Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు

[సి.హెచ్. శివరామ ప్రసాద్ గారు రచించిన ‘ఒక దెబ్బకు మూడు పిట్టలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

పోలీస్‌ స్టేషన్‌కి మొదటిసారిగా బలరామస్వామి కుటుంబం వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి కలిగించింది బలరామస్వామే. అతను ఇంటికి రాకుండా అదృశ్యమయ్యాడు. ఆఫీసుకి వెళ్ళినవాడు అటునుంచి అటే ఎటో వెళ్ళిపోయాడు. కమ్మర్షియల్‌ టాక్స్‌ ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తున్న అతనికి 59 సంవత్సరాలు. ఇంకొక ఆర్నెల్లలో రిటైర్‌ కాబోతున్నప్పుడు జరిగిందీ సంఘనట. అదే ఆఫీసులో ఆఫీసర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగమయ్య బలరామస్వామి బావమరిది. చొరవ తీసుకుని అక్కగౌరిని, పిల్లలు సంజీవ్‌, సునందలను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చాడు.

“ఏం జరిగింది?” అని సి.ఐ ప్రశ్నించాడు.

“సార్‌! మా బావ బలరామస్వామి మొన్న ఆఫీసు నుంచి ఇంటికి రాలేదు. నిన్నంతా ఎదురు చూశాం. ఏం జరిగిందో తెలియక కంప్లైంట్‌ ఇద్దామని వచ్చాం.” అని సి.ఐ.కి వివరంగా చెప్పాడు నాగమయ్య.

“ఔనండీ! రోజూసాయంకాలం ఆరు, ఏడుకి ఇంటికి వచ్చేవారు. ఒక్కోసారి ఆఫీసులో లేటయితేరాత్రి ఎనిమిది, తొమ్మిది అయినా వచ్చేవారు. మొన్న ఆఫీసుకి వెళ్ళి తిరిగిరాలేదు. నిన్నంతా ఎదురు చూశాం. నిన్న ఆఫీసుకి కూడా వెళ్ళలేదని తెలిసింది. ఇంకొక ఆర్నెల్లలో రిటైర్‌ కాబోతుండగా ఇలా జరిగింది. మాకు చాలా భయంగా వుంది సార్‌!” కళ్ళనీళ్ళు పెట్టుకని చెప్పింది గౌరి.

సి.ఐ.కి ఆమెను చూస్తే చాలా జాలి కలిగింది. నిజమే ఆర్నెల్లలో రిటైర్‌ కాబోతున్న ఆయన కనిపించకుండా పోవడం ఆందోళన కలిగించే విషయమే.

“ఈ వయసులో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏమిటి? ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా?” అడిగాడు సి.ఐ.

“లేదు సార్‌! ఏం జరగలేదు” కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్సింది గౌరి.

“మీ బంధువుల ఇళ్ళలో కనుక్కున్నారా?”

“లేదండీ. ఎవరింటికీ వెళ్ళలేదు.”

“ఆయన ఆఫీసుకి ఎలా వెళ్తారు? స్కూటర్‌ గాని వాడతారా?”

“లేదండీ. బస్‌పాస్‌ తీసుకున్నారు. సిటీబస్సులోనే ఆఫీసుకి వెళ్ళొస్తారు.”

“స్కూటర్‌ వాడరు. కాబట్టి యాక్సిడెంట్‌ జరిగే అవకాశం లేదు.” అని బలరామస్వామి ఫోటో తీసుకున్నాడు గౌరితో కంప్లైంట్‌ రాయించి తీసుకున్నాడు సి.ఐ.

“మిస్సింగ్‌ కేసు. ఫోటో అన్ని పోలీస్‌ స్టేషన్లకి పంపిస్తాం. ఆచూకీ దొరికితే మీకు తెలియజేస్తాం” అని భరోసా ఇచ్చాడు సి.ఐ.

రెండు రోజుల తర్వాత ఎల్లమ్మ చెరువులో ఒక నడివయసు వ్యక్తి మృతదేహం బైటపడింది. పోలీసులు ఆ చుట్టు పక్కల ఎంక్వయిరీ చేస్తే ఎవరూ గుర్తుపట్టలేదు. ఒకవేళ మిస్సయిన బలరామస్వామిది ఏమో? అని అతని కుటుంబానికి కబురు పంపిచారు.

నాగమయ్య అక్క గౌరిని తీసుకుని ఎల్లమ్మ చెరువు దగ్గరకు వెళ్ళాడు. పాపం గౌరి దారి పొడుగునా ఏడుస్తూనే వుంది. అదృష్టవ శాత్తు ఆ శవం బలరామస్వామిది కాదు.

‘హమ్మయ్య’ అని వూపిరి పీల్చుకుని వచ్చేశారు.

ఇటు బలరామస్వామి ఇంట్లో, అటు ఆఫీసులో అతను కనిపించకుండా పోవడంతో ఆందోళనపడుతున్న సమయం ఆఫీసుకి రిజిష్టర్‌ పోస్ట్‌ వచ్చింది. ఫ్రమ్‌ అడ్రస్‌ బలరామస్వామిది.

ఆఫీసు సూపరింటెండెంట్‌ నాగమయ్యను  పిలిచి చెప్పాడు.

“మీ బావ ఆర్నెల్లు లీవ్‌ పెట్టాడు. మెడికల్‌ సర్టిఫికెట్‌ కూడా పంపాడు.”

“ఔనా సార్‌! ఎంత కంగారు పెట్టాడు? ఏమైపోయాడో అని మా అక్క ఒక్కటే ఏడుపు. గుడ్‌ న్యూస్‌ చెప్పారు సార్‌! ఎడక్కడున్నంచి పంపాడు సార్‌?” అన్నాడు నాగమయ్య.

“ఆంజనేయ నగర్‌, మూసాపేట అని వుంది.”

“అది మా బావ ఇంటి అడ్రసే సార్‌!”

“అంటే తన ఇంటి అడ్రస్‌తో ఎక్కడి నుంచో పంపాడన్నమాట” అన్నాడు సూపరింటెండెంట్‌.

సాయంకాలం ఆఫీసు నుంచి అక్కగారింటికి వెళ్ళి ఆర్నెల్లు  సెలవు పంపిన విషయం చెప్పాడు నాగమయ్య. గౌరి, పిల్లలు సంతోషించారు. ఏం జరగలేదు. క్షేమంగా వున్నాడు అనుకుని వూపిరి పీల్చుకున్నారు.

రోజులు గడుస్తున్నాయి. బలరామస్వామి కనిపించకుండా పోయి నెల రోజులు దాటింది. ఆచూకీ తెలిసిందని పోలీసుల నుంచి ఏ కబురూ రాలేదు. గౌరికి ఆందోళనగా వుంది. నాగమయ్య అక్క కుటుంబాన్ని ఓదారుస్తూనే వున్నాడు.

“పోలీసులకు ఏం శ్రద్ధ వుంటుందిరా! మనమే గట్టిగా ప్రయత్నించాలి” అన్నది గౌరి తమ్ముడితో.

“హైదరాబాద్‌ సిటీ మహా సముద్రం. ఎక్కడని వెతుకుతాం. బావ ఏమైనా చిన్నపిల్లోడా? తప్పిపోవడానికి” అన్నాడు నాగమయ్య.

“మావయ్యా! నాన్న ఫోటో పేపర్లో వేయిద్దాం.” అన్నాడు సంజయ్‌.

కొడుకు ఐడియా బాగానే వుందనిపించింది గౌరికి.

“ఏ పేపర్లో వేయిద్దాంరా! చాలా పేపర్లు వుంటాయి.” అన్నాడు నాగమయ్య.

“రెండు, మూడు తెలుగు పేపర్లలో వేయిద్దాం” అన్నాడు సంజయ్‌.

“ఆ పని చెయ్యరా! చూద్దాం. ఏ పుట్టలో ఏ పాము వుందో? తెలిసిన వాళ్ళెవరికైనా, ఎక్కడైనా కనిపిస్తే ఫోన్‌ చేస్తారు” అన్నది గౌరి.

ఈ ఫోటోలో వున్న బలరామస్వామి నెల రోజుల నుంచి కనిపించుట లేదు. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎక్కడైనా వుండొచ్చు. వయసు 59 సంవత్సరాలు. మనిషి ఎత్తుగా వుంటాడు. నల్లగా కోల ముఖం. ఆచూకీ తెలియజేసిన వారికి పదివేల రూపాయలు బహుమతిగా ఇవ్వబడును.

మూడు తెలుగు పేపర్లలో రోజుకొక పేపర్‌లో మూడు రోజుల పాటు మిస్సింగ్‌ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత గౌరి కుటుంబం రోజూ ఆశతో ఎదురు చూడసాగారు. ఏ రోజు ఎవరైనా కనిపించాడని కాల్‌ చేస్తారేమోనని.

బలరామస్వామి కనిపించకుండా పోవడం ఎంత నష్టమో? ఆ కుటుంబానికే తెలుసు. ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు. గౌరి కుటుంబం నిరాశా, నిస్పృహలలో మునిగిపోయింది.

సిద్ధిపేట సమీపంలో ఆనందాశ్రమం నిర్వాహకుడు ఆరోజు ఉదయం న్యూస్‌ పేపరు చూస్తూ, అందులో కనిపించుట లేదు అంటూ పడిన బలరామస్వామి ఫోటో చూస్తూ వులిక్కిపడ్డాడు. అతను నెల రోజుల క్రితం వచ్చి ఆ ఆశ్రమంలో చేరాడు. కాని అక్కడ వుంటున్న వృద్ధులతో కలిసిమెలిసి వుండడం లేదు. ఎవరితోనూ సరదాగా మాట్లాడడు. చిరునవ్వు నవ్వడు. మౌనంగా, విషాదంగా మరమనిషిలా తన పనులు తను చేసుకుంటూ వుంటాడు. జీవితంలో ఏదో కోలుకోలేని దెబ్బతిన్నవాడిలా కనిపిస్తాడు.

ఆనందాశ్రమం నిర్వాహకుడు సిద్ధిపేట పోలీస్‌ స్టేషన్‌కి బలరామస్వామి తమ ఆశ్రమంలో నెల రోజుల క్రితం వచ్చి చేరిన విషయం, నిజాయితీగా వున్న మాట చెప్పాడు.

పోలీసులు వచ్చి బలరామస్వామిని తీసుకెళ్ళి సి.ఐ. నరసింహారావు ముందు హాజరు పరిచారు.

“ఏమండీ బలరామస్వామిగారూ! మీరు పెద్దవారు. ఆర్నెల్లలో సర్వీసు నుంచి రిటైర్‌ కాబోతున్నారు. రిటైరైన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లు ఆశ్రమంలో చేరి వుండొచ్చుగా! ఈ లోపల ఇంట్లో భార్యకి కూడా చెప్పకుండా వెళ్ళి ఆశ్రమంలో ఎందుకు చేరారు? పాపం మీ భార్య ఎంతలా ఏడుస్తున్నదో? మీ పిల్లలు ఎంత ఆందోళనతో వున్నారో కదా? ఎందుకు ఇలా చేశారు?” సి.ఐ బలరామస్వామిని నిలదీశాడు.

అతని ముఖంలో రంగులు మారాయి. ఎందుకో ఒక్కసారిగా వుద్వేగ భరితుడయ్యాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బోరున విలపించసాగాడు. సి.ఐ. కంగారు పడి అతన్ని అనునయించాక కుదుట పడ్డాడు.

తర్వాత చెప్పడం సాగించాడు.

“సార్‌! మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను కుటుంబంతో అన్ని విధాలా విసిగిపోయాను. నేను ఎంతో కష్టపడి నా కొడుకు సంజీవ్‌ని బి.టెక్‌ చదివించాను. నేను చదువు లేక చిన్న వుద్యోగం అటెండర్‌గా పని చేయాల్సి వచ్చింది. నా కొడుకైనా పెద్ద వుద్యోగం చేస్తాడని కలలు కన్నాను. స్తోమతకు మించి అప్పులు చేసి ఫీజులు కట్టాను. అత్తెసరు మార్కులతో ప్యాసయ్యాననిపించాడు. ఉద్యోగం రాలేదు. ఏవేవో కోర్సులంటూ చేసేవాడు. పాతికేళ్ళు వచ్చినా చేతికి అందిరాలేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ తిరుగుతాడు. నన్ను పీడించి బులెట్‌ బండి కొనిపించి బలాదూర్‌గా తిరుగుతాడు. బాధ్యతగా ప్రవర్తించడం లేదు. తల్లి వాడిని ఏమీ అననీయదు. ఉద్యోగం తెచ్చుకుని ప్రయోజకుడై అందివస్తాడని, ఒక్కగానొక్కకొడుకు మీద పెట్టుకున్న ఆశలు కూలిపోయాయి.

నా కూతురు సునంద ఇంటర్‌ చదివింది. తర్వాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ డిప్లోమా చేసింది. ఒక షాపులో చేరింది. ఎంత సంపాదిస్తుందో తెలీదు. తను అందగత్తెననీ, సినిమా తార అవ్వాలనే పిచ్చితో తిరుగుతోంది. హీరోయిన్‌ అయితే కోట్లు సంపాదిస్తానంటుంది. తల్లి దృష్టిలో సునంద హీరోయిన్‌. నా కొడుకు దృష్టిలో హీరోయిన్‌. సునందకు తన దృష్టిలో తనే హీరోయిన్‌. సినిమాలు, టీ.వీ సీరియల్స్‌లో చిన్న వేషాలు వేస్తూ తిరుగుతుంది. నేను కోప్పడితే నా భార్య వూరుకోదు. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి పంపు చూద్దాం అని ఎద్దేవా చేస్తుంది. ఏదొక రోజున హీరోయిన్‌ అవుతుందని కూతుర్ని వెంటేసుకుని స్టూడియోల్లో తిరుగుతుంటుంది నా భార్య.

వీళ్ళకు తోడు నా బావమరిది నాగమయ్య వత్తాసు. గవర్నమెంట్‌ కారులో తల్లీ కూతుళ్ళను తిప్పుతుంటాడు. ఇంట్లో నన్ను ఎవరూ లెక్క చెయ్యడం లేదు. నేను డబ్బులు తెచ్చిచ్చే ఏటిఎమ్‌ మిషన్‌లాంటి వాడిని.”

బలరామస్వామి చెప్పిందంతా విని సి.ఐ. నరసింహారావు నిట్టూర్చాడు. చాలా ఇళ్ళలో ఇటువంటి బాగోతాలే వున్నాయి కొత్త ఏముంది అనుకున్నాడు.

“సరేనండీ! మీ భార్య పిల్లలు మిమ్మల్ని లెక్క చేయ్యరు. ఇండిపెండెంట్‌గా ఎవరికి వారు ప్రవర్తిస్తున్నారు. మీ ఇంట్లోనే కాదు. కోట్లకు పడగలెత్తిన కుటుంబాలలోనూ ఇదే పరిస్థితి వుంది. తండ్రి డబ్బు సంపాదనలో మునిగి తేలుతుంటాడు. భార్య క్లబ్బులు, సంఘాలు అంటూ బీజీగా వుంటుంది. పిల్లలు ఎవరికి వారే యమునా తీరే. పిల్లలు యాక్సిడెంట్‌ చేసో, ఏదొక గొడవలో ఇరుక్కున్నప్పుడు కళ్ళు తెరుస్తారు. సరే. లోకం అలా వుంది. దీనికే బాధపడి  ఇంట్లో భార్యకు కూడా చెప్పకుండా ఇలా ఆశ్రమంలో చేరిపోతే ఎలా? మనిషి ఇంట్లో వున్నప్పుడు విలువ తెలియదు. లేనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీ భార్య పిల్లలు మీ గురించి ఎంతో బాధపడుతున్నారు. తప్పు తెలుసుకున్నారు. ఇక అలకమానండి. కాల మహిమ అని సర్దుకుపోండి. ఇంటిరి చేరుకోండి” హితోపదేశం చేశాడు సి.ఐ నరసింహారావు.

బలరామస్వామి ముఖం వివర్ణమైంది.

“సార్‌! నన్ను ఇంటికి పంపకండి. నా గురించి మా వాళ్ళకు తెలియజేయకండి. ఆర్నెల్ల పాటు నన్ను ఆశ్రమంలో వుండనివ్వండి.” జీరబోయిన గొంతుతో చెప్పాడు బలరామస్వామి.

సి.ఐ. పెద్ద షాక్‌ తిన్నాడు. ఆర్నెల్లు అరణ్యవాసం ఎందుకు? ఇంటికి వెళ్ళడానికి ఎందుకు విముఖంగా వున్నాడు? అతనికి ఏమీ అర్థం కాలేదు.

“ఆర్నెల్లు ఎందుకు ఆశ్రమంలోనే వుండాలనుకుంటున్నారు? ఏమిటి మీ ప్రాబ్లం? వివరంగా చెప్పండి?” అని అడిగాడు సి.ఐ.

బలరామస్వామి అసహాయంగా సి.ఐ. వైపు చూసి చెప్పాడు.

“సార్‌! నేను ఈ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. చెప్పుకునేది కూడా కాదు. ఇలా బైట పెట్టాల్సి వస్తుందనీ అనుకోలేదు. ఇప్పుడు ఇక మీకు చెప్పుకోక తప్పదు. నా ఇంట్లో నా మీద కుట్ర జరిగింది. ఆ కుట్ర పన్నింది నా వాళ్ళే. ఎవరో నాకు చెప్పింది కూడా కాదు. నేను చెవులారా విన్నదే. మా బావమరిది నాగమయ్య అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి నాతో పాటు మందు తాగుతాడు. వాడి అక్క వాడికి ఇష్టమైన నాన్‌వెజ్‌ కూరలు వండి పెడుతుంది. ఒక రోజు అలాగే వచ్చి ఎక్కవగా తాగి తిని మా ఇంట్లోనే వుండిపోయాడు. అక్కా తమ్ముడు మాట్లాడుకుంటూ వుంటే, నేను వెళ్ళిపోయి పడుకున్నాను. నాకు ఎంతకీ నిద్ర పట్టలేదు. నేనూ వాళ్ళతో పాటు కబుర్లు చెప్పుకుంటే పోతుందని అక్కడికి వెళ్ళాను. నేను బెడ్‌ రూములో నిద్రపోతున్నానుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

“అక్కా! సంజీవ్‌కి ఉద్యోగం రావడం కష్టం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ విధంగా చేస్తే ఒక్క దెబ్బకి మూడు పిట్టలు” అన్నాడు నాగమయ్య.

“ఒక్క దెబ్బకు మూడు పిట్టలేంట్రా? సరిగ్గా చెప్పు?” అని అడిగింది గౌరి.

“సంజీవ్‌కి ఇంజనీర్‌ ఉద్యోగం రావాలంటే బావ రిటైర్‌ కాగూడదు.”

“మీ బావ రిటైర్‌ కాకుండా ఎలా? సంజీవ్‌ ఇంజనీర్‌, ఉద్యోగానికి ఆయన రిటైర్‌మెంట్‌కి ఏం సంబంధం?

“సంబంధం వుంది బావ రిటైర్‌మెంట్‌ కాకుండా చచ్చిపోతే ఒక దెబ్బకు మూడు పిట్టలు. ఒకటి సంజీవ్‌కి గవర్నమెంట్‌లో ఇంజనీర్‌ ఉద్యోగం ఇస్తారు. అదంతా నేను చూసుకుంటాను. రెండోది బావకు గ్రాట్యూటీ, పి.ఎఫ్‌, ఎన్‌క్యాష్‌మెంట్‌ ఎర్న్‌డ్‌ లీవు కింద డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో సునందకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేయవచ్చు. మూడోది నీకు జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌ వస్తుంది. మీ కుటుంబం అంతా సెటిలైపోతుంది.”

“అది సరే! బావ  రిటైర్‌మెంట్‌ కాకుండా ఎలా చచ్చిపోతాడు ఆయనకు ఏ జబ్బూ లేదుగా?”

“మనం లేపెయ్యడమే. ఏదొక రోజున ఫుల్లుగా తాగించి గొంతు పిసికితే పైకి పోతాడు. తాగుడు ఎక్కువైపోయాడని  ఏడుస్తాం. ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు నాగమయ్య.

“అంతే సార్‌! అది విని నేను కరెంట్‌ షాక్‌ తిన్నాను. నా మనసు వికలమైపోయింది. ఇంట్లో వుండడం పాము పడగ నీడలో వున్నట్టే అని భయం వేసింది. ఆ పాము ఏ రోజైనా కాటేస్తుందని అనిపించింది. మర్నాడు ఆఫీసుకి వెళ్ళి అట్నుంచి అటే ఆనందాశ్రమానికి వెళ్ళిపోయాను. ఆర్నెల్లు సెలవు ఆఫీసుకి పంపించాను. ఇక సెలవు పూర్తి కాగానే వెళ్ళి రిటైరైపోవడమే. బతికిపోతాను” చెప్పాడు బలరామస్వామి.

బాధతో, బరువెక్కిన కళ్ళతో, దుఃఖాతిశయంతో, జేవురించిన ముఖంతో వున్న బలరామస్వామిని  చూస్తుంటే ఎంతో ఆవేదన కలిగింది సి.ఐ నరసింహారావుకి.

ప్రాణభయం ఆబోతులా కుమ్మడంతో, దాన్నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి ఆశ్రమంలో చేరాడన్నమాట. సి.ఐ. కళ్ళముందు రకరకాల మర్డర్‌ కేసులు కనిపిస్తున్నాయి. మానవ సంబంధాలు విచ్ఛినమైపోతున్న దృశ్యాలు మనసులో  మెదులుతున్నాయి.

“సార్‌! ఇందులో మా బావమరది స్వార్థం కూడా వుంది. నా కొడుక్కి ఇంజనీర్‌ ఉద్యోగం వస్తే వాడి కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానడ్న మాట.” చెప్పాడు బలరామస్వామి.

దుఃఖంతో మాటలు గొంతులోనే ఆగిపోయాయి. పెదవులు వణుకుతున్నాయి. కళ్ళలో నీళ్ళు నిండి జలజలా రాలుతున్నాయి. తన కథంతా చెప్పి గుండె బరువు దించుకున్నాడు.

“బాధపడకండి. కాలమహిమ అనుకోండి. మనుషుల్లో విపరీతమైన స్వార్థం పెరిగిపోయింది. రక్త సంబంధాలు, బంధుత్వాలు బలాదూర్‌. ఎవరు ఏమైపోయినా ఫరవాలేదు. తమ ప్రయోజనాలే ముఖ్యమైపోయింది. భర్తలను భార్యలను చంపించడం లోగడ ఎన్నడైనా చూశామా?” అన్నాడు సి.ఐ. అతన్ని ఓదారుస్తూ.

బలరామస్వామి తనను తాను సంబాళించుకోవడానికి కొంత సమయం పట్టింది. అతని భార్య, పిల్లలు, బామ్మర్ది వీరంతా ప్రకోపిస్తున్న క్రూర మృగ ప్రవృత్తికి ప్రతీకలు. ప్రజ్వరిల్లుతున్న స్వార్థానికి ప్రతినిధులు. మనుషులు ఎందుకిలా మారిపోతున్నారు? అనే దానికి సమాధానం చెప్పగలిగిన వారెవరూ లేరు.

 “సార్‌! నేను ఆశ్రమంలో వున్నట్టు మావాళ్ళకు చెప్పకండి. తెలిస్తే నన్ను బలవంతంగా తీసుకెళ్ళి చంపేస్తారు. నాకు చావాలని లేదు”  వణుకుతున్న గొంతుతో చెప్పాడు బలరామస్వామి.

“స్వామిగారూ! నేనొక విషయం అడుగుతాను ఏమనుకోకండి. మీకు కట్టుకున్న భార్య పిల్లలు కూడా మీ చావు కోరుకుంటే మీకు జీవితం మీద విరక్తి కలగడం లేదా? ఎందుకు ఇంకా బతకాలనుకుంటున్నారు? ఈ పాడులోకంలో బతికి ఎవరికి ప్రయోజనం? ఉన్నమాట చెప్తున్నాను. నాకు ఇటువంటి పరిస్థితి దాపురించితే వాళ్ళు చంపకముందే నేనే ఆత్మహత్య చేసుకుంటాను” ఉద్వేగపడుతూ చెప్పాడు సి.ఐ. నరసింహారావు.

“సార్‌! మీ అనుమానం నిజమే. ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంటారు కాని నా పరిస్థితి వేరు నేను బతికుండాలని కోరుకుంటున్నది నాకు ప్రాణం మీద తీపితో కాదు. ఊళ్ళో ఎనభై ఏళ్ళ నా తల్లి వుంటున్నది. నేను నెల నెల జీతం తీసుకోగానే ఆమెకు డబ్బు పంపాలి. ఊళ్ళో మాకు ఒక ఇల్లు తప్ప ఆస్తులు ఏమీలేవు. మా నాన్న చనిపోయాక మా అమ్మ నా దగ్గరకు వచ్చింది. కాని నా భార్య ఆమెను రాచి రంపాన పెట్టింది. ప్రతిరోజూ దేనికో దానికి పేచీ పెట్టుకుని పోట్లాడుతూ వుండేది. మా అమ్మను ఇంట్లో వుండే పరిస్థితి లేకుండా చేసింది. అందుకే నేను మా అమ్మను వూరికి పంపించాను. ఆమె మనుగడకు డబ్బు పంపుతాను. ఆమె బతికున్నంత కాలం పోషించవలసిన బాధ్యత నాకు వుంది కదా సార్‌! నేను చనిపోతే ఆమె ఎలా బతుకుతుంది?” అంటూ బలరామస్వామి ఏడవసాగాడు.

సి.ఐ నరసింహారావుకు మనసు ద్రవించింది.

“స్వామీ! ఆర్నెల్ల తర్వాత కూడా ఇంటికి వెళ్ళొద్దు, రిటైరైపోయి ఆశ్రమంలోనే వుండిపోండి. మీ పెళ్లాం పిల్లలు వాళ్ళ చావు వాళ్ళు చస్తారు” తీవ్రంగా అన్నాడు.

Exit mobile version