Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భివండీని ఉర్రూతలూగించిన ఒగ్గు కథ – వార్త

తేది 01-02-2026 న సాయంత్రం 6.00 గంటలకు భివండీ లోని అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవన సభాగృహంలో మహారాష్ట్ర ప్రభుత్వ, తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒగ్గు కథ, సాహిత్య ప్రక్రియ భాగంగా కవి సమ్మేళనం ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఇది ఈ ఆర్థిక సంవత్సరం, అకాడెమీ ద్వారా నిర్వహించబడ్డ నాలుగవ కార్యక్రమం.

దాదాపు రెండు వందల మంది హాజరైన భివండీ కార్యక్రమం, ముఖ్య అతిథి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారి కర కమలాల ద్వారా దీప ప్రకాశనంతో మొదలయింది. ఆ కార్యక్రమానికి స్థానిక తెలుగు కార్పొరేటర్ శ్రీమతి రజిత మోహన్ కొండ గారు, అఖిల పద్మశాలి సమాజం, భివండి అధ్యక్షులు శ్రీ పొట్టబత్తిని రామకృష్ణ గార్లు కూడా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీ అశోక్ కంటె గారు అతిథులు శ్రీ కందగట్ల స్వామి, శ్రీమతి రజిత మోహన్ కొండ, శ్రీ రామకృష్ణ పొట్టబత్తిని, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ సమన్వయకులు శ్రీ గంజి జగన్ బాబు, శ్రీ అంబల్ల జనార్దన్ మరియు శ్రీ హరీశ్ గార్లను వేదికపైకి ఆహ్వానించారు. శ్రీ అశోక్ గారు సభకు స్వాగతం చెప్పిన తర్వాత శ్రీ గంజి జగన్ బాబు గారు, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ ఆవిర్భావ నేపథ్యం వివరించారు. ఆ తర్వాత శ్రీ కందగట్ల స్వామి గారు ప్రసంగిస్తూ, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పినందుకు ఇక్కడి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అకాడెమీ స్థాపనకై రెండు సంవత్సరాలు అవిశ్రాంతంగా శ్రమించిన శ్రీ జగన్ బాబు, శ్రీ అశోక్ కంటే బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక పరాయి రాష్ట్రం లో తెలుగు కేతనాన్ని ఎగురవేస్తున్న మహారాష్ట్ర ప్రజలను అభినందించారు. అటు పిమ్మట శ్రీ కందగట్ల స్వామి మరియు వేదికపై ఉన్న ఇతర ప్రముఖులను మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఇక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ కర్నాల మల్లేశ్ బృందం వారి మార్కండేయ మహాముని ఒగ్గు కథ మొదలయింది. సర్వశ్రీ కర్నాల మల్లేశ్, తాండ్ర సోలోమన్, ఏకుల తిరుపతి, గుర్రాల శ్రీనివాస్ మరియు బొట్ల పర్వతాలు గార్ల బృందం, తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వారి వినూత్నమైన నాట్యశైలి, వారు ఏమాత్రం తడబడకుండా అనర్ఘళంగా కథ చెప్పిన తీరు, మధ్య మధ్యలో చెప్పిన పిట్ట కథలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి. అప్పుడప్పుడు వారి విసుర్లు జనాలను కడుపుబ్బ నవ్వించాయి. ఒగ్గు కథ సగం కాగానే, కళాకారులకు విశ్రాంతినిచ్చేందుకు, కవి సమ్మేళనం మొదలయింది.

సర్వశ్రీ బొడ్డు శంకరయ్య, ఈరబత్తిని రవి, పొట్టబత్తిని రామకృష్ణ, చింతకింది శంకర్, బైరి రామస్వామి, కుసుమ సుదర్శన్ మరియు శ్రీమతి దియా విగ్నేష్ తమ తమ కవితలతో ఆహుతులను ఆలోచింపజేశారు. చాలా మంది ఛందోబద్దమైన పద్యాలు చదవడం గమనింప దగ్గ విషయం. ఇంకొందరు మన తెలుగు భాష ఔన్నత్యంపై కవితలు పఠించారు. మరి కొందరు సామాజిక స్పృహ తో కూడిన అంశాలను తమ కవితా వస్తువులుగా ఎన్నుకున్నారు. తెలుగేతర ప్రాంతంలో ఉంటూ మన భాష పద్య ప్రత్యేకతను కాపాడుతున్నందుకు హాజరైన చాలా మంది అభినందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున, కవులందరిని శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అంతే కాదు, ఒక్కొక్క కవికి మూడు వేల రూపాయల పారితోషికం కూడా అందించనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి శ్రీ హరీశ్ ప్రకటించారు.

ఆ తర్వాత ఒగ్గు కథ కొనసాగించారు. ఆ కళాకారుల బృందాన్ని కూడా మహారాష్ట ప్రభుత్వం తరఫున సన్మానించారు. చివరగా ఆనవాయితీ ప్రకారం కళాకారులు మంగళహారతిని ప్రేక్షకులమధ్య తిప్పారు. ఆ విధంగా మహారాష్ట్రలో మన తెలుగు, ప్రాచీన జానపద కళారూపాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సన్మానించినట్లయింది.

మొత్తం కార్యక్రమానికి శ్రీ అశోక్ కంటే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శ్రీ హరీశ్ గారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Exit mobile version