Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక నువ్వు – ఒక నేను

[కోటమర్తి రాధాహిమబిందు గారు రచించిన ‘ఒక నువ్వు – ఒక నేను’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

క్యాంటీన్‌లో రామచంద్రను చూసి ఆశ్చర్యపోయింది రూప.. ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు రామచంద్ర. టిఫిన్ తినడంలో రామచంద్ర శ్రద్ధ చూపిస్తే, రూప అతన్ని చూడటంలోనే సమయం అంతా గడిపింది. తెల్లగా అందంగా ఉండే అతను మరి కొద్దిగా లావై ఇంకా అందంగా కనిపించాడు, టిఫిన్ పూర్తి చేసి కాఫీ తాగారిద్దరు.

“ఏంటి.. నేను మరీ పరిచయమే లేనట్లుగా పరాయిగా ఉన్నావు? మూడు సంవత్సరాల తర్వాత కలిసాం, ఏదో ఒకటి మాట్లాడవచ్చుగా? కంపెనీ మారి నా కంపెనీకి వచ్చావు? హైక్ పెరిగే ఉంటుందిగా? ఇప్పుడు నీ ప్యాకేజీ ఎంత? ఫ్లాట్ కొన్నావా? నేను ఇక్కడ బెంగళూరులోనే కొన్నాను.”

“హైదరాబాదులోనే త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొన్నాను, నీతో మాట్లాడటానికి నాకు కొత్తేముంది? నువ్వు ఎలా ఉన్నావు? నీ గురించి చెప్పు? కంపెనీలు మారటం, ప్యాకేజీలు పెరగటం మామూలు విషయమే కదా?”

“నేను అప్పుడు ఇప్పుడు హ్యాపీనే, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇంకా సెటిల్ కాలేదు, నిన్ను నేను మర్చిపోలేదులే, నా వెడ్డింగ్ కార్డ్ నీకు పంపిస్తాను, నా పెళ్ళికి తప్పకుండా రావాలి” అంటూ లేచింది రూప.

***

“ఇంటికి వచ్చినప్పటినుండి చిటపటలాడుతున్నావు? ఏమైంది?” టీ అందిస్తూ అడిగింది తల్లి సుమిత్ర.

“నాన్న కనపడట్లేదు, ఎటెళ్లారు?”

“నాన్న స్నేహితుడు నాగేందర్ గారు ఫోన్ చేశారు, అతన్ని కలిసి వస్తానని వెళ్లారు, ఏమైంది రూపా?”

“ఏమీలేదమ్మా, ఆఫీసులో పని ఎక్కువవుతుంది అంతే, నాన్నకు టైంపాస్ బాగానే అవుతుంది, ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నువ్వు కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టుకో, గుడికి వెళ్లేవాళ్లని, కిట్టి పార్టీ వాళ్ళని, పరిచయాలు చేసుకో, నీకూ టైంపాస్ అవుతుంది” నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది రూప.

కాసేపు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది, ఆ తర్వాత డోర్ వేసుకుని ఏసీ ఆన్ చేసి బెడ్ మీద పడుకుంది, ఎంత ఆపుకున్నా ఆగని దుఃఖం ఉప్పెనలా వచ్చింది, మనసంతా విసుగ్గా కోపంగా అయింది, బలవంతంగా తనను తాను సముదాయించుకుంటూ రామచంద్రకు ఫోన్ చేసింది.                     “హలో.. ఏంటి రూపా, కాల్ చేసావు?” అడిగాడు అతను.

“ఏం లేదు, ఆఫీసునుండి ఇంటికి వచ్చి టీ తాగాను, నీతో మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నాను, వారం రోజులు ఉంటున్నట్లు చెప్పావు కదా, హోటల్లో ఎందుకు? ఈవారం రోజులు నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు, ఇంకో కాల్ వస్తుంది తర్వాత మాట్లాడతాను” అంటూ కాల్ కట్ చేసింది. అంతదాకా ఆపుకున్న దుఃఖం మళ్ళీ ప్రారంభం అయింది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న రోజులు గుర్తుకు వచ్చాయి, అలాగే హోటల్ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటూ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్న రామచంద్రకు కూడా అప్పటి రోజులు గుర్తొచ్చాయి.

***

రూపను చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాడు రామచంద్ర. ఆఫీసులో చేరిన అతనికి ముందుగా రూపే కనిపించింది, ఆమె అతనికి ఎంతగానో నచ్చింది. సంవత్సరకాలం ఆమెను మూగగా ప్రేమించాడు. అతని మనసు, చూపు ఆమె మీదనే ఉండటంతో చాలా క్షోభకు గురయ్యాడు. ఎప్పటికో అతని ఫ్రెండ్ డేవిడ్‌తో తన మనసును తెలుపుకున్నాడు. మూగప్రేమ వద్దని, నీ ప్రేమను తెలుపుకోమని సలహా ఇచ్చాడు డేవిడ్. కానీ ధైర్యం చేయలేక మౌనంగా వుండిపోయాడు. మరో ఆరునెలల కాలం గడిచింది, డేవిడ్ ప్రోత్సాహంతో తన మనసులో మాట ఆమెతో తెలుపుకున్నాడు. రూప నవ్వుతూ ‘నో’ అనేసరికి చాలా బాధపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత ఆశతో మరోసారి అడిగేందుకు ప్రయత్నం చేశాడు, సమయం కోసం ఎదురుచూశాడు, క్యాంటీన్ నుండి బయటకు రాగానే ఆమెను అనుసరించాడు.

“ఏంటీ.. మళ్ళీ ప్రపోజలా? చెప్పానుగా” కోపంగా అంది రూప.

“ప్లీజ్.. ఒక్క పదినిమిషాలు మాట్లాడుకుందాం, అదిగో, అక్కడ కూర్చుందాం” బ్రతిమాలుతూ అన్నాడు.

“అయ్యో.. రామచంద్రా, నువ్వంటే నాకు ఇష్టంలేదు రామచంద్రా” జోక్‌గా అంటూ కిలకిల నవ్వింది, ఎంతో అవమానంగా ఫీలయ్యాడు రామచంద్ర. అయినా తన గురించి తెలుసుకోమని ప్రాధేయపడ్డాడు.            “రూపా.. నన్ను అర్థం చేసుకో, నేను ఇంతవరకు ఏ పెళ్ళిచూపులకు వెళ్ళలేదు, ఎవరినీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, నిన్ను చూడగానే నా మనసు స్పందించింది, నిన్నే నా బెటరాఫ్‌గా ఊహించుకున్నాను, మాది వ్యవసాయ కుటుంబం, మా ఊళ్ళో మాకు పొలాలు తోటలు ఉన్నాయి, అమ్మానాన్న ఊళ్ళోనే వుంటారు, వాళ్ళకు నేను ఒక్కగానొక్క సంతానాన్ని, మా ముగ్గురితో నీకు అన్నివేళలా ఎంతో సౌకర్యవంతంగా వుంటుంది ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకు, నిజానికి నీకు కూడా ఇదో మంచి అవకాశం కాదా? చెప్పు”

“ఏం మాట్లాడుతున్నావు రామచంద్రా, నీపై నాకు అలాంటి ఫీలింగ్ లేదు, అయినా అప్పుడే చెప్పానుగా, మళ్లీ అడిగితే ఇంకా కొత్తగా నేనేం చెప్పను? మరోసారి ఇలా వెంటపడి అడిగితే హెచ్చార్‌కు కంప్లైంట్ చేస్తాను.”

“నేను అడిగింది ఎలా వుందీ? నువ్వు చెప్పేది ఎలా వుందీ? అంతగా బెదిరింపు వద్దులే, ప్లీజ్, ఇంకోసారి మనసుపెట్టి ఆలోచించు, నీ నిర్ణయం అదే అయితే ఇక ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను, అడగను” అంటూ అప్పటికి వెళ్లిపోయాడు రామచంద్ర. ఇంకో ఇరవైరోజుల సమయం తీసుకొని ఆమెను కలిసి మళ్ళీ అడిగాడు. ఆమె ఏ సమాధానం చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయింది, రామచంద్ర మనసు చాలా గాయపడింది. అతను అస్సలు ఊహించని విషయం జరిగేసరికి మరీ తల్లడిల్లిపోయాడతను. రూప హెచ్చార్‌కు కంప్లైంట్ చేయటం, హెచ్చార్ రామచంద్రను పిలిచి వార్నింగ్ ఇవ్వటం అతని మనసును కలచివేసింది. జాబ్‌కు రిజైన్ చేయమని చెప్పటం, లేదా సారీ చెప్పమనటంతో రూపకు సారీ చెప్పి బయటకు వచ్చాడు. అది మొదలు పై ఫ్లోర్ లోకి వెళ్ళి వర్క్ చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు. అనుకోకుండా రూప ఎదురైనా పలుకరించకుండా ముఖం పక్కకు తిప్పుకొని వెళ్లిపోయాడు రామచంద్ర. కాలం వేగంగా కదిలిపోయింది, ఒకరోజు రూప అతని దగ్గరికి వచ్చింది, చాలా నింపాదిగా చూసాడు రామచంద్ర. కాసేపటిదాకా ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేకపోయారు.

“రామచంద్రా.. క్యాంటీన్‌కు వస్తావా? నీతో కాస్తా మాట్లాడాలి?” అంటూ అతని చేతిమీద చేయివేసి నవ్వింది.

“నాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడు రాలేను, విషయం ఏంటో చెప్పు” ఆమెనే చూస్తూ చిరునవ్వుతో అన్నాడు.

“సారీ, అప్పట్లో నేను హెచ్చార్‌కు చెప్పకుండా ఉండాల్సింది, సరే.. జరిగిందేదో జరిగిపోయింది, ఈమధ్య నాకు నాలుగైదు సంబంధాలు వచ్చాయి, అవేవీ నచ్చలేదు, నేను బాగా ఆలోచించుకున్నాను రామచంద్రా, నువ్వు ఎంతగా ఆనందిస్తావో నాకు తెలుసు, నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి  చేసుకుంటే, నేను పెళ్లి చేసుకుని నిన్ను ప్రేమిస్తాను, నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమ్మానాన్నకు మన విషయం చెప్తాను, ఇస్తావని నాకు తెలుసు?” కళ్ళు మెరుస్తుండగా చిరునవ్వుతో చూస్తున్న రూపను కొన్నిక్షణాలు  అలాగే చూశాడు రామచంద్ర. లాప్టాప్ బ్యాగ్ నుండి వెడ్డింగ్ కార్డ్ తీసి ఆమెకు ఇచ్చాడు, అర్థం కానట్లు కవరుపై ఉన్న పేర్లను చూసి, కవరులో వున్న కార్డు తీసి చూసి శిలావిగ్రహంలా నిలబడిపోయింది.

“ఈనెల పదకొండో తారీఖున తిరుపతిలో నాపెళ్లి, రిసెప్షన్..” అతను చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది రూప.

***

గతంనుండి బయటకు వచ్చి మనసు ఆపుకోలేక రామచంద్రకు ఫోన్ చేసింది రూప. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విపరీతంగా కోపం వచ్చి వెంట వెంట నాలుగుసార్లు రింగ్ చేసింది, అయినా అతను లిఫ్ట్ చేయలేదు. మరోసారి ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ వచ్చింది. తనను ఎప్పుడో ఒకసారి పలకరిస్తున్న తండ్రి కంటికి రెప్పలా చూసుకునే తల్లి కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే దుఃఖం పొంగిపొర్లుతూ వచ్చింది. పనికిరాని ఆలోచనల వేగం పెరుగుతుంటే నిద్రమాత్ర వేసుకుని పడుకుంది. తెల్లవారి కాస్త త్వరగానే ఆఫీసుకు వెళ్లింది.

“రాత్రి నువ్వు చాలా హ్యాపీగా నిద్రపోయివుంటావు, నాకు అస్సలు నిద్ర పట్టలేదు, ఏంటీ.. ఈరోజు మా ఇంటికి వస్తున్నట్లే కదా, మొహమాటపడకు, భయపడకు, ఇంట్లో అమ్మానాన్న ఉంటారు” నవ్వుతూ అంది రూప.

“సారీ రూపా, నా ఫ్రెండ్ కూడా నాతో ఉంటున్నాడు, రాలేను” అంటూ వెళ్ళిపోతున్న అతన్ని అలాగే చూసింది.

ఒక్కోరోజు గడుస్తూ మనసంతా వేదనతో నిండిపోతుంటే వద్దనుకుంటూనే రామచంద్రను కలిసి మాట్లాడింది. “రామచంద్రా.. నేను నీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను, రేపు వెళ్ళిపోతున్నావు? మళ్లీ చూద్దాం ఎప్పుడో? ఎవరి బిజీలు వాళ్ళవి? అక్కడకు వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం, నీకేమన్నా అభ్యంతరమా?” అని అడిగింది.

“ఇందులో అభ్యంతరం ఏముంది?” అంటూ ఆమెతో నడిచాడు రామచంద్ర. ఇద్దరూ ఒకచోట నిలబడ్డారు.

“ఏంటో మనసంతా చాలా బాధగా ఉంటుంది రామచంద్రా, నీతో ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏది కూడా చెప్పుకోలేని పరిస్థితి, నువ్వు కనిపించగానే మళ్ళీ పాత జ్ఞాపకాలు నన్ను నన్నుగా ఉండనీయకుండా చేశాయి, ఈ కొద్దిరోజులు కళ్ళముందు కనిపించిన నువ్వు రేపటినుండి కనిపించవు అనుకుంటే నా హృదయం తట్టుకోలేకుండా ఉంది, నీ పెళ్లికి రాలేకపోయాను, ఇప్పుడు కూడా ఆమె గురించి అడగాలని లేదు, నేను కూడా నిన్ను ప్రేమించానేమో? అలా అనిపిస్తుంది నాకు, అందుకే ఇంత వేదనగా ఉంది” జేబులో చేయి పెట్టుకొని స్టైల్‌గా ఉన్న అతన్ని అలాగే కాసేపు చూసి ముఖం తిప్పుకుంది రూప.

“రూపా, నీకు నాకూ మధ్య ఏముందని ఇలా మాట్లాడుతున్నావు? ఎలాంటి ప్రయోజనం లేని మాటలు ఇప్పుడు ఎందుకు? అప్పట్లో నా మనసు తెలుపుకున్నాను, నువ్వు ఇష్టపడలేదు, తప్పేముంది? అది నీ ఇష్టం కదా, నాకు పెళ్లయిపోయింది, ఇప్పుడు మాకు ఒక బాబు, ఇంకో విషయం కూడా నీకు చెప్పాలి, నేను చేసుకున్న అమ్మాయి నా సొంత మేనమామ కూతురు, మా చిన్నప్పటినుండి తనకు నేనంటే చాలా ఇష్టం, ఏవేవో సంబంధాలు చూసే బదులు నన్ను ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను ఎంతో హ్యాపీగా ఉండగలను అనిపించింది, మా భవిష్యత్తులో ఏ గొడవలు చికాకులు ఉండకూడదని, ఆమెతో మన గురించి  చెప్పాను, నేను ఆమెకు దక్కటమే భాగ్యంగా అనుకుంది కాబట్టి, దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆమె.. నా లైఫ్ చాలా బాగుంది, ఇకనుండి నాతో కాంటాక్ట్ వద్దు, కనెక్ట్ కావద్దు ప్లీజ్, నాకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది, మరి ఇంకా నువ్వు పెళ్లెందుకు చేసుకోలేదో నాకు తెలవదు, త్వరలో పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటుంది” అంటూ వేగంగా వెళ్ళిపోయాడు రామచంద్ర. రూపకు కన్నీళ్లు ఆగలేదు.

***

“నేనేం చేయను సుమిత్రా, దాని ఇరవయ్యారో సంవత్సరం నుండే ఎన్నెన్నో సంబంధాలు చూసాం, ఏ ఒక్కటీ దానికి నచ్చలేదు, ప్రతీ సంబంధాన్ని వంకలుపెట్టటం, వద్దనటం ఇలాగే నాలుగు సంవత్సరాలు గడిచాయి, ముప్పయి దాటాయి. ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది, దానికి ముప్పయిమూడు, ఇప్పటికీ సంబంధాలు చూస్తున్నాం, అప్పట్లో అది వద్దంటే, ఇప్పుడు దీన్ని వద్దంటున్నారు, ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు చెబుతుందా అంటే అదీలేదు, అలా అయినా ముడిపెట్టేవాళ్ళం, రెండునెలల్లో దాని పుట్టినరోజు వస్తుంది, ఇలా పుట్టినరోజులు జరుపుకోవటమేనా? దాని పెళ్ళిరోజు మనం చూస్తామా? లేదా? అనే బాధ రోజు రోజుకు నాకు ఎక్కువౌవుతుంది, ఒక్కగానొక్క సంతానం, మనకు మన ఊళ్లో ఇల్లు, హైదరాబాదులో ఇల్లు ఇప్పుడు ఇక్కడ రూప కొన్న ఇల్లు, ఇవికాక ఊళ్ళో పొలాలు, మనకేం తక్కువైంది? అన్ని బాగానే ఉన్నాయి, ఇదిగో సంబంధం కుదరటం దాని పెళ్ళికావటమే మిగిలింది, ఆ దేవుడు మనల్నిఎప్పుడు కరుణిస్తాడో? అసలు దాని జాతకంలో పెళ్ళియోగం ఉందో లేదో? ఈమధ్య భయంగా, విరక్తిగా వుంటుంది సుమిత్రా,  ప్రతీ విషయంలో  టైమ్ సెన్స్ ఉండాలి, అందుకే పెద్దలంటారు, ఏ సమయంలో జరిగే ముచ్చట ఆ సమయంలోనే జరగాలని, అది చాలా నిజం, మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, సర్లే, నేను వెళ్ళి మా ఫ్రెండును కలిసివస్తా” అంటూ సోఫా నుండి లేచాడు మాధవరావు.

గుమ్మం దగ్గర నిలబడి తండ్రి మాటలు విన్న రూప లోపలికి వచ్చింది. తండ్రి తనను చూసీ చూడనట్లు బయటకు వెళ్లిపోతుంటే కళ్ళనిండా కన్నీళ్లు నిలిచాయి, తల్లిని గమనిస్తూ లోపలికి వెళ్ళి ఫ్రెషయి వచ్చి సోఫాలో కూర్చుంది. తల్లి ట్రేలో రెండు టీ కప్పులు పెట్టుకొని వస్తుంటే ఆశ్చర్యపోయింది.

“నువ్వు నాన్నతో కలిసి టీ తాగలేదా అమ్మా”

“నేను ఈరోజునుండి నీతో టీ తాగాలనుకున్నాను” చిరునవ్వుతో చూస్తున్న తల్లితో ఏం మాట్లాడాలో తోచక త్వరగా టీ తాగి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంది, ఏసీ ఆన్ చేసి బెడ్ మీద వాలిపోయింది. రామచంద్రకు ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంది, రామచంద్ర పేరుతో నెంబర్ కనిపిస్తుంటే కొంతసేపు అలాగే చూసింది, ‘నీకు నాకు మధ్య ఏముందని మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నావు?’ నిలదీస్తున్నట్లుగా అడిగే రామచంద్ర కళ్ళముందు కనిపించాడు. అతనితో మరోసారి మాట అనిపించుకోవడం ఇష్టంలేక కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినదానిలా అతని పేరుతో ఉన్న ఆ నెంబర్‌ను శాశ్వతంగా డిలీట్ చేసింది రూప.

Exit mobile version