Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ యువతా! నువు మా భవిత!

[‘ఓ యువతా! నువు మా భవిత!’ అనే గేయాన్ని అందిస్తున్నారు శ్రీ కస్తూరి రాజశేఖర్.]

అతడు:
భరతమాత వదనంలో చిరునవ్వులు చెరగనీకు –
నిరాశా నిస్పృహలను ఎన్నడు దరి జేరనీకు
ఓ యువతా! నువు మా భవిత!
ఆమె:
భరతమాత వదనంలో చిరునవ్వులు చెరగనీకు –
నిరాశా నిస్పృహలను ఎన్నడు దరి జేరనీకు
ఓ యువతా! నువు మా భవిత!
ఇద్దరూ:
ఓ యువతా! నువు మా భవిత!
ఆమె:
సమైక్యతా వస్త్రంలో చిరుగులు ఇక పెరగనీకు –
ఎదురీతన ఆటుపోట్ల కండ దిటవు కరగనీకు
అతడు:
విద్వేషపు జాగిలాన్ని సమాజంలో తిరగనీకు
గుండె ధైర్య మనోబలం ఎన్నటికీ తరగనీకు
ఇద్దరూ:
ఓ యువతా! నువు మా భవిత!
అతడు:
సంఘటితమే జనం బలం ఎన్నటికీ చెదరనీకు –
ఉగ్రవాద మెదురైనా జనతనెపుడు బెదరనీకు
ఆమె:
సుజల భావ జలధిలోన కలుషితనది పారనీకు –
కుళ్ళు కుత్సితాల చెత్తలను నీ మదిలో పేరనీకు
ఇద్దరూ:
ఓ యువతా! నువు మా భవిత!
అతడు:
కష్టాలెన్నెదురైనా అన్యాయం జరగనీకు –
నష్టాలెన్నెదురైనా పట్టుదలను జారనీకు
ఆమె:
భరత మాత హృదయమే దివ్య దేశమని తలిస్తే
ప్రతి పౌరుడు అనుక్షణం మన ఘన జనసైనికుడే
ఇద్దరూ:
ఓ యువతా! నువు మా భవిత!
ఆమె:
జనత మీద మమత నీది –
సమత వాద ఘనత నీది –
అతడు:
కదం కలిపి కదలు నేడు –
కనకధార భవిత నీది!
ఇద్దరూ:
ఓ యువతా! నువు మా భవిత!
పిల్లలు కోరస్:
భారత్ మాతా కీ జై.. భారత్ మాతా కీ జై..
భారత్ మాతా కీ జై..

Exit mobile version