ఎన్ని నాళ్ళ ముచ్చటో అది…
ఇప్పటికీ నా మదిలో శాశ్వతమై
అపురూపమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది!
నా కలల రాణి అందాన్ని ఆరాధిస్తూ
నిదుర రాని కనులతో
ఆనాటి ఉషోదయ సంధ్యలో
నిన్ను ప్రేమించే నా హృదయం
నీ వాకిటి ముంగిట చేరి
శుభోదయం పలికింది!
రేయంతా వెన్నెల జలపాతంలో
తడిసి మురిసిన ముగ్ధమోహన సౌందర్యంతో
నా కన్నుల ముందు సాక్షాత్కరించావు!
నీ చూపుల విసిరిన
చిరునవ్వుల వెలుగు రేకలకు
నా చుట్టూ అలముకున్న చీకటి తెరలు
కనుచూపు మేర కనిపించకుండా
కనుమరుగై పారిపోయాయి!
రేయి మొత్తం కలల గుర్రమెక్కి
నీ ప్రేమ సామ్రాజ్యంలో దౌడు తీశా ఒంటరిగా…!
నీవు వెంట ఉన్నావనే ఊహల్ని
హృదయం లోగిలిలో దాచుకొని
కౌముదీ కాంతులను తోడు తీసుకొని
ఉదయానికి ముందే
వేకువ పొద్దున…
నీ చిరునవ్వుల రహదారిలో
నీ కాలి అందియల సవ్వడి కోసం
నేను ఆశగా నిరీక్షిస్తోన్న
ఆ అమృత ఘడియల్లో….
జాబిలి నుండి జాలువారిన మంచు వెన్నెలవై
నన్ను పూర్తిగా ఆక్రమించి…
ఆనంద తరంగాలలో ఓలలాడించావు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.

