ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ పుస్తకం ‘ఒక ఆదివారం సాయంత్రం’ డా. విజయ్ కోగంటి గారి రెండవ కవితా సంపుటి. ఇందులో మొత్తం 51 కవితలున్నాయి. ఈ కవితలు చదువుతుంటే మనల్ని మనం తరచి చూసుకుంటున్నట్టు ఉంటుంది. ఆలోచన, ఆవేశం, ఆవేదన, ఉద్వేగం కలిగిస్తాయి ఈ కవితలు. తక్కువ వాక్యాలలో అమితమైన భావాలను పొదిగి పాఠకులకు అందించారు విజయ్ కోగంటి, చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు వచ్చినట్టుగా. అలతి పదాలతో అవలీలగా మెప్పించారు.
~
ఒక మధ్య తరగతి కుటుంబపు ఆర్థికస్థితిని ఉన్నది ఉన్నట్టుగా అతిశయోక్తి లేకుండా చెప్పిన కవిత ‘ఒక ఆదివారం సాయంత్రం‘. ఓ కుటుంబం రెండు గంటలు విండో షాపింగ్ చేసి హైపర్ బజార్ నుంచి బయటకు వస్తే, వాళ్ళ చేత ఏమీ కొనిపించలేక ఓడింది హైపర్ బజార్ అంటారు. కొనలేని అశక్తత మధ్యతరగతి వాళ్ళదైనా, వెలా తెలా బోయింది మాత్రం హైపర్ బజారేనని అంటారు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితపు మధురిమను ఆస్వాదించమంటుంది ‘ఒక్క మలుపు‘ కవిత. “వాన చినుకులూ / కాంతి స్నానం చేస్తున్నై / వన్నెల ఇంద్ర ధనువులందుకే / వంపు తిరిగి పిలుస్తున్నై” అంటూ ‘ఇంకో వర్షాకాలంలో‘ ఎలా ఉంటుందో చెబుతారు కవి.
జీవితమంటే ఒక దశ నుంచి ఇంకో దశలోకి మారే వంటరితనమే అంటుంది ‘అన్వేషణలో…‘ అనే కవిత. అస్పష్టానందపు అదృష్ట లోకంలో తమను తిప్పేందుకు ‘రంగు రెక్కల గుర్రం‘ కావాలంటారు కవి.
తేనెటీగలా మాధుర్యం పంచలేని, వాన చినుకులా కళాత్మకత నిలుపుకోలేని, చిరుగాలిలా పరిపూర్ణ ప్రేమ ఇవ్వలేని మనిషి మౌనంగా ఉండడం తప్ప ఏం చేయగలడు? ‘మూడు ప్రశ్నలు ఒక మౌనం‘ చక్కని కవిత.
ఎదిరించడమేదైనా యుద్ధమే అంటారు కవి. అవసరమైనప్పుడల్లా ఛేదించాల్సిన నిశ్శబ్దమూ యుద్ధమే అంటూ ‘యుద్ధమూ ఒక అనివార్య క్షణమే‘ కవిత చెబుతుంది.
మనుషులుగా మనం ఆనందపు రహస్యాన్ని మరచిపోయామని చెబుతూ, ఆ రహస్యాన్ని తిరిగి తెలుసుకోవాలంటే ‘ఓ కవిత్వ వాక్యాన్ని కావాలి‘ అంటారు.
మన అస్తిత్వపు చిరునామ ‘అమ్మ’ అని ‘ఆమె‘ కవితలో అంటారు. చిన్న కవిత అయినా, గొప్ప అనుభూతినిస్తుంది.
“ఏ అనుభూతి అనుభవించనీ, గొప్పలు చెప్పుకోకుండా ఉండలేని మనమూ – పూలూ, నక్షత్రాల వలె, చెట్ల వలె ఉంటాం” అంటారు కవి. లోతైన అవగాహనని కలిగించే కవిత ‘మనమూ ఉంటాం‘.
పనీ పాటా విషయంలో మనిషిని చెట్టులతోనూ, పువ్వులతోనూ, కాకి తోనూ పోల్చి మనిషి తప్పేంటో చెబుతారు ‘పనీ పాటా లేకుండా‘ కవితలో.
పూడ్చివేసినా తిరిగి మొలకెత్తే శక్తి ప్రేమదే అంటారు ‘గురుదక్షిణ తర్వాతి మాట‘ కవితలో. తనను గురువు ద్వేషించినా, గురువు పట్ల తనలో గౌరవ భావం పోదని అంటారు.
బాధ పోవాలంటే వినోదం కావాలని, అందుకు ఇంటర్‍నెట్ అందించాలంటూ – ‘మాకేం కావాలో మీకు బాగా తెలుసు‘ కవితో. పాలకులు పాలితులను ఎలా మభ్యపెడతారో ఈ కవిత చెబుతుంది.
అసూయని కొలిచే ‘యాప్’నీ, బాధల్ని సహించే ‘బార్కోడ్’నీ సృష్టించలేకపోతున్నామని ‘ఈ టెక్ నాగరికతలలో మనం‘ కవితలో వాపోతారు కవి. వర్తమాన సమాజపు లక్షణాలకు అద్దం పట్టిన కవిత ఇది.
ఎవరికి వారు చదివి అనుభూతి చెందాల్సిన కవిత ‘కొన్ని దూరాలంతే‘. భావోద్వేగాల కలబోత ఈ కవిత.
కొద్ది సేపయినా మన కోసం మనం జీవించడంలోని ఆనందాన్ని ‘కొంచెంగా నైనా మనలా‘ కవిత నేర్పుతుంది.
జీవితం అంతా అంకెలమయం అయిపోతే, ‘అంకెల పాస్వర్డ్‘ ఎంత అవసరమో చెప్తారు కవి.
‘బతక్క తప్పదు కదా, ఇలానే బతుకుదాం’ అంటారు ‘ఇలానే బతుకుదాం‘ కవితలో. నేటి సమాజంలో ఎందరివో జీవన విధానాలకు దర్పణం ఈ కవిత.
సొంతూరంటే తనకి ఎందుకు ఇష్టమో ‘నా అసలు నీడ‘ కవితలో కవి చెప్పారు. చాలామందికి తమ సొంతూరు గుర్తొస్తుంది ఈ కవిత చదివితే.
మనం మరిచిన సంతోషపు రహస్యాన్ని గుర్తించిన ఓ కోడిపుంజుని చూపించి… ఆ ఆనందపు రహస్యాన్ని మళ్ళీ పొందమంటారు ‘పొద్దునే ఓ పుంజు‘ కవితలో.
~
మరికొన్ని కవితలున్న ఈ పుస్తకం చదువుతుంటే మనలోని భావుకుడో/ప్రేమికుడో/ఆలోచనాపరుడో తిరిగి తల ఎత్తడం ఖాయం. ప్రకృతిని/ప్రపంచాన్ని/మనుషులని మళ్ళీ ప్రేమించడం నిశ్చయం! పోగొట్టుకున్న దేనినో వెతుక్కోమంటాయి ఈ కవితలు. ఆ దిశగా పాఠకులు ప్రయత్నం చేస్తారని ఆశ పడడం అత్యాశ కాదు.
***
కవి : డా. విజయ్ కోగంటి,
పేజీలు : 96,
వెల : రూ.130/-
ప్రతులకు :
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలు.
డా. కోగంటి విజయ్ బాబు, గుంటూరు. ఫోన్ : 880182324
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.