[3 అక్టోబర్ 2026 న స్వర్గస్థులైన ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు భువనచంద్ర.]
సంగీతం భగవంతుడి భాష అయితే సింగీతం శ్రీనివాస రావు గారిది ‘సినిమా’ భాష. ఆ భాష తప్ప మరొకటి ఆయనకి రాదు. నేర్చుకున్న సినీ భాషని మాత్రం ఎంత క్షుణ్ణంగా నేర్చుకున్నారంటే ఆయన సినిమానే ఆయనకి ‘సాక్షి సంతకాలు’.
ఎప్పటి ‘మాయా బజార్’! కె.వి. రెడ్డిగారు తీసిన ‘మాయా బజార్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలు పెట్టిన ఆయన సినీ ప్రయాణం 2026 ‘సింగ్ – గీతం’ అని ఆయన పేరే ధ్వనించే సినిమాతో ‘గమ్యం’ చేరింది. 95 సంవత్సరాల సంపూర్ణ జీవితానికి 3 అక్టోబరు 2026 న ‘శుభం’ కార్డు పడింది.
‘శుభం’ కార్డు అని ఎందుకంటున్నానంటే, ఆయన చివరి క్షణం వరకూ సృహతో మాట్లాడుతూనే ఉన్నారు. బహుశా మరిన్ని అద్భుతమైన ఇతివృత్తాలకు సినిమాలు తీయడానికి వీలైన సరికొత్త శరీరాన్ని తొడుక్కోవడానికి ఆయన ఈ లోకానికి తాత్కాలిక వీడుకోలు పలికారేమో!
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో అనేక సినిమాలు ఆయన తీశారు. ‘సంఖ్య’ కోసం తొందర పడలేదు.. ఆరాటపడలేదు. ఆయనకి సినిమా అనేది ఏనాడూ వృత్తి కాదు. జీవితం, ‘నాణ్యత’ కోసం పాటుపడ్డారు. ‘దిక్కట్ర పార్వతి’ అని ఆయన సినిమాని తమిళనాడు ప్రభుత్వమే కొని ‘పంపిణీ’ చేసింది అంటే, ఆయన సినిమా విలువ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ‘లిటిల్ జాన్, సన్ ఆఫ్ అలాజీన్’ (అల్లాఉద్దీన్) సినిమాలు ఇంగ్లీషు భాషలో తీశారంటే, ఆయన చూపే వైవిధ్యతకి వినయంగా తల వంచవచ్చు.
భగవంతుడి మొదటిభాష అయిన ‘మౌన భాష’లో ‘పుష్పక విమానం’ తీసి అన్ని భాషల వారికీ మృష్టాన్న భోజనం వడ్డించారంటే ఆయన ‘రస’జ్ఞతకు రత్నా సింహాసనం అమర్చవచ్చు.
భూత, వర్తమాన భవిష్య కాలాలని అద్భుతంగా మిళాయించిన ‘ఆదిత్య 369’ సినిమా చూసి ఆయన భవిష్య దర్శనానికి సాష్టాంగపడవచ్చు.
ఎన్ని సినిమాలు! కాలు తెగిపోయిన వికలాంగురాలి కథని ‘మయూరి’గా తీసి లక్షలాది వికలాంగుల గుండెల్లో జ్యోతిని వెలిగించిన ఆయన స్ఫూర్తిని శిలా విగ్రహంగా మలిచి మన గుండెల్లో ప్రతిష్ఠించుకోవచ్చు.
ఆయన స్పృశించని కోణం ఏదీ? జానపదం, పౌరాణికం, సాంఘికం, హాస్యం, సాంకేతికం.. ఇలా అన్ని రకల సినిమాలనీ తీశారు. ఇతరుల కంటే ‘భిన్నంగా’ తీశారు. కమల్ హాసన్ వంటి మహా నటుడిని మరింత పదును పెట్టిన ఘనత సింగీతం గారికే దక్కుతుంది. దాదాపు ఓ నెల మేమిద్దరం మా ఇంట్లోనే ఒక సినిమా కోసం కథాచర్చలు చేశాం. మరో నెలపాటు నేనూ, వెన్నెలకంటీ వారింట్లోనే అవే కధాచర్చలు చేశాం.
ఏనాడూ ఆయన ఇతరులని విమర్శించటం చూడలేదు. ఏనాడూ సినిమా గురించి తప్ప మరే సబ్జెక్టు మీదా మాట్లాడలేదు. కలిసి కూర్చున్నాక కొన్ని ‘దశాబ్దాల’ విశేషాలు మా మధ్య గంగాయమునలా ప్రవహంచేవి.
ఆయన దర్శకుడే కాదు, నటులు, సంభాషణ, కధా రచయిత, సంగీత దర్శకులు, గాయకులు. వారు రచించిన ‘క’ రాజు కథలు లక్షలాది పాఠకుల్ని ఎంతో మురిపించడమే కాక మైమరపించాయి. ఘటోత్కచ, వెల్కమ్ ఒబామా వంటి చిత్రాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించడమే కాక ఎన్నో పాటలు కూడా రచించారు.
నా అదృష్టం ఏమంటే, Welcome OBAMA చిత్రంలో, వారి దర్శకత్వంలో నటించడం. ఆ సినిమాలో వారు ముగ్గురు రచయితల్ని (నేను, బలభద్రపాత్రుని రమణి, అనంత శ్రీరామ్) నటుల్ని చేశారు. అదో అద్భుత అనుభవమే కాక, నా జీవితంలో ఆయన నాకు ఇచ్చిన అపూర్వ వరం. కొన్ని వారాల పాటు వారితో కలిసి మెలిసి పనిచేసే అదృష్టం నాకు ‘వెల్‍కం ఒబామా’ రూపంలో దక్కింది.
వారి జీవితం లోని ఎన్నో విషయాలు ఎందరికో తెలిసి ఉండొచ్చు. కొన్ని విషయాలు, అంటే, నాకు తెలిసినవి, చెప్పాలి. ఆయన చలనచిత్ర పరిశ్రమలో ఉన్నది దాదాపు ఏడు దశాబ్దాలు; అంటే డెబ్బై సంవత్సరాలకు పై మాటే. కానీ, ఏనాడూ ఆయన మీద ఏ నీలాపనిందా పడలేదు. అంత స్వచ్ఛమైన వ్యక్తిత్వం వారిది. వారి సహచరి శ్రీమతి కళ్యాణి గారు గుడిలో అమ్మవారి లాంటి వారు. అందరికీ ‘అమ్మతనాన్ని’ పంచిన జగద౦బ. అలా వారితో బాటు అనుక్షణమూ పయనించి వారి శ్రమలో పాలు పంచుకున్న పూర్తి ప్రజ్ఞ కూడా. సింగీతం వారిలాగే అత్యంత సున్నిత మనస్కులు.
సాలూరి రాజేశ్వరరావు గారంటే సింగీతం వారికి ప్రాణం. అంతేకాదు, సాలూరి వారిని గురువుగా భావించేవారు. అంటే ఏకలవ్య శిష్యత్వం అన్న మాట. సాలూరి గారి మీద భక్తితో ఒక అద్భుతమైన, అపురూపమైన, అపూర్వమైన CDని సింగీతం గారు సృష్టించారు. ఆ CD లో సాలూరి వారు పాడిన 8 పాటల పల్లవుల్ని తీసుకుని, ఆ పల్లవులకు 8 మంది రచయితలతో చరణాలు వ్రాయించారు. ఆ చరణాలలో సాలూరి వారి గొప్పతనాన్ని, వారి సంగీత మధురిమనీ వర్ణించాలి. ఇక B.G.M (అంటే ఇంటర్లూడ్ మ్యూజిక్) అంతా సాలూరి వారి పాటల ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్కే.
ఆ యజ్ఞంలో నేనూ పాలుపంచుకున్నాను. ‘నావను నడిపే నవయువకా’ పాటకు చరణాల వ్రాసి జీవితాన్ని చరితార్థం చేసుకున్నాను. ప్రపంచంలో, ఇటువంటి ప్రయోగం జరగటం ఈ ‘చల్లగాలిలో’ అనే C.D. తోనే ప్రథమం. ఇప్పటివరకూ ఇటువంటి ప్రయోగం మరోసారి ఎక్కడా జరగలేదనే చెప్పాలి.
నేను వారి దర్శకత్వంలో పాటలు వ్రాశాను. ముఖ్యంగా ‘మేడమ్’ సినిమాలోనూ, ‘ఘటోత్కచ’ యానిమేషన్ సినిమాలోనూ వ్రాసినవి నాకు చాలా ఇష్టమైనవి.
అసలు వారితో మ్యూజిక్ సిటింగ్ అనేది ఓ పిక్నిక్ లాగా జరిగేది. టెన్షన్ అనేది ఉండేది కాదు. కారణం, వారు కూడా పాటల నిర్మాణంలో పాలుపంచుకోవడమే.
మరో విషయం చెప్పితీరాలి. తెలుగు సినీ రచయితల సంఘం (T.C.W.A) మా ఇద్దరికీ ఒకేసారి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఆ కార్యక్రమానికి వారు హాజరు కాలేకపోతే, జ్ఞాపిక, బొకే, శాలువా అన్నీ నేనే వారింటికి వెళ్ళి అందజేసి, TCWA తరఫున శాలువ కప్పి, పాద నమస్కారం చేసుకోగలిగాను.
‘వడపళని’ (స్టూడియోలన్నీ అక్కడే) వెళ్ళినప్పుడల్లా ఓ నిట్టూర్పు అప్రయత్నంగా నా నాసిక నుండి వెలువడుతుంది. ఏదీ ఆ విజయా గార్డెన్స్, ఏదీ ఆ వాహిని స్టూడియో, ఏరీ ఆ దిగ్దర్శకులు.. ఏరీ ఆనాటి నటీనటులు? నిన్నటి వరకూ వారందరి కబుర్లను ప్రాణానికి ప్రాణంగా చెప్పే సింగీతం గారు మన మధ్య ఉన్నారనే ఓ సాంత్వన కలిగేది.
ఈ రోజు సింగీతం గారు మనలని వదిలి ఆ నక్షత్రాలలో మరో నక్షత్రమై నిలిచారు.
భగవంతుడా, వారి చరిత్ర ఏనాటికీ వెలిగే ధృవనక్షత్రమే. వారూ, వారి సినిమాలూ కూడా ఈ లోకంలో చిరంజీవులే.
వారి కుటుంబ సభ్యులకూ, అభిమానులకు మాత్రం ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించు.
మృత్యోర్మా అమృతంగమయ.
సాష్టాంగ నమస్కారాలతో
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
