Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక ప్రేమకథ

విరబూసిన ఒక తోటలో ఆమని అరుదెంచినది
యవ్వనంలో అడుగుపెట్టిన సుమబాల రెమ్మల చాటున
తన సోయగాల హరివిల్లును విరిసింది
జుంటి తేనియల దప్పికతో అలమటించే భ్రమరం
వలపు గీతాలను మధురంగా ఆలపించింది
గాన రసాంబుధిలో మురిసి మైమరచిన సుమకన్య
అరమోడ్పు కనులతో ఆహ్వానం పలికింది
అలుపెరుగని మధుపం సుమకాంత వొడిలో చేరింది
తనివారగా మధుపానముచేసి రెక్కలు
విదిలించి అంబరానికి ఎగసింది
తొలివలపు ఒరవడిలో తనువుకు గాయమై
కుసుమ కోమలి నలిగిపోయింది
వలపు రుచితెలిసిన జవ్వని మలి అనుభవానికి ఆత్రపడింది
తనివితీరని దాహం భ్రమరానిది కొత్త రుచులు కోరింది
పక్కదారి పట్టింది విరిసీ విరియని మొగ్గల వెంట పడింది
మోసపోయిన చంద్రకాంత ఆవేదనతో
ఆత్మహత్యకు పాల్పడి నేలకు రాలింది.

Exit mobile version