిపిస్తున్నాయి. అయినా ఆమె ప్రశాంతమైన చిరునవ్వు దగ్గర ఆ మార్పులేవీ పెద్ద విషయాలుగా కనబడలేదు. మళ్ళీ ఆమెకి శివ గుర్తొచ్చాడు. ఎక్కడ వున్నాడో.. తనలాగే ఎవర్నో పెళ్ళి చేసుకొని.. పిల్లల్తో తనదైన జీవితాన్ని గడిపేస్తూ వుండివుంటాడా? తనకి నేను గుర్తుండివుంటానా? అయినా వయసులో ఏర్పడ ప్రేమ కాబట్టి ఈ మమతతో వున్నాను కానీ అతనితో పెళ్ళే జరిగుంటే ఈ అనుభూతి వుండుండేదా..? ఈ చాకిరీలో పడ్డాక ప్రేమ నిలబడుతుందా..? నిలబడితే ఎంత కాలం? శైలజ ఆలోచనలకి తెరిపి లేదు. ప్రేమకి ఇద్దరి సమ్మతి కావాలి. అందులో ఇద్దరి ఆలోచనలకి ఒక ప్రాముఖ్యత వుంటుంది. కానీ పెళ్లి అలా కాదు. పెళ్ళైయ్యాక ప్రాముఖ్యత ఎటో ఒక వైపు ఒరిగిపోతుంది. ఎవరిదో ఒకరి గుప్పెట్లోకి అది జారిపోతుంది. ఇక్కడ సమతుల్యత.. బ్యాలెన్సింగ్ ఎందుకు వుండదు? అలా వుండడానికి ఎందుకని చాలా కృషి చెయ్యాల్సోస్తుంది? పోనీలే శివ ప్రేమగా మిగిలిపోవడమే మంచిదైంది. కనీసం ఒక అందమైన అనుభవంగానైనా నిలిచి వున్నాడు. అలా అనుకోగానే ఆమె పెదవులపై సన్నని నవ్వు. జీవిత సత్యం ఎదో బోధపడినట్టు శ్వాస బలంగా తీసుకుంది శైలజ. పక్కన తనతో తెచ్చుకున్న డైరీ తెరిచి మళ్ళీ ఏదో రాసుకుంది. దాని సారం ఏవిటో.. ఆమె చెప్తేనే కానీ ఎవరికి అర్థంకాని విధంగా రాసుకుంది.

గడియారంలో పన్నెండు కొట్టింది. పొద్దున్న వున్న మేఘాలు అప్పుడు లేవు. ఆకాశం చాలా తేటగా వుంది. మధ్యాహ్నపు ఎండ అంత తీవ్రంగా లేదు. చల్లగాలి ఇల్లంతా కలయతిరిగి శైలజను కూడా పలకరించి పోయింది. ఆమె మనసు ఎన్నో భావాలతో పరిపరి విధాలా పోతుంది. దాన్ని కట్టడి చెయ్యడానికి అన్నట్టు ఫోన్ తీసుకోని పెరట్లోకి వెళ్ళింది. కాసేపు మంచి ఫ్రేమ్ కోసం వెతికి.. నందివర్థనం మొక్క దగ్గర ఫోన్ సెట్ చేసి నాలుగు భంగిమల్లో ఫోటోలు తీసుకుంది. వాటిని చూసుకొని సంతృప్తిగా నవ్వుకుంటూ.. ఎన్ని రోజులైంది.. ఇష్టమైన రీతిలో ఫోటోలు తీసుకొని అని వింతగా ఆశ్చర్యపోయింది. అల్మరాలో పాత అల్బమ్లని బైటకి తీసి కాసేపు నోస్టాల్జియాలో తలమునకలయ్యింది. ఎందుకో వున్నపాటుగా ఆమెకి కడుపు నొప్పి రావడం మొదలైంది. ఏమిటా అని గడియారం చూస్తే సమయం ఒంటిగంట దాటింది. ఆహా ఇది ఆకలి నొప్పి కాబోలు.. ఇదేమిటి వంట మీదకి ధ్యాసే మర్లలేదు. సహజంగా అయితే టిఫిన్ చేసే టైయానికే వంట ఏం చెయ్యాలో నిర్ణయించుకుని ఆ పనిలో పడిపోవడం తన దినచర్య. కానీ ఈ రోజు.. భోజనం చేసే వేళకి కూడా వంట చేసుకోలేదు. ఆకలేస్తే కానీ తిండి గుర్తురాకపోవడం ఎప్పటి సంగతీ.. అనుకుంది శైలజ స్వగతంగా. గత ఏడెనిమిదేళ్ళుగా ఇలా ఏ రోజైనా వుందా నా జీవితంలో. అసలీ యాతనలేవీ లేకుండా ప్రశాంతంగా బ్రతికే జీవితం ఎప్పుడొస్తుంది ఆడవాళ్ళకి. అలాంటి ఆలోచనలతోనే వంటగదిలోకి వెళ్ళింది. అల్మరాలో వాళ్ళ అమ్మ కొత్తగా చేసి పంపిన ఆవకాయ్ కనిపించింది. ఇక ఆలోచన లేకుండా బియ్యం కడిగి కుక్కర్ పెట్టి.. పప్పు చేసేందుకు సన్నద్ధం అయ్యింది. అర్థగంటలో వంట పూర్తయ్యింది. శైలజ చేసుకున్నది పంచభక్ష పరమాన్నాలు కాదు.. కానీ అమృతంలా అనిపించింది. ఆకలి తీరింది. ఎంత హాయిగా వుందో ఈ రోజు భోజనం. రోజు ఆ కేరియర్ బాక్స్‌లో ఎండిపోయిన తిండి. సెలవు రోజుల్లో భర్తకి, కూతురుకి అన్నీ అమర్చి, వడ్డించి.. తను తినేసరికి చప్పగా చల్లారిపోయిన భోజనం.. అవి ఎంత రుచికరమైనవైనా.. శైలజకి తిన్నట్టే వుండేది కాదు. మోహన్ తనేం చేసినా బాగుందనే అంటాడు. ఎంత బాగా చేసావో అంటాడు. కానీ ఆ బాగా వుండే దశలో ఆమె తినలేకపోవడం వల్లో ఏమో.. తనకది రుచించదు. ఈ రోజు శైలజ సంతృప్తిగా తిన్నది. వేడి వేడి అన్నంలో.. ఆవకాయితో పప్పు తినడం ఆమె చిన్నతనాన్ని గుర్తు చేసింది.

తినడం ముగించి.. పడకగదిలోకి వెళ్ళింది. పుస్తకాల వరస నుంచి.. ఒక కథల పుస్తకం బైటకి తీసి.. వెల్లకిలా పడుకొని చదవడం ప్రారంభించింది. నాలుగు పేజీలు ముందుకు జరిగే సరికి శైలజకి మత్తుకమ్మింది. పుస్తకాన్ని గుండెలకి ఆనించుకొని అలాగే నిద్రలోకి జారిపోయింది. అలా ఎంత సమయం నిద్రలోకీ ఒరిగిందో గానీ.. లేచేసరికి ఐదయ్యింది. చాలా సేపే పడుకున్నట్టున్నానే అనుకుంటూ.. పెరట్లోకి వెళ్ళి మొహం కడుక్కొని డాబా మీదకి వెళ్ళింది. చల్లగాలికి కాసేపు తిరిగింది. చదువుతూ పక్కన పెట్టిన కథని పూర్తి చెయ్యాలనుకుంది. ఇంతలో.. ఆ వీధికి రెండు వీధుల అవతల వుండే పార్కులో పిల్లలు ఆడుకోవడం కనిపించింది. అక్కడికి వాకింగు కోసం చాలామంది వస్తుంటారు. శైలజకి అక్కడికి వెళ్ళాలనిపించింది. రోజూ స్కూల్ నుంచి ఇంటికి చేరేసరికే ఆరవుతుంది. అదే దారి గుండా వచ్చినా ఎప్పుడు ఆ పార్క్ లోకి వెళ్ళలేదు. నిజానికి వెళ్లే అవకాశం ఆమెకు చిక్కలేదు. స్కూల్ నుంచి రాగానే రాత్రి వంటకి ఉపక్రమించాలి. అలా చల్లగాలికి నడవడం ఆమెకు సాధ్యం కాదు. కానీ ఆ రోజు పూర్తిగా భిన్నమైనది. శైలజ తలుపులకి గొళ్ళెం పెట్టి.. చదువుతూ ఆపేసిన పుస్తకం కూడా పట్టుకొని బయల్దేరింది. దారిలో కనిపించే అందరిని పలకరిస్తూ.. ప్రతీ సన్నివేశం నుంచి ఒక కథని ఊహిస్తూ ముందుకు వెళ్తోంది.

“యేంటి శైలు ఇలా వస్తున్నావ్..” అడిగింది పక్క వీధిలో శైలజకి తెలిసిన ఒక ఆమె.

“అలా పార్కుకెళదామని.” అంటూ ఆగింది శైలజ.

“అబ్బో..‌ అత్యంత బిజీగా వుండే శైలజకి.. పార్కుకి వెళ్ళే తీరిక దొరికిందే..” అందామె నవ్వుతూ.

“ఈ రోజు సెలవు కదా సరిత..” – శైలజ.

“అయితే ఇప్పటి వరకూ.. సెలవులే రాలేదంటావ్..” పెదవుల మధ్య నవ్వును బిగబట్టింది ఆమె.

“నీకు తెలియనిదేముంది..! ఇంట్లో ఎక్కడ అవుతుంది. నాకు ఉద్యోగంతో ఖాళీ వుండదు.. ఇంటి పనితో సెలవు రోజులు కూడా అలాగే వుంటాయి. ఎప్పుడైన అలా బైటకి వెళ్ళినా పాపతో ఎలా వుంటుందో నీకు తెలుసు కదా! ఈ రోజు ఏదో సమయం చిక్కింది అందికే అలా..” అంటూ వివరించింది తను.

“నీకేం శైలు! కనీసం ఉద్యోగానికైనా బైటకి వెళ్తావ్. నన్ను చూడు ఇలా ఇంట్లోనే వుండిపోవాలి. సొంతమైన పనులకి తీరిక వుండదు, అవకాశమూ వుండదు. నిజానికి నాకు కూడా నీతో పార్క్ వరకు రావాలి అని వుంది.. కాని అవుతుందా! నేను వెళ్ళిపోతే ఎదో ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నట్టు బెంబేలెత్తిపోతుంది మా అత్త” విరక్తిగా నవ్వింది సరిత. శైలజకి ఆమె చెప్పేదంతా అర్థం అవుతున్నా తిరిగి ఏం బదులివ్వాలో తెలియలేదు. ఆమె మౌనం వెనకున్న ఇబ్బందిని గ్రహించినట్టుగా.. సరితా అంది.. “చేతిలో ఏంటది నవలా?” అని.

శైలజ, అహా కాదు కథల పుస్తకం అంది.

“హో..! నీకు పుస్తకాలు చదివే సమయం కూడా వుందా అదృష్టమంటే నీదే” అంది.

ఒక్క రోజో, ఒక గంటో.. పక్కవాళ్ళని చూసి వాళ్ళు ఇంతే ఆనందంగా ప్రతీ క్షణం వుంటారని అపోహ పడడం సరిత మాత్రమే చేసేది కాదు ఇందులో నేను వున్నాను. నాలో ఇప్పటికే వున్న అసంతృప్తులు పక్కవాళ్ళ చిన్న చిన్న ఆనందాలని కూడా భరించలేవు. ఎందుకు నేనే ఇలా వున్నాను అనే భావన మనసుని తినేస్తుంది. ఈ విధంగా నేను ఎన్ని సార్లు పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి అసూయ పడ్డానో. శైలజ మనసులో సరితకి థ్యాంక్స్ చెప్పుకుంది.. తనలోని లోపాన్ని గుర్తుచేసినందుకు.

బైటకి మాత్రం మెత్తగా ఒక నవ్వు నవ్వి.. వెళ్ళొస్తాను అంది. ఆమె మనసులోని కల్లోలాన్ని బేరీజు వెయ్యలేని సరిత సరే అని తల వూపింది.

శైలజ పార్కుకి వెళ్ళి గడ్డిలో కాసేపు కూర్చుంది. ఎదురుగా ఒక ఆరేళ్ళ పాప తల్లితో పాటూ వుంది. ఆ తల్లి ఎవర్తోనో ఫోన్ మాట్లాడుతోంది. ఎవరికో తానున్న అడ్రస్ చెబుతోంది. ఎంత పనిలో వున్నా ఆమె చెయ్యి ఆ పాపను వదలడం లేదు. ఆ పిల్ల, వాళ్ళ అమ్మ తన చెయ్యి ఎప్పుడు వదిలేస్తుందా అన్నట్టు చూస్తుంది. దూరంగా వృద్ధ దంపతులు.. నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. వాళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న విధానం చాలా అందంగా అనిపించింది శైలజకి. ఒక పదడుగుల దూరంలో కూతుర్ని ఉయ్యాలలో కూర్చోబెట్టి మెల్లిగా వూపుతున్నాడో తండ్రి. చుట్టుపక్కల జరిగే వాటిని కాసేపు గమనించిన శైలజకి.. తన చేతిలో వున్న పుస్తకం గురించి.. ఆలస్యంగా గుర్తొచ్చింది. ఎందుకో ఆమెకి పుస్తకం తెరవాలి అనిపించలేదు. ఆ పరిసరాలలో కనిపించే కథల కన్నా అందంగా ఉంటాయా ఈ కథలు అనుకుంది. అప్పుడప్పుడే సంధ్య వాలుతోంది. అక్కడక్కడా చుక్కలు.. మేమూ కూడా ఈ విశ్వంలో భాగమే అని చెప్తున్నట్టు చిన్నగా మెరుస్తున్నాయి. అది అమావాస్య గడిచిన ఐదవ రోజు. పడమర దిక్కున చంటిదాని నవ్వులా వుంది నెలవంక. శైలజకి మాటే రాని చిన్నదాని పాట గుర్తొచ్చింది. వెంటనే స్పోటిఫై ఆన్ చేసి ఆ పాట పెట్టుకొని‌.. నీలమైన ఆకాశం, నలుపు వర్ణంలోకి ఇంకిపొవడాన్ని కళ్ళు విప్పార్చి చూసింది. ఆ క్షణం ఆమె మనసులో ఏ ఆలోచన లేదు. పూర్తి నిశ్శబ్దం. ఆ రోజు జరిగినదంతా ఆమెకు ఒక కలలా అనిపించింది. ఏం చేసింది అంటే ఏమీ లేదు. ఎవరికి చెప్పినా ఏముంది ఇందులో అనే అంటారు. కానీ తను అనుభవించిన ప్రశాంతత ఎంత విలువైనదో శైలజకు మాత్రమే తెలుసు. బహుశా.. జీవితంలో స్థాయి, సంపద, జ్ఞానం, పొందాకే తెలుస్తుందేమో చిన్న చిన్న ఆనందాల్లోనే నిజమైన అందం దాగుంటుందని. ఈ రోజు పాప ఎంత పిలిచింది.. తనతో రమ్మని. వెళ్ళానా..! సహజంగా అయితే వెళ్ళేదాన్నే కానీ ఈ రోజు ఎందుకో తన కోసమే గడపాలనిపించింది. అది ఇంత అందమైన అనుభవంగా మారుతుంది అని ఆమెకి కూడా తెలియదు.

ఇలా రోజూ వుంటుందా? ఒక వేళ రోజు వుంటే తనకి నచ్చుతుందా? ఈ ఆనందం అతిధిలా వస్తేనే బాగుంటుందేమో. రోజూ వుంటే దీనికి ఏ విలువా వుండకపోవచ్చు. శైలజకి నవ్వొచ్చింది. ఇది కూడా ఒక డిఫెన్స్ మెకానిజమే! తన చేతిలో లేని విషయాల గురించి ఎక్కువ మథనపడకుండా దొరికిన దానితో సంతృప్తి పడే రక్షక తంత్రం. మళ్ళీ రేపటి నుంచి రొటీన్ జీవితం. అదే ఉరుకులు పరుగులు, ఇల్లు, పని, స్కూలు, మళ్ళీ ఇల్లు, వంట, ఆలోచనలు, అవసరాలు, ఏవో నిర్లిప్తతతలు, ఎందుకో విచారాలు, మళ్ళీ ఆశలు, ఏ కారణానికో కోపాలు, మరెందుకో ఆనందాలు. వీటన్నిటితో తలమునకలైపోతూ అలుపు లేకుండా పరిగెత్తే జీవితం. ఆమె విరక్తిగా నవ్వుకుంది. ఎందుకో చాలా నీరసంగా అనిపించింది. ఆ రోజు ఆ రాత్రి అక్కడే ఆగిపోతే ఎంత బాగుండు.. ‘ఓ రేయి! తెలవారకోయి!’ అనుకుంది శైలజ. అది అసాధ్యం అన్నట్టు, వాస్తవాన్ని గుర్తు చేస్తున్నట్టు ఫోన్ మోగింది. శైలజ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు చూసి.. “మోహన్ వాళ్ళు వచ్చేసినట్టు వున్నారు” అని ఫోన్ లిఫ్ట్ చేసింది. “ఎక్కడ శైలు! తాళం వేసి వుంది” మోహన్ గొంతు వినబడింది. “హా దగ్గరలోనే వున్నా మోహన్ వచ్చేస్తున్నా” లేస్తూ అంది శైలజ. పార్క్ బైటకి వచ్చి మూడు ఐస్క్రీమ్‌లు కొనుక్కొని ఇంటి దారి పట్టింది. అప్పటి వరకు ఆమె ఇష్టంగా మోసిన ప్రశాంతత అప్పుడు ఆమెలో లేదు. కొన్న ఐస్ క్రీంలు కరగక ముందే ఇల్లు చేరాలనే ఆతృతలో ఆమె అనుభవాలు కరిగిపోయాయి.

Exit mobile version