Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ సబల కథ

[ముప్పర్తి దుర్గా ప్రసాదరావు గారు రచించిన ‘ఓ సబల కథ’ అనే కథని అందిస్తున్నాము.]

ఆయాసపడుతూ పరుగు పరుగున ఒక స్త్రీ వచ్చి రాత్రి స్టేషన్‌కు పహారా కాస్తున్న సెంట్రీతో “ఎస్.ఐ. గారు ఉన్నారా కంప్లైంట్ ఇవ్వాలి” అని అడిగింది.

“లేరమ్మా. ముందు మీరు ఈ కుర్చీలో కూర్చోండి” అంటూ కుర్చీ చూపించాడు.

“నేను అర్జంటుగా కంప్లైంట్ ఇవ్వాలి” పరిగెట్టుకుంటూ రావడం వల్ల రొప్పుతూ అంది.

“అమ్మా అసలు మీ సమస్య ఏమిటి? ఇంత రాత్రిపూట స్టేషన్‌కు వచ్చారంటే మీది పెద్ద సమస్యే అయి ఉంటుంది. ఏమిటి మీ ఇంట్లో దొంగలు పడ్డారా? దోపిడి జరిగిందా? మిమ్మల్ని ఎవరైనా చంపడానికి వచ్చారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నీళ్ళ గ్లాస్ అందించాడు సెంట్రీ.

కొంచెం నీళ్ళు తాగి, “మీరు అడుగుతున్నవి ఏమీ కావు. నేను నా సమస్య ఎస్.ఐ. గారికి మాత్రమే చెప్తాను. అతను లేరా?” అంటూ తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఎస్.ఐ. గారిని కలవాలని పట్టుపట్టుతున్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు సెంట్రీ.

ఆమె వైఖరి చూస్తుంటే ఈమె సమస్యను తనకు చెప్పేటట్టులేదని గ్రహించి, “అమ్మా ఎస్.ఐ. గారు స్టేషన్‌లో లేరు. మీరు వెయిట్ చేయండి ఇప్పుడే ఫోన్ చేస్తాను” అని చెప్పి ఎస్.ఐ. దురంధర్‌కి ఫోన్ చేసాడు. రెండుసార్లు ఫోన్ చేస్తేగాని ఎత్తలేదు ఎస్.ఐ. దురంధర్.

“సార్ మన స్టేషన్‌కి ఒక స్త్రీ వచ్చింది సార్.” అని చెప్పేసాడు.

“దాన్ని అక్కడే ఉంచు వచ్చేస్తున్నాను” అన్నాడు ఎంతో ఉత్సాహంగా.

దురంధర్ సంగతి తెలిసిఉండే ఆ వచ్చింది స్త్రీ అని చెప్పాడు.

కుర్చీలో కూర్చుని ఎస్.ఐ. దురంధర్ గురించి వెయిట్ చేస్తున్న విమలకు తన గతం ఒక్కసారి కళ్ళముందు కదలాడింది.

***

విమల తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో కనుమూయడంతో విమల చిన్నతనం అంతా అనాథ శరణాలయంలోనే గడిచింది. విమల తెలివైన పిల్ల కావడంతో అన్ని తరగతులలో ఫస్ట్ మార్కులు తెచ్చుకునేది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇలా సాఫీగా సాగుతున్న విమల జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. అదే రాకేష్‌తో పరిచయం. అది స్నేహంగా మొదలై ప్రేమగా మారి పెళ్ళిదాక వచ్చింది. కాని అది విమలని సంతోషపెట్టలేదు. విమలని ప్రేమ పేరుతో మోసగించాడన్న సంగతి , రాకేష్ పక్కా తాగుబోతన్న విషయం ఆలస్యంగా తెలుసుకుని తనలో తానే కృంగిపోయింది. ఒక రోజు తాగివచ్చిన రాకేష్‌తో “మీరు మారరా?” అని నిలదీసింది.

“అవునే నేను మారను. నీలాంటి అనాథను ఎవరు పెళ్ళి చేసుకుంటాడు? నన్ను రెచ్చగొట్టకు చంపేస్తాను.” అంటూ అనరాని మాటలు అన్నాడు. ఎలాగూ తాను తాగుబోతునన్న నిజం బయట పడడంతో రాకేష్ రోజంతా తాగడం మొదలు పెట్టాడు. దానితో చేస్తున్న చిరుద్యోగం పోయింది. దానితో విమలని తాగడానికి డబ్బులు ఇమ్మని హింసించేవాడు. ఆడవారితో కూడా చెప్పుకోలేనంతగా చిత్ర హింసలు పట్టేవాడు. చాలా కాలం భరించింది. నయానా భయాన చెప్పింది. కానీ రాకేష్‌లో మార్పురాలేదు. ఒక రోజు అర్ధరాత్రి ఎవరో ఆడమనిషితో వచ్చి తనను బయటకు తోసి తలుపులు వేసాడు.

***

విమలను “అమ్మా ఎస్.ఐ. గారు రమ్మంటున్నారు” అని కానిస్టేబుల్ పిలిచాడు.

గదిలోకి వస్తున్న విమలను కళ్ళతోనే తినేసేటట్టు చూస్తున్నాడు దురంధర్. షర్ట్ పై చేతిలో వెలుగుతున్న సిగరెట్‌తో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు.

దురంధర్ చూపులు విమలని ఇబ్బంది పెడుతున్నా ఇక చేసేది లేక అలాగే కూర్చుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా అతని అవతారం చూసేసరికి నోటిలోంచి మాట రావడంలేదు. అది గ్రహించి దురంధర్ తన టేబుల్ పై ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని

“ముందు మంచినీళ్ళు తాగు. తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అని గ్లాస్ అందిస్తూ కావాలనే చేతివేళ్ళను ముట్టుకున్నాడు దురంధర్.

“ఆఁ, చెప్పు నీ సంగతేంటి? ముందు మనం అన్ని విషయాలు మాట్లాడుకుంద్దాం” అన్నాడు దురంధర్.

తనకి రాకేష్‌కి ఎలా వివాహం అయ్యింది. అతను ఎంత శాడిస్టో, రాత్రులు ఒక విధంగా, పగలు ఒక విధంగా ఎలా ప్రవర్తించేవాడు. అందరి ముందు ఎంత మంచివాడుగా నటించేవాడు, తరువాత నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవాడు అంతా వివరంగా చెప్పి ఈ రోజు ఎవరితోనో రాకేష్ వచ్చిన సంగతి కూడా చెప్పింది.

కానీ ఇవేమీ వినకుండా విమలని ఎలా లొంగదీసుకోవాలా అని ఆలోచిస్తున్న దురంధర్.

“రాకేష్ శాడిస్ట్ అన్న దానికి ఆధారాలు ఏమిటి? ఆధారాలు లేనిదే ఈ దురంధర్ కంప్లైంట్ తీసుకోడు” అంటూ అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేశాడు.

ఇది గమనించిన విమల “సార్ మీరు కంప్లైంట్ తీసుకుంటారా లేదా?” అని ఎలాగోలా ధైర్యం చేసి అడిగింది.

“ఎందుకు తీసుకోను, మా స్టేషన్‌కి కొన్ని ఫార్మాల్టీస్ ఉన్నాయి. అవి పూర్తి అయితే ఖచ్చితంగా తీసుకుంటాను” అంటూ వేరే అర్థం వచ్చేటట్టు మాట్లాడుతూ

“సరే అక్కడ కంప్లైంట్ వివరంగా రాసి ఇవ్వు. రేపు నీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేస్తాను. బై ది బై మీరు ఇంట్లో ఒంటరిగా ఎప్పుడు ఉంటారు.” అన్నాడు తన కోరికను మరింత తెలియజేయడానికి.

“అదే మీ ఇంటికి ఎంక్వైరీకి ఎన్ని గంటలకు రావాలి? మీరు ఒంటరిగా ఎప్పుడుంటారు” అన్నాడు దురంధర్

“అయితే రేపు ఉదయం 10 గంటలకు రండి.” అంది.

“కుదరదు. రేపు ఇంకో పనుంది. అయిన తరువాత వస్తాను. అప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు ఇంకోసారి తన గుణం తెలియజేస్తూ.

పూర్తిగా కంప్లైంట్ రాసి ఇచ్చి ఇంటికి తిరిగి ఇంటి వచ్చింది విమల.

***

నిన్న రాత్రి సంఘటనతో ఇక రాకేష్ మారడు అన్నది నిజం అని మనసల అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన విమలకు రాకేష్‌తో వచ్చిన ఆవిడ పరారి అయ్యిందని అక్కడ పరిస్థితిని చూడగానే అర్థమైంది. రాకేష్‌కు కొద్దిగా మత్తు వదలడంతో కదలడంతో

“ఏమండీ వచ్చి మంచంపై పడుకోండి” అంది విమల

“ఏం నేను ఇక్కడ పడుకుంటే నీకేంటి? రాత్రి ఎవడి దగ్గరకు వెళ్ళావో చెప్పు” అన్నాడు పొగరుగా అంటూ తూలుతూ వచ్చి మంచంపై అడ్డంగా పడ్డాడు రాకేష్. రాకేష్ వైపు అసహ్యంగా చూసింది విమల.

ఆలస్యంగా లేవడంతో ఆఫీసుకి సెలవు చెప్పి వంట చేసి తను తినింది. రాత్రంతా నిద్రలేకపోవడంతో విమలకి మళ్ళీ నిద్ర పట్టేసింది.

రాకేష్ ఎప్పుడు లేచాడో, ఎప్పుడు తిన్నాడో, మళ్ళీ తాగి ఎప్పుడు బయటకు వెళ్ళాడో విమలకి తెలియలేదు. గేటు దగ్గర బైక్ ఆగిన శబ్దం వినబడింది. గోడకున్న గడియారం చూసింది. టైం ఎనిమిది కావొస్తోంది. బైక్ మించి ఎస్.ఐ. దురంధర్ దిగి లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. దూరంగా నిల్చుంది విమల.

“నా కంప్లైంట్ ఏం చేశారు?” అడిగింది విమల.

“చెప్పాను కదా మన విషయం తేలేదాకా అది ఏం కాదు. నీలాంటి వాళ్ళను నా సర్వీసులో చాలా మందిని చూసాను కాని అసలు విషయం చెప్పు. ఎప్పుడు రమ్మంటావు?” అన్నాడు.

“నేను కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నా మీదే కేసు పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అయితే మీరు వచ్చింది ఇందుకన్నమాట.” అంది విమల.

“ఆ కంప్లైంట్ ఈ వ్యవహారం తెలితేగాని ముందుకు సాగదు.” అన్నాడు దురంధర్

సామాన్య ప్రజలు న్యాయం జరుగుతుందని నమ్మి దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళితే తనకు న్యాయం జరగకపోగా తనను కేసులో ఇరికించాలని చూస్తున్న దుష్టబుద్ధిని కనిపెట్టింది విమల. తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాడని గ్రహించింది. విమల ఆలోచిస్తోంది. విమల మౌనాన్ని అంగీకారంగా భావించి దురంధర్

“నా సంగతి తెలిసింది కదా! డబ్బుతో నైనా ఇంకేదైనా సరే! నన్ను సంతృప్తి పరచు” అంటూ నోటికి వచ్చినవన్నీ వాగుతూ విమల ఏమి చెప్తుందో అని కూడా ఎదురు చూడకుండా

“రేపు మళ్ళీ ఇదే టైంకి వచ్చి కలుస్తాను. రడీగా ఉండు” అంటూ బైక్‌మీద వెళ్ళిపోయాడు.

ఏమి చేయాలో తోచలేదు విమలకి. ‘న్యాయం చేయవలసినవాళ్ళే సామాన్య ప్రజల మానమర్యాదలు మంటగలుపుతూ, అనాథల పాలిట రాబందులై పీక్కు తింటుంటే వీళ్ళ అరాచకాలకు అంతం లేదా? న్యాయం అన్యాయం చేతిలో ఓడిపోవల్సిందేనా? ధర్మం అధర్మం గుప్పిట్లోకి వెళ్ళిపోవలిసిందేనా?’ అని తన మనసులో తాను అనుకోసాగింది విమల.

మర్నాడు దురంధర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. “మన విషయం ఏం చేశావ్?” అన్నాడు.

“నాకు కొంచెం టైం కావాలి.” అంది విమల.

“నీలాంటి అందమైనవాళ్ళ కోసం ఈ దురంధర్ ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాడు” అన్నాడు ఎంతో ఆనందంగా.

విమల స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానన్న సంగతి తెలుసుకున్న తరువాత మరీ రెచ్చిపోయాడు రాకేష్. మరీ దిగజారిపోయి ఒకప్పుడు బార్లో తాగేవాడు ఇప్పుడు తాగి రోడ్లమీద పడుతున్నాడు. వాళ్ళ స్నేహితులు ఎవరో తీసుకు వచ్చి ఇంట్లో దించుతున్నారు. వాళ్ళకి విమలకి సంబంధం కలిపి చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ స్టేషన్ ఐ.డి. పార్టీ పంపించి సమాచారాన్ని తెలుసుకున్న తరువాత బాల్ మన కోర్టులో ఉందని తెలుసుకొని సమయం కోసం ఏదురు చూస్తున్నాడు దురంధర్.

సమయం కోసం ఎదురు చూస్తూన్న ఎస్.ఐ. విమల భర్త రాకేష్ లేని సమయంలో విమల ఇంటికి వచ్చాడు

ఇంట్లోకి వచ్చి కూర్చుని “నా మాట విన్నావనుకో బ్రతికిపోతావ్! లేకపోతే.. ఇక నేను చెప్పను” అంటూ నయాన భయాన విమలని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ తొందరపడకూడదు అని మనసులోనే అనుకున్నాడు ఎస్.ఐ. దురంధర్.

దురంధర్ చెప్పిన మాటలు వింటుంటే ఒక ప్రక్క భయం, మరో ప్రక్క అసహ్యం వేస్తున్నాయి. వీళ్ళా మన సమాజాన్ని రక్షించే రక్షక భటులు. కాదు కాదు వీళ్ళు భక్షక భటులు అంటూ తనలో తను మథనపడసాగింది విమల.

ఒక రోజు ఆఫీసుకి వెళ్తూంటే రోడ్డు మీద జనం ఒక చోట గుమిగూడడం చూసింది విమల.

“ఏవడో తప్ప తాగి రోడ్డు మధ్యకు వచ్చాడంటా ఇంకేముంది కారుకింద పడ్డాడు. వీడికి ఇంకా ఈ భూమిమీద నూకలు ఉన్నాయి” అనుకుంటూ ఎవరిదారిన వారు వెళ్ళిపోతున్నారు. విమల తన కళ్ళను తానే నమ్మకలేకపోయింది. అక్కడ తలకు దెబ్బతో పడి ఉంది రాకేష్. వెంటనే ఆంబులెన్స్‌కి ఫోన్ చేసింది. క్షణాల్లో రాకేష్‌ను హాస్పిటల్‌కి చేర్చారు.

అది ఏక్సిడెంట్ కేసు కావడంతో పోలీసులు వచ్చేంతవరకు హాస్పెటల్‌లో రాకేష్‌ను ఐసియుకి తీసుకువెళ్ళలేదు. కానీ ఎవరు చేసింది, ఎలా జరిగింది అనే విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎంత తాగి అడ్డువచ్చినప్పటికీ ఏక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వెళ్ళిన వారి విషయం ఎంక్వైరీ చేయాలి కదా? అలాంటిదేమీ లేకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పోనీ పోలీస్ రిపోర్టు ఇద్దామా అనుకుంది. కానీ తనకు పూర్తీగా నమ్మకం పోయింది. సామాన్య ప్రజలకు న్యాయం ఎంత దూరంలో ఉందో అప్పటికే విమలకి తెలిసివచ్చింది. ఐసియు నుండి వచ్చిన డాక్టర్ వచ్చాడు.

“డాక్టర్ నా భర్త రాకేష్‌కు ప్రమాదమేమీ లేదు కదా?” అంది ఆదుర్ధాతో

“అతనిది చాలా రేర్ గ్రూపు రక్తం. అది లేదు. ” అన్నాడు డాక్టర్.

దురంధర్ లాంటి అవినీతి స్వార్థపరులే కాకుండా డాక్టర్ లాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారని మొదటి సారిగా అనుకుంది విమల. రాకేష్‌ని ప్రాణాపాయం తప్పించి, హాస్పిటల్ ఉన్నంతకాలం కంటికి రెప్పలా కాపాడింది.

మెలకువ వచ్చిన తరువాత ఎదురుగా ఉన్న విమలని చూసి ఆశ్చర్యపోయాడు రాకేష్. తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు.

“ఏమండి ఇప్పుడు ఎలా ఉంది” అని ప్రశ్నిస్తున్న విమల వైపు కళ్ళ నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు.

దుఃఖాన్ని ఆపుకుంటూ “విమల నన్ను క్షమించు… ” అంటూ రెండు చేతులు జోడించాడు.

“అయ్యో అంతమాట అనకండి. ఇది నా ధర్మం ” అంది విమల

“కాదు కాదు నాలాంటి వాడిని కూడా రక్షించి నీ పేరుకు సార్థకత చేకూర్చావు” అన్నాడు రాకేష్.

ఈ ఏక్సిడెంట్ విషయాలు ఏమీ తెలియని దురంధర్ ఒక రోజు ఎలాగైనా విమలను అనుభవించాలి అన్న పట్టుదలతో విమల ఇంటి దగ్గరకు వచ్చాడు.

అప్పుడే విమల ఇంటి లోపలికి వస్తున్న రాకేష్‌కు దిష్టి తీస్తోంది.

ఈ దృశ్యాన్ని చూసి అవాక్కై వెనుదిరిగాడు దురంధర్.

Exit mobile version