Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక ఆలోచన

[శ్రీమతి యం. ధరిత్రీ దేవి రచించిన ‘ఒక ఆలోచన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

మధ్యాహ్నం భోంచేశాక వంటిల్లంతా సర్దేసి కాసేపు టీవీ చూస్తూ కూర్చుంది పావని. అరగంట గడిచాక లేచి, కాసేపు విశ్రాంతి కోసం నడుం వాల్చింది. ఐదు నిమిషాలు గడిచాయో లేదో.. బయట ఒకటే పిల్లల గోల! స్కూలు, కాలేజీ ఉండే రోజుల్లో అయితే సాయంత్రాలు మాత్రమే ఈ క్రికెట్ ఆటలూ, అరుపులూ ఉండేవి. వేసవి సెలవులు మొదలై రెండు రోజులైంది. ఇక వీళ్ల ఆటలకీ,అల్లరికీ ఓ సమయం అంటూ లేకుండా పోయింది. అదేమి చిత్రమో..వాళ్ళ ఇళ్ళ ముందర ఆడరు, వేరే వాళ్ళ ఇళ్ల ముందుకొచ్చి హంగామా చేస్తుంటారు.

అలా విసుక్కుంటున్న పావనికి మూడో తరగతి చదువుతున్న పక్కింటి బాలూగాడి ఏడుపు వినిపించి, తల పట్టుకుని లేచి బయటకొచ్చింది.

“సెలవులు వచ్చాయి కదా, అదేదో సమ్మర్ క్లాసులంట.. పోతానని ఒకటే ఏడుపు.. అంతంత ఫీజులు కట్టలేమురా అంటే వినకుండా చూడు పావనీ ఎలా ఏడుస్తున్నాడో..”

కిందపడి దొర్లుతూ ఏడుస్తున్న బాలును చూపిస్తూ ఫిర్యాదు చేసింది పక్కింటి వనజమ్మ. వాణ్ణి లేపి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి తన ఎదురుగా కూర్చోబెట్టుకుంది పావని.

“రేయ్ బాలూ, నీకో కథ చెప్పనా..” అంటూ వాడి ధ్యాస మళ్లించింది. తర్వాత చిన్న పిల్లల కథల పుస్తకాలు రెండు ఇచ్చి ఓ కథ చదవమంది. వాడు అక్షరాలు కూడబలుక్కుంటూ నెమ్మదిగా చదవడం మొదలెట్టాడు. అరగంట గడిచాక, ఓ చాక్లెట్ వాడి చేతిలో పెట్టి,

“చూడు, రేపు కూడా ఇలాగే రావాలి, మరిన్ని కథలు చెబుతా. కథల పుస్తకాలు ఇస్తా, సరేనా..”

అనగానే వాడు తలూపి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు అదే టైం కి వాడి కోసం చూసింది కానీ వాడు రాలేదు. మెల్లిగా బయటికి వచ్చి,

“అక్కా, బాలు లేడా..” అని కేకేసింది.

“ఉన్నాడు పావనీ, ఇదిగో వస్తున్నాడు..”

జవాబుగా బాలును తీసుకుని వనజమ్మ బయటికి వచ్చింది. వాడు బుంగమూతి పెట్టినా, బుద్ధిగానే వచ్చి కూర్చున్నాడు.

“బాలూ, నిన్న ఓ కథ చెప్పాగా.. గుర్తుందా, ఏదీ, నాకు చెప్పు..” అంటూ వాణ్ణి కూర్చోబెట్టుకుంది. వాడు తడుముకుంటూ, నాన్చుతూ మెల్లిగా తోచినట్టు చెప్పేశాడు.

“గుడ్, ఇందులో మరొకటి చూపిస్తా చదువు..” అంటూ కథల పుస్తకం చేతికిచ్చింది. అందులోని రంగురంగుల బొమ్మలు చూసేసరికి వాడి మొహం విప్పారింది. మెల్లిగా అందులో లీనమైపోయాడు. వదలకుండా అలాగే మరో రెండు రోజులు వాడిని పిలిచి కూర్చోబెట్టుకోవడం మొదలెట్టింది పావని. తర్వాతి రోజు వాడు మరో ముగ్గురిని వెంటబెట్టుకొచ్చాడు వాడి ఫ్రెండ్స్ అంటూ. పావనిలో ఏదో తెలియని సంతోషం..!

పావని పది పాసయింది. పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయిపోయింది. కాలక్షేపానికి భర్త రమణతో లైబ్రరీ పుస్తకాలు తెప్పించుకొని చదవడం ఆమెకో అలవాటుగా మారిపోయి కాస్త పుస్తక పరిజ్ఞానం అబ్బింది.

వారం గడిచింది. బాలు స్నేహితులు మరో నలుగురు జతయ్యారు. అది చూసిన పావనిలో ఏదో ఆలోచన మెల్లిగా మొదలైంది. ఆ ఉత్సాహంతో భర్తతో సంప్రదించి నిర్ణయం తీసుకుంది. అప్పుడప్పుడు అమ్మానాన్న ఇచ్చిన డబ్బులు, జీతంలో మిగిలినవీ ఓ ఐదారువేలదాకా ఉన్నాయి తన దగ్గర. ఆ పైకం తీసుకుని మరుసటి రోజు బజారుకు వెళ్ళింది పావని. తను కొనాలనుకున్న వస్తువులు, కొన్ని కథల పుస్తకాలు కొనేసింది. మరుసటి రోజు ఇంటి ముందు కాంపౌండ్ లోపల అంతా శుభ్రం చేసింది. అలవాటు ప్రకారం నాలుగింటికి బాలు, వాడి ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు. పావని వాళ్ల ముందర కథల పుస్తకాలు పరిచింది. ఆ రంగురంగుల పుస్తకాలు, అందులో బొమ్మలు చూడగానే ఎంతో హుషారుగా పిల్లలంతా తిరగేయడం మొదలెట్టారు. నిమిషాల్లోనే అందులో లీనమైపోయారు. అరగంట గడిచాక బుక్స్ అన్నీ సర్దేసి, వాళ్ల ముందు తను కొని తెచ్చిన క్యారం బోర్డు, వైకుంఠపాళీ, మరి కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంచింది. అంతే.. వాళ్ళ ఆనందానికి అంతులేకపోయింది. ఆ ఆటలతో మరో గంట ఇట్టే గడిచిపోయింది. ఆ తర్వాత అందరినీ లేపి, ఓ అరగంట బయట ఆడుకోమని చెప్పింది.

అలా మూడు రోజులు గడిచిపోయాయి. నాలుగోరోజుకంతా విషయం తెలిసి క్రికెట్ బ్యాచ్ పెద్ద పిల్లలు కూడా వచ్చేశారు. వాళ్ల ముందు చెస్ బోర్డు పెట్టి ఎలా ఆడాలో నేర్పించింది పావని. అంతే..! తర్వాత రోజు నుండీ ఊహించని రీతిలో సాయంత్రం నాలుగయ్యేసరికి అంతా పోగై, ముందు ఓ అరగంట పుస్తకపఠనం, తర్వాత ఆటలు ఆడడంలో నిమగ్నమైపోవడం అలవాటయింది వాళ్ళకి. పనిలో పనిగా చిన్న పిల్లలకు పాఠాల్లో తెలియనివి చెప్పడం చేస్తోంది పావని. ఆ తర్వాత బయట ఆటలు కూడా కాసేపు ఆడుకోమని పంపిస్తోంది. అలా అలా నెల గడిచిపోయింది.

సెలవులు ముగిసి స్కూళ్లు తెరిచారు. ఆ సాయంత్రం చుట్టుపక్కల పిల్లల అమ్మలంతా పావని వద్దకు వచ్చారు.

“పావనీ, నీవల్ల పిల్లలు బుద్ధిగా తయారయ్యారు. వందల రూపాయలు కట్టి ఎక్కడికో పంపడం కంటే నీ దగ్గరే చక్కగా నేర్చుకుంటున్నారు. బళ్ళు తెరిస్తేనేం. సాయంత్రాలు ఇలాగే కొనసాగించమ్మా..” అంటూ కోరుకున్నారు.

పావని చాలా సంతోషించింది. వాళ్లంతా మాట్లాడుకుని పావనికి కాస్త ఫీజు కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు భర్త సంపాదనకు తనూ ఓ చేయి వేయడం ఆమెకు ఆనందాన్నిచ్చింది. తనకు వచ్చిన ఒక ఆలోచన వల్ల ఇరుగుపొరుగు వాళ్ల సమస్య, వీధిలో పిల్లల గోల సమస్య అన్నీ సమసిపోయాయి. తీరిక ఎక్కువై తన్నావహించిన బద్ధకం, మధ్యాహ్నపు నిద్ర కూడా మటుమాయమైపోయాయి. అంతేకాక తనకు కాస్త ఆదాయం కూడా చేకూరుతున్నందుకు పావని మనసు సంతృప్తితో నిండిపోయింది.

కొద్ది రోజులుగా సాయంత్రాలు పావనిని గమనిస్తూన్న భర్త రమణ భార్య చురుకుదనం, తెలివితేటలకు అచ్చెరువొందాడు. చదివింది పదో తరగతే అయినా, గణితం, ఆంగ్లంలో కూడా ప్రావీణ్యం చూపించడం మరింతగా అతన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. కాస్త సహకారం, చేయూత అందిస్తే తను మంచి స్థాయికి చేరగలదన్న నమ్మకం కూడా అతనిలో కలిగింది. ఆ నమ్మకమే అతనిలో సరికొత్త ఆలోచనకు బీజం వేసింది.

***

ఏడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆదర్శ ఉన్నత పాఠశాల ముందు బైకు ఆపాడు రమణ. పావని, పాప, బాబు ముగ్గురూ దిగి రమణకు బై చెప్పి గేటు లోపలికి వెళ్లారు. బాలూ మరి కొంతమంది పిల్లలు పరుగున వచ్చి పావనికి గుడ్ మార్నింగ్ చెప్పారు. పావని హెచ్.యం. రూములోకి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి అక్కడున్న టీచర్స్‌కి విష్ చేసింది. ఇంతలో ప్రార్థన బెల్ మోగింది. మరో పావుగంటలో ప్రార్థన ముగిసి పిల్లలంతా వాళ్ల క్లాసుల్లోకి వెళ్లిపోయారు. పావని కూడా తన క్లాసు ఐదవ తరగతిలోకి వెళ్ళి పాఠం చెప్పడం మొదలెట్టింది.

అవును మరి.. ఇప్పుడు పావని ఆ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఇదంతా ఆషామాషీగా.. అదీ ఒక్కరోజులో జరిగిందేమీ కాదు..

***

ఆరోజు పావనిని దీక్షగా గమనించిన రమణలో మెదిలిన ఓ సరికొత్త ఆలోచనకు నాందిగా ఆమెను ప్రైవేట్‌గా ఇంటర్ కట్టించాడు. స్వతహాగా చురుకైనదే కాబట్టి రెండు సంవత్సరాల్లో ఇంటర్ పూర్తి చేసింది పావని. ఆపై రెండు సంవత్సరాల టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా పూర్తి చేసింది. గవర్నమెంట్ పోస్టులు పడేదాకా ఎదురు చూడకుండా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రయత్నించి మూడు నెలల క్రితం చేర్పించాడు రమణ. ఇదంతా భర్త ప్రోత్సాహమేనంటుంది పావని. కాదు.. ఆమె సంకల్పం, అకుంఠిత దీక్ష, కఠోరశ్రమ మాత్రమే అంటాడు రమణ..

ఓవైపు తాను చదువుకుంటూ, చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మరోవైపు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి తల్లిగా కూడా తన బాధ్యత నెరవేర్చుకుంది పావని. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల్ని కూడా తను పనిచేస్తున్న స్కూల్ లోనే చిన్న తరగతుల్లో చేర్పించి తనతో కూడా తీసుకు వెళ్తూ ఉంటుంది. తన మొట్టమొదటి విద్యార్థి.. ఇంకా ప్రియతమ విద్యార్థి అయిన బాలు ఇప్పుడు అదే స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. బాలు అంటే పావనికి చెప్పలేనంత ఇష్టం. వాడికీ అంతే. వాడికే కాదు అప్పట్లో తను ఇంటి వద్ద పాఠాలు చెబుతూ ఆటలు ఆడించిన పిల్లలందరికీ పావని టీచర్ అంటే మహా ఇష్టం. ఆమె వారికి అక్క, ఆంటీ, టీచర్.. అలా రకరకాలుగా పిలుస్తుంటారు మరి..

పావనికి వచ్చిన ఓ ఆలోచనకు ఓ రూపం తాను కల్పిస్తే రమణలో మెదిలిన మరో ఆలోచన ఆమె భవితవ్యానికి సరికొత్త అర్థాన్ని సృష్టించి ఆమెను ఓ ఉన్నత స్థానంలో నిలబెట్టింది. భర్త విశాల దృక్పథం ఆమెకు అంతులేని ఆలంబన కావడం నిజంగా ఆమె అదృష్టమే.

Exit mobile version