Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ – నలభై ఏళ్లుగా నవ్వుల నయాగరా

[2026 అక్టోబర్ 2వ తేదీకల్లా ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ సినేమా వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు దిలీప్ కేతవరపు.]

1986వ సంవత్సరంలో విడుదల అయిన కమల్ హాసన్, శ్రీదేవిల సినేమా ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ వెండి తెర నవ్వుల ‘విరి’పాతం.

Laugh riot.

తండ్రిని హతమార్చిన వ్యక్తి నోటనే ఆ నిజాన్ని చెప్పించేందుకు – నాయకుడు – విలన్ కూతురిని వలపింప చేసుకుని తా వరించి, తన లాంటి పోలికలు ఉన్న మరొకడు ఉన్నాడంటూ అందరినీ తికమక పెట్టి ఆఖరుకు అనుకున్నది సాధించడం ఈ సినేమా ఇతివృత్తం.

తమాషాలు, తగాదాలు, సరదాలు, సరాగాలు, మసాలాలు, మజాకాలతో కడుపుబ్బించేసింది.. సత్తెం. (సత్యం అనే మాటకు వికృతి ఈ సత్తెం. కరవు బత్తెం అనే పదం మాదిరి గానే)

~

కొన్ని మచ్చులు..

పార్కులో చెట్టును ఆనుకొని తలకిందులుగా నిలుచున్న మురళీకృష్ణని “ఏవండి మీ తల కాస్త పైకి పెడతారా” అంటూ రాధ అండ్ కో. అడిగితే, “నాలాగే ఉండి నన్ను ఇబ్బందులు పెడుతున్న ఆ రెండో వాడ్ని (హరికృష్ణ.. ఈ పాత్రను పోషించిందీ కమల్ హాసన్‌యే) పట్టుకోటాన్కి పరకాయ ప్రవేశం విద్య ప్రాక్టీస్ చేస్తున్నాను” అని పొద పక్కన ఉన్న కోతి శవాన్ని చూపించి, “ప్రస్తుతం అందులోకి వెళ్తున్నాను. నా దగ్గర అడగాలనుకున్న డౌట్స్ ఆ కోతి గారి దగ్గర అడగండి” అంటాడు.

“ఏవండీ మీరు మా కాలెజ్ ప్రిన్సిపల్ గారు కదూ, ఆఁ” అని రాధ అడుగుతుంది కోతి గారిని. కోతి గారు తల అడ్డంగా ఊపుతారు.

“పోనీ మా హాస్టల్ వార్డన్ గారా?” అంటుంది. దీనికీ కోతి మళ్లీ తల విదిలిస్తుంది. (చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా)!

“ఏవండీ, మా కాలేజ్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏమిటి..” ఇది ఆఖరి ప్రశ్న. సమాధానంగా కోతి గారు నేల మీదికి ఉమ్మేసి, చేయి కిందికి జాడించి కొడతారు.

అది చూసి “అబ్బా! ఎంత కరెక్ట్‌గా చెప్పారే, ఈయన ఖచ్చితంగా మురళీకృష్ణే” అని రాధ ప్రశంస.

***

“కృష్ణ గారు, మీ పరకాయ ప్రవేశం ద్వారా నా బెడ్రూమ్‌లో చీమగా, నా బాత్‌రూమ్‌లో బల్లిగా వచ్చీ ఛీ ఛీ మీరు చేసిన అల్లరి నేను తట్టుకోలేకపోతున్నానండీ” అని రాధ మురిపెంగా అంటే,

“మై గాడ్, బల్లి గానా..” అంటూ కృష్ణ విస్తుపోతాడు. “అయితే వాడిక్కూడా నాలా పరకాయ ప్రవేశం తెలుసన్న మాట” అనేసరికి రాధ చేతుల్తో ఒళ్లంతా కప్పేసుకుంటూ “ఆఁ! అయ్యయ్యో, ఏవిఁటండీ మీరనేది, ఒట్టూ” అని తన కుడి అరచేతిని చాచడం, ఆ చేతి మీద మురళి తన కుడి చేతితో గట్టిగా చరుస్తాడు. దీనికి చేయి నొప్పి పెట్టి రాధ ‘హమ్మా’ అని ఆందోళన చెందడం మనకు చక్కిలిగిలి పెట్టిన సన్నివేశాల్లో ఎన్నోదిదీ అంటా(ను).

***

హరి‘కృష్ణుడి’ చేత మోటార్ సైకిల్‌ను డ్రైవ్ చేయించి మరీ పెళ్లి పందిట్లోకి ఎంట్రీ ఇప్పించాడు డైరెక్టర్ ఏ(క్లాస్ బ్రెయిన్‌వేవ్) కో‘దండ’రామిరెడ్డి. యాక్సిలరేటర్‌తో తోలావు కదయ్య సినేమాను, నువు తోపువు.

***

“కుర్రో కుర్రు, మూడు నిద్రలు ఇప్పట్లో జరగవు. ముహూర్తం పెట్టొచ్చు, పెట్టనీ పుంజునీ పట్టెమంచం మీద పడుకో పెట్టొచ్చు. కాకపోతే కాద్రా, దార్కా, విషాచీ క్షుద్ర దేవతల కారణాన శోభనం జరగదు తల్లి. అయినా తాయెత్తు ఇస్తనూ.. కట్టుకొని చూడమను” అని గిల్లిగూడెం మల్లి దొర జోస్యం.

“ఏంటేంటి, మన శోభనం జరగదు తల్లా. శోభనానికిదుగో అడ్వాన్సూ..” అంటూ రాధ కోయదొరని ముద్దు పెట్టుకుంటుంది అతను తన భర్తేననుకుని.

“పిచ్చిబామ్మా ఇప్పుడొచ్చింది కోయదొరా కాదు, కోతి దొరా కాదు, మా ఇంటాయన అహ్హ..” అని వగలు పోతూ ముసిముసి నగవుల తళుకులు కురిపిస్తుంది రాధ.

“ఇంటల్లుడు అయ్యాక్కూడా కోయ వేషాలూ, కోతి వేషాలూ ఏవిఁటే” అని బామ్మ.

“ఆయనకు సరదా బామ్మా అలా వేషం వేసి నన్ను ఆటపట్టించాలని. కాకపోతే నేను గుర్తు పట్టేశాను. అని రాధ బదులిస్తూ హాల్లో ఉన్న భర్తని చూసి “డాడీ ఆహ్..” అని అరిచి స్పృహ తప్పిపడిపోతుంది.

ఈమె కులుకులు మనకి మిరుమిట్లు గొలిపాయి కదూ; కద్దు.

***

శోభనం ముచ్చటైతే అలవి కాదు చెప్పను.

తొలి రెండు రాత్రులూ ఆరు కేరింతలూను.

“అవును,

అవును,

అవును.”

“సైలెన్స్”.

“సైలెన్స్”.

“ఈ పట్టెమంచం మా తరతరాల ఆచారం” అని రాధ చెప్పగానే మురళి మంచం చుట్టూ కలియతిరుగుతూ “ఊఁ, దుప్పటైనా మార్చారా? లేక అదీ..” అని ముఖం తిప్పి అడగ్గానే రాధ అవాక్కు.

హాల్ అంతా ఫక్కు.

మేను వాల్చబోగానే మంచంకోడు పుటుక్కు.

సుత్తి కోసం రాధ వెదకుతూ ఉంటే, పట్టెమంచం పక్కన పెట్టి ఉంచిన మైసూర్ పాక్ ముక్కల్ని కృష్ణ చూపిస్తూ “ఆ స్వీటు మీ బామ్మ చేసిందేనా?” అని అడుగుతాడు. “అవును” అని చెప్తుంది రాధ. “అయితే ఇక సుత్తి అక్కర్లేదు” అని కృష్ణ చెణుకు. మంచం సరి చేసే సరికి ‘కౌసల్యా సుప్రజా..’ పలుకు.

రెండో రాత్రి “అసలు మొగుణ్ణి నేను” అంటూ మాయగడ్డం స్వామి బాసింపట్టు.

‘వాడు దొంగసన్యాసి’ అంటూ కృష్ణ బెట్టు.

తండ్రీ కూతుళ్ళ తలరాత తిట్టు(లు).

నేరం ఒప్పుకొని జైలుకెళ్ళిన తండ్రి నరసింహానికి కవల మనవల్ని చూపెట్టడానికి రాధ.. కృష్ణతో వస్తే,

వాళ్లలో మోహనకృష్ణ ఎవరో, గోపాల‌కృష్ణ ఎవరో గుర్తుపట్టలేక చివరికి పుట్టుమచ్చల జోలికిపోతే –

అక్కడా అచ్చం వాళ్ల డాడీ పోలికే.

‘ఈ డిటో కన్‌ఫ్యూజన్ ఏమిటో భగవంతుడా’ అని తాత ఏడుపండీ.

కొస పొడుపు విరవండీ.

నవ్వు తెరలు తెరలండి.

తెమలండి.. తెమలండి.

నెక్స్‌ట్ షో కి టైమయింది కదండి, పదండి పదండి.

***


‘వెయ్ వెయ్ తకథిమి చెయ్ చెయ్ కథకళి
టకుముకు తాళ్ం వెయ్..’

పాట ఆరంభంలో మురళీకృష్ణ పేపర్ బూరను పట్టుకుని ఊదడం, ఒక చోట రాధకు ముకుతాడు వేసి లాగినట్టు అతడు వేసిన స్టెప్ hep (గా ఉంది.)

‘ఏమి తుంటరి పిలగాడే ఎన్ని చొరవలు చేశాడే..’ డ్యూయెట్‌లో హీరో చెరువులోకి పోయి పెద్ద చేపను పట్టి తీసేసరికి హీరోయిను ముక్కు మూసుకు మూతిని ఇంకోవైపుకి తిప్పుకోవటం.. సఖి రాధ ముద్దాడితే తల గిరగిరా తిరిగి హీరో మురళి బేలన్స్ తప్పి పడిపోవటం.. చెలి కాళ్ల పైన అతను శిరసును ఉంచి వెల్లకిలా పడుకుని ఆమె హైహీల్ తీసేసి అరికాలులో కితకిత పెట్టటం.. రాధకి షేక్ హ్యాండ్‌తో పాటు గడ్డిపోచను ఇస్తే ఆమె దానిని సుతారంగా మెడకు రాసుకుని దురద పుట్టి గోక్కోవటం..

‘మధుర మురళి హృదయ రవళి..’ బృంద గీతంలో ఫ్లూట్ ఊదే హరికృష్ణ పేడను తొక్కి పాదరక్షను రాతికి గీరటం, భుజ వస్త్రం సరి చేసుకుంటూ ఉంటే దాని నుండి దుమ్ము రాలి తుమ్మటం, రిస్ట్ వాచ్‌ చూచుకుని కిరాయి డ్రెస్ మార్చుకోబోవటం, కోలాటం కర్రతో రాధ చుబుకాన్ని హరికృష్ణ ఒత్తినందువల్ల ఆమె పాడుతున్న పాట కాస్తా కాస్సేపు ఆగడం, పాట చివర్లో బెంచీ దగ్గర కళాకారులు షరా ‘మామూలు’ కై మూగితే వాళ్లని ఇక వెళ్లి రండంటూ హరి సైగ చేసి చెప్పిన వైనాలకు మనం మనసారా నవ్వు చిందించక మానం. (నృత్య రీతులను సమకూర్చిన వారు: తార, పులియూర్ సరోజ, రఘు; సంగీతం అందించింది ఇళయరాజా)

***

ఒకటే అల్లరల్లరి అమరి

అలరించింది మరీ మరి

అబ్బుర పడిపోయి

కళ్లింత

చెవులంత

చేసుకు చూశాంగా

మళ్లీ మళ్లీ

***

కామెడీకి సందర్భం పండాలని, సంభాషణలు వండాలని, అసభ్యపు అవాకు చెవాకులు పోపు పెట్టి కలగలపాలని వాదోపవాదాలు చేసే వాళ్లకి ఈ పిక్చర్ కనువిప్పు.

ఫార్స్ అనే వినోద ప్రక్రియకి సెల్యూలాయిడ్ మాధ్యమం లోనూ పాప్యులర్ ఫోర్స్ ఉందంటూ చీర్స్ చెప్పింది కదా ఆడియన్స్ తీర్పు.

(ఈ చలనచిత్రం హైదరాబాద్ ఆర్.టి.సి. ఎక్స్ రోడ్స్ సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లో 65 రోజులు ఆడి, మరొక థియేటర్ కి షిఫ్ట్ అయింది 1986 డిసెంబర్‌లో.)

చిన్న పాయింట్ మీద పూర్తి నిడివి కథాచిత్రాన్ని వినోదభరితంగా తీర్చిన కూర్పు ఎంతటి నేర్పు.

శ్రీదేవి 23 ఏళ్ల వయస్సులో అప్పటికి మూడు సంవత్సరాలుగా హిందీ రంగానికి కూడా పోయి ప్రేక్షకులని ఉఱ్ఱూతలూగించడమే కాక, కనుకట్టు మెలకువల్లో ఆరితేరి తనువున వన్నె చిన్నెల వెన్నను చిలికించి మరీ రాధ పాత్రకు పోత పోయడం బంగారు పళ్లేనికి గోడ చేర్పు.

యువ నటులకు రోల్ మోడల్ పర్సన్ ‘సకల కళా వల్లవన్’ కమల్ హాసన్ టాప్ టెన్ చిత్రాలలో కచ్చితంగా ఒకటిగా ప్రకాశించే ప్రతిభాన్విత ప్రతిరూపాలు మురళీకృష్ణ, హరికృష్ణలకు కైమోడ్పు.. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’.

ఈ సినేమాలో కమల్ హాసన్, శ్రీదేవి పోటాపోటీగా నటించి, అరగ దీసేశారు, ఆహ్లాదపరిచారు.

***

జనప్రియ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన నవలకి సినేమాటిక్ రొమాంటిక్ హ్యూమరిస్టిక్ నగిశీల్ని సత్యానంద్ అద్దితే నవల పేరుతోనే చలనచిత్ర రూపంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తీర్చిదిద్దితే ఈ మూవీ నిర్మాణ బాధ్యత శ్రీసారసా మూవీస్ వంతే.. అయ్యాయి సుమా.

Exit mobile version